Thursday, May 22, 2025

శ్రీ విశ్వావసు నామ 2025 సంవత్సర వైశాఖమాస శ్రీ సరస్వతీ నదీపుష్కరతీర్థస్నాన వైభవం..💐🙂


రమారమి 12 సంవత్సరాల పాటు సూర్యుడి చుట్టూ సాగే గురుగ్రహం యొక్క భ్రమణ సమయాన్ని పుష్కర సమయం అని విజ్ఞ్యులు వచించెదరు...
ఈ 12 సంవత్సరాల సమయంలో,
జ్యోతిషశాస్త్రానుగుణంగా మనకు గల 12 రాశులగుండా బృహస్పతి గావించే పయనంలో భాగంగా ప్రతీ సంవత్సరం ఒక్కో మహానదికి ఒక్కో సంవత్సరం పుష్కరసమయంగా మన ఆర్షవిజ్ఞ్యానకోవిదులు, మహర్షులు నిర్ణయించి తరించి మనల్ని తరింపజేసారు....

2025 మే 15 నుండి 26 వరకు,
వృషభరాశి నుండి మిథునరాశికి బృహస్పతి యొక్క సంచారాన్ని పురస్కరించుకొని సరస్వతీనది యొక్క ఆది పుష్కరాలు మరియు నర్మదానది యొక్క అంత్య పుష్కరాలు జరిగే మహోన్నతమైన పర్వసమయం...తదనుగుణంగా కొంత అధ్యాత్మ వివేచన గావించి ఈశ్వరానుగ్రహంతో తరించడం మనందరి విహిత ధర్మం...

కేవల భౌతికతత్త్వానికి మరియు అధ్యాత్మతత్త్వానికి గల భేదం ఏంటంటే....

భౌతికశాస్త్ర విజ్ఞ్యులకు ఇతర అన్నీ మొక్కలలా తులసి మొక్క కూడా ఒక మొక్క....
అధ్యాత్మశాస్త్ర విజ్ఞ్యులకు తులసి మొక్క సకల దేవతాతత్త్వ నిలయం....సకల ఔషధీతత్త్వ నిలయం....సర్వ తీర్థతత్త్వ నిలయం...

భౌతికశాస్త్ర విజ్ఞ్యులకు ఇతర అన్నీ దేశాలలా భారతదేశం  కూడా ఒక దేశం....
అధ్యాత్మశాస్త్ర విజ్ఞ్యులకు భారతదేశం 
దేవభూమి....
వేదభూమి....
ధర్మభూమి
జ్ఞ్యానభూమి
కర్మభూమి...

భౌతికశాస్త్ర విజ్ఞ్యులకు ఇతర అన్నీ నదులలా భారతదేశంలోని జీవనదులు కూడా సామాన్య త్రాగు/సాగు నీటి జలప్రవాహాలు....
అధ్యాత్మశాస్త్ర విజ్ఞ్యులకు భారతదేశంలోని జీవనదులు దేవతలు....అనగా ఆయా నదులను ఉద్ద్యేశించి నదీఅధిష్టానదేవతలను అధ్యాత్మశాస్త్రం ఆరాధించిను....

అనగా అధ్యాత్మశాస్త్రానుగుణంగా ఇప్పుడు నర్మదానదీదేవత /
నర్మదాతీర్థం నుండి పుష్కరుడు అనే అమేయపుణ్యదాయక తీర్థజలసంచారదేవతాశక్తి సరస్వతీనదీదేవతను / 
సరస్వతీతీర్థాన్ని అనుగ్రహించే ఈ 12 రోజుల పర్వసమయాన్ని సరస్వతీనదీ / సరస్వతీతీర్థ పుష్కర సమయం అని వచించెదరు...

ఋగ్వేదంలో విశేషంగా స్తుతింపబడే సరస్వతీనదీ
ఈ కలియుగంలో కొన్ని కారణాలరీత్యా అంతర్వాహిని గా ప్రవహించడం, అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రమే తన ఉనికిని వ్యక్తపరుస్తున్న కారణంగా....

ఉత్తరాఖండ్ లో మానా గ్రామంలో,
ఉత్తరప్రదేశ్ ప్రయాగ గ్రామంలో ఉండే గంగా యమునా సరస్వతీ త్రివేణి సంగమంలో,
తెలంగాణ కాళేశ్వరం గ్రామంలో గోదావరి ప్రాణహిత సరస్వతి త్రివేణి సంగమంలో,
విజ్ఞ్యులచే సరస్వతీనదీ పుష్కరాలు నిర్వహింపబడడం మన సౌభాగ్యం...

అక్కడెక్కడో బదరినారాయణ పుణ్యక్షేత్రం దెగ్గర ఉద్భవించే సరస్వతీనదీ, అంతర్వాహినిగా ప్రవహించి, ప్రయాగ త్రివేణి సంగమానికి చేరుకొని, అక్కడినుండి ఆ అంతర్వాహిని సరస్వతీఝరి శ్రీకాళేశ్వరముక్తీశ్వర పుణ్యక్షేత్రం దెగ్గర ఉన్న ప్రాణహిత గోదావరి నదుల త్రివేణి సంగమంగా ఉద్భవించి, బంగాళాఖాతంలో సంగమించడం ఏంటి అని కొందరు భౌతికతత్త్వవేత్తల సందేహం అయ్యుండొచ్చు....

మన కాలికి ఏదో గాయమై నొప్పిగా ఉన్నప్పుడు, డాక్టర్ గారి దెగ్గరికి వెళ్తే, జెరోడాల్ ఇత్యాది ఔషధీమాత్రలను ఇచ్చి, నీళ్ళల్లో వీటిని కలుపుకొని తాగితే మీ కాలిగాయం తాలూకా నొప్పి శమింపబడుతుంది అని చెప్పినప్పుడు...
"అదేంటి...పైన నోట్లో ఔషధీమాత్రలను వేస్తే కాలి నొప్పి తగ్గడం ఏంటి...?
అని అడిగితే దానికి సమాధానం,
"వెళ్ళి ఎం.బి.బి.ఎస్ & జెనెరల్ మెడిసిన్ లో మాస్టర్స్ చేసిరా నాయనా....అప్పుడు ఆ టాబ్లెట్స్ లో ఉండే పేన్ న్యూట్రలైజింగ్ మాలిక్యులార్ ఫార్మ్యుల ఎవ్విధంగా నీటిలో డిసాల్వ్ అయ్యి, నీ కాలిగాయం యొక్క నొప్పికి ఉపశమనం కలిగించునో అర్ధమౌతుంది...."
అని చెప్పవలసిఉంటుంది....

అవ్విధముగనే, గౌ || ఎం.ఎల్.ఏ గారో / మంత్రి గారో / ముఖ్యమంత్రి గారో / ప్రధానమంత్రి గారో న్యుఢిల్లి ఏర్పోర్ట్ లో బయల్దేరి, ప్రయాగరాజ్ లో నిర్వహింపబడే ఒక ఈవెంట్ కి హాజరయ్యి, అట్నుండి హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కి హాజరయ్యి, ఆ తరువాత బెజవాడ గన్నవరం ఏర్పోర్ట్ లో వేచిఉన్న మాన్యులతో సంభాషించి ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి సన్నిధికి విచ్చేయనున్నారు....."
అని అంటే....
దానర్ధం...
"ప్రయాగరాజ్ ఏర్పోర్ట్ లో, మరియు హైదరాబాద్ ఏర్పోర్ట్ లో వేచి ఉండే మాన్యులతో కూడా లఘువుగా సంభాషించెదరు..." అని అర్ధం చెప్పవలసిఉంటుంది....

అవ్విధముగనే, బదరీ పుణ్యక్షేత్రంలో బయల్దేరిన సరస్వతీనదీ అంతర్వాహినిగా ప్రయాణించి, ఉత్తరప్రదేశ్ గంగ, యమున
సరస్వతి, త్రివేణిసంగమంలో ఉద్భవించి, అక్కడినుండి ఆ అంతర్వాహిని ప్రవాహం అట్లే కొనసాగుతూ శ్రీకాళేశ్వరముక్తీశ్వర పుణ్యక్షేత్రం దెగ్గర, గోదావరి ప్రాణహిత నదుల సంగమస్థలిలో త్రివేణిసగమంగా అంతర్వాహిని గా ఉద్భవించడం కూడా అట్టి ప్రయాణమే...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నట్టుగా, గౌతమ మహర్షి యొక్క తపఃశక్తితో ఉత్తరభారతదేశం నుండి ఒక అంతర్వాహిని ప్రవాహఝరిగా దక్షిణభారతావనికి ఆహ్వానింపబడిన గంగానది, నాసికాత్రయంబకేశ్వర పుణ్యక్షేత్రం దెగ్గర సహ్యాద్రిసానువుల్లో బ్రహ్మగిరిపర్వతప్రాంతంలో ఒక్కోచుక్కగా వినిర్ముక్తమౌతూ గౌతమితీర్థంగా ప్రభవించి, అక్కడ ఒక కుండంలో ఒదిగి అంతర్వాహినిగా మారి, పర్వతాన్నిదిగి త్రయంబకేశ్వరుడి ఆలయ ఆవరణలో గుప్తగోదావరిగా తీర్థకుండంలో ప్రభవించి, అక్కడినుండి ప్రయాణిస్తూ ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను పునీతం గావిస్తూ, సుదీర్ఘప్రయాణానంతరం శ్రీవరభద్రగిరీశ సన్నిధికి చేరుకున్న గౌతమి, సిద్ధగౌతమిగా రూపాంతరం చెంది, రాజమహేంద్రవరానికి గలగల తరలివచ్చే విశాలగోదావరి విశ్వరూపాన్ని చూసి ఎవ్వరైనా అచ్చెరువొందెదరు....

కాబట్టి అధ్యాత్మతత్త్వపరంగా గంగయే గోదావరి...!
సకలజీవుల ప్రాణములకు నాయకుడైన సమవర్తి చెల్లెలే సూర్యపుత్రిక అయిన యమున....
అట్టి యముడికి పరమేశ్వరుడు ఈశ్వరత్వాన్ని అనుగ్రహించి,
తనతో సమానంగా తనపక్కనే లింగరూపంలో శ్రీకాళేశ్వరుడిగా 
కొలువైఉండి, తనకంటే ముందు యముడికి / అనగా లింగరూపంలో తనపక్కన కొలువైన 
శ్రీకాళేశ్వరుడికే ప్రథమపూజ అనే అరుదైన అనుగ్రహాన్ని ఈశ్వరుడు ప్రసాదించిన క్షేత్రం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రం...

ఈశ్వరుడు స్వయంవ్యక్త శివలింగరూపంలో ఎక్కడ కొలువైఉన్నా కూడా జీవనదులు తమంతతాముగా అక్కడికి వచ్చి చేరుకుంటాయ్....
యముడి సహోదరి అయిన యమునకు ప్రతిరూపమే ప్రాణహిత నది...
కాబట్టి గంగగా గోదావరి నది ఉండగా...యమున గా ప్రాణహిత నది ఉండగా సరస్వతి నది అంతర్వాహినిగా వచ్చి కొలువైఉండడం భక్తుల భాగ్యవిశేషం...

భక్తి అనేది నిర్హేతుకవిశ్వాసానికి నిర్వచనం...
విశ్వాసం అనేది నిర్హేతుక అనుగ్రహానికి ఆధారం...

ఒక అయస్కాంత క్షేత్రంలోకి వచ్చిచేరే వస్తువు ఒక ఇనుప పుల్ల అయినా, ఒక ఇనుప స్తంభమైనా, అది అయస్కాతంగా మారును...
అనే లా ఆఫ్ అబ్సర్వబుల్ సైన్స్ సూత్రానికి మనం ఇచ్చే నిర్వచనమే...
ఒక త్రివేణిసంగమ పవిత్రభూమికి విచ్చేసే ప్రతీ భక్తుడికి లభించే గౌరమై ఒప్పారును...
అనగా ప్రతీ భక్తుడికి, వారివారి భక్తిప్రపత్తులకు తగ్గట్టుగా ఈ పుష్కరసమయం విశేషమైన పుణ్యసంపత్తును అనుగ్రహించును.....

మన భగవద్భక్తి ఒక ఇనుప పుల్ల అంతటిదైతే మనకు లభించే అనుగ్రహం ఒక మాగ్నెటిక్ పుల్ల...
మన భగవద్భక్తి ఒక ఇనుప స్తంభమనంతటిదైతే మనకు లభించే అనుగ్రహం ఒక మాగ్నెటిక్ స్తంభం...
అన్నమాట....

చెట్టుకొలది గాలి..
భక్తికొలది భగవంతుడు...
పుణ్యంకొలది సంపత్తు... 
జ్ఞ్యానంకొలది ఈశ్వరానుగ్రహం...
అని కద మన పెద్దల మాట...

జ్ఞ్యానానికి అధిదేవత సరస్వతీదేవి...
ఇప్పుడు నిర్వహింపబడే సరస్వతీ నదీ పుష్కరాలు విశేషమైన జ్ఞ్యానానుగ్రహదాయకమైనవి కాబట్టి, ఈ పుష్కరాల్లో పాల్గొనే భక్తులందరికీ ఈశ్వరుడు విశేషమైన జ్ఞ్యానానుగ్రహాన్ని ప్రసాదించి తరింపజేయును...

శక్తికన్ననూ, సంపదకన్ననూ ఈ లోకంలో జ్ఞ్యానానికే విలువ, గౌరవం ఎక్కువ....
ఎందుకంటే జ్ఞ్యానరహితమైన శక్తిసంపదలు తలుపులు, తాళాలు లేని బంగారం, వజ్రాల విక్రయ దుకాణాలవంటివి....

కాబట్టి భక్తులెల్లరూ, ఈ విశేషమైన సరస్వతీనదీపుష్కరవైభవంలో పాల్గొని పునీతులై తరించెదరని ఆకాంక్షిస్తూ, ఈ పుష్కరాల్లో భక్తులకు వివిధరీతుల సేవలనందిచేందుకు ఏర్పాట్లు గావించిన దేవాదాయధర్మాదాయశాఖ వారికి కృతజ్ఞ్యతానమస్సుమాంజలిని వచిస్తూ...

ఓం శ్రీమహాసరస్వత్యై నమః..💐🙏🙂


No comments:

Post a Comment