అగజాననపద్మార్కం
గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం
ఏకదంతముపాస్మహే
అనే శ్లోకంతో వినాయకుణ్ణి ప్రార్ధించిన తదుపరి ఎట్టి ఆరాధనలైననూ కొనసాగించడం ఈ భారతదేశంలో అనాదిగా ఆచరింపబడే సత్సంప్రదాయం....
"అగజ అనగా హిమవంతుని కుమార్తే అయిన పార్వతీదేవి యొక్క వదనపద్మానికి సూర్యుడివంటి వాడైన గజాననుడికి ఎందరో భక్తులుకలరు...అట్టి ఏకదంతుణ్ణి సదా ఉపాసిస్తున్నాము..."
అనే సామాన్యార్ధంలో ఉన్న విశేషం ఈ వినాయకచవితి పర్వసమయంలో కాస్త పరికిద్దాం...
సూర్యుడు ఉన్నప్పుడు పద్మం ఎంతో గొప్పగా విప్పారి ప్రకాశిస్తుంది...
(అందుకే శ్రీవేంకటేశ్వరుడు నాటి శ్రీశుకనూర్ లో శ్రీమహాలక్షికై తపస్సు ఆచరించే సమయంలో దేవలోకం నుండి సంగ్రహింపబడిన బంగారు పద్మాలు సదా వికసితమై ఉండేలా ఏకంగా సూర్యభగవానుణ్ణి అక్కడికి ఏతెంచి కొలనుకు అభిముఖంగా కొలువైఉండమని చెప్పగా, ఇప్పటికీ మనం నేటి తిరుచానూర్ పద్మసరోవర ప్రాంతంలో ఆ అరుదైన సూర్యదేవాలయాన్ని దర్శించవచ్చు..)
పార్వతీదేవి మేనిని అలంకరించిన హరిద్రాచందనం నుండి ప్రభవించిన వినాయకుడు ద్వారపాలకుడిగా ఉండగా ఏతెంచిన పరమేశ్వరుడితో గావించిన వాదప్రతివాదాల్లో భాగంగా రుద్రుడి త్రిశూలఘాతానికి గురైన వినాయకుణ్ణి, పశ్చిమం దిశగా నిద్రిస్తున్న ఒక ఏనుగువదనం తో పునర్జీవింపజేయగా, బ్రాహ్మాదిదేవతలందరూ సంతసించి, వినాయకుణ్ణి గజాననుడిగా ఆశీర్వదించి అనేక వరాలను అనుగ్రహించగా పార్వతీదేవి ఎంతో సతసించెను...
అనేది పౌరాణిక గాథ....
హృదయకోశంలో కొలువైన అధోముఖపద్మకింజిల్కసదృశ ద్యుతితో నిత్యం వెలిగే జీవేశ్వరుణ్ణి పరమేశ్వరశక్తిగా శివంగా కీర్తిస్తున్నది నారాయణసూక్తం....ఈ క్రింది విధంగా...
********************* *********************
అనంతమవ్యయం కవిగ్ం సముద్రేఽన్తం విశ్వ శంభువం |
పద్మ కోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖం ||
అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యా ముపరి తిష్ఠతి |
జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాఽయతనం మహత్ ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభం |
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ||
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః |
సోఽగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహార మజరః కవిః ||
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయ స్తస్య సంతతా |
సంతాపయతి స్వం దేహమాపాదతల మస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః ||
నీలతో యదమధ్యస్థ ద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా ||
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః స్సేన్ద్ర స్సోఽక్షరః పరమ స్స్వరాట్ ||
********************* *********************
సూర్యుడు ఆత్మశక్తికి ప్రతీక...
సూర్యుడి నుండి శక్తిని గ్రహించి భూమికి ప్రసరించే చంద్రుడు మనోశక్తికి ప్రతీక...
అందుకే ఆత్మశక్తి ఉన్నప్పుడే మనోశక్తి ఉండేది....
మనోశక్తి లేకున్నా ఆత్మశక్తి ఉన్నది....
చిత్తవృత్తులను లయింజేసి మనస్సును శూన్యపరిచి స్థిరమైన ఆత్మానుసంధీకృత ఏకాగ్రచిత్తంతో ఉండే మహర్షుల స్థితిని గమనిస్తే ఈ కేవల ఆత్మశక్తితో వెలిగే జీవేశ్వరుణ్ణి దర్శించవచ్చును....
ఎప్పుడైతే చిత్తం అంతర్ముఖత్వం నుండి బహిర్గతమై బాహిరప్రపంచంతో అనుసంధానమవ్వునో, అప్పుడు మనోశక్తితో కదలాడే శరీరం కేవలం జీవుడి శక్తిని మాత్రమే ప్రతిబింబించును...అనగా ఆత్మశక్తిపై మనోశక్తి తన ఉనికిని వ్యవస్థీకరించుకొని మనకు దర్శనీయమై ఉన్నది అని అర్ధం....
ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు అంటే దాని అసలైన అర్ధం, సూర్యుడి పరావర్తనకాంతితో వెలుగుతున్న చంద్రుణ్ణి దర్శిస్తున్నాము అని....
అంతే కాని ఆకాశంలో సూర్యుడు లేని చంద్రుణ్ణి దర్శిస్తున్నట్టు కాదు...
యోగతత్త్వపరంగా
పార్వతిదేవి ఆత్మశక్తికి ప్రతీక..
శివుడు మనోశక్తికి ప్రతీక...
ఈ ఇరుశక్తుల సమన్వయస్థితిలో ఓలలాడే వాడే జీవుడు...
['ఇడా పింగళ మధ్యమందున ఇమిడి ఉన్నది రామనామము అనే శ్రీరామనామ వైభవగానాన్ని వినే ఉంటారు కద...]
శివుడి శిరోభూషణంగా కొలువైన చంద్రుడి క్షీణవృద్ధిపరంపరలా...
మన మనస్సు కూడా నిత్యం క్షీణవృద్ధిపరంపరల్లో కదలాడుతూ ఉంటుంది...
"హె బ్రొ.. నిన్న బాగా ఉషారుగా ఉన్నావ్...ఇవ్వాళేంటి జలుబుతో చిన్నబోయావ్...మాంచి శొంఠి కాఫీ ఒకటి తాగు బ్రొ...మళ్ళీ ఉషారుగా ఉంటావ్...."
అని ఎవరైనా అంటే, అది క్యాజువల్ గా మన మనోశక్తిలో కలిగిన హెచ్చుతగ్గులగురించిన వ్యాఖ్యానం అని అర్ధం...
ఇక మన అసల్ టాపిక్ కి వస్తే....
శివదూషణ చేసిన వారి పాపం ఊరికేపోదు...
వారి శక్తి నశిస్తుంది...
అందుకే వినాయకుడి చేతినుండి పార్వతీదేవి ఇచ్చిన శక్తి అనే ఆయుధం జారి, ఆ తదుపరి పరమేశ్వర త్రిశూల ఆయుధ ఘాతానికిలోనై శిరస్సును కోల్పోయాడు...
అనగా, ఏ వదనం శివనింద గావించిందో ఆ వదనం గల శరీరం, చేతిలో ఉన్న శక్తి ఆయుధం జారి, (శ్రీకైలాస)నేలకొరిగింది....
అనగా ఆ శరీరం మనోశక్తిని సంపూర్ణంగా కోల్పోయింది.
స్వతహాగా శక్తి పుత్రుడు కాబట్టి వినాయకుడి ఆత్మశక్తి అట్లే నిద్రాణమై ఉన్నది...
పార్వతీదేవి శాసనాన్ని అర్ధనారీశ్వరుడిగా పరమేశ్వరుడు కూడా గౌరవించును.....
కాబట్టి మరో వదనంతో వినాయకుణ్ణి పునర్జీవింపజేయడం అనే యోగిక ప్రక్రియలో భాగంగా పడమర దిక్కుగా శిరస్సుతో నిద్రిస్తున్న ఒక ఏనుగుతలతో వినాయకుణ్ణి గజాననుడిగా "పునర్వ్యవస్థీకరించాడు" పరమేశ్వరుడు....
ఏ జీవుడి సమయం ఎంతో క్షుణ్ణంగా పరమేశ్వరుడికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియును...?
ఎందుకంటే ఆయన ఉజ్జైని పుర మహాకాళేశ్వరుడు కాబట్టి....
తూర్పు దిక్కుగా శిరస్సుతో నిద్రించడం శాంతిదాయకం....
పడమర దిక్కుగా శిరస్సుతో నిద్రించడం ఆయుక్షీణం...
ఉత్తర దిక్కుగా శిరస్సుతో నిద్రించడం రోగకారకం....
దక్షిణ దిక్కుగా శిరస్సుతో నిద్రించడం సౌఖ్యదాయకం...
అనేది శాస్త్రవచనం....
అలా నిత్యం పడమర దిక్కుగా శిరస్సుతో నిద్రిస్తూ మొత్తం ఆయుః ప్రమాణం క్షీణింపబడిన ఏనుగుతలను పరమేశ్వరుడు వినాయకుడి కోసం తీసుకురమ్మని ప్రమథగణాలను ఆజ్ఞ్యాపించాడు....
ఇతర ఎన్నో జీవులు కూడా అలా నిత్యం పడమర దిక్కుగా శిరస్సుతో నిద్రిస్తూ ఉండగా ఎందుకు అవసాన దశలో ఉన్న ఏనుగునే ఈశ్వరుడు ఎన్నుకున్నాడు అంటే..
ప్రకృతిలోని ఒక్కో ప్రాణికి ఒక్కో ప్రత్యేకత, వరం, విశేషం ఉండడం అనేది ఈశ్వరసృష్టివైభవం...
ఏనుగు నాదశక్తిని సృజించగల విశేషమైన ప్రాణి...మరియు ఎంతో బుద్ధివైభవం గల బలాఢ్యమైన ప్రాణి కూడా...ఏనుగుకు తిక్కరేగిందంటే కొదమసిమ్హాన్ని కూడా బండకేసికొట్టగల బలంతో విజృంభించే ప్రాణి...మరియు అంతే సూక్ష్మదృష్టి, సూక్ష్మనైపుణ్యం గల ప్రాణి...
తన దారికి అడ్డొచ్చే పెద్దపెద్ద చెట్లనైనా సరే ఈడ్చి అవతలికి విసిరెయ్యగలదు...
తన దార్లో పడిఉన్న ఒక చిన్నసూదిని కూడా తీసి పక్కకు పెట్టి ముందుకు సాగగలదు...
ఒక మావటి వాడికి లొంగి ఈశ్వరుడి వాహనసేవలో కొలువుదీరే ఏనుగుల వినమ్రతను, వైభవాన్ని గమనించే ఉంటారు కద...
ఇక ఈ సృష్టిలో మరే ఇతర ప్రాణిదంతానికి శ్రీమహాలక్ష్మిని ఆకర్షించే శక్తి లేదు...
మరియు మరే ఇతర ప్రాణివెంట్రుకలకు అలక్ష్మిని దరిచేరనియ్యని శక్తి లేదు...
కేవలం ఏనుగుకు మాత్రమే ఈ ప్రత్యేకతలు సొంతం...మరెన్నో కూడా...
"హస్తినాద ప్రబోధినీం.." అనే శ్రీసూక్త వచనాన్ని వినే ఉంటారు...
మిగతా జంతువులలా కాకుండా, ఏనుగుకు ద్వైపం అని పేరు...
అంటే చాలా ఇతర జంతువులలా డైరెక్ట్ గా మూతితో కాకుండా మనుషులలా మొదట చేతితో / అనగా తొండంతో సంగ్రహించి,
ఆతరువాత మూతితో ఆహారం స్వీకరించే ప్రాణి ఏనుగు...
ఈ ప్రక్రియకు యోగపరిభాషలో విశేషతత్త్వార్ధము కలదు...
ఇంకా ఎన్నో ఇతర కారణాలరీత్యా ఒక ఏనుగు అనేది ఇతర ఎన్నో ప్రాణులకంటే కూడా చాలా సర్వోన్నతమైన ప్రాణి...
సూర్యుడి నుండి నిరంతతం ఉద్భవించే నాదశక్తి సకల జీవులకు ఆత్మశక్తిగా పరిణామంచెంది పరిఢవిల్లుచున్నది ....
అట్టి సూర్యుడి తేజస్సుతో దేవశిల్పి విశ్వకర్మచే తయారు చేయబడిన త్రిశూలానికి సద్యోఆత్మశక్తిదాయక
విశేషం కలదు...
కాబట్టి, పరమేశ్వరుడు తన ఏ త్రిశూలంతో వినాయకుడి శిరస్సుని ఖండించాడో, అదే త్రిశూలానికి కట్టబడి ఉండే నాదశక్తికారక ఢమరుకంతో, ఏనుగుతలలో పరివ్యాప్తమై ఉన్న నాదశక్తిని అనుసంధానపరచి, వినాయకుణ్ణి గజాననుడిగా, ఆ తరువాత తన ప్రమథగణాలకు అధిపతిగా కొలువుతీర్చి శివపరివారంలో అగ్రపూజ్యత్వాన్ని అనుగ్రహించాడు ఆ సద్యోజాత సర్వేశ్వరుడు...
కాబట్టి,
గణపతి ఆరాధనతో...
పార్వతీపరమేశ్వరానుగ్రహం...
స్కందానుగ్రహం...
విష్ణ్వానుగ్రహం...
(వల్లీదేవసేనాపతి అయిన స్కందుడి వివాహానికి గణపతి ఎలా కారకుడైయ్యాడో, ఒకానొక సందర్భంలో శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనచక్రాన్ని లడ్డూ లా ఆరగించిన గణపతి నుండి తిరిగి తన చక్రాన్ని ఎవ్విధంగా శ్రీమహావిష్ణువు పొందెనో, ఇత్యాదివి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినడం కొందరిలో కొందరికైనా గుర్తుండే ఉంటుంది....)
సూర్యచంద్రానుగ్రహం,
ఏకకాలంలో అనుగ్రహింపబడే విశేషం...
అంతటి వైభవభరితమైన వినాయకుణ్ణి ఎంతో గొప్పగా శ్రీత్యాగరాయులవారు కీర్తించిన వైనం విజ్ఞ్యులైన భక్తలోకానికి బాగా సుపరిచితమే...
ప. శ్రీ గణ నాథం భజామ్యహం
శ్రీ-కరం చింతితార్థ ఫలదం
అ. శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ-కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)
చ. రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణి-మయ భూషణం
ఆంజనేయావతారం సు-భాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)
https://thyagaraja-vaibhavam.blogspot.com/2008/10/thyagaraja-kriti-sri-gana-natham-raga.html?m=1
No comments:
Post a Comment