Sunday, February 2, 2025

శ్రీకరమైన శ్రీమద్రామాయణం గురించిన కొన్ని వ్యాఖ్యానాలు.


సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారమైన రాముడు, ఒక సాధారణ మానవుడిలా, సితావియోగంతో అడవులవెంట తిరుగుతూ బాధపడడం ఎంత చిత్రమో కదా....అని ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యాఖ్యానించడం వారివారి భావుకత...

"అన్నిటికీ మూలకారణం ఆ ముదనష్టపు మంథర...
అంతఃపురదాసి దాసిలా ఉండకుండా...తగుదునమ్మా అని కైకకి రాముడి మీద అనవసరంగా లేనివన్నీ నూరిపోసింది కాబట్టే...రాముడికి అన్ని కష్టాలు..." 
అని కొందరి అభిప్రాయాం....

"అన్నిటికీ మూలకారణం కైకేయి...
భార్యగా తన పరిధి ఏంటో తెలుసుకోకుండా....
తగుదునమ్మా అని ఒక దాసి మాటలను విని, భర్తను శోకగృహంలో అనరాని మాటలను అని...తన కొడుకు భరతుడికి యవ్వరాజ్యపట్టాభిషేకం కావించడానికి రాముణ్ణి అడవులకు పంపించమని వరం కావాలని హఠం
చేయడం వల్లే రాముడికి అన్ని కష్టాలు..." 
అని కొందరి అభిప్రాయం....

"అన్నిటికీ మూలకారణం దశరథుడే...
తండ్రిగా తన కర్తవ్యం పట్ల ఉండవలసిన స్పృహను కోల్పోయి,
ఒక ఆడది శోకగృహంలో జుత్తు విరబోసుకొని విలపిస్తూ, అగ్రజుడైన మొదటి కొడుక్కి కాకుండా రెండవ కొడుక్కి రాజ్యాపరిపాలనాధికారం కావాలని అడిగినప్పుడు....
అట్టి దురాశ తగదని చెప్పి భార్యను వారించకుండా, సరే అని మాట ఇచ్చినందు వల్లే రాముడికి అన్ని కష్టాలు..." 
అని కొందరి అభిప్రాయం...

"అన్నిటికీ మూలకారణం లక్ష్మణుడే...
ఒక రాక్షసి అని తెలిసికూడా సమ్హరించకుండా, శూర్పణఖను కురూపిగా చేసి అవమానించి పంపించినందుకు, కోపంతో ఆ రాక్షసి ఖరదూషణ రావణాదులను రాముడిపైకి ఉసిగొల్పడం వల్లే రాముడికి అన్ని కష్టాలు..." 
అని కొందరి అభిప్రాయం...

"అన్నిటికీ మూలకారణం సీతమ్మే...
లోకంలో బంగారు లేడి అనేది ఎక్కడా ఉండదు అని తెలిసికూడా తారసపడిన ఒక బంగారు లేడిని తెచ్చివ్వమని రాముణ్ణి కోరడం, ఈ బంగారు లేడి వెనక ఏదో రాక్షస మాయ / కుట్ర ఉందని గ్రహించిన లక్ష్మణస్వామి వారు,
నేను రాముడితో తిరిగివచ్చేంతవరకు. కుటీరం వెలుపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రాకూడదు వదినమ్మా అని తన అస్త్రరక్షణా వలయాన్ని సీతమ్మకు కాపుగా ఏర్పాటు చేసి వెళ్ళినా కూడా, మాయావిగా బిక్షను అర్ధిస్తూ ఏతెంచిన రావణాసురుడికి బిక్షను వేసేందుకు లక్ష్మణస్వామి చెప్పిన మాటలను మరచి కుటీరం బయటికి అడుగుపెట్టినందువల్లే రాముడికి అన్ని కష్టాలు..." 
అని కొందరి అభిప్రాయం...

"అన్నిటికీ మూలకారణం రాముడే...
భర్తగా తన కర్తవ్యం పట్ల ఉండవలసిన స్పృహను కోల్పోయి, భార్య అడిగింది కదా అని...లోకంలో ఎక్కడాఉండని బంగారు జింకను భార్యకు తెచ్చివ్వడానికై వెనకాముందు అలోచించకుండా ఆ మాయా మృగాన్ని వేటాడుతూ భార్యను కుటీరంలో వదిలి అడవిలోకి వెళ్ళినందువల్లే రాముడికి అన్ని కష్టాలు..." 
అని కొందరి అభిప్రాయం...

"అతిలోక సౌందర్యవతి, మహాపతివ్రత అయిన తన భార్య మండోదరి వద్దని వారించినా కూడా, చెల్లె రాక్షసి శూర్పణఖ నూరిపోసిన మాటలకు వివేకన్ని కోల్పోయిన వాడై 
మహాసాధ్వీమణి, భూదేవి అంశలో ప్రభవించిన సాక్షాత్తు ఆదిపరాశక్తిని పౌలస్త్యుడు చెరబట్టినందువల్లె రాముడికి అన్ని కష్టాలు..." 
అని కొందరి అభిప్రాయం...

ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా, శ్రీమద్రామాయణ ఇతిహిహాసం గురించి వారివారి అభిప్రాయాలను వ్యక్తపరచడం లోకం యొక్క నైజం, లోకుల వాగ్స్వాతంత్ర్యం...కావొచ్చు...

కాని మనం శ్రీమద్రామాయణం ద్వారా, శ్రీమద్రామాయణం లోని ఆయా సంఘటనల ద్వారా తెలుసుకోవలసింది ఏంటంటే..

నిత్యం ఈశ్వరానుగ్రహమైన కుశాగ్రబుద్ధివైభవంతో వర్ధిల్లుతూ, ఆయా వ్యక్తులను, వ్యక్త్విత్వాలను, వ్యక్తుల మాటల్లోని అంతరార్థాలను, నిత్యం సమాలోచనగావిస్తూ...

ఎవరు మితృలు, ఎవరు స్నేహితులు, ఎవరు హితులు, ఎవరు పరిచయస్తులు, ఎవరు పరాయివారు, ఎవరు మనవారు, ఎవరు మనవారిగా ఉన్న పరాయివారు, ఎవరు పరాయివారిగా ఉన్న మనవారు, ఎవరు మన అభివృద్ధిని కాంక్షించేది, ఎవరు మన అభివృద్ధిని ఓర్వలేకపోతున్నది, ఎవరు ఎవరి మాటలను వింటూ ఎవరెవరితో అంటకాగుతున్నరు, ఎవరికి ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఏం నూరిపొస్తున్నరు.....
ఇత్యాదిగా ఈ లోకులనైజాన్ని, లోకరీతిని, క్షుణ్ణంగా వడబోస్తూ జీవితాన్ని ఒక నిరంతర ఈశ్వరచింతనాభరిత స్వాధ్యాయ యజ్ఞ్యంగా జీవిస్తారో....

వారు తమ గతానికి బాధ్యతను వహిస్తూ,
తమ వర్తమానానికి అధ్యక్షతను వహిస్తూ,
తమ భవిష్యత్తుకు మార్గదర్శకాన్ని వహిస్తూ, 
ఈశ్వరానుగ్రహంతో జీవితాన్ని ఒక చక్కని అర్ధవంతమైన, ఉపయుక్తమైన పుస్తకంగా పరిగణించి తరిస్తారు...

అందుకే ఏకంగా త్రిలోకసంచారులైన శ్రీనారద మహర్షి వారిచే, 
(నారం దదాతి ఇతి నారదః, అనగా జ్ఞ్యానాన్ని అనుగ్రహించు వారు నారదుల వారు అనే వ్యుత్పత్తి గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు)
అనుగ్రహింపబడిన " స్వరార్ణవం " అనే సంగీత విద్యను అందుకొని తరించిన శ్రీత్యాగరాయులవారి సంకీర్తనలు ఇప్పటికీ, మరియు ఎప్పటికీ, నిత్యనూతనమైన అమరానుగ్రహదాయక విశేషాలు...

ఒకసారి శ్రీచాగంటి సద్గురువులు ఉటంకించిన ఈ క్రింది సంకీర్తనలో శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారు నిజంగా ఎంతో అంతరార్ధాన్ని ఎంత గొప్పగా వ్యక్తపరిచారో కద..!

ప. తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా

అ. తలపులన్ని నిలిపి నిమిషమైన
తారక రూపుని నిజ తత్వములను (తె)

చ1. రామాయన చపలాక్షుల పేరు
కామాదుల పోరు వారు వీరు
రామాయన బ్రహ్మమునకు పేరు
ఆ మానవ జననార్తులు తీరు (తె)

చ2. అర్కమనుచు జిల్లెడు తరు పేరు
మర్కట బుద్ధులెట్టు తీరు
అర్కుడనుచు భాస్కరునికి పేరు
కు-తర్కమనే అంధకారము తీరు (తె)

చ3. అజమనుచు మేషమునకు పేరు
నిజ కోరికలేలాగీడేరు
అజుడని వాగీశ్వరునికి పేరు
విజయము కల్గును త్యాగరాజ నుతుని (తె)

సర్వం శ్రీవేంకటరామచంద్రపరబ్రహ్మార్పణమస్తు..💐

https://thyagaraja-vaibhavam.blogspot.com/2008/06/thyagaraja-kriti-thelisi-rama.html?m=1


No comments:

Post a Comment