శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ (2025-ఏప్రిల్-30), "అక్షయతృతీయ" పర్వసమయ శుభాభినందనలు....💐😊
చైత్ర శుద్ధ పాఢ్యమి / యుగాది,
వైశాఖ శుద్ధ తదియ / అక్షయ తృతీయ,
ఆశ్వయుజ శుద్ధ దశమి / విజయదశమి,
అనే మూడు శుభసమయాలు, పర్వదినాలు భారతీయ సనాతనధర్మవైభవసిగలో తణుకులీనే శాశ్వత మేలిమిముత్యపు ముహూర్తాలు అని విజ్ఞ్యుల విశ్వాసం...
ఈరోజే పంచపాండవులకు వారి వనవాస సమయంలో సూర్యపరమాత్మ అక్షయపాత్ర ప్రసాదించిన శుభసమయం...
ఆ అక్షయపాత్ర యొక్క ప్రత్యేకత ఏమనగా, ఎంత మంది అతిధులకైనా భోజనప్రసాదాన్ని అందించడం.
ఎప్పుడైతే ఆనాటి సూర్యాస్తమయం తరువాత చివరగా ద్రౌపదీదేవి ఆ అక్షయపాత్ర నుండి భోజనాన్ని స్వీకరిస్తారో, అప్పుడు ఆ రోజుకి అది నిండుకుంటుంది.. అనగా అందులోని భోజనం మొత్తం సమాప్తమవుతుంది...
ఇవ్విధంగా పంచపాండవుల వనవాస సమయంలో వారి కనీస అన్నపానీయముల అవసరములకు ఏ లోటు రాకుండా భగవంతుడు అనుగ్రహించాడు....
ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం కలగవచ్చు.....
కుంతీ పుత్రులైన
ధర్మరాజు, (యమధర్మరాజు గారి అంశ)
భీమసేనుడు, (వాయుదేవుని అంశ)
అర్జునుడు, (ఇంద్రుని అంశ)
మాద్రి పుత్రులైన
నకుల, సహదేవులు (అశ్వినీ దేవతల అంశలు),
ఈ దేవతాంశభరిత సుక్షత్రియ వీరులకు లేని ఆ అమృతస్పర్శ, కేవలం ద్రౌపదీదేవికి ఎందుకు అనుగ్రహింపబడింది...అని...
సీతమ్మ, సావిత్రి, అరుంధతి, అనసూయ, దమయంతి, ద్రౌపది, కుంతి అనే సప్తపతివ్రతాశిరోమణుల్లో ఒకరిగా...
అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి అనే పంచపతివ్రతాశిరోమణుల్లో ఒకరిగా...
చిరంతన ఖ్యాతి గడించిన ద్రౌపదీదేవి మామూలు క్షత్రియకాంత కాదు....సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశలో, దృపదమహారాజు గారు నిర్వహించిన యజ్ఞ్యవేదిక నుండి దేవతాంశలో ప్రభవించిన అనన్యసామాన్యమైన సుక్షత్రియకాంత....
త్రేతాయుగంలో సీతమ్మ,
"నా శ్రీరాముడు వచ్చి నన్ను స్వాగతించేంతవరకు,
ఈ రావణుడి కాంచనలంకలోని అన్నం మెతుకు కూడా ముట్టను..."
అనే శపథంతో కేవలం దేవేంద్రుడు పంపించే పాయసపాత్రను స్వీకరించి జీవించిన విషయం గురించి మనం శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో విన్నాం కద....
అవ్విధముగనే, ద్వాపరయుగంలో, శకుని మాయాజూదంలో ఓడిన పంచపాండవులకు వారి 14 సంవత్సరాల వనవాస / అజ్ఞ్యాతవాస సమయంలో అన్నపానీయములకు కూడా ఇబ్బంది కలిగితే ఇక వారు రాజ్యం, సిమ్హాసనం అని తిరిగి రావడం ఉండదు కాబట్టి మొత్తం హస్తినాపుర సామ్రాజ్యం నాకే సొంతం అని అనుకున్న దుర్యోధనుడి అధీనంలో ఉన్న ఏ ప్రాంతానికి వెళ్ళినా పంచపాండవులకు అన్నపానీయముల లభ్యతలో ఇబ్బంది ఉండును కావున,
ద్రౌపదీదేవి అంతటి మహాసాధ్వీమణికి, అట్టి రాచకాంత ఇల్లాలుగా ఉన్న పంచపాండవులకు, దైనందిన భోజనాలకు ఇబ్బంది ఉండడం అనేది దేవతలకే అవమమానకరమైన అంశం...
ధర్మాత్ముల ఆకలిబాధ వారు జీవించే రాజ్యానికి అమంగళకరమౌను కాబట్టి, అట్టి పరిస్థితి రాజ్యానికి దాపురించకుండా ప్రత్యక్షపరమాత్మ అయిన సూర్యదేవుడు తన అక్షీణశక్తిస్పర్షను కలిగిఉన్న పంచలోహపాత్రను అక్షయపాత్రగా ద్రౌపదీదేవికి అనుగ్రహించారు...
తన అనుమతిలేకుండా ముట్టకూడని ఏ సుక్షత్రియకాంత యొక్క కురులను పట్టుకొని మరీ ఈడ్చి నిండు సభలో తనను పరాభవించారో...
ఏ రాచకాంత యొక్క మానాభిమానములు వస్త్రాపహరణంతో నిండుసభలో మంటకలిసాయో,
అట్టి కురులను ఆవిడ,
కౌరవులందరూ నశించేంతరవకు ముడివెయ్యలేదు.....
అట్టి సభను ఆవిడ కౌరవుల పక్షాన ఉన్నవారందరూ నశించేంతరవకు అలంకరించలేదు.....
కలిపురుషుడి అంశలో జన్మించిన ధుర్యోధనుడు మరియు వాడి ఇతర రాక్షస సమూహం మొత్తం సమూలంగా నశించడానికి ఏ పాపం మూలకారణమో తెలుసా...,
ద్రౌపదీదేవి అంతటి రాచకాంతను మాయాజూదం పేరుతో ఇంతగా అవమానించి వేధిస్తున్నా కురుసభలో కనీసం భీష్మపితామహులైనా...
"దుర్యోధన...రాచకాంత అయిన నీ వదినను ఇలా నిండు సభలో అవమానించడం రాజ్యానికే తీరని కళంకం మరియు చేటురా...." అని కనీసం నొరెత్తని పాపానికి.....మరియు
ధర్మాత్ముడైన ధర్మరాజు గారి రుధిరబిందువులు విరాటపర్వంలో నేలరాలిన పాపానికి...
"అక్షయతృతీయ" అనే ఈ మహత్తరమైన తిథి నాడు చేసుకున్న పుణ్యకార్యాల పుణ్యం అక్షయమై వర్ధిల్లును అని విజ్ఞ్యుల ఉవాచ....
మీరు చూడండి.....
కొందరి ఇళ్ళల్లో ఉండే పెంపుడుకుక్కలు కూడా మహారాజ భోగాలతో జీవిస్తుంటాయ్....
ఆ కుక్క జన్మకు కారణం సదరు జీవుడు సదరు జన్మలో చేసుకున్న సదరు పాపమైతే....
కుక్క జన్మలో ఉన్నా కూడా సదరు జీవుడి రాజభోగాలకు కారణం సదరు జన్మల్లో వారు చేసునున్న అక్షయమైనపుణ్యం...
పాపపుణ్యాలు ఎవ్విధంగా జీవుల జన్మాంతర జీవయాత్రలో వాటి ఫలాలను ఇస్తుంటాయో అనేదానికి చిన్న ఎగ్సాంపుల్ చెప్తా...
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లోని తులసీదాస్ గారి జీవితచరిత్రలోని ఒక ఉదాహరణ తీసుకుందాం...
(వాల్మీకీ గారి కలియుగ అవతారమే తులసీదాస్ గారు అని విజ్ఞ్యుల విశ్వాసం)
ఒక సంపన్న జమీందార్ గారికి తులసీదాస్ గారు...
"మీకు శ్రీమద్రామాయణ వృత్తాంతాల గురించి చెప్తాను వింటారా..." అని అడిగినప్పుడల్లా...
" తర్వాతా వింటాను....మళ్ళీరా...వచ్చేవారం రా....నాకు వేరే చాలా పనులు ఉన్నాయ్....అది ఇది..." అని ఎల్లప్పుడూ తులసీదాస్ గారిని అగౌరవపరుస్తూ పంపించేసేవాడు....
అలా ఉండగా...కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జమీందారు గతించి ఆ ఇంట్లోనే ఒక కాడెద్దుగా జన్మించాడు....అది దర్శించి గుర్తించి తులసీదాస్ గారు....
"మీకు ఎన్ని పనులున్నా కూడా ఒక్కాసారి శ్రీమద్రామాయణం
వినిఉండిఉంటే ఇప్పుడు మీకు ఈ కాడెద్దు జన్మ వచ్చిఉండేది కాదు కద..." అని వచించి అక్కడి నుండి నిష్క్రమించారు.....
ఎద్దుగా ఉన్నా కూడా ఆ జమీందార్ గారు తులసీదాస్ గారి వచనాలను అర్ధం చేసుకుని శ్రీమద్రామాయణం విని ఉండి ఉంటే బావుండేది కదా అని అనుకున్నాడు కాని ఎద్దులకు శ్రీమద్రామాయణం బోధించడం అనే అంశం అంతగా వర్తించదు...
హనుమంతులవారు శ్రీరాముడి ఆనతిప్రకారంగా సీతమ్మ జాడను అన్వేషిస్తూ, భారతదేశ దక్షిణ సరిహద్దు సముద్రతీరానికి చేరుకున్న తదుపరి సంపాతి అనే గరుడపక్షితో జరిగిన సంవాదంలో భాగంగా,
హనుమంతుల వారు...
"కోసల మహాసామ్రాజ్యాధీశులైన దశరథమహారాజునకు శ్రీరామభరతలక్ష్మణశతృఘ్నులు అనే నలుగురు కొమరులు కల్గిరి...వారిలో శ్రీరాముడి అరణ్యవాసానికై కైకేయి వరం అడగడంతో శ్రీసీతారామలక్షణులు అడవులకేగిరి....." అని అప్పటి వరకు జరిగిన శ్రీమద్రామాయణాన్ని సంక్షిప్తంగా క్లుప్తంగా వివరించగా, అది శ్రద్ధగా ఆలకించిన పుణ్యానికి కాలిపోయిన తన రెక్కలు సంపాతికి తిరిగిలభించినవి...
అనగా ఏ జన్మలో ఉన్నాకూడా పుణ్యసంచయం అనేది ఉన్నతమైన సద్యోఫలితాలను కూడా ఇచ్చును...
అటువంటి అనేకానేక మహత్తరమైన దానాల్లో, షోడశదానాలు గా కొన్ని ఖ్యాతి గడించగా...
మిగతా ఎన్నో దానాలు మనుజులకు ఎంతో ఉన్నతమైన పుణ్యాన్ని సముపార్జింపజేయునని శాస్త్ర ఉవాచ....
ప్రపాదానం, గుడదానం, గోక్షీరదానం, పూర్ణఫలదానం,
కర్పూరదానం, వస్త్రదానం, శాకదానం, ఫలదానం, ఇత్యాది ఎన్నో దానాలు చాలా సామాన్యమైనవిగా అనిపించినా ఆయా పుణ్యసమయాల్లో గావింపబడే ఇట్టి దానాలు మహత్తరమైన ఫలితాలను అందించే అంశాలుగా పరిఢవిల్లును...
నేటి తిథి అయిన అక్షయతృతీయ నాడు గావింపబడే ప్రపాదానం / మంచితీర్థదానం జన్మజన్మలపర్యంతం గొప్ప ఫలితాలను ఇచ్చునని విజ్ఞ్యుల ఉవాచ...
కాబట్టి సత్బ్రాహ్మణోత్తములకు యాలకులు, పచ్చకర్పూరం, ఇత్యాది సుగంధద్రవ్య సమ్మిళిత ప్రపాదానం / పూర్ణజలకుంభ దానం ఇచ్చిన వారికి జన్మజన్మల పర్యంతం దాహర్తిశమనం, పుచ్చుకున్న వారికి పూర్ణఫలమైన అమేయ ఈశ్వరానుగ్రహం సమకూరునని విజ్ఞ్యుల విశ్వాసం...
ఎల్లరికీ (2025-ఏప్రిల్-30) అక్షయతృతీయ పర్వసమయ శుభాభినందనలు....💐😊
No comments:
Post a Comment