Monday, October 12, 2020

శ్రీఆశ్వయుజ శరన్నవరాత్రోత్సవ వైభవం....😊


శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల
సారాన్ని తమ నరనరాన జీర్ణించుకున్న వారికి ఎరుకలో ఉన్నట్టుగా, ఆశ్వయుజమాసం లో ఆదిపరాశక్తి యొక్క ఆరాధన ఎంతో ఆవశ్యకం....ఎంతగానో మహత్తరం...

( మన చాంద్రమాన పంచాంగాంతర్గత 
అశ్విన్యాది 27 నక్షత్రములలో చంద్రుడు కూడుకుంటూ ప్రకాశించే 12 నక్షత్రమండలాలలో అశ్విని నక్షత్రమండలం మొట్టమొదటిది.....
కాబట్టి ఉపాసనాపరంగా ఆశ్వయుజమాస ఆదిపరాశక్తి ఆరాధన చాల ప్రశస్తమైనదని శ్రీచాగంటి సద్గురువులు వివరించడం చాలామంది ఉపాసకులకు ఎరుకలో ఉన్న సత్యమే కద... )

ఆశ్వయుజ శుద్ధపాడ్యమి మొదలు నవమి వరకు ఉండే 9 రోజులు వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల వివిధ అర్చారాధనా విధానాల్లో ఆ ఆదిపరాశక్తి నిత్యం సేవించబడడం మనం సర్వదా గమనించే సత్యం.....

నవదుర్గా సంప్రదాయంలో శ్రీ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను వివిధ అలంకారాలతో అర్చించి ఆ శ్రీదుర్గామల్లేశ్వరి అమ్మవారిలోనే నవశక్తిరూపాలను దర్శింపజేసే సంప్రదాయం, ( దుర్గమ్మ నిజరూప అలంకార దర్శనం కలిపితే పది ) 

ఆశ్వయుజ నెలపొడుపు మొదలుకొని సద్దుల బత్కమ్మవరకు " బ్రతుకమ్మ " ఉత్సవాలుగా అదే నవదుర్గా సంప్రదాయన్ని వివిధ పుష్పాలతో తయారుచేయబడే  " పుష్ప శ్రీచక్రార్చన " గా యావద్
తెలంగాణలో బత్కమ్మ ఉత్సవాంతర్గతంగా మహిళామణులందరు కలిసి అమ్మవారిని ఆరాధించడం ఎల్లరికి తెలిసిందే కద.....

ఆగమబద్ధంగా స్థిరీకరించబడి సమంత్రక అర్చనలను అందుకునే శాక్తేయాలయాంతర్గత శ్రీచకార్చన అందరికి సాధ్యమయ్యే అంశం కాదు కద.....

శ్రీశైల భ్రమరాంబిక ఆలయం ఇత్యాది కొన్ని క్షేత్రాల్లో టికెట్ సిస్టం ద్వారా భక్తులు అమ్మవారి శ్రీచక్రార్చన ప్రత్యక్షంగా చేసుకొని అనుగ్రహం పొందే సౌభాగ్యం కలదు.....

( ప్రత్యేకించి ఆ శ్రీశైలభ్రామరి తన కరుణారస దృక్కులతో భక్తులను అనుగ్రహిస్తూ ఉండగా అమ్మవారి ఎదుటే కొలువైన ఆ మహిమాన్విత శ్రీచక్రార్చన ఎన్నెన్నో జన్మపరంపరల దురితాలను భంజించి ఈప్సితములను ఈడేర్చే మహా మహిమాన్వితమైన శ్రీచకార్చన....
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనామృతంలో ఈ సత్యాన్ని దర్శించి వెంటనే కుటుంబసమేతంగా ఇంట్లో అందర్ని తోడ్కొని శ్రీమల్లికార్జునమహాలింగ గర్భాలయంలో రుద్రాభిషేకానంతర  లలాటతాడనం
మరియు శ్రీభ్రమరాంబిక అమ్మవారి శ్రీచక్రకుంకుమార్చన గావించిన తదుపరి మా జీవితాలకు లభించిన అనుగ్రహన్ని ఆలంబనగా గావించే నేను ఈ సత్యాన్ని ఉటంకించాను.....)

శోడష కళలు ఆవహించబడి పౌర్ణమి నాటి సంపూర్ణచంద్రబింబంలా ధగధగ మెరిసిపోతు ఉండే ఏ దేవతామూర్తి దర్శనానికి వెళ్ళినాసరే,

( అనగా పాదాల నుండి శిరోపర్యంతం అయ్యవారి ఆలయాల్లోని సందర్శనం....
శిరస్సుపై నుండే కిరీటం మొదలు పాదాలకు అలంకరించబడిన మంజీరముల పర్యంతం అమ్మవారి ఆలాయల్లోని సందర్శనం..... )

ఆపాదతలమస్తక సందర్శనానంతరం
అందరు తమ చిత్తాన్ని స్థిరీకరించేది ఆ దేవతాస్వరూపం యొక్క ముఖమండలంపైనే....

అటువంటి వదనారవిందానికి వన్నెతెచ్చేది ఆ దేవతా మూర్తికి ఫాలభాగంలో ఆజ్ఞ్యాచక్ర స్థానంలో అలంకరించబడిన / ఆచ్ఛాదించబడిన కుంకుమ బొట్టు / తిరునామం / శ్రీచందనం / కస్తూరి తిలకం / విభూతి రేఖలు ఇత్యాది అలంకారము....

"అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితాయైనమః....."

అనికదా ఆ పరేశ్వరిని మనం స్తుతించేది....

అనగా "శుక్లపక్షంలో మరియు కృష్ణపక్షంలో కూడా ఒకేవిధంగా ఉండే ఎకైక తిథి 8వదైన అష్టమి తిథి నాటి చంద్రుడి వంటి ఫాలభాగంతో శోభిల్లే ఓ జగజ్జనని....." అని కద మనం లలితలో నిత్యం అమ్మవారిని స్తుతించేది....

ఇక్కడ అష్టమి తిథి అనగా 8 సంఖ్యకు, లలాటానికి, లలాట మధ్యమంలో కొలువైఉండే అజ్ఞ్యాచక్రానికి మరియు ఆ యోగశక్తికేంద్రానికి ఆచ్ఛాదనగా ధరింపజేసే బొట్టుకి,
వీటన్నిటిని సమగ్రసమాహార స్వరూపమైన ముఖమండల ఉపరితలభాగానికి అసలు ఏంటి సంబంధం...??

దేవతా మూర్తి యొక్క ఆపాదతలమస్తక దర్శనానంతరం ఆ మూర్తి యొక్క వదనారవిందంపై మన చూపు నిలిపి దేవుణ్ణి ప్రార్ధించండి అని మన సంప్రదాయ సుసంపన్నమైన పెద్దలు మనకు బోధించడం దేనికోసం...??

సనాతన ధర్మం యొక్క ఉనికిపట్టు మొత్తం ఇక్కడే దాగున్నది....!

శ్రీచాగంటి సద్గురువులు మనకు బోధించినట్టుగా అసలు మనం బొట్టు పెట్టుకునేది ఎందుకోసం....??

"నేను పునర్జన్మ సిద్ధాంతమును నమ్ముతున్నందుకు గుర్తుగా బొట్టును ధరించుచున్నాను....." అనేది సద్గురువుల బోధ కద.....

( ఇక్కడ బొట్టు ధరించని వారి గురించి ఎవ్వరు ఏమి అనుకోవట్లేదు....అనుకోవలసిన అవసరం కూడా లేదు....అసలు అది చర్చించవలసిన అంశమే కాదు......
ఎందుకంటే బొట్టు అనేది ఒక వ్యక్తిగతమైన అలంకరణ....
ఒక వాచ్చి, ఒక కళ్ళజోడు, ఒక బ్రేస్లెట్, ఇత్యాదివి ధరించడం ఎట్లాగో బొట్టు ధరించడం కూడా అట్లే....
కాకపోతే ఆ వివిధ వస్తువులు కేవలం భౌతికమైనవైతే....బొట్టు అనేది దైవికమైన ఒక శుభసూచకం....అంతే భేదం... 

బొట్టు ఉన్నంతమాత్రాన సదరు వ్యక్తి ఎక్కువ/గొప్ప అని కాదు....
బొట్టు లేనంత మాత్రాన సదరు వ్యక్తి తక్కువ అని కాదు.....

బొట్టు పెట్టుకొని ప్రజలను దోచి కోట్లకు కోట్లు ఫారిన్ బ్యాంకుల్లో దాచే వారు లేరా...?

బొట్టు పెట్టుకోకుండా తమ జీవితాలను ఇతరులకోసం త్యాగం చేసిన మహనీయులు లేరా...?

కాబట్టి బొట్టు పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం అనేది ఒక వ్యక్తిగతమైన, సైద్ధాంతికపరమైన,
దైవికమైన అలంకరణ ప్రియత్వం ....)

ఇక అసలు విషయానికి వస్తే,

పంచభూతాలు / సూర్యచంద్రులు / జీవుడు ఈ 8 తత్త్వముల కలయిక గా ఉండే అష్టవిధ ప్రకృతికి సంకేతం 8 సంఖ్య.....

ప్రకృతి పరమాత్మ,
పార్వతీ పరమేశ్వరులు,
అభిన్నం....

అందుకే వాటికి ప్రతీకలుగా ఉండే పరమేశ్వర లింగస్వరూపమైన 8 క్షేత్రాలు....అనగా....

1. చిదంబర ఆకాశలింగ క్షేత్రం.
2. శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం.
3. అరుణాచల అగ్నిలింగ క్షేత్రం.
4. జంబుకేశ్వర జలలింగ క్షేత్రం.
5. కంచి ఏకామ్రేశ్వర పృథ్వీలింగ క్షేత్రం.
6. కోణార్క్ సూర్యలింగ క్షేత్రం
7. సీతాకుండ్ చంద్రలింగ క్షేత్రం
8. నేపాల్ ఖాట్మండు యాజమానలింగ క్షేత్రం ( అనగా జీవుడికి ప్రతీక ) 

గురించి మనకు శ్రీ చాగంటి సద్గురువులు తెలిపినారు...

( 2,3,5 అనుగ్రహించిన ఈశ్వరుడు మిగిలిన 5 క్షేత్రాల సందర్శనాభాగ్యం కూడా నాకు త్వరలోనే అనుగ్రహించు గాక...😊)

మూలాధారచక్రం, మణిపూరకచక్రం, ఆజ్ఞ్యాచక్రం,

ఈ మూడింట్లో కొలువైఉండే 
బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి....
అనే 3 యోగ గ్రంథులను భేదించిన పిదపమాత్రమే 
సదరు వ్యక్తి / యోగి / జీవుడు తుదకు మస్తిష్కమండలంలో బ్రహ్మరంద్రం క్రింది భాగంలో కొలువైఉండే అత్యున్నతమైన 7వ దైన సహస్రారచక్రాన్ని భేదించి జీవాత్మలోనే అంతర్నిహితంగా అంతర్యామిగా ఉండే ఆ పరమాత్మను ఆంతరమున దర్శించగలిగేది....

( మనలోనే ఆత్మసాక్షాత్కారం / దైవసాక్షాత్కారం అనే పదాలు అన్వయం కానివి.....అసంబద్ధమైనవి.....
ఎందుకంటే ఇతర అన్ని అవస్థలలో కూడా పరమాత్మ కేవలం అనుభూతికి మాత్రమే అందే బ్రహ్మపదార్థ తత్త్వవిశేషం కాబట్టి.... )

ఈ షడ్చక్రభేదనం అనేది చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటుంది.....

"అలా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కేసి తిరుపతిలో దిగి చకచకా ఫ్రెషప్ అయ్యి అలిపిరి పాదాలమండపం చేరుకొని ఒక 10 కిలోమీటర్లు టకటకమని మెట్లెక్కేసి, అలా వైకుంఠం Q కాంప్లెక్స్ లో కాస్త విశ్రమించి, పడికావలి దాటుకొని, అలా వెండివాకిలి దాటగానే ఇలా వచ్చే బంగారువాకిలి లోకి ప్రవేశించి ఆ శ్రీశ్రీనివాసుడిని సందర్శించి అలా బయటికి వచ్చి లడ్డు కౌంటర్లో ఇచ్చే ఆ లడ్డులను తీస్కొని మీఇంటికి రాగానే నాకు ఒ 5 లడ్డులు ఇవ్వండి....సరేనా...."

అని ఒకరు మనకు చెప్పడానికి, మరియు
అలా స్వామివారిని సందర్శించి లడ్డు ప్రసాదం పొందడానికి ఎంత భేదమో, అది ఎంత  వ్యయప్రయాసలకోర్చే ప్రక్రియో, 

వివిధ యోగ ప్రక్రియలు కూడా అంతే...

ముక్కు మూసుకున్నంతమాత్రాన ప్రాణాయామం కాదు...
ఆసనం వేసుకున్నంత మాత్రాన యోగం కానేరదు....

గురువానుగ్రహం....దైవానుగ్రహం....
జన్మజన్మల సాధనాబలం.....
ఇవన్నీ జతైనప్పుడు మాత్రమే సంభవించేవే వివిధ యోగసాధనలు....తదంతర్గతజనితమైన విశేష దైవానుగ్రహములు....

స్థూల, సూక్ష్మ, జీవ/ఆత్మ, అనే మూడుస్థాయుల్లో నిత్యం మనిషి యొక్క చిత్తం తన ఉనికిని ఏర్పరుచుకుంటూ ఉంటుంది....

ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ( అనగా ఈ మూడింట్లో ) మనుష్యుడి చిత్తం కొలువైఉంది అనేది ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉండే అంశం....

వాక్కు మరియు ఈ షడ్చక్రాల కాన్సెప్ట్, 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనుష్య ప్రాణికి మాత్రమే లభించే అరుదైన వరం....

అందుకే మన పెద్దలు అన్నారు 
"దుర్లభం మానుషజన్మం ...." అని..

సహజంగా ఎల్లరికి ఎల్లప్పుడు స్థూలస్థాయిలోనే ఈ చిత్తం స్థిరీకరించబడి ఉంటుంది...

అనగా పాంచభౌతికమైన శరీర స్థాయిలోనే అన్నమాట....

ఇప్పుడేంతిందాం....సాయంత్రానికి ఏంతిందాం.....
మొహానికి ఏ క్రీంలు పూసి నిగారింపు తెద్దాం.....
ఇలా కేవల శరీర స్థాయిలో చరించే చిత్తం సర్వసామాన్యమైనా చిత్త స్థితి....

ఒక మెట్టు పైస్థాయిలో నిలిచి ఆధ్యాత్మికం పట్ల అంతో ఇంతో అభిరుచి, అవగాహన, పెంపొందించుకున్న వారికి స్థూల స్థాయిని దాటి సూక్ష్మ స్థాయిలో చిత్తాన్ని స్థిరీకరించగలిగే శక్తి ఈశ్వరానుగ్రహంగా లభిస్తుంది....

అనగా శరీరాన్ని పావుగా చేసుకొని
శరీరాంతర్గతమైన ఇంద్రియాలు సాగించే ఆటపై నియంత్రన సాధించే దిశగా వారి చిత్తం సూక్షస్థాయిలో తనను తాను స్థిరీకరించి శరీరం గురించి మాత్రమే పూనిక ఉండే స్థూల స్థాయిపై సంపూర్ణపట్టును సాధించగలుగుతుంది....

మామూలుగా భూమిపై బైకో, కారో ఎక్కి తిరగడం స్థూలస్థాయికి ఉపమానంగా భావించగలిగితే,
"ఆధ్యాత్మిక సాధన" అనే వృత్తిలో బాగా కష్టపడి 
" ఉపాసనా బలం " అనే డబ్బును ఆర్జించి కొనుకున్న
ఫ్లైట్ టికెట్ తో విమానం లో విహరించడం వంటిది సూక్ష్మస్థాయిలో చిత్తాన్ని స్థిరీకరించడం.....

ఇక సర్వోన్నతమైన జీవ / ఆత్మ స్థాయిలో స్థిరీకరించబడే చిత్తం....

ఇది అంత సులభంగా లభించే స్థితికాదు....

సూక్ష్మ స్థాయినికూడా దాటి ఎంతో గొప్ప గురువానుగ్రహం, దైవానుగ్రహం అనే అరుదైన సంపదతో తయారుచేసుకున్న ఒక అత్యాధునిక సకలసదుపాభరిత ప్రైవెట్ అంతరిక్ష పరిభ్రమణ వ్యవస్థ ( ఒక సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ ప్రైవెట్ ISS లాంటిది అనుకోండి ) లో కొలువై యావద్ ఆకాశాన్ని కళ్ళెదుట దర్శిస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి తుర్రుమని స్పేస్ షటిల్లో దూసుకుపోగల స్థాయిలో ఉండే స్థితికి ఉపమానంగా ఈ జీవ / ఆత్మ స్థాయిలో స్థిరీకరించబడే చిత్తం గురించి మనం భావించవచ్చు.....

ఈ స్థాయిని కూడా దాటి ఇంకా పై స్థాయిలో అనగా సహస్రారపద్మంలో సదరు ఉపాసకుడు తన యావద్ యోగశక్తిని స్థిరీకరించి అసలు తొదిమొదలంటులేని అనంతమైన రోదసిలో విహరించే ప్రత్యేక విహంగంలా ఉండే ఆ స్థాయినే తురీయావస్థగా మన పెద్దలు అభివర్నించారు....

జాగ్రత్, స్వప్న , సుషుప్తి అనే అవస్థాత్రయం సర్వ సాధారణంగా అందరికి వాటంతట అవే సంప్రాప్తించే అవస్థలు.....

ఆ అవస్థలో ఉంటూనే చిత్తాన్ని ఆ అవస్థకు సాక్షిగా సంపూర్ణ చేతనతో నిలపడమే ఆ అవస్థలోని కుండలినీ యొక్క షడ్చక్రభేదనం...

శ్రీ చాగంటి సద్గురువులు తెలిపినట్టుగా శరీరాన్ని కోసిచూసినాసరే ఏ చక్రాలు ఎవ్వరికి కనిపించవు.....

కాని అవి మన శరీరం లోనే ఎట్లుండును అంటే

ఒక రాకెట్ బాంబ్ ని కట్చేసి చూస్తే 
అన్ని బాంబులలో ఉన్నట్టే అందులో కూడా అదే భాస్పరసమ్మిళిత పేలుడుపదార్థం తాలూకా మిశ్రమం / పొడి కనిపిస్తుంది....కద....
అంతే కాని రంగు రంగుల మెరుపులు.....
వాటి విభిన్నమైన ఆకృతులు.....
అవి ఆవిష్కరించబడినప్పుడు వచ్చే వివిధ ధ్వనులు....

ఇవన్నీ కనిపిస్తాయ ఆ గుప్పెడంత మందుగుండు తరహాలో ఉండే పదార్ధంలో....??

కేవలం ఒక ఇగ్నైట్ చేయనడిన రాకెట్ వినువీధిలోకి దూసుకెళ్ళి ఒక అత్యున్నతమైన స్థాయికి అది చేరుకున్న తర్వాతమాత్రమే తనలో ఇముడ్చుకున్న

ఆ వివిధ వర్ణమంజరులు....
కళాకృతులు.....
ధ్వనులు.....
వీటన్నిటి సమ్మిళిత సమాహారంగా.....

"అబ్బా ఆ రాకెట్ ఎంత బాగా అన్ని రకాల విన్యాసాలను ఆవిష్కరించింది...కదా...." అని ఆశ్చర్యంచెందడం సంభవించేది..... 

కాబట్టి ఇప్పుడు ఇంకా ఇగ్నైట్ చేయబడని రాకెట్లో ఒక గొప్ప సంభ్రమాశ్చర్యజనక శక్తి ఉన్నట్టా లేనట్టా....??

ఉంటే ఎక్కడ ఉన్నట్టు....లేకుంటే అది ఎక్కడినుండి వస్తుందన్నట్టు....??

అని ఎవ్వరైనా అడిగితే ఏం సమాధానం చెప్తాం...?

" 'సరైన పద్ధతిలో' ఆ రాకెట్ ని వెలిగించి చూడండి...
మీకే తెలుస్తుంది అది ఎంతటి శక్తిని తన అధీనంలో సూక్ష్మరూపంలో ఒడిసిపట్టిఉన్నదో..... "
అని చెప్తాం...కద....

అచ్చం అదే విధంగా ప్రతి మనుష్యప్రాణి కూడా ఇంకా ఇగ్నైట్ చేయబడని ఒక రాకెట్ వంటి వారు...

వారిలో ఆ మచ్ నీడెడ్ స్పార్క్ ని ఇగ్నైట్ చేసి వారిలోనే అంతర్నిహితంగా దాగున్న యోగశక్తిని 
వారికి అందించేది గురువానుగ్రహం / దైవానుగ్రహం....

ఆ అనుగ్రహన్ని ఎవరికి వారు సాధించుకొని తమలోనే కొలువైఉండే ఆ పరతత్త్వప్రభలను సందర్శించడమే నిజమైన యోగం....

ఏ రాకెట్ కూడా తనకు తానుగా తనను వెలిగించుకోలేదు.....

ఒక సరైన సమయంలో.....
సరైన పద్ధతిలో....
సరైన దిశలో....

అది వెలిగించే వారికి ప్రతీకలే గురువులు....

అలా గురువుయొక్క అనుగ్రహ స్పర్శ లభించినతదుపరి మాత్రమే ఏ ప్రాణి అయినా తనలో కొలువైన పరమాత్మను అనుభూతి చెందడంలో దర్శించగలిగేది....

సరే ఇక అసలు విషయానికి వస్తే అంతటి మహత్తరమైన కుండలినీ శక్తికి అధిదేవతగా ఆదిపరాశక్తి వివిధ సూక్ష్మ స్థాయిలలో మన శరీరం అనే ఒక ఆశ్చర్యమైన శ్రీచక్రంలోనే  కొలువై ఉండి జీవుడిని సమ్రక్శించే ఆ గహనమైన సిద్ధాంతం గురించి, అది శాస్త్రోక్తంగా తెలుసుకొని ఆరాధించడం అందరికి అన్నివేళలా కుదిరేపని కాదు....

మహర్నవమికి ప్రతిఒక్కరు దేవి ఆలయంలో శ్రీచక్రకుంకుమార్చన చేసుకొని తరించడం కూడా వీలయ్యే పని కాదు...కాబట్టి.....

దేవుడి దెగ్గరికి జీవుడి పయనం కుదరనప్పుడు
జీవుడి దెగ్గరికే దేవుడి పయనం కుదరాలి.....కద....

అందుకే ఆ దయాస్వరూపిణి అందరు తనను అర్చించి తరించే విధంగా అమంత్రకంగా ఎల్లరు ఆరాధించగల 
పుష్పశ్రీచక్రాన్ని అధిష్టించి....

నా దెగ్గరికి మీరు రాలేక పోతే...
మీ దెగ్గరికే నేను వచ్చాను....

అన్నట్టుగా ఆ వివిధ పుష్పదొంతరలనే తన శ్రీచక్రనవావరణగా చేసుకొని 
పైన కొసకు ఉండే గుమ్మడి పువ్వునే తన త్రికోణబిందుస్థానంగా గావించి 
పూజలు స్వీకరించి భక్తితో ప్రార్ధించిన వారికి బ్రతుకును ప్రసాదించి అనగా ఆ చూడచక్కని బ్రతుకమ్మ లాంటి చక్కనైన బ్రతుకును అనుగ్రహించి దీవించడమే ఆ ఆదిపరాశక్తి యొక్క ఆశ్వయుజ నవరాత్ర బత్కమ్మ ఉత్సవాంతర్గత విశేషం......

పుష్పాలకు గల ప్రత్యేకత, యావద్ సృష్టిలో ఉండే పంచభూతాత్మక తత్త్వం ఒక్క పువ్వులో మాత్రమే ఏ విధంగా కొలువైఉంటుందో నేను ఇదివరకే ఒకపాతపోస్ట్లో రాసాను కద.....అది ఇక్కడ కూడా అన్వయించుకోవచ్చు...

ఒక శ్రీచక్రాంతర్గత త్రికోణబిందుస్థానానికి ఎంతటి శక్తి ఉంటుందో అనగా పాంచభౌతిక మరియు సూర్య చంద్ర జీవ సమ్మిళితమైఉండే అష్టవిధప్రకృతిలోని ప్రతి శక్తిపుంజంతో అనుసంధానించబడే వ్యవస్థకు ఆ బిందుస్థానం ఒక అంటెన్న ( Antenna ) వంటిది....

అచ్చం అదే విధంగా "అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితాయైనమః" అని అర్చించబడే అమ్మవారి ముఖమండలంలో కొలువైఉండే ఆ హరిద్రాకుంకుమ బొట్టులోని కోట్ల కుంకుమ పరాగములు కొన్ని కోట్ల భువనభాండాల్లో పరివ్యాప్తమై ఉండే ఆ ఆదిపరాశక్తి యొక్క అమేయ అనుగ్రహాన్ని మనకు అందించడంలో ఒక 
అంటెన్న ( Antenna ) సిస్టంలా పనిచేసే ట్రాన్సీవర్ వ్యవస్థ.....

( ట్రాన్స్మిటర్ కి, రిసీవర్ కి,  మరియు ఈ రెంటి కలయికగా ఉండే ట్రాన్సీవర్ కి గల భేదం ఈసీఈ ఇంజనీర్స్ కైతే పెద్దగా వివరించవలసిన అవసరం లేదు...ఇతరులకు చాల సింపుల్ గా చెప్పాలంటే...

కొన్ని రకాల స్పెషల్ స్టైలిష్ షర్ట్లు / రేయిన్కోట్లు / శ్వెటర్లను గమనిస్తే
అవి ఒక వైపు వేసుకుంటే ఒక వస్త్రంలా కనిపిస్తాయి....
ఉల్టా తిప్పి వేస్కుంటే మరొక వస్త్రంలా కనిపిస్తాయి...

అనగా రేయిన్కోట్ తిరగేస్తే శ్వెట్టర్ గా మారినట్టు అన్నమాట....

అచ్చం ఇదేవిధంగా ఒకే సాంకేతికపరికరాన్ని ఒకలా ఉపయోగిస్తే ట్రాన్స్మిటర్ గా మరోలా ఉపయోగిస్తే రెసీవర్ గా పనిచేసేలా రూపొందిస్తే దాన్నే ట్రాన్సీవర్ అని సంబోధిస్తారు.... )

ఒక అంటెన్న ( Antenna ) నుండి ప్రసరించబడే వివిధ తరంగదైర్ఘ్యం గల శక్తితరరంగాలను సులభంగా ఒడిసిపట్టాలంటే అటువంటి సామ్యము గల మరొక అంటెన్న ( Antenna ) కే అది సాధ్యమయ్యే పని....

అందుకే మనం కూడా అలా అటువంటి బొట్టును మన ఆజ్ఞ్యాచక్రస్థానంలో ధరించేది.....

అనగా పరమాత్మ అనే ఒక గ్లోబల్ అంటెన్న ( Antenna ) నుండి ప్రసరించబడే వివిధ శక్తితరంగాలను గ్రహించుటకు జీవాత్మ అనే ఒక లోకల్ అంటెన్న ( Antenna ) ను మన ముఖమండల మధ్యమున నెలకొల్పి ఆ తరంగాలను సులభంగా మనలోకి గ్రహించి వివిధ లౌకిక, పారమార్ధిక ఉపలబ్ధిని పొందే మహోన్నతమైన వ్యవస్థ ఈ సనాతనధర్మాంతర్గతమైన బొట్టు / తిలకధారాణ వ్యవస్థ అన్నమాట....

అందుకే అలా మన పెద్దలు మన చూపుని, చిత్తాన్ని ఆలయదేవతామూర్తి యొక్క ముఖమండలంపై స్థిరీకరించి ప్రార్ధన, ధ్యానం, నమస్కారం, చేసి తరించమని మనకు సెలవిచ్చినారు....

మనుష్యులకు ఈ ఆధ్యాత్మిక అర్ధాలు పరమార్ధాలు ఎల్లప్పుడు స్మృతిపథంలో ఉంటాయో ఉండవో అని ప్రకృతి ఎల్లప్పుడు మనకు హితకరంగా ఉండేలా
తనను తాను ఆవిష్కరించుకుంటూ
మన విహితకర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది....

శ్రీ చాగంటి సద్గురువులు సెలవిచ్చినట్టుగా వసంతనవరాత్రులు / యుగాది పండగ వస్తుంది కాబట్టి ఓ మామిడి చెట్టా....కొత్త చిగురు వేసి పూత పూసి పిందలు కాసి కాయలు మాకు అందివ్వవా అని మనం చెప్తున్నమా....?

ఓ వేప చెట్టా...మా ఉగాది పచ్చడిలోకి వేపపువ్వు కావాలి కాబట్టి పూయవా అని మనం చెప్తున్నమా....?

అట్లే, ఆశ్వయుజ నవరాత్రోత్సవం / బత్కమ్మ పండగ వస్తుంది కాబట్టి ఓ తంగేడు చెట్టా....పసుపచ్చని తంగేడు పూలను బత్కమ్మకోసం సృజించవా అని మనం చెప్తున్నమా..?

ఎప్పుడు ఏ ఉత్సవం సకలప్రాణి ప్రీతికరంగా క్షేమదాయకంగా శ్రేయోదాయకంగా జరుపబడాలి అనేది మన పెద్దలు ఏనాటినుండో మనకు ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా అందిస్తూనే వచ్చారు.... వాటిని అందిపుచ్చుకొని ఆచరించి దైవానుగ్రహం పొంది తరించి మన భావితరాలకు వాటిని అట్లే అందివ్వడమే ఎల్లరికి విహితధర్మం....

సర్వమంగళమాంగళ్యేశివేసర్వార్ధసాధకే
శరణ్యేత్రయంబికేగౌరినారాయణినమోస్తుతే....
🙏🙏🙏🙏🙏😊

No comments:

Post a Comment