Thursday, May 22, 2025

శ్రీ విశ్వావసు నామ 2025 సంవత్సర వైశాఖ బహుళ దశమి ప్రయుక్త పూర్వాభాద్ర నక్షత్ర పురస్కృత శ్రీహనుమద్ జన్మదినోత్సవ శుభాభినందనలు...💐🙂


శ్రీచాగంటి సద్గురువులు నుడివిన శ్రీపరాశరసమ్హిత ప్రోక్త శ్రీహనుమద్ జన్మవృత్తాంత శ్లోకం నెట్ లో హిందీలో దొరకగా, తెలుగులో ఈ క్రిందివిధంగా అనువదించాను...

http://www.jayahanumanji.com

***** ***** ***** ***** ***** ***** ***** ***** ***** 

వైశాఖేమాసికృష్ణాయాం దశమీమందసమ్యుత
పూర్వప్రోష్టపదాయుక్త కథావైధృతిసమ్యుత

తస్యాం మధ్యాహ్నవేళాయాం జనయామాసవైసుతం
మహాబలం మహాసత్వం విష్ణుభక్తిపరాయణం

సర్వదేవమయం వీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం
వేదవేదాంగతత్వజ్ఞ్యం సర్వవిద్యావిశారదం

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

ఇట్టి పర్వసమయాన, శ్రీహనుమద్ వైభవం గురించి కొంత వివేచనగావించి తరించెదము...

స్వర్ణపురి
రజతపురి
లోహపురి

అనే 3 పురాల్లో తన అస్తిత్వం విస్తరించి ఉండగా, ఈ మూడుపురాలు కూడా ఆకాశంలో వివిధతలాల్లో ఎగురుతూ ఉండగా, ఎప్పుడైనా అవి ఒకేసరళరేఖపైకి వచ్చినప్పుడు వాటిని ఎవరైనా భేధించగలిగితే, అప్పుడు మాత్రమే తనకు నిధనప్రాప్తి అనే వరాన్ని బ్రహ్మగారి నుండి సముపార్జించిన త్రిపురాసుర వృత్తాంతం గురించి విజ్ఞ్యులకు ఎరుకే....

అలా ఎన్నో వందల సంవత్సరాలపాటు గాల్లో విహరించే  బంగారు, వెండి, ఇనుప పురాల్లో ఉండి ఉండి బోర్ కొట్టిన త్రిపురాసురుడు, ఒకసారి జస్ట్ ఒక్క క్షణం పాటు వీటిని ఒకేసరళరేఖపైకి వచ్చెలా చేస్తే తనతో యుద్ధం చేసేవారు ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని అనిపించి,
త్రిపురాసురుడు అలా ఒక్క క్షణం ఆ 3 పురాలను ఒకేసరళరేఖపై నిలుపగానే ఇలా పరమేశ్వరుడు తన పినాకం అనే ధనస్సుకు శ్రీవైష్ణవాస్త్రబాణరూపంలో 
ఎక్కుపెట్టబడిఉన్న శ్రీమహావిష్ణువును సంధించగా త్రిపురాసురవధ సాధింపబడెను అనేది మన పురాణ ఐతిహ్యం...

ఈ పురాణ ఐతిహ్యంలో భాగంగా, తనకు శ్రీవైష్ణవాస్త్రబాణరూపంలో త్రిపురాసురవధకు సహాయం చేసినందుకు, రాబోయే త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు స్వీకరించే శ్రీరామావతార సమయంలో, అపరరుద్రాంశసంభూతుడై ప్రభవించే ఆంజనేయుడిగా జన్మించి, రావణవధలో సహాయం గావించెదను అని శ్రీమహావిష్ణుకు పరమేశ్వరుడు వరమిచ్చిన కారణంగా, మనకు ఈ లోకంలో సాటిలేని దైవంగా శ్రీఆంజనేయస్వామివారు లభించినారు అనేది మన పురాణ ఐతిహ్యం...

ఆంజనేయుడు జన్మించిన
అంజనాద్రి అనే పర్వతప్రాంతం తిరుమల లోని జపాలి తీర్థం దెగ్గర అని కొందరు...
కర్ణాటక హంపి దెగ్గర అని ఇంకొందరు....
మరో చోట అని ఇంకొందరు....
ఇలా పలురకాలుగా ఉండడం అనే సత్యంలోని ధర్మసూక్ష్మం ఏమనగా....

ఇప్పటికి ఎన్నో త్రేతాయుగాలు గడిచినవి....మనమున్న ఈ కలియుగం తరువాత, ప్రారంభమయ్యే 29వ మహాయుగచక్రంలో మళ్ళీ కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు పునరావృతమవ్వును కద...కాబట్టి
మరెన్నో త్రేతాయుగాలు రానున్నాయి....

మన జియాలజిస్ట్ల పరిశోధనల ప్రకారంగా ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఈ భూప్రపంచ పటంలో ఎన్నో మార్పులు సంభవిస్తూవస్తున్న కారణంగా, రమారమి 13 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న భూప్రపంచనక్షకు, మరియు ఇప్పుడు మనమున్న దేశకాలంలోని భూప్రపంచనక్షకు ఎన్నో భేదాలుండును....
కాబట్టి ఒక భూప్రదేశం ఒక త్రేతాయుగంలోని సంఘటనలకు సాక్షి అయితే, సమీప ప్రాంతంలో ఉండే మరో భూప్రదేశం వేరొక త్రేతాయుగంలోని సంఘటనలకు సాక్షి అని అనడంలో అతిశయం ఏముండును....?

కొన్ని కోట్ల సంవత్సరాలుగా శ్రీవేంకటేశ్వరస్వామి వారు వివిధ రూపాల్లో తిరుమల కొండపై సంచరిస్తున్నట్ట్లుగా పౌరాణిక చారిత్రక ఐతిహాసిక విశ్లేషణలు ఉండగా...,
ఇప్పుడున్న ఆలయం కంటే ముందు స్వామివారి ఇప్పటి మూలమూర్తి సమీపప్రదేశంలో వేరే ఆలయంలో ఉన్నది...
అంతకంటే ముందు మరో సమీపప్రదేశంలో ఉన్న వేరొక 
ఆలాయంలో ఉన్నది...ఇలా దేశకాలములకు అతీతంగా 
తిరుమల శ్రీవేంకటేశ్వర పరదైవం, తిరుమల కొండపైనే ఉన్నా కూడా, సమీప ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ ప్రదేశాల్లో ఆయా కాలాల్లో కొలువుదీరిన ఆలయాల్లో స్వామివారు కొలువై భక్తులను అనుగ్రహించిన వైనంలోనే...
వివిధ కాలాల్లో, వివిధ యుగాల్లో వివిధ ప్రదేశాలు దేవతావాసాలుగా అలరారడం అనే భౌగోళిక ప్రక్రియ అనేది దేశకాల విశేషమే అవుతుంది...

మన తాతల ఊర్లు మనకు తెలుసు కాని...
వారి తాతల ఊర్లు పేర్లు మనకు తెలుసా...?
అంతమాత్రాన మన తాతలకు తాతలు లేరని అర్ధమా....? కాదు కద.....
అవ్విధముగనే క్రితం యుగం నాటి విశేషాలే మనకు తెలియును కాని అంతకంటే పూర్వం జరిగిన సంఘటనలకు సాక్షిత్వాన్ని వహించిన దేశకాలస్మృతులకు ఎవరు సాక్షి...? 
కేవలం మహర్షులు, దేవతలు, పంచభూతాలు, సూర్య చంద్ర నక్షత్ర మండలాలు, మాత్రమే సాక్షి...

కాబట్టి, పురాతన విశేషాలను తెలుసుకొని, అర్ధంచేసుకొని గౌరవించడంలో వైభవం ఉండును కాని వాటిలో భేదాలను, సందిగ్ధాలను, మాత్రమే ఎంచుతూ ఉంటే ఆధ్యాత్మికత యొక్క ప్రాథమిక లక్ష్యం కన్నుమరుగై సమయం గడిచి పోవును...

కాబట్టి ఆంజనేయుడు....,
కొండగట్టులో ఎప్పుడు ఎలా వెలిసాడు...
తాడ్బండ్ లో ఎప్పుడు ఎలా వెలిసాడు...
కర్మాన్ఘాట్ లో ఎప్పుడు ఎలా వెలిసాడు...
తిరుమల జాబాలి మహర్షి యొక్క తపోస్థలి అయిన జపాలితీర్థపరిసరాల్లో ఎప్పుడు ఎలా వెలిసాడు...
ఉడుపి శ్రీకృష్ణమందిర ప్రాంగణంలో ముఖ్యప్రాణదేవరగా 
ఎప్పుడు ఎలా వెలిసాడు...
ఇంకా మరెన్నో ప్రదేశాల్లో స్వయంభువుగా ఎప్పుడు ఎలా వెలిసాడు...

అనే మీమాంస కన్ననూ, భక్తుల భాగ్యంకొలది ఇన్ని ప్రదేశాల్లో, ఇన్ని ఆలయాల్లో ఇంత వైభవంతో వెలసి అలరారుతూ ఉండడం మన అభివృద్ధికారక సౌభగ్యం...అని భావించి ఆరాధించడంలోనే విజ్ఞ్యత ఉన్నది....

భారతదేశం యొక్క దక్షిణధృవమైన మహేంద్రగిరి పర్వతప్రాంతానికి చేరుకున్న హనుమంతుల వారిని విజ్ఞ్యులైన వారు, 
"హనుమ....సీతమ్మ వారి జాడను కనుగొనడానికి ఈ సముద్రాన్ని లంఘించి కాంచనలంకకు చేరడానికి నీకన్నా సమర్ధులు వేరెవరు వాయుపుత్ర...? లే...నీ అప్రతిహత శక్తి గురించి తెలుసుకో...విశ్వరూపాన్ని ధరించి
ఈ నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా లంఘించి సీతమ్మ జాడను కనుగొని విజయుడవై తిరిగిరమ్ము...." 
అని జాంబవంతాది వీరులు స్తుతిస్తూ ఉండగా...

మహేంద్రగిరి పర్వతం తుత్తునియలయ్యే రీతిలో ఆనాడు 
వామనావతారంలోని శ్రీమహావిష్ణువులా....
ఇంతింతై...ఆన్నట్టుగా...విశ్వరూపాన్ని ధరించిన హనుమంతులవారు...జైశ్రీరాం అని ఒక్క దూకుతో ఆకాశంలోకి ఎగిరి చారణులు చరించే మార్గంలో 
(అప్పర్ స్ట్రాటోస్ఫియర్ ఏర్ పాత్) స్థిరంగా ప్రయాణిస్తూ కాంచనలంకదిశగా బయల్దేరగా....
సురస, సిమ్హిక, మైనాకుడు అనే మువ్వురు హనుమంతుల వారికి ఎదురైనారు....

హనుమంతుల వారి లక్ష్యశుద్ధిని, లక్ష్యసిద్ధిని పరీక్షించేందుకు దేవతల తరపున తారసపడినది నాగమాత సురస....

తనకు ఎదురుపడిన వారు తననోట్లోకి ఆహారంగా ప్రవేశించకుండా ముందుకు వెళ్ళడం కుదరదు అని వచించిన సురస యొక్క వచనాలను గౌరవించి, హనుమంతులవారు...
"సరే అట్లే గావించెదను....మీ నోటిని నేను పట్టేంత విశాలంగా గావించినచో మీ నోట్లోకి ఆహారంగా ప్రవేశించెదను...
అని పలికి తన విశ్వరూపం పట్టేంత సైజ్ లో ఉన్న సురస నోట్లోకి క్షణాల్లో ఒక చిన్న కీటకమంత పరిమాణంలోకి మారి అలా నోట్లోకి దూరి ఇలా బయటకు వచ్చిన హనుమంతుల వారు మనకు బోధించేది ఎమనగా....
జీవితంలో మనకు తారసపడే ప్రతీ వ్యక్తి వద్ద మనం మొదట ఉపయోగించవలసినది బుద్ధిబలం....
అనగా ప్రతీసమస్యకు మొదట బుద్ధిబలం వినియోగించినచో అది పద్ధతిగా పరిష్కరింపబడును....

ఆ తరువాత ఎదురైన సిమ్హిక, హనుమంతులవారి ప్రయాణానికి అవరోధం కల్పించే రాక్షసిగా తారసపడింది....పైపెచ్చు అది తన పరిసరాల్లో ఉన్న వాటిని వాటియొక్క నీడను పట్టి లాగి స్వాహా చేయగల శక్తిసంపన్నురాలు...
అందుకే హనుమంతులవారు అట్టి హానికారక రాక్షసిని సమూలంగా హతం గావించి ముందుకు సాగినారు...
సిమ్హిక వృత్తాంతం మనకు బోధించేది ఏమనగా....
జీవితంలో కొందరు వ్యక్తులు మనకు ఎదురుపడకున్నా కూడా, పరోక్షంగా మన కదలికలను బట్టి అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు...
అట్టి వారు మూలఘాతకులుగా పరిణమించకముందే, బుద్ధిబలం తో సమస్య యొక్క మూలం ఎక్కడ ఉన్నదో తెలుసుకొని, దేహబలంతో పరిశ్రమించి సమస్యను పరిష్కరించవలెను....అనగా సదరు సమస్యకు కారకులైనవారిని దారికి అడ్డుతొలగించి లక్ష్యం దిశగా మున్ముందుకు సాగవలెను...

ఆ తరువాత, మైనాకుడు తారసపడి...
"ఆహా...శ్రీరామకార్యనిమిత్తమై సముద్రాన్ని లంఘించి మరీ వెళ్తున్న వాయుసుతుడికి ఆతిథ్యం ఇవ్వడం ఎంతటి పుణ్యకారకం.." అని వచించి హనుమంతుల వారికి ఆతిథ్యాన్ని ఇవ్వగా....,
లక్ష్యసాధనకై ప్రయాణిస్తూ ఉండగా ఆలస్యకారకమయ్యే అలసత్వం, ఆహారవ్యామోహం అనగా ప్రాపంచిక విషయభోగలాలసతను, సున్నితంగా వద్దని వారించి మున్ముందుకు సాగడం....

ఆదిలోనేహంసపాదు అన్నట్టుగా....
ఈ మూడు సంఘటనల్లో హనుమంతుల వారు ఎక్కడైనా ఆగిఉండిఉంటే, శ్రీరామకార్యానికి, సుగ్రీవాజ్ఞ్యకు, వారు పూర్తిగా న్యాయం చేసిన వారిగా విజ్ఞ్యులు భావించలేరు...

అనగా మన జీవితంలో...మనం ఎల్లప్పుడూ...
"డిటర్మిన్ యువర్ ప్రయారిటీస్" అనే సూత్రానికి అనుగుణంగా జీవిస్తూ ప్రయాణించవలసి ఉంటుంది...
ఫర్ ఎగ్సాంపుల్, వాడు వీడు పార్టీలు చేసుకుంటూ, జీవితమంటే బిర్యానీలు, కార్లల్లో తిరుగుళ్ళు, అని చెప్తే విని బ్రతకడం కాదు విజ్ఞ్యత అంటే...మన వాస్తవిక జీవితానికి తగ్గట్టుగా విలాసాలకు దూరంగా, సంపన్నరాయుళ్ళ సారంగ తిరుగుళ్ళను సున్నితంగా వలదని వారిస్తూ, మన అసలైన లక్ష్యం ఏంటో తెలుసుకొని, బాధ్యతతో మన జీవితానికి మనమే న్యాయం చేస్తూ బ్రతకడమే హనుమ జీవిత కథనాలు మనకు బోధించును.....

అంతటి ధర్మభరిత యుక్తి పూర్వక శక్తి సంపన్న వినయమూర్తి కాబట్టే హనుమ పలికిన మాటలు పరమమంత్రమై, యుగయుగాల జగజగాల భక్తులను బ్రోచే జయమంత్రములై ఆ వచనాలు అమరవీచికలైన అమృతసిద్ధిసారస్వతమై వర్ధిల్లుచున్నవి.....

శ్రీచాగంటి సద్గురువుల "సంపూర్ణ శ్రీమద్రామాయణం" ప్రవచనాలు వినే సౌభగ్యం ఎందరు విజ్ఞ్యులకు లభించిందో కాని....

1. బాలకాండ
2. అయోధ్యకాండ
3. అరణ్యకాండ
4. కిష్కింధకాండ
5. సుందరకాండ
6. యుద్ధకాండ

అనే శ్రీమద్రామాయణంలోని ఆరు కాండల్లో.... 
అయిదవదైన సుందరకాండ ఎంతో విశేషమైన పారాయణకాండగా జగద్ప్రసిద్ధినొందిన మహామహిమాన్వితమైన సారస్వతం...

ఈ క్రింది ప్రసిద్ధ శ్లోకంతో సుందరకాండ యొక్క వైభవాన్ని అధ్యాత్మవిజ్ఞ్యులు కొనియాడడం గురించి శ్రీచాగంటి సద్గురువుల వివరణ చాలామంది విజ్ఞ్యులకు ఎరుకే.....

***** ***** ***** ***** ***** ***** ***** *****

సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా।
సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం।।
సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః।
సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం।।

" శ్రీరాముడు స్వయంగా సుందరుడు, సీతమ్మ సుందరి, శ్రీరామకథ సుందరమైనది, వనం సుందరమైనది, శ్రీమద్రామాయణ ఆదికావ్యం సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, జయమంత్రం సుందరమైనది, ఏది సుందరం కాదు? "
అని ఈ శ్లోకం సుందరకాండను స్తుతిస్తున్నది.....
***** ***** ***** ***** ***** ***** ***** *****

ఇక్కడ సుందరం / సౌందర్యం అనగా...
సకల సద్గుణప్రోదితో అలరారే సత్యమూర్తుల సహృదయవైభవ ఆవిష్కరణ అని విజ్ఞ్యులు వచింపవలసి ఉంటుంది...

అంతే కాని ఇక్కడ సుందరం / సౌందర్యం అంటే 2025 లో హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణుల సౌందర్యం తాలూకా ఉపమానంగా కావ్యధర్మం వచింపబడజాలదు.....

రోజు 3 చుక్కల పచ్చకర్పూర తీర్థసేవనం ఎంతటి మహత్వభరిత ఔషధమో / సకల ఆరోగ్యకారకమో,
రోజు ఒక చెంచా ఉసిరికాయ్ / త్రిఫలాచూర్ణ లేహ్యసేవనం ఎంతటి మహత్వభరిత ఔషధమో / సకల ఆరోగ్యకారకమో,
తెలుసుకొని సేవించి తరించడానికి నాకు 38 సంవత్సరాలు పట్టింది....
అంటే రమారమి నా సగంజీవితకాలం అజ్ఞ్యానంలోనే కూరుకుపోయింది....
ఎందుకు....?
ఇటువంటి ఉపయుక్తమైన విషయాల గురించి
చెప్పేవారు లేక...
కద...

అవ్విధముగనే....
రోజు ఒక్కసారైనా ఈ క్రింది సుందరకాండ ప్రోక్త జయమంత్ర పఠనం ఎంతో అనుగ్రహదాయకం అని ఎందరో విజ్ఞ్యుల ఉవాచ....
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాంతర్భాగంగా ఈ జయమంత్రాలను అందుకొని అనుసంధించి తరించగలగడం నా జన్మాంతరసౌభాగ్యం...

"ఏరా రావణ...లంకలో నీకు మంచి చెప్పేవారు లేరా...?
లేక మంచి చెప్పేవారు ఉన్నా కూడా  నువ్వు వినవా...?
దోషం ఎక్కడ ఉంది ...??"

అనే సీతమ్మ వారి మాటలు శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నవారికి గుర్తున్నట్టుగా.....
శ్రద్ధగా వినడం అనేది ఒక గొప్ప తపస్సు...

శ్రీమద్రామాయణ శ్రవణం అనే తపస్సుకు ఫలితాన్ని అనుగ్రహించే ఈ క్రింది జయమంత్రం యొక్క వైభవాన్ని అర్ధం చేస్కోవడానికి వాటి గురించి గొప్పగా చెప్పేవారు / విశ్లేషించే వారు ఉండాలి....వినే వారు కూడా ఉండాలి...
అందుకే నిరంతరం ఈ లోకంలో శ్రీహరికథాశ్రవణం అనే సారస్వతయజ్ఞ్యం లోకశ్రేయస్సుకై కొనసాగుతూనే ఉండాలి...

***** ***** ***** ***** ***** ***** ***** *****

శ్రీమద్రామాయణ జయమంత్రం

నమోస్తు రామాయ సలక్ష్మణాయ 
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై.
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో 
నమోస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః৷৷5.13.59৷৷

https://www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=5&language=te&field_sarga_value=13

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః.
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః৷৷5.42.33৷৷

దాసోహం కోసలేన్ద్రస్య రామస్యాక్లిష్టకర్మణః.
హనుమాన్శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః৷৷5.42.34৷৷

న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్.
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః৷৷5.42.35৷৷

అర్దయిత్వా పురీం లఙ్కామభివాద్య చ మైథిలీమ్.
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్৷৷5.42.36৷৷

https://www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=5&language=te&field_sarga_value=42

***** ***** ***** ***** ***** ***** ***** *****

ప. నీ నామ రూపములకు నిత్య జయ మంగళం

చ1. పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు (నీ)
చ2. పంకజాక్షి నెలకొన్న అంగ యుగమునకు (నీ)
చ3. నవ ముక్తా హారములు నటియించేయురమునకు (నీ)
చ4. నళినారి కేరు చిరు నవ్వు గల మోమునకు (నీ)
చ5. ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండే (నీ)
చ6. రాజీవ నయన త్యాగరాజ వినుతమైన (నీ)

https://thyagaraja-vaibhavam.blogspot.com/2007/05/thyagaraja-kriti-nee-naama-roopamulaku.html?m=1

సర్వం కొండగట్టు శ్రీలక్ష్మీవేంకటేశ్వర సహిత
శ్రీవీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙏🙂


No comments:

Post a Comment