Sunday, February 16, 2025

శ్రీ అపీతకుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర దర్శనం మరియు [ అష్టదిక్కుల్లో కొలువైన 8 లింగాలు..,అనగా తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయాన అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిలో నిర్రుతిలింగం, పశ్చిమాన వరుణలింగం, వాయవ్యాన వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యాన ఈశానలింగం,మరియు మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం, నేర్ అన్నామలై ఆలయం, ఆది అన్నామలై ఆలయం, ఇత్యాదివన్నీ దర్శిస్తూ సాగిన ] మాఘపౌర్ణమి పర్వసమయ అరుణాచలగిరిప్రదక్షిణం..💐😊

[ అష్టదిక్కుల్లో కొలువైన 8 లింగాలు..,అనగా తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయాన అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిలో నిర్రుతిలింగం, పశ్చిమాన వరుణలింగం, వాయవ్యాన వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యాన ఈశానలింగం,
మరియు మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం, నేర్ అన్నామలై ఆలయం, ఆది అన్నామలై ఆలయం, ఇత్యాదివన్నీ దర్శిస్తూ సాగిన ]
మాఘపౌర్ణమి పర్వసమయ అరుణాచలగిరిప్రదక్షిణం..💐😊

ఈ విశ్వంలో, ఈ భూప్రపంచంలో, మన సనాతన భారతావనిలో ఎన్నెన్నో మహిమాన్వితమైన శివాలయాలు కలవు.
వేటి మహిమ వాటిదే....వేటి ప్రత్యేకత వాటిదే...వేటి వైభవం వాటిదే....
 
అసంఖ్యాకమైన అట్టి అనేకానేక శివాలయాల్లో / శైవాగమవైభవభరిత శివశక్తిక్షేత్రాల్లో నిరుపమానమైనది, అనన్యసామాన్యమైనది, అందరానిమహిమలతో అనాదిగా అలరారుతున్న అత్యంత అరుదైన, అపురూపమైన ప్రాచీన ఆలయం, అరుణగిరి శ్రీపాదములచెంత కొలువైన
అరుణాచలేశ్వర ఆలయం / తిరువణ్ణామలయార్ తిరుక్కోయిల్...

మణిగిరి గా కృతయుగంలో,
స్వర్ణగిరి గా త్రేతాయుగంలో,
తామ్రగిరి గా ద్వాపరయుగంలో,
అరుణగిరి గా కలియుగంలో,

అనాదిగా ఈ మహిమాన్వితమైన అరుణాచలేశ్వర పర్వతం భాసిల్లుతున్నది అని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు...

మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి,
" అరుణగిరి " అనే పదానికి గల పర్యాయపదాలు ఏంటో తెలుసుకొని ఆ అరుణగిరియోగి / అరుణాచలేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులమై తరించే ప్రయత్నం గావిద్దాం...

అరుణగిరి అనగా....

అరుణ గిరి : అరుణవర్ణంలో భాసించే గిరి

అరుణ వర్ణంలో భాసించుట...అనగా ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచవర్ణశోభల కలయికగా భాసిల్లే దైవిక అరుణవర్ణం అని అర్ధం.... 
పంచముఖగాయత్రిదేవి యొక్క పంచాస్యవర్ణాలుగా భాసిల్లే ఈ అయిదు భాసలకు వివిధ విశేషాలు, వివిధ ప్రత్యేకతలు, వివిధ ఔపాసనిక తత్త్వార్ధాలు కలవు.... 
వాటిలో ఒక తత్త్వార్ధంగా...
ఈ అరుణగిరి యొక్క వర్ణం, సదరు ఉపాసకుడి గాయత్రి శక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దే సంధ్యాకాంతి వర్ణం....

అ రుణ గిరి : రుణాన్ని క్షయింపజేయు గిరి

ఏ రుణాన్ని క్షయింపజేయు గిరి...? అంటే....
ఏ రుణాన్నైనా క్షయింపజేయు గిరి...అని అర్ధం...

"రుణానుబంధేన పునర్జన్మవిద్యతే..." అని శాస్త్రవచనం....

అనగా రుణం కారణంగా మనిషి పునర్జన్మలను స్వీకరిస్తూ ఉండును...అని అర్ధం....
ఆ ఋణం అనేది...
దేవరుణం
ఋషిరుణం
పితృరుణం
అనే ఉన్నతస్థాయి ఋణాలనుండి....
ఏ ఋణం అయినా కావొచ్చు.... 

జన్మరాహిత్యం అనే సర్వోన్నతమైన మోక్షతీరాన్ని చేరేందుకు / కైవల్యసిద్దిని గడించేందుకు మనిషి యొక్క కర్మసంచయ సూచి శూన్యమై ఉండవలెను....
అది ఎంతోదుర్లభమైన స్థితి...ఎందుకంటే అన్నిరకాల ఋణాలు లయించినతదుపరి మాత్రమే ఈశ్వరుడు తన నిర్హేతుక సంకర్షణేక్షణములతో ఆ స్థితిని అనుగ్రహించును...

కర్మసిద్ధాంతాన్ని అనుసరిస్తూ అన్ని ఋణాలను లయింపజేసుకొని శూన్యఋణస్థితికి చేరుకోవాలంటే...
ఆ ప్రయాస అనేది అరుణగిరిప్రదక్షిణకై, హైదరబాద్ లో మన ఇంటినుండి ప్రారంభించి అరుణాచలం వరకు నడుచుకుంటూ వెళ్ళడం వంటిది....
ఈ ప్రయాసలో అరుణగిరిప్రదక్షిణ అనే మహాపుణ్యం ఎప్పుడు లభించును...?
తిరువణ్ణామలై అనే ప్రదేశానికి చేరుకున్న తరువాత గావించే 
అరుణగిరిప్రదక్షిణ పూర్తైన తదుపరి మాత్రమే....

కర్మసిద్ధాంతం కన్నా మెరుగైన భక్తిజ్ఞ్యానవైరాగ్య సిద్ధాంత మార్గాన్ని అనుసరించడం అనేది...
అరుణగిరిప్రదక్షిణకై, హైదరబాద్ లో మన ఇంటినుండి వివిధ వాహనాల్లో ప్రయాణించి అరుణాచలం వరకు చేరుకొని, అరుణాచలగిరిప్రదక్షిణం గావించడం వంటిది...

ఈ రెండు ప్రయాసల్లోను..,
అరుణగిరిప్రదక్షిణ పూర్తైన తదుపరి ఈశ్వరానుగ్రహంగా తత్ మహాపుణ్యం లభించి తరించడం అనేది సమానమే...

మొదటి ప్రయాసలో.....
ఎప్పటికి పూర్తౌనో ఆ అరుణాచలేశ్వరుడికే ఎరుక...

అనగా, కేవల కర్మసిద్ధాంతంతో ఎన్ని జన్మల్లో తిరుగాడుతూ, ఏ జన్మతదుపరి ప్రాప్తించే ఎట్టి జన్మలో ఋణశూన్య / కర్మసంచయలుప్త స్థితి అనుగ్రహింబపడి మోక్షం సంప్రాప్తించునో ఆ అరుణాచలేశ్వరుడికే ఎరుక...

రెండవ ప్రయాసలో.....
అనగా, విద్యుక్త కర్మసిద్ధాంతాన్ని ఆచరిస్తూనే, విశేషమైన భక్తిజ్ఞ్యానవైరాగ్య సిద్ధాంతాన్ని ఆచరిస్తూ జీవించడంలో.....
కేవలం కొద్ది జన్మల్లోనే ఋణశూన్య / కర్మసంచయలుప్త స్థితి అనుగ్రహింబపడి విశేషమైన ఈశ్వరానుగ్రహంతో మోక్షం సంప్రాప్తించుని అని విజ్ఞ్యుల ఉవాచ....

ఎందుకంటే.....

భక్తి అనగా...
సకల శ్రేయోదాయకుడైన ఈశ్వరుడి పట్ల నిర్హేతుక ప్రేమ...
జ్ఞ్యానము అనగా....
ఈశ్వరానుగ్రహమైన సదసత్వస్తువివేచన....
వైరాగ్యము అనగా....
రాగరహితమైన తద్వారా ద్వేషరహితమైన జీవనం.....

వారివారి పరిశ్రమకు అనుగుణంగా....
భక్తి జ్ఞ్యాన వైరాగ్యములు అనేవి....
ఒక్కొక్కరికి ఒకోస్థాయిలో ఉండును....

నా భక్తి ఈశ్వరుడుకి గంధపుష్పధూపదీపనైవేద్యం అనే పంచోపచారముల స్వల్ప భక్తి....
నా జ్ఞ్యానము ఈశ్వరానుగ్రహమైన కొద్దిపాటి సుజ్ఞ్యానము....
నా వైరాగ్యము ఈశ్వరానుగ్రహమైన కొద్దిపాటి శమదమజనిత ఉపయుక్తమైన స్వీయనిగ్రహం.....
కావొచ్చు....

కొందరి విజ్ఞ్యుల సర్వోన్నతస్థాయిలోని.....
భక్తి, ఈశ్వరుడుకి మహోన్నతమైన ఆలయాలు నిర్మింపజేసి, నిత్యారాధనలు నిర్హహింపజేసేంతటి గొప్పస్థాయి భక్తి....
జ్ఞ్యానము, ఈశ్వరానుగ్రహమైన సర్వోన్నతమైన ప్రజ్ఞ్యానము....
వైరగ్యము, ఈశ్వరానుగ్రహమైన సర్వోన్నతమైన తపోసమాధిస్థితి జనిత సంపూర్ణ సుప్తచేతనాస్థితి
కావొచ్చు....

కొందరి మధ్యమ స్థాయి వీటికి మధ్యలో ఉండే ఏ స్థాయైనా కావొచ్చు.....

ఈ భక్తి జ్ఞ్యాన వైరాగ్యం అనేవి అధ్యాత్మసంపద....

అప్పుడు సైకిల్ పై ప్రయాణించే వ్యక్తి...
ఈశ్వరానుగ్రహంగా ఇప్పుడు బైక్ పై ప్రయాణించడం.....
ఎట్లో...
భక్తి జ్ఞ్యాన వైరాగ్య స్థాయి కూడా ఈశ్వరానుగ్రహంగా అభివృద్ధిచెందే అంశం....తద్వారా మనిషి జన్మాంతరాభివృద్ధితో తన పునర్జన్మల ఉన్నతత్త్వానికి తానే బాటలు ఏర్పరచుకోవడం అనేది కర్మసిద్ధాంతం యొక్క విశేషం.. ....

మనం ఉన్న ప్రస్తుత కలియుగంలో, ఈశ్వరనామస్మరణం అనేది భక్తి యొక్క ప్రాథమిక లక్షణమై ఉన్నది...

అందుకే ఈశ్వరుడు ఎంతో దయాళువై....

దర్శనాదభ్రసదసి....
(చిదంబర ఆకాశలింగ దర్శనం)
జనానాద్కమలాలయే...
(తిరువారూర్ లో జన్మించడం..)
కాశ్యాంతు మరణాన్ముక్తిః...
(కాశిలో తనువుచాలించడం)
స్మరణాదరుణాచలే...
(అరుణాచలేశ్వరుణ్ణి స్మరించడం)

అని, త్రికరణశుద్ధిపూర్వక అరుణాచలేశ్వర నామస్మరణంతో భక్తులకు ఎంతగానో పుణ్యాన్ని ప్రసాదిస్తూ, పాపాలను దహిస్తూ, భక్తిజ్ఞ్యానవైరాగ్యాలను అనుగ్రహిస్తూ తిరువణ్ణామలయార్ గా పరిఢవిల్లుతున్నాడు....

అమ్మవారికి శ్రీలలితాసహస్రనామావళిలో, రెండు అత్యంత మహిమాన్వితమైన నామాలు కలవు...
అవి...

కైవల్యపదదాయిని ...
శివజ్ఞ్యానప్రదాయిని ...

[
క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ ।
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ ॥ 125 

స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ ।
సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయినీ ॥ 140 ॥
]

శివజ్ఞ్యానము, కైవల్యపదము, అనే రెండు కూడా భూలోకంలో మనుజులు తమంతతాముగా సముపార్జించుకోలేని సర్వోన్నతమైన అధ్యాత్మసంపద...

ఈ రెండు ఇంకా అనుగ్రహింపబడలేదు....
కాబట్టి...
అరుణాచలేశ్వరా... 
అని భక్తుడు ఎన్నో జన్మలపర్యంతం ప్రార్ధిస్తూనేఉన్నాడు....

ఈ రెండు అనుగ్రహింపబడినవారికి....
అరుణాచలేశ్వరా...
అని జన్మచట్రంలో తిరుగుతూ ప్రార్ధించే ఆవశ్యకత ఉండదు....

అందుకే అమ్మవారు అరుణాచలంలో అపీతకుచాంబ గా వర్ధిల్లుతూ ప్రార్ధించే భక్తులకు ఘనమైన భక్తిజ్ఞ్యానములను అనుగ్రహిస్తున్నది...

అది ఇది అనే భేదాలు లేకుండా తనతో ఐక్యమైన అన్నిటినీ నిమిషాల్లో దహించి భస్మంచేసే శక్తి, పంచభూతాల్లో కేవలం అగ్నిది....

అట్లే...

వారు వీరు అనే భేదాలు లేకుండా తమను ఆశ్రయించిన ఎల్లరి కర్మలంపటాలను ఎంతో శీఘ్రంగా దహించి భస్మంచేసే శివశక్తి స్వరూపాలు, పంచభూత అగ్నిలింగ క్షేత్రాధిష్టానదేవతలైన 
శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు /
అరుల్మిగు ఉన్నామాలై అమ్మన్ సమేత అన్నామలయార్....

అందుకే శ్రీచాగంటి సద్గురువులు అన్నది...

"అసంఖ్యాక జన్మాంతర జీవయాత్రాభ్యున్నతి అనేది...

అరుణాచలప్రవేశానికి ముందు వేరు....
అరుణాచలప్రవేశానికి తర్వాత వేరు..

అని ఎర్రసిరాతో మీరు అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యాంశం..." అని....

అన్నము వేరు.....
బెల్లంతో తయారుగావించే మధురాతిమధురమైన పరమాన్నము వేరు....

అట్లే...

"నమఃశివాయ".....
అనే పంచాక్షరి జపఫలం వేరు...
"అరుణాచలశివ" జపఫలం వేరు...!

(శ్రీరమణాశ్రమంలో ఆకలితో వెళ్ళిన మాకు వెంటనే ప్రసాదం గా పరమాన్నం లభించింది...😊
అది స్వీకరించిన తదుపరి స్కందాశ్రమం / విరూపాక్షగుహ కు 
నడకదారి ప్రయాణం ప్రారంభించాము...)

మూడోసారి అరుణగిరి ప్రదక్షిణానుగ్రహాన్ని ఒనరించిన అరుణాచలేశ్వరుడి నిర్హేతుక దయకు సద్భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ....

అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా

ఓం అరుణాచలేశ్వరాయ నమః...💐😊🙏


No comments:

Post a Comment