Sunday, February 16, 2025

శ్రీక్రోధి నామ 2025 సంవత్సర మాఘ శుద్ధ పంచమి, శ్రీపంచమి పర్వసమయ శుభాభినందనలు...💐😊


సకల విద్యలకు అధిదేవతగా శ్రీసరస్వతీదేవిని శ్రీవిద్యోపాసకులు ఆరాధింతురు......
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారు హంసారూఢసరస్వతి గా తిరువీధిఉత్సవ ఊరెరిగింపులో భక్తులను అనుగ్రహించడం విజ్ఞ్యులకు ఎరుకే....

అమ్మవారి వాహనంగా కొలువైన హంస, భక్తులకు
క్షీరనీరన్యాయాన్ని బోధించును...
అమ్మవారు ధరించే జపమాల, పుస్తకం, భక్తులకు భగవద్ నామజపంలో ఉండే శక్తి యొక్క ప్రాభవం, భగవద్ సంబంధమైన పుస్తకపఠనంలో ఉండే యుక్తి యొక్క ప్రాభవం బోధించును....
అమ్మవారు మీటే కచ్ఛపి అనే వీణ, సకలసద్యోశ్రేయోదాయక విద్యానుగ్రహాన్ని బోధించును..

ఒక వ్యక్తి మహదైశ్వర్యవంతుడు అనుకోండి.....
అనగా వారి తండ్రితాతముత్తాతలు బాగా సంపాదించి పెట్టగా, దేనికీ లోటు లేకుండా బ్రతుకుతున్న సదరు వ్యక్తి...
కాని ఎట్టి సరస్వతీ అనుగ్రహానికి కూడా పాత్రుడవ్వని పామరాధముడు....

ఒక వ్యక్తి మహావిద్యావంతుడు అనుకోండి...
అనగా తండ్రితాతముత్తాతలు పెద్దగా ఏమి కూడబెట్టలేదు...
కాని తన జీవితపర్యంతం ఎంతో శ్రమించి ఎంతగానో శ్రీసరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని సముపార్జించుకున్న ధన్యుడు....

మొదటి వ్యక్తికి...
అష్టదిక్కుల పేర్లు కూడా తెలియవు...
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు....
ఏ వస్తువును కొనుక్కోవాలో...ఏ వస్తువును కొనుక్కోకూడదో తెలియదు....

రెండవ వ్యక్తికి...
అష్టదిక్కుల ప్రభావం, ప్రాభవం గురించి తెలియును...
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియును....
ఏ వస్తువును కొనుక్కోవాలో...ఏ వస్తువును కొనుక్కోకూడదో తెలియును....

ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులజీవితాలను పోల్చడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే....

మొదటి వ్యక్తి జీవితం....
నిండుకుండకు అడుగున చిల్లుపడిన రీతిలో సాగే పయనం....

రెండవ వ్యక్తి జీవితం....
ఆరుబయట వర్షంలో ఉన్న ఖాలికుండలోకి ఒక్కోవర్షంచుక్కా
చేరుతూ నిండుకుంటున్న పయనం....

మొదటి వ్యక్తి జీవితం, అనగా అడుగున చిల్లు పడిన కుండలో మీరు ఎంత నీరు పోసినా అది కేవలం వృధా....

రెండవ వ్యక్తి జీవితం, అనగా వర్షం చుక్కలప్రోదితో ఎప్పుడూ నిండుగా ఉండే కుండలోనుండి మీరు ఎంత నీటిని వాడుకున్నా అది నిండుకుండగానే ఉండును.....

ఇవ్విధంగా, శ్రీసరస్వతిదేవి అనుగ్రహం సమకూరని వారి జీవితాలు ఎన్నటికీ సంపూర్ణమైనవి కాజాలవు...అవి ఎండమావిలో మెరిసే మృగతృష్ణల తీరుగా ఉండే సారహీనమైన మేడిపండ్ల చందమైన జీవితాలు.....

శ్రీసరస్వతిదేవి అనుగ్రహం సమకూరే వారి జీవితాలు ఎప్పటికీ పరిపూర్ణతతో అలరారే అమరానుగ్రహ మంజరులు.... 
అవి ఎడారిలో కొలువైన మంచితీర్థ సరసస్సులలో విరబూసే శ్వేతపద్మకింజిల్కాలపై విహరించే భ్రమరాల నాదంతో పరిఢవిల్లే నయనమనోహర నిత్యనూతన నవ్యకాంతులకు ఆవాసాలు....

శ్రీపోతనామత్యుల అమరకావ్యం శ్రీమద్భాగవతాంతర్గత ఈ క్రింది శ్రీసరస్వతీదేవి యొక్క ప్రార్ధనా పద్యాల ప్రాభవం, ప్రభావం గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్టవచనాల్లో విజ్ఞ్యులు వినే ఉంటారుకద...

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
1. 

శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!

భావము:
భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

2. క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

3. పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ! మేల్
పట్టున్ నా కగుమమ్మ, నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

4.అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!

5. ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఛేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్

https://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=1
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

ఈ పద్యరత్నాల్లో, 1వ పద్యాన్ని నిత్యప్రార్ధనగా గావించడం విశేషమైన విద్యాదాయక ఉపకరణంగా విజ్ఞ్యుల ఉవాచ...

భక్తుల ప్రార్ధనలకు అనుగుణంగా, ఆ వైరించిశక్తి శ్రీవాణి సకల విద్యలను అనుగ్రహించి, విజ్ఞ్యుల జీవితాలను ఉద్ధరించుగాక అని ఆకాంక్షిస్తూ, ఎల్లరికీ శ్రీపంచమి పర్వసమయారాధనా శుభాభినందనలు...😊💐


No comments:

Post a Comment