Saturday, December 26, 2020

శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి 2020 పర్వదిన శుభాభినందనలు....😊🍕💐🍨🍟

శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాభినందనలు....😊🍕💐🍨🍟

తెలుగు సంప్రదాయం లోని అన్ని పండుగలు చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకొని జరుపబడే ఉత్సవములు....

అశ్విన్యాది 27 నక్షత్రములు మరియు ప్రతీ నక్షత్రానికి గల 4 పాదాలు వెరసి 27×4=108 నక్షత్రపాదముల్లోనే ఈ భూప్రపంచంపై ప్రభవించే సర్వజీవకోటి యొక్క గమనాన్ని మన పెద్దలు స్థిరీకరించారు.....

9 పాదాల చొప్పున యావద్ కాలాన్ని ఆ కాలగమనాన్ని శాసించే సూర్యచంద్రుల భ్రమనాన్ని మన సనాతన మహర్షులు మేషాది వివిధ పేర్లతో సూచించబడే 12 రాశులలోకి క్రోడీకరించారు....

శ్రీ చాగంటి సద్గురువులు ప్రవచనాల్లో పలుమారు వివరించినట్లుగా ఈ 108 నక్షత్రపాదాల్లోనే / 12 రాశుల్లోనే ఏ జీవైనా సరే ఈ భూమిపై జన్మించి జీవించి తన జీవయాత్ర ముగించి మరో జీవయాత్రకు పయనమయ్యేది....

108 సంఖ్యకు మన సంప్రదాయంలో గల ప్రాధాన్యత కూడా ఇందుకే...

అష్టోత్తరశతనామాలు....
108 పూసల జపమాలలు....
108 ప్రదక్షిణలు.....
108 దివ్యదేశాలు....
108 శక్తిపీఠాలు ( 18 ప్రముఖమైనవి మనం ఆరాధించే అష్టాదశ శక్తిపీఠాలు...)
దక్షారామ భీమమండలం లోని 108 శివాలయాలు...

ఇలా 108 గల ప్రాముఖ్యత మనకు బహుధా ప్రకటితము కద....

ఈ 27 నక్షత్రాల్లో చంద్రుడి గమనం, 12 రాశుల్లో సూర్యుడి గమనం విచారించి కాలాన్ని, కాలాంతర్భాగమైన వివిధ పండగలు, ఉత్సవాలు, ఇత్యాదివి అనాదిగా మన సనాతన మహర్షులు మనకు అందించినారు....

అన్నీ పండగలు చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేస్కొని ఉండే చాంద్రమానాన్ని అనుసరించి ఉంటే,
కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు కేవలం సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేస్కొని ఉండేవి....

రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి, ఇవన్నీ కూడా సౌరసంబంధ పర్వములు....

మేషాది 12 రాశుల్లోని సూర్యుడి గమనం ధనూ రాశిలో ఉన్నప్పుడు వచ్చే శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి పర్వదినంగా మన పెద్దలు మనకు అందించి తరించమని దీవించినారు....

సూర్యుడు ధనస్సులో సంచరించే ఈ కాలాన్నే ధనుర్మాసంగా నిర్వచించి విశేషమైన శ్రీమహావిష్ణ్వారాధనకు శ్రీహరి అనుగ్రహపాత్రతకు మన పెద్దలు మనకు అందించినారు....

శ్రీవిళ్ళిపుత్తూర్లో తులసీ వనంలో భూదేవి అంశలో ప్రభవించి పెరియాళ్వారుల పుత్రికగా వినుతికెక్కిన ఆండాళ్ తల్లి తను రచించిన దైవిక పాశురాలను తిరుప్పావై / శ్రీవ్రతం పేరిట ధనుర్మాస ఉత్సవంగా మనకు అందించి, తన సర్వస్వం ఆ శ్రీరంగనాథుడే అని భావించి సేవించి తుదకు ఆ రంగడిలోకే ఐక్యమైన రోజుని శ్రీగోదాకళ్యాణంగా ధనుర్మాస ఆఖరిరోజున మనం జరుపుకోవడం ఎల్లరికీ ఎరుకలో ఉన్న విషయమే....

జీవుడు దేవుడిలోకి ఐక్యమవ్వడమే జీవాత్మ పరమాత్మల సమ్యోగమైన కైవల్యసిద్ధి.....

అలా ఐక్యమవ్వడం సంపూర్ణచేతనతో తాత్కాలికం అయినప్పుడు అది ధ్యాన స్థితిలో లభించే పరమాత్మసమ్యోగ సిద్ధి అని నిర్వచించారు మన పెద్దలు...

అలా ఐక్యమవ్వడం ఈశ్వరశాసనంగా/అనుగ్రహంగా శాశ్వతమైనప్పుడు అదే అద్వైత సంప్రదాయ ప్రతిపాదిత సర్వోత్కృష్ఠ ఈశ్వరానుహ్రమైన కైవల్యసిద్ధి అనబడుతుంది....

సరే ఇంతకీ ఈ కైవల్యసిద్ధికి, చాంద్రమాన, సౌరమాన, 27 నక్షత్రాలకు, 12 రాశులకు, ముక్కోటి/వైకుంఠ
ఏకాదశికి, ఏంటి సంబంధం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం..

మన సంప్రదాయం ప్రకారంగా ప్రత్యక్షపరమాత్మ గా ఆరాధింపబడే సూర్యుడు ఆత్మశక్తి కారకుడు.....సకల ఆరోగ్య ప్రదాత...సకల అనారోగ్య నాశకుడు...

సూర్య శక్తిని ఆధారంగా చేసుకొని భూమి చుట్టూ పరిభ్రమిస్తూ జీవులకు మనోశక్తిని ప్రసాదించడం చంద్రుడి పని.....

అందుకే కద
" చంద్రమామనసోజాతః " అని శృతివాక్యం....

ఆ మనసు అని పిలువబడే అగోచర శక్తి నిజానికి మన చేతనలో ఉద్భవించే అసంఖ్యాక సంకల్పవికల్పాల సమూహం...

ఆ సంకల్ప శక్తే మన మనోశక్తి....
ఆ సంకల్ప బలమే మన మనోబలం....

అందుకే కద సాధారణంగ మనం వినే డైలాగ్స్ లో,

" నా మనసు మనసులో లేదండి....నన్ను ఒంటరిగా కాసేపు ప్రశాంతగా ఉండనివ్వండి....."

" నా మనసుకు తెలుసండి....ఎవరు మంచివారో...ఎవరు ముంచే వారో....ఎవరో అయినవారో...ఎవరు కానివారో..."

" సంతలో కొన్న తియ్యని నాటు దోర జాంకాయలు కొన్నప్పటినుండి నా మనసంతా వాటిపైనే ఉంది....ఎప్పుడు తింటానో అని...."

" నా శారీరక బలం అంతగా గొప్పదేంకాదని నన్ను తక్కువ అంచనావేసి అవమానించారు.....చూసారా నా మనోబలంతో అన్ని మెట్లు ఎట్ల ఎక్కోచ్చానో ఈశ్వరానుగ్రహంగా...."

" గురోక్త సంకల్పశక్తికి నా సాటిలేని మనోశక్తిని జతపరిచానంటే ఈ విశ్వంలో నా ఎదురుగా నిలిచి గెలిచే మొనగాడే లేడు..."

" కొండలను సైతం పిండిచేసే మనోశక్తి హనుమంతులవారి అనుగ్రహంగా లభిస్తుంది...."

ఇవ్విధంగా అన్ని రకాల సినిమా డైలాగ్స్ లో చెప్పబడే మనసుయొక్క శక్తి నిజానికి మన చేతన యొక్క సంకల్పశక్తి....అది ఎంత దృఢమైనదో కొలిచేందుకు ఎవ్వరికీ సాధ్యపడని అంశం....

శ్రీ ఆదిశంకరాచార్యుల నుండి ఈనాటి ఆధునిక తత్త్వవేత్తలవరకు ఎందరెందరో మహానుభావుల తత్త్వపరిశోధన మొత్తం మనిషి మనసు గురించే, ఆ మనోశక్తిజనిత అసంఖ్యాక సంభ్రమాశ్చర్యకర కార్యక్రమాల గురించే....

ఇక లౌకిక ప్రాపంచిక పోకడల గూర్చి ఉండే లక్షలాది సినిమా పాటాల్లో సిమ్హభాగం మొత్తం మనసు మీద రచించినవే.....

"మనసంతానువ్వే...."
దెగ్గరినుండి
" పడి పడి లేచే నా మనసు...."
వరకు ఏ సినిమాలోని యుగళగీతాలను విన్నా అన్నీ మనిషి మనసు యొక్క ప్రత్యేకతను తెలుపుతూ రచింపబడి పాడబడినవే....

( ఆ " నువ్వే " ఈశ్వరుడైనప్పుడు ,
ఆ పడి పడి లేచే మనసు పడే తపన ఈశ్వరానుగ్రహం గూర్చి అయినప్పుడు ఆ మనసు విముక్తి పొందే దిశగా జీవుడి ప్రయాణాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతోందని అర్ధం.....

అట్లు కాక ఈశ్వరుడిని విస్మరించి ఇతరత్రా గూర్చి మాత్రమే పరిభ్రమించడంలోనే ఉండి పోతే ఉన్న బంధనాలకు తోడుగా మరిన్ని బంధనాలను పెనవేసుకుంటూ విముక్తికి దూరంగా జీవుడి ప్రయాణాన్ని భ్రమింపజేస్తుందని అర్ధం....

"మహామాయావిశ్వంభ్రమయసిపరబ్రహ్మమహిషి..."

అనే వాక్యాన్ని ఉటంకించే శ్రీ చాగంటి సద్గురువుల ఆదిపరాశక్తి వైభవం గురించిన ప్రవచనాల్లో
" తిరోధానకరీశ్వరి...సదాశివానుగ్రహదా...." గా తనను ప్రార్ధించినవారికి ఆ మాయ అనే తెరను ఎవ్విధంగా తోలగించి జీవుడికి తన స్వస్వరూపానుసంధాన సిద్ధిని అనుగ్రహిస్తుందో సద్గురువులు తెలిపియున్నారు....

అత్యంత శక్తివంతమైన జ్యోతిష శాస్త్ర విజ్ఞ్యాన విషయాలను గూర్చి కాసేపు పక్కనపెడితే,

సూర్యుడు ధనూరాశిలో ఉన్నప్పుడే వైకుంఠ / ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుపుకోవడంలో గల విశేషం పరికిద్దాం.....

ధనస్సు యొక్క గొప్పదనం గూర్చి మన శాస్త్రపురాణ వాజ్మయంలో ఎన్నో చోట్ల ఎంతో గొప్పగా అభివర్నించారు......

తన ధనస్సు శారంగం కోసం ఏకంగా ఒక అవతారమే ఎత్తి " కోదండ రాముడి " గా తన ధనస్సుకు చిరకీర్తిని ప్రసాదించాడు ఆ శ్రీమహావిష్ణువు...

" అయ్యా నీకో దండం.....నీ చేతిలో ఉన్న పినాకం అనే నీ ధనస్సుకోదండం....." అంటూ పలుమారు
ఈశ్వరుడుకి నమస్కరిస్తూ
" నమొస్తుధన్వనేబాహుభ్యాం...." అంటూ మొదలయ్యే శ్రీరుద్రం ఆ పరమేశ్వరుడి ధనస్సు యొక్క వైభవం మనకు తెలియచెప్తూనే ఉంది.....

శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన ఈ "పినాకహస్తాయా సనాతనాయ...." వివరణ నాకు చాల ఆశ్చర్యకరమైన ధ్యానసిద్ధిదాయకమైనది.....

అర్జునుడి సాటిలేని గాండీవానికి శ్రీకృష్ణ పరమాత్మ వల్ల లభించిన ఖ్యాతి ఎట్టిదో మత్స్యయంత్రభేదనం మొదలుకొని పాశుపతాస్త్రప్రయోగం వరకు ఎన్నెన్నో సార్లు మహాభారతం మనకు తెలియజేస్తుంది....

గురుమూర్తిని ఎదుటనిలిపి
ద్రోణాచార్యులను తమ మానసిక గురువులుగా ఉపాసనగావిస్తూ ఏకంగా సవ్యసాచినే మించిన ధనుర్విద్యాకౌశలాన్ని గడించిన ఏకలవ్యుడి ధనుర్వేదోపాసన యొక్క గొప్పదనం,
కొత్తగా ధనుర్విద్యను అభ్యసిస్తూ అందులో ఎదురులేని వీరుడిగా ఎదగాలని తను ప్రాక్టీస్ చేస్కుంటుంటే అరిచి డిస్టర్బ్ చేసిందని ఒక అడవికుక్క నోట్లోకి ఏ ధనుర్ధారి సంధించలేనంతటి నైపుణ్యంతో ఆ కుక్క ఇంకెప్పుడు తనపైకి పొగరుతో నోరు తెరిచి అరవకుండా, ఆ తెరిచిన నోరు మూయలేనివిధంగా, బాణాలను సంధించి ఎక్కడికక్కడ ఆ కుక్కనోటిని కట్టిపడేసిన వైనంలో
ఆ బోయ యొక్క విలువిద్యాఘనత మనకు తేటతెల్లమౌతుంది.....

ఒకేసారి ఒకటికంటే ఎక్కువ బాణాలను
సంధించే " ద్వే...మణిబంధనం...." సీన్లో ప్రభాస్ సూపర్బ్ యాక్టింగ్ తో బాహుబలి సినిమా బద్దలుకొట్టిన రికార్డ్లు అందరికి తెలిసిందే.....

ఇవ్విధంగా ధనస్సు చాలా గొప్ప ఆయుధం.....

ఎంతో దూరంలో ఉన్న ఎంతటి శతృవునైనను మట్టికరిపించగల శక్తి ధనుర్వేదవిద్యది....

అది అమంత్రక శస్త్రంగా సంధించబడిన శరమైనాసరే.....
సమంత్రక అస్త్రంగా అభిమంత్రించబడి సంధించబడినా సరే....
ధనుర్వేదశక్తి అనన్యసామాన్యమైనది......

ఒక ధనస్సుకు గల లౌకిక, పారామార్ధిక శక్తి, ప్రత్యేకత,
ఎట్టిదో ధ్యానసిద్ధిగా ఒడిసిపట్టాలంటే, శ్రీభద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో, స్వర్ణతులసీఅర్చన ఇత్యాది అంతరాలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు స్వామివారు ధరించిన ధనుర్బాణాములపై ధ్యానం గావించండి.....

ఆత్మారాముడిగా ఆ అయోధ్యారాముడిని శాస్త్రములు కీర్తించడం, ఇనకులసంజాతుడై ఉత్తమ క్షత్రియుడిగా ఒక సాధారణ మనిషివలే భువిపై జన్మించి
కౌసల్యానందనుడిగా దశరథతనయుడిగా తన కీర్తిని ఆచంద్రతారాత్కం చతుర్దశభువనాలు శ్లాఘించేవిధంగా జీవించి తన జీవిత అయనం శ్రీమాద్రామాయణ ఇతిహాసమై, వేదోపబృహ్మణమై, పౌలస్త్యవధగా, సీతాయాశ్చరితమ్మహత్త్ గా శాశ్వతమై అప్పుడూ ఇప్పుడూ ఎలప్పుడూ
భక్తులను ఎంతో ఘనంగా ఉద్ధరించి అనుగ్రహించే
" శ్రీ వాల్మికీ కోకిల కూజిత శ్రీరామ తారక మంత్రమహిమార్ణవమై"
వెలుగొందే రామాయణ మహాకావ్యంలో ఆ కోడండరాముడి చేతిలో ఒదిగిన కోదండం యొక్క మహిమ ఎంత ఘనమైనదో ఇంతని అంతని వర్నించనలవి కానిది.....

సూర్యవంశతేజమై అవతారం దాల్చిన ఆ శ్రీరాముడు సకల జీవుల ఎదలోనే కొలువైఉండే ఆత్మారాముడు.....

శ్రీరాముడిని పరమాత్మ గా ఆరాధించే మన భక్తే ఆ ఆత్మారాముడిచే ధరింపబడిన కోదండం అనే ధనస్సు....

అసంఖ్యాక సంకల్పవికల్పాల సమూహమైన మన మనసనే ఆ అక్షయబాణతూణీరంలోని శరసమూహం, శ్రీరాముడి కోదండానికి సంధింపబడేలా చిత్తము పాత్రతను సమకూర్చుకున్నప్పుడు,

శ్రీరాముడి కరకమలముల
అమృత స్పర్శతో సంధించబడే మన మనసు దైవికాస్త్రంగా మారి, హనుమంతులవారి అనుగ్రహంగా సరాసరి రావణుడనే ప్రాపంచిక మాయలో కుంభకమైఉండే అజ్ఞ్యాన లంపటాన్ని భేదించి జీవుడు ముక్తిని బడయుట అనే విశిష్ట తత్త్వసామ్యమే
అద్వైత సంప్రదాయ ప్రతిపాదిత కైవల్య సిద్ధి....!

ఆ శ్రీకరమైన శాశ్వతదైవానుగ్రహసముపార్జనకు
జీవుడిని సంసిద్ధం గావించేలా భక్తిసంస్కారమును అలది వచ్చే మకర సంక్రమణంతో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాల విశేషబలంచేత సకల దైవిక శక్తిసంఘాతమై జీవుడికి ఎనలేని ఆత్మశక్తి సమకూరేలా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదివసాన్ని మన పెద్దలు ఏర్పాటుచేసారు.....

అవ్విధంగా ఒక జీవితపర్యాయంలో వచ్చే 100 వైకుంఠ ఏకాదశుల్లో
( 'శతమితిశతందీర్ఘమాయుహు' అనే సాధారణ శృతి వాక్యానుగుణంగా )
ఎదో ఒక ఏకాదశి మనకు నిజంగా మోక్షద ఏకాదశిగా ప్రభవించి ఈశ్వరుడి ద్వాదశి పారణగా మన ఆత్మ ఆ పరమాత్మలోకి లయించి జీవుడుకి శాశ్వత ప్రశాంతత లభించడమనే గంభీరమైన తత్త్వసారాన్ని ప్రతిపాదించే ఈ వైకుంఠ ఏకాదశి పర్వం భక్తులెల్లరికి
ఆ శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహాన్ని మరింత మెండుగా లభించేలా చేసి ఎల్లరూ సుఖశాంతులతో ఆయురారోగ్యైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ అందరికి
వైకుంఠ ఏకాదశి / తిరుమల శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి / వైకుంఠ ద్వాదశి పర్వదిన శుభాభినందనలు....☺🍨💐🍕

దక్షిణాన ఉండే యమపురికి కాకుండా, జీవుడి గమ్యం ఉత్తరాన ఉండే వివిధ ఊర్ధ్వలోకాలవైపుగా సాగి తుదకు 108వ దైన ఆఖరి దివ్యదేశమైన పరమపదం చేరుకోవడంతో మన జీవ తీర్థయాత్ర సంపూర్ణమైయ్యేలా విశేష దైవానుగ్రహ సంపాకకారకమైన శ్రీ వైకుంఠ ఏకాదశి / ద్వాదశి ఉత్తరద్వార దర్శనం భక్తుల్లెలరికి సంవత్సరంలో
ఒక్కసారి మాత్రమే సంప్రాప్తించే అరుదైన అనుగ్రహం....

తిరుమల ఉత్తరద్వార దర్శనంలో స్వామివారి గర్భాలయ ప్రాకారానికి మరింత దెగ్గరగా సాగి ప్రదక్షిణనమస్కారం చేస్కునే భాగ్యం పొందిన భక్తులెల్లరు తమ తమ జీవితాల్లోని తిరుమలయాత్రను
ఒక చిరకాల అమూల్యమైన మధురస్మృతిగా మలిచి ప్రతీ వైకుంఠ ఏకాదశి / ద్వాదశికి నెమరువేసుకోవడం శ్రీశ్రీనివాసుడి భక్తుల్లెల్లరికి సంప్రాప్తించే ఒకానొక దైవికానుభవ పెన్నిధి...

కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉండే వివిధ మనోహర పుష్పసముదాయంతో అలకరించబడి ఉండే ఆ శ్రీవైకుంఠద్వారంలోకి మానసికంగా ప్రవేశించి ఆ పురాతన ఆలయవైభవాన్ని, ఆ పూలమొక్కలను, రంగురంగుల లైట్లను, ఆ పరిమళాలను, ఆస్వాదిస్తూ స్వామివారి హుండీ దెగ్గర బయటికి వచ్చాక పైన ఉండే ప్రాగీశాన్యాభిముఖ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి నమస్కరించి ఆ సిరులతల్లి అమేయ కరుణాకటాక్షవీక్షణాలను ప్రసాదంగా గైకొని ఎల్లరూ తరించి ఆనందించెదరుగాక......

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి
అత్యత్భుతమైన ఈ క్రింది సంకీర్తనలో తిరుమలను దర్శించడం భక్తులకు మరింతగా ముదావహం....😊💐🍨🍕🍟

Ragam : Brindavani, composer : G.Balakrishnaprasad
Audio link :PriyaSisters
Archive link :
ప|| కంటి నఖిలాండ (తతి) కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి | రహి వహించిన గోపురములవె కంటి ||

చ|| పావనంబైన పాపవినాశము గంటి | కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి | కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||

చ|| పరమ యోగీంద్రులకు భావగోచరమైన | సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి | తిరు వేంకటాచలాధిపు జూడగంటి |

http://annamacharya-lyrics.blogspot.com/2007/03/167kamti-nakilamda.html?m=1

No comments:

Post a Comment