Wednesday, May 15, 2019

అందరికి హ్యాపి ' మదర్స్ డే ' - 2019 - మాతృదేవోభవ ... :)

శ్రీమాత కు ప్రతిరూపమై ప్రపంచంలో తమ తమ పిల్లలందరికి ప్రత్యక్ష దైవంగా నిరంతరం రక్షణగా ఉండేది అమ్మ... ఆ మాతృమూర్తికి గౌరవవందన సూచకంగా సంవత్సరకాలంలో ఒక రోజుని ప్రత్యేకంగా జరుపుకోవడమే ' మదర్స్ డే ' అయితే, అందరికి హ్యాపి ' మదర్స్ డే '... 
గ్లోబలైజేషన్ వల్ల ఈ యావద్ ప్రపంచం నేడు ఒక కుగ్రామంగా మారి, "ఇందులో లేనిది లోకంలో లేదు....లోకంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి..." అనే మహాభారత ఇతిహాసం గురించిన సామెత ఒకటి, ఈనాటి భారత దేశ వర్తమాన వాస్తవికతకు కూడా వర్తిస్తుందన్నది అందరికి తెలిసిన విషయమే....
కాబట్టి భూగోళ ఆవలివైపున్న అప్రాచ్య ఆర్భాటాలన్నీ కూడా మన ప్రాచ్య దైనందిన జీవనవిధానంలో అంతర్భగామై, అక్కడి ఉత్సవాలు ఇక్కడ కూడా జరుపుకోవడం అన్నది ట్రెండ్ గా మారిన ఈ రోజుల్లో, వాటికి మన ఘన సంప్రదాయపు జోడింపుతో అవి సహేతుకంగా అందరికి ఒక సత్సందేశం ఇచ్చేలా మార్చి మాత్రమే వాటిని జరుపుకోవాలి అన్నది ఈనాటి పెద్దల మాట. అప్పుడే వాటివల్ల ఇంటికి, సమాజానికి కూడా ఒక సుహృద్భావ మేళవింపు కలిగి, ఈ నవయుగ జీవనశైలిలోని మన మరజీవన విధానానికి ఎంతో కొంత సార్ధకత...
పూర్తిగా వాటిని త్రోసిరాజని మనదైన సనాతనజీవనవిధానంలోనే జీవించాలనుకుంటే, ఈ నిత్య పరుగులపందెమైన మోడర్న్ వల్డ్ లో అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండి వెనకపడిపోతామని భావించడం కన్నా,
పూర్తిగా వాటినే ' దిగుమతి ' చేసుకొని, మనదైన సనాతనజీవనవిధానాన్ని కోల్పోతున్నాం అని భావించడంకన్నా,
"తానొవ్వక ఇతరులనొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి..." అని మన సుమతీ శతక కర్త సెలవిచ్చినట్టుగా, అటు మనదైన భారతీయ జీవనవిధానాన్ని దృఢంగా అనుసరిస్తూనే,
లోకంపోకడలకు అనువుగా కొంతమేర ఆధునికతను కూడా ఆహ్వానిస్తూ, ఆ అప్రాచ్యాచారాలను భోజనానంతర విస్తరిగా పరిగణించి వాటిని ఎంతవరకో అంతవరకే పరిమితంగా ఆదరించి, మధ్యేమార్గంగా, ఉభయకుశలోపరిగా జీవించడంలోనే జీవనసార్ధకత ఉందని నా భావన...
సద్గురు శ్రీచాగంటి వారి ప్రవచనాలు వినేవారికి,
"He who thanks his mother and his wife is the biggest fool on the planet...",
అని గురువుగారు చెప్పే ఒక ప్రోవర్బ్ బాగా జ్ఞ్యాపకంలోనే ఉండి ఉంటుంది....
ఎవ్వరి జీవితంలోనైనా, ఆ ఇరువురి ప్రాధాన్యత అటువంటిది..... వారివల్లే జీవితపుబండి ఆటుపోట్లకు తట్టుకొని నిలబడి మనగలిదేది....
ఆఖరికి కన్న తండ్రి కూడా, నా జీవితం, నా డబ్బులు, నా ఇల్లు, నా జల్సాలు, నా ఇష్టం, అనే సంకుచిత స్వార్ధవైఖరితో కుటుంబాన్ని, తన కర్తవ్యాన్ని పక్కనపడేసి బలాదూర్ గా జీవించగలడేమో.... కాని కేవలం అమ్మ మాత్రమే ఎంతటి పరిస్థితుల్లో సైతం యావద్ కుటుంబానికై తన కర్తవ్యాన్ని బాధ్యతగా స్వీకరించి శ్రమించి జీవించగలదు....
అందుకే యావద్ చరాచర విశ్వాన్ని తన క్రీగంటి చూపులతోనే సమ్రక్షించే ఆ పరాశక్తిని, వశిన్యాది వాగ్దేవతలు ఎన్నెన్నో శక్తివంతమైన పేర్లున్నాసరే,
" శ్రీమాతా " అని సంబోధిస్తూనే తమ లలితాసహస్రాన్ని మొదలుపెట్టారు... మతృమూర్తికి ఉన్న గొప్పదనం అటువంటిదని సకల శాస్త్రాల సారాంశం.....
లోకశ్రేయస్సుకై శ్రీ శివగురు ఆర్యాంబల తనయుడిగా అవతారాన్ని స్వీకరించిన శ్రీఆదిశంకరభగవద్పాదులు,
తమకోసం అంటూ ఎనాడూ ప్రత్యేకంగా ఏది సమకూర్చుకోకుండా, సమస్త మానవాళి శ్రేయస్సుకైమాత్రమే తమ తపశ్శక్తిని వినియోగించారు....
కాని వారి మాతృమూర్తికి కలిగిన కష్టాలకు, ఎన్నో సార్లు వారు ప్రత్యక్షంగా ఉద్యుక్తులయ్యారు.... నీటి కోసం శ్రమించే తల్లి కష్టాలకు చలించి ఏకంగా పూర్ణానది యొక్క గమనాన్నే తమ ఇంటివైపునకు మళ్ళించారు....! వారి మాతృమూర్తి యొక్క అవసానదశలో ప్రత్యేకంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్ధించి శ్రీమద్భాగవతలీలాసందర్శనా భాగ్యాన్ని కలిగించి మోక్షాన్ని సిద్ధింపజేసారు...!!
గోకుల గారాలబిడ్డడిగా తనను ఎంతో గారాబంగా పెంచి పోషించిన యశోదమ్మ, శ్రీకృష్ణుడి పెళ్ళిని స్వయంగా తాను జరిపించలేకపోయానని బాధపడినందుకు, ఏకంగా ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా, " శ్రీవేంకటేశ్వరస్వామి " అనే అవాతరాన్నే స్వీకరించాడు ఆ గోవిందుడు...!
ఈరోజుల్లో ఎవరింట్లో స్వచ్చమైన గోక్షీరాన్ని కాచి తీసిన వెన్నకుండలుంటున్నాయి గనక, ఆ పరమాత్మ ఆకలికి ఆగక ఇంట్లోజొరబడి నవనీతచోరలీలలు గావించడానికి.....
ఎంతైనా తిండిమెండయ్య కదా, కాబట్టి కన్నయ్యకి ఈ కలియుగవాసులు సరిగ్గా పెట్టకుంటే ఎలా అని,
వకుళమాతగా ఇప్పటికీ స్వామివారి ఆలయ ఆగ్నేయభాగాన ఉన్న శ్రీవారిపోటులో కొలువై, ఎదురుగా చిన్న బిలం నుండి,
బాలభోగాలనుండి, రాజభోగాలవరకు తన శ్రీవేంకటకృష్ణుడికి అన్నీ సరిగ్గా వండిపెడుతున్నారా లేదా అని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంది ఆ పరమాత్మ యొక్క మాతృమూర్తి సైతం....! 
పుట్టి బుద్ధి గడించిన పిదప 23 సంవత్సరముల వరకు అంటే 2010 వరకు, కనీసం ఒక్కసారైనా తిరుమల యాత్ర / స్వామి దర్శనానికి నోచుకోకుండా బ్రతికిన దౌర్భాగ్యపు జీవితానికి స్వస్తి పలికి, నా జీవితంలోని అత్యంత క్లిష్టపరిస్థితులను సైతం నిలదొక్కుని జీవించేందుకు గోవిందుడి రక్షణను ఆనాటినుండి నా జీవితాంతర్భాగం గా చేసేందుకు కారణమైన తిరుమల యాత్రలో,
ఆ శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి జీవితంలో మొట్టమొదటిసారి ( కుటుంబసమేతంగా కూడా ) ఏప్రిల్ 2010 లో తిరుమల వెళ్ళినప్పటి పిక్ లో అమ్మా / నేను..... 🙂

No comments:

Post a Comment