Saturday, December 12, 2020

శ్రీగిరి వైభవం....😊💐🍟🍨🍕

శ్రీగిరి / శ్రీశైలం అనే వ్యావహారిక నామం అటు తిరుమల ఇటు శ్రీశైలం ఈ రెండు పుణ్యక్షేత్రాలకు కూడా వర్తిస్తుందని శ్రీ చాగంటి సద్గురువులు నుడవడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

స్థితికారకుడిగా ఉండే పరమాత్మ స్వరూపమైన శ్రీమహావిష్ణువు యొక్క ప్రశస్తమైన 108 దివ్యదేశాలలో ఒకటిగా ఉన్న భూవైకుంఠమైన తిరుమల మరియు లయకారకుడిగా ఉండే పరమాత్మ స్వరూపమైన రుద్రుడు /  అరూపరూపి గా ఉండే తన శివలింగ స్వరూపంలో కొలువైన 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం యావద్ ప్రపంచంలో ఎంతో ప్రశస్తమైన తీర్థయాత్రాస్థలి/పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధినొందడం జగద్విదితమే కద...

నిజానికి హరిహరులు అభిన్నమైన పరమాత్మ స్వరూపులు...
తత్త్వతః వారి వారి ఉపాధికి నిర్దేశించబడిన కర్తవ్య సాధనకొరకై అలా ఇద్దరుగా తమ ఉనికిని ఈ లోకంలో వివిధ నామరూపాత్మకంగా వ్యాప్తిగావించి జగద్రక్షణ గావించడం కోసం అలా మనకి కనిపించడం...

భువిపై శయనించిన ఆదిశేషుడి సరీసృప శరీరాకారంగా విస్తరించి ఉండే నల్లమల అటవీ ప్రాంత గిరులపై కొలువైన 5 ప్రముఖ క్షేత్రాలను ఎంతో అత్యత్భుతమైన రీతిలో ఎవరో మహానుభావులు చిత్రీకరించిన ఆ చిత్తరువు తిరుమల శ్రీతరిగొండవెంగమాంబ అన్నప్రసాద భవనంలో మనం చూడవచ్చు...

ఈ రెండు క్షేత్రాలూ కూడా ఆదిశేషుడి మొదలు / చివర, అనగా తోకపై శ్రీశైలం ( మూలాధార చక్ర / పృథ్వీతత్త్వ ప్రతీకం ) ఉండడం,

తల / పడగపై తిరుమల ఉండడం మనం ఆ చిత్రంలో చూడగలం....

( సహస్రార కమల మధ్యగత పరమాత్మకు ప్రతీకగా శ్రీవేంకటనగముపై ఆనందనిలయంలోని గర్భాలయంలో అష్టదలపద్మపీఠంపై కొలువైన స్వయంప్రాకాశక సజీవసాలిగ్రామావేశిత శ్రీనివాసుడి సన్నిధి ఆదిశేషుడి సహస్ర ఫణములపై కొలువైన దివ్య మణిసంఘాతం....)

( అహోబలం, త్రిపురాంతకం, మహానంది ఇత్యాది క్షేత్రాలు మిగతా యోగకేంద్ర స్థానాల్లో ఉండడం...)

చివరకు అన్నీ దేన్లోకి కలిసిపోతాయో అది లయ కారకం....

దేని వల్ల అన్నీ సృజించబడినపిదప  పోషింపబడుతున్నాయో అది స్థితికారకం......

అనగా స్థితికారకుడు అన్నిటినీ చక్కగా సమ్రక్షిస్తూంటే లయకారకుడు అన్నింటిని తనలోకి లయించివేస్తున్నాడని లౌకిక అర్ధం కద....

ఒకాయన చక్కగా అన్నీ చక్కబెడుతుంటే మరొకాయన వాటన్నిటిని తనలోకి మింగేయడం ఏంటి విచిత్రంగా...అసలు అలా పనికట్టుకొని అన్నింటిని మింగేయడమే పనిగా లయకారకుడు అని ప్రత్యేకంగా పేరుపెట్టుకొని మరీ ఆ రుద్రుడు ఈ లోకంలో ప్రశస్తినొందడం అనే ప్రశ్న ఆధ్యాత్మిక తత్త్వచింతనాపరులకు రావడం సహజమే కద...

శ్రీ చాగంటి సద్గురువులు బోధించిన ఒక చక్కని ఉదాహరణతో ఆ హరిహరాత్మక పరబ్రహ్మతత్త్వాన్ని కొంత పరికిద్దాం....

పుట్టి, పెరిగి, జీవితపు అన్ని మజిలీలను దాటి ఈ శరీరం " దేహం " గా మారిన తదుపరి, అనగా ఒక 60 సంవత్సరాలు దాటిన తదుపరి ఈ శరీరం దహించబడడానికి సిద్ధమౌతున్నది కాబట్టి దీన్ని "దేహం" అని పిలవడం....

అలా ఉన్న మన పెద్దవాళ్ళను అడిగితే చెప్తారు వాళ్ళ బాధలు ఎంత వర్ణనాతీతమో.....

తింటే అరగదు...తినకపోతే ఉండలేరు... 

ఒకదెగ్గర ఓపికగా కూర్చొని ఒక గంటసేపు కదలకుండా పూజ చేయలేరు...అలాగని గంటసేపు చలాకిగా ఎక్కడికీ నడిచివెళ్ళలేరు....

ఒకవైపు పిల్లల జీవితాలు, కుటుంబబాధ్యతలు, ఆస్తిపాస్తులపై గల మమకారాలు తగ్గించుకోలేరు... 
మరోవైపు మీదపడుతున్న ముసలితనాన్ని తప్పించుకోలేరు....
( అనగా మనలో మనకే ముసలం వచ్చి ఈ శరీరం మీద చిరాకు, కోపం, విసుగు, దైన్యం, ఇలా సకల ఏహ్యభావాలు కలిగి, ఈశ్వరుడిని ఎప్పుడు తనలోకి కలిపేసుకుంటావు అని పదే పదే ప్రార్ధించడం...)

ఇలా ఉన్న సందర్భంలో శ్రీ చాగంటి సద్గురువుల బోధలో చెప్పబడినట్టుగా " పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ..."
అనే ఆ సమయంకోసం జీవుడు ఆర్తితో 
అర్ధించినప్పుడు, దేముడు జీవుడిని తనలోకి లయించివేసుకోవడం కూడా అనుగ్రహమే కదా...

లేకపోతే ఈ భూమి పై పుట్టిన వారు పుట్టినట్టే శాశ్వతంగా ఉండిపోవడం....

పొద్దున లేచినది మొదలు మనిషి అట్లే ఎప్పటికీ మేల్కొని ఏదొ ఒక పని చేస్తూండడం..
(నిద్ర పోకుండా...)

ఇలా దీర్ఘకాలిక, స్వల్పకాలిక లయం లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించిచూడండి....ఎంత కష్టంగా ఉంటుందో ప్రాణులకు...వారి జీవితాలే వారికి మోయలేనంత భారంగా ఉన్నప్పుడు, శ్వాసతీసుకోవడమే నరకమై ఉండి చెప్పలేని వేదనకు జీవుడు గురౌతున్నప్పుడు, లయకారకుడిగా ఉండి ఈశ్వరుడు తనలోకి కలిపేసుకోవడం అనే ప్రళయ ప్రక్రియలో ఉన్నది అనుగ్రహమే కాని ఆగ్రహం కాదు....

ఉన్న సత్యం గురించి రూఢపరచాలంటే ముమ్మారు "ఔను"
అని అనడం మన సంస్కృతిలో గమనించే ఉంటారు....

సత్యం సత్యం సత్యం....
రామ రామ రామ...
ఔను ఔను ఔను...

ఇలా ఎదైనా ముమ్మారు ఉటంకించడం ఆ సంధర్భంతాలూకా సత్యాన్ని ధృవపరిచి బలపరచడం కోసం అనే సత్యం మనకు ఎరుకలో ఉన్నట్టుగా...

పొద్దున లేవగానే ముమ్మారు 
శ్రీహరి...శ్రీహరి...శ్రీహరి
అనే మొట్టమొదటి పిలుపుతో రోజును ప్రారంభించడం...

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 11 సార్లు 

శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ

అని స్మరించి నిద్రించడం గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు బోధించి ఉన్నారు కద....

స్థితికారకుడైన శ్రీహరిని ముమ్మారు కీర్తించి మేల్కొనడంలో ఆ రోజు మన స్థితిస్థాపకతకు నిదర్శనంగా మనకు మనమే మన అస్తిత్వాన్ని రూఢపరచి బలపరచడం.....

ఏకాదశ రుద్రులుగా తన ఉనికిని ఆ లయకారకుడు ఈ విశ్వంలో వ్యాప్తి గావించి ఉన్నాడు కాబట్టి....

ఈ విశ్వంలోని యావద్ బ్రహ్మాండ పిండాండ వ్యవస్థను అనుసంధానించే మనిషి శరీరం లోని 9 సాధారణ కన్నములు ( ఊర్ధ్వ కూటమైన ముఖమండలంలోని 7 కన్నములు, అధో కూటమైన నాభి అధో భాగంలోని 2 కన్నములు కలిపి 9 కన్నముల సమన్వయం ప్రతి మనిషికి ఉండే సర్వ సాధారణమైన వైశ్వికానుసంధాన వ్యవస్థ....

ఇవి కాకుండా కపాలమధ్యమునకు కేంద్రీకృతమై ఉండే బ్రహ్మరంద్రం...
మరియు యావద్ శరీరానికి మధ్యకేంద్రంగా ఉండే నాభి రంద్రం...

ఈ రెండు కూడా కలిపితే 9+2=11 కన్నముల సంపూర్ణ 
వైశ్వికానుసంధాన వ్యవస్థపై మనిషి తన చేతనాత్మకమైన పట్టును కోల్పోయి వాటిని ఈశ్వరార్పనం గావించేది దైనందిన నిద్రలో మరియు ఆ పెద్ద నిద్రలో....

కాబట్టి 11 సార్లు ఆ లయకారకుడిని స్మరించి వాటిని ఆయనకు అప్పగిస్తే,
జీవుడికి ఉపయుక్తంగా ఉండేలా ఆ జీవాత్మ పరమాత్మల వైశ్వికానుసంధాన వ్యవస్థను ఆ లయకారకుడు తన అధీనంలోకి తీసుకొని, జీవుడికి నూతన జవసత్వాలు ప్రసాదించి అనుగ్రహిస్తాడు...

అనగా రోజువారి నిద్ర తర్వాత మరునాడు లేచినప్పుడు,
" అబ్బా....ఎంత హాయిగా..రిఫ్రెషింగ్ గా...ఉల్లాసంగా...ఎనర్జిటిక్ గా....ఉందో...."
అని అనుకోగలగడం సాధ్యమయ్యేది....

అట్లే పెద్ద నిద్ర తర్వాత లభించే ఉన్నతమైన జన్మలో...
" అబ్బా...ఎంత మంచి జీవితాన్ని ఇచ్చావ్ దేవుడా....అంతా నీ అనుగ్రహం..." అని అనుకోగలిగేది... 
 
అలా కాకుండా ఈశ్వరుడిని విస్మరించి అడ్డమైన గడ్డిని మెదడుకు అందించి నిద్రిస్తే...( అనగా మంచి దైవసంబంధమైన ప్రవచనాలు...పాటలు...మాటలు... ఈశ్వర నామం....కాకుండా ఇతరమైన చెత్తాచెదారం...) మరునాడు లేచిన తదుపరి....
"అబ్బా...మళ్ళీ ఇంకో రోజు జీవితమా....హుమ్మ్...."
అంటూ మూలుగుతూ రొప్పుతూ ఉండడం....

అట్లే లభించిన మరుజన్మలో "హయ్యో..రామ..ఎందుకురా నాయనా ఈ జీవితం..." అనేలా జీవించడం... 

అందుకే కద సద్గురువులు అన్నారు....
" ఈశ్వరుడి స్మరణమే జీవనం...ఈశ్వరుడి విస్మరణమే మరణం...." అని.....

కాబట్టి 3 సార్లు శ్రీహరి నామ స్మరణ,
11 సార్లు శివనామ స్మరణ..
మధ్యలో ఉండే జాగ్రత్ అవస్థలో మనకు 3×11=33 కోట్ల దేవతాసమూహ అనుగ్రహం సమకూరి మన జీవితాలు పరిఢవిల్లే విధంగా మన పెద్దలు అలా మన దైనందిన జీవిత నియమావళిని వ్యవస్థీకరించారన్నమాట....

సరే ఇంతకీ అసలైన టాపిక్లోకి వస్తే...

శ్రీగిరి... అనగా తన శక్తి సహితంగా పరమాత్మ కొలువైన కొండగా మనం ఆరాధించే తిరుమల మరియు శ్రీశైలం యొక్క వైభవం.....

ఉత్తరాన కాశి, 
మధ్యమున ఉజ్జైని, 
దక్షిణాన శ్రీశైలం,

18 శక్తిపీఠాల్లో, 11 జ్యోతిర్లింగాలలో...
ఈ మూడూ మాత్రమే శివశక్త్యాత్మక శక్తిపీఠజ్యోతిర్లింగ క్షేత్రములు...

విశాలాక్షిసహితవిశ్వనాథుడు..
మహంకాళిసహితమహాకాళేశ్వరుడు..
భ్రమరాంబాసహితమల్లికార్జునుడు..

ఒక మనిషికి అత్యంత ముఖ్యమైనది తన ముఖమండలం....
అసలు మొహం లేకపోతే (అనగా కంటం పైన ఉండే తలకాయ్ మొత్తం) మనిషేఉండడు కద...

అటువంటి మనిషికి 3 అత్యంత ముఖ్యమైన శక్తి కేంద్రములు

కళ్ళు, ముక్కు, నోరు....

ఆ సామ్యామున, ఆధ్యాత్మిక జీవ శక్తికేంద్రస్థానాలలో....

నయనమండలం(కళ్ళు) / ఆజ్ఞ్యాచక్ర
జనిత సకల యోచనాత్మక శక్తికి
కాశి క్షేత్ర విశాలాక్షిసహితవిశ్వనాథుడు
ప్రతీక..

నాసికామండలం (ముక్కు) / ఊపిరి / ఘ్రాణశక్తికి ఉజ్జైని క్షేత్ర మహంకాళిసహితమహాకాళేశ్వరుడు ప్రతీక..

అధరమండలం(పెదవులు) / నోరు / దంతములు / నాలుక వీటన్నిటికి శ్రీశైల క్షేత్ర భ్రమరాంబాసహితమల్లికార్జునుడు ప్రతీక....

ఇక్కడ సరిగ్గా గమనిస్తే ప్రతీ మనిషి యొక్క గొప్పదనాన్ని శాసించేది వారి నోరే...

కళ్ళు / ముక్కు చేసే పని అందరికి దాదాపుగా ఒక్కటే....

కాబట్టి నోరే ప్రత్యేకం...

ఎందుకంటే మనం తినే ఆహారంలో 6వ వంతు మన మనసు ఔతుంది....

ఆ మనో శక్తితో క్రమక్రమంగా ఆర్జించుకున్న ఎన్నెన్నో ఇతర శక్తులతో కలుపుకొని,
మనం మాట్లాడే ఉన్నతమైన మాటలు / వాక్యాలు,
మన ఉన్నతికి, మన గౌరవానికి / మన గొప్పదనానికి బాటలు వేసే బంగారు మేటలు...

లోకంలో మనం సాధారణంగా వినేట్టుగా....

"ఎందుకండి అలా అనవసరంగా నోరు పారేసుకుంటారు...
మీ వయసుకు తగ్గట్టుగా...
మీ పెద్దరికానికి తగ్గట్టుగా...
మీ స్థాయికి తగ్గట్టుగా...
మాట్లాడొచ్చుకద..." 
అని అంటూంటారు...

" వామ్మో...ఆయన నోరా....మీరు ఎంత తక్కువ ఆయనతో పెట్టుకుంటే అంత మంచిది...ఆ నోటిని మీరు గెలవలేరు సరికదా మిమ్మల్నీ, మీ వైఖరిని ఎక్కడికక్కడ ఏకిపారేస్తాడు....జాగ్రత్త...ఆయన జోలికి వెళ్ళకపోవడమే మంచిది...." 
అని అంటూంటారు...

"మీ నోటిచలవ వల్ల అంతా శుభంగా జరిగిందండి....మాకు చాలా సంతోషం..."
అని అంటూంటారు.....

ఇవ్విధంగా పలురకాలుగా నోటి యొక్క గొప్పదనం లోకంలో ప్రస్తుతించబడడం మనము గమనించగలం.....

అంత మాత్రాన కళ్ళని, ముక్కును తక్కువ చేసినట్టు కాదు....
వేటి గొప్పదనం వాటిదే...

"ఆల్ఫా, బీటా కిరణాలను దాటి గామా కిరణాలను సైతం సారించి కిలోమీటర్ల మేరా రేడార్ లా అన్నీ స్కాన్ చేయగల కళ్ళు ఆయనవి...
ఆ కంటపడితే ఇక ఎప్పటికీ మరచిపోని జాబితాలోకి ఆ వస్తువు / మనిషి చేరినట్టే...." అని కళ్ళ యొక్క గొప్పదనం గురించి ప్రస్తుతించబడడం.....

" రేచక, పూరక, కుంభకాలతో, పంచభూతములను సైతం తన అధీనంలో బంధించగల ప్రాణాయామ 
శక్తిని తనది...." అనేలా సూర్యనాడి చంద్రనాడి ద్వారా శ్వాస జనిత శక్తులను నియంత్రించే నాసికామండలం / ముక్కు యొక్క శక్తి గురించి ప్రస్తుతించబడడం.....

ఇట్లా మనం గమనించవచ్చు....

కాకపోతే నోటి యొక్క గొప్పదనం మిక్కుటంగా ఈ లోకంలో వ్యాప్తిగావించబడడం అనేది మనం ఎక్కువగా గమనించే సత్యం....

" వారు నోరు తెరిచి ఒక్క గంట మాట్లాడితే చాలండి....కొన్ని వందల పుస్తకాల ద్వారా ఆర్జించబడే జ్ఞ్యానం మనకు వారి వాగ్వైభవంలో లభ్యమౌతుంది....అంతటి ప్రహృష్టమైనవి వారి వచనాలు..."
అనేలా నోటి యొక్క గొప్పదనం గురించి శ్లాఘించబడడం మనం గమనించవచ్చు....

( ప్రవచనాసామ్రాట్, అస్మద్ గురుదేవులు, సద్గురు శ్రీ చాగంటి వంటి మహనీయుల వాగ్వైభవంలా....)

"మహానుభావుడు.....ఒక్కసారి ఈశ్వరుడిని స్మరించి సంకల్పించి వచిస్తే చాలు....వారు అన్నది అన్నట్టుగా జరిగి తీరుతుంది...అంతటి వాక్ శుద్ధి వారిది...." అనేలా నోటియొక్క గొప్పదనం గురించి ప్రస్తుతించబడడం మనం గమనించవచ్చు....

ఇవ్విధంగా నోటి యొక్క గొప్పదనాన్ని వేనోళ్ళా కొనియాడబడడం మనం గమనించవచ్చు.....

ఒక పది గంటల పాటు కళ్ళు బిగించి పెడితే పెద్దగా ఏ సమస్యా ఉండదు....

ఒక పది గంటల పాటు కళ్ళను, ముక్కును బిగించి పెడితే నోటిద్వార శ్వాసను అందుకొని గట్టెక్కవచ్చు....

ఒక పది గంటల పాటు కళ్ళను, ముక్కును, నోటిని కూడా బిగించి పెడితే ఇక చెప్పాల్సింది పెద్దగా ఏమి ఉండదు... కద....

కాబట్టి ఇక్కడ నోరు యొక్క గొప్పదనం చెప్పకనే చెప్పబడుతున్నది.....

"ప్రాణాత్ వాయురజాయత...." అనే శృతివాక్యానుగుణంగా మనుష్యుడి ప్రాణం ఊపిరి అధీనంలో ఉండే వ్యవస్థ....

అందుకే ఆ పంచప్రాణాలను శాసించే దైవం, మృత్యుంజయుడిగా, ఎక్కడాలేని విధంగా అప్పుడే దహనసంస్కారాలు కావించబడిన ఫ్రెష్ చితాభస్మం తో 
అభిషేకం గావించబడే ఎకైక ఘోరాఘొరా చక్షుర్ధారియై
మహాకాళేశ్వర శివలింగస్వరూపంలో
ఆ ఉజ్జైని మహాకాళుడు అధ్యాత్మ పురుషుడి నాసికామండలాధిదైవంగా కొలువైఉన్నాడు.....

ఇక శ్రీగిరి మల్లికార్జున మహాలింగ స్వరూపంలో ఆ 
శ్రీ భ్రమరాంబా సహిత మల్లికార్జునుడు నిత్యం ఎందరో సిద్ధసాధ్యగరుడగంధర్వయక్షకిన్నెరకింపురుషవిద్యాధరచారణనాగాది దేవగణములతో సేవించబడుతూ
దేశంలో ఎక్కడ ఏ పూజా కార్యక్రమం జరిగినా సరే
" శ్రీశైలస్య ----- దిగ్భాగే...."
అని కీర్తించబడే ఆ శ్రీనగాధీశుడై కొలువైఉండి ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన దైవిక విశేషములకు ఆలవాలమై 
" సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం...."
అని ఆరాధింపబడుతుండడం మనం గమనించే సత్యం....

అధ్యాత్మ జీవుడి అధరమండలానికి
( అనగా పెదవులు, నోరు, నాలుక, పళ్ళు, అన్నీ కలిసుండే నోటికి సంకేతం ఈ శ్రీశైల శ్రీ భ్రమరాంబామల్లికార్జున క్షేత్రం...)

ఇందాక పైన చెప్పిన విధంగా ఒక మనిషికి నోరు ఎంతటి వైభవాన్ని సమకూర్చగలదో, అవ్విధంగా శ్రీగిరి కూడా అంతటి విశేషమైన అనుగ్రహాన్ని సమకూర్చే పుణ్యక్షేత్రం....

యోగం, భోగం, ఇష్టకామ్యార్ధసిద్ధి, అష్టసిద్ధులు, నవనిధులు, ఇలా ఒక మనిషి ఏమేమి ఊహించగలడో / ప్రార్థించగలడో వాటన్నిటిని వర్షించే ఆశ్చర్యకరమైన తీర్థస్థలి శ్రీశైల క్షేత్రం....

సకలాఘ నాశిని పాతాళగంగ....
పైకి చూడటానికి ఒక సామాన్య తీర్థంలా కనిపించినా....ఆ తీర్థరాజం యొక్క శక్తి అనంతం, అమేయం.....

ఎన్నెన్నో అగోచర దైవిక తీర్థాల జలనాడులు ఈ పాతాళగంగలోకి సంగమించి ఉండి వాటన్నిటి అనుగ్రహాన్ని భక్తులకు సమకూర్చి పెట్టే ఆశ్చర్యకరమైన తీర్థం...

శ్రీ కంచి పరమాచార్య వారిచే సరస్వతీ తీర్థం కనుగొనబడిన ప్రాంతం....

ఎన్నెన్నో బాగా కాస్ట్లి మందులు మింగితే కాని సాధ్యపడని రక్తశుద్ధిని అనుగ్రహించగల బహు శక్తివంతమైన బయలు వీరభద్రుడి గుడి ఉన్న పుణ్యక్షేత్రం.....

మనుష్యుల ఊహకు కూడా అందని మహదాశ్చర్యకరమైన మహిమాన్విత సిద్ధిదాయక ప్రదేశాలు ఆ శ్రీశైలంలో కోకొల్లలు....

అక్కమహాదేవి గుహలు, ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి, హేమారెడ్డిమల్లమ్మ ఆలయం, కదలీవనం, సిద్ధరామప్పపాదాలు, ఇలాంటి ఎన్నెన్నో చోట్ల గుప్తంగా కొలువైన శక్తిస్థావరాలు సిద్ధిదాయకాలు, మహామహిమాన్విత సిద్ధకూటములు ఇలా ఎన్నో ఎన్నెన్నో వింతలు విశేషాలు ఆ శ్రీగిరి సొంతం....

మానవమాత్రులకు / మనుష్యశరీరంతో చేరుకోలేని విశేషదైవిక పుణ్యస్థలాలు అక్కడ ఎన్నెన్నో....

అందుకున్న వారికి అందుకున్నంత అన్నట్టుగా....

వీటన్నిటి గురించి అస్మద్గురుదేవులు శ్రీచాగంటి సద్గురుదేవుల ప్రవచనాల్లో విని అవన్నీ ఎక్కడెక్కడున్నాయో అని వెతుక్కుంటూ వెళ్లి నాకు వీలైనంత రీసర్చ్ చేసిన సందర్భాలను ఆలంబనగా గావించే వీటి గురించి చెప్తున్నాను....

తిరుమల కొండపై ఎన్నెన్ని ఆశ్చర్యకరమైన తీర్థాలు ఉన్నాయో....
శ్రీశైలం లో కూడా అన్ని ఆశ్చర్యకరమైన తీర్థాలు ఉన్నాయి....

ఇక ఆ మహాయోగేశ్వరేశ్వరి శ్రీభ్రమరాంబా అమ్మవారి వైభవమైతే ఎంత చెప్పినా ఇంకా మిగిలేఉంటుంది.....

మామూలుగా చూడ్డానికి ఒక చిన్న కోవెలలో, పెద్ద రూపాయిబిల్లంత రుధిరవర్ణ కుంకుమబొట్టును ధరించి,
బంగారు త్రిశూలం ధరించి, మహాశక్తివంతమైన శ్రీచక్రానికి అభిముఖంగా నిలిచిన ఆ 
" మహాచతుఃషష్ఠికోటియోగినీగణసేవిత " యొక్క మహిమ ఏ మానవమాత్రుడికి
కూడా అందనిది.....

అది కేవలం ఆ త్రయి యొక్క అనుగ్రహసంపాకమైన యోగదృష్టికి మాత్రమే లభించే విశేషం....

త్రయి అనే లలితనామం పై ధ్యానం మొదలుపెట్టి త్రిపురమాలినీ దెగ్గరికి వచ్చే సరికి ఆ ధ్యానసిద్ధికి గోచరమయ్యే శ్రీభ్రమరాంబాదేవి వైభవం బహు ఆశ్చర్యదాయకం....

అరుణాసురుడిని సమ్హరించేందుకు అలా భ్రామరి గా అవతారాన్ని స్వీకరించిన ఆ ఆదిపరాశక్తి, అట్లే 
ఆ శ్రీగిరిపై కొలువైన వైనంలో ఎంతో గంభీరమైన అధ్యాత్మవిజ్ఞ్యాన విశేషం దాగున్నది.....
 
మందస్మితురాలైన నగుమోమొతో భక్తులను అనుగ్రహించే ఆ గర్భాలయ శ్రీభ్రమరాంబా అమ్మవారి సన్నిధిలో పైన చిన్న గ్లాస్ బాక్స్ / గాజుపేటికలో మనం ఇప్పటికీ ఆ శ్రీభ్రామరి యొక్క నిజరూపాన్ని దర్శించగలం....

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా స్పిరిట్యువాలిటిని ఎన్నడు చేరుకోలేనంతగా ఉన్నతంగా శాశ్వతమై ఉండడమే ఆధ్యాత్మికతకు గల గొప్పదనం.....
అది ఎప్పటికీ అట్లే ఉండడం అనేది సైన్స్ కి ఎప్పుడూ ఒక జీవితకాల ప్రశ్నయే....

ఒక భ్రమరం / తేనెటీగలా ఎగరగల
డ్రోన్స్ ని సైన్స్ తన విజ్ఞ్యానవైభవంతో సృష్టించగలదేమోగాని ఒక తేనెటీగలా ప్రకృతిలో ఉండే పూలనుండి మకరందాన్ని పానంగావించి తన భ్రమరకళతో ఆ వగరుగా ఉండే పదార్ధాన్ని తియ్యని తేనెగా మార్చగల మషీన్ ని సైన్స్ సృష్టించగలదా....??

ఎన్నటికీ అది సైన్స్ కి సాధ్యపడని అంశం....
ఇలా ఎన్నెన్నో ప్రకృతి వింతల్లోగల విజ్ఞ్యానాన్ని సైన్స్ అనుకరించి తన గొప్పదనాన్ని ఆవిష్కరించగలదేమో కాన్ని అందలి ప్రజ్ఞాన సిరిని సైన్స్ ఎన్నడూ కూడా తన వశంచేసుకొనజాలదు....
ఇదే మన సనాతన ఆధ్యాత్మికతకు గల గొప్పదనం మరియు సైన్స్ కి గల పరిమితి...

ఒక గొప్పవ్యక్తెవరో అందుకే అన్నారనుకుంటా....
" Spirituality starts where science ends ..." అని....

ప్రకృతి లో లభించేది మకరందం...
ఆ ప్రకృతిసిద్ధమైన మకరందాన్ని అమృతతుల్యమైన మధువు గా మార్చేది భ్రమరం....

( ఆయుర్వేద శాస్త్రరీత్యా తేనె ఒక గొప్ప ఓషధీ శక్తిగల పదార్ధం....అది ఎన్నెన్నో రుగ్మతలకు మందులు తయారుచేయడంలో ఒక కీలక ముడిసరుకు....
ఆశ్చర్యం ఏంటంటే ఇంత గొప్పదనం గల తేనెని వేడి చేస్తే మాత్రం అది విషంగా మారుతుంది....
కాబట్టి ప్రకృతిలో ఎట్లు లభించినదో అట్లే తేనెను స్వీకరించవలెను..... )

అచ్చం ఇదేవిధంగా ఈ భ్రామరికళ తో ఆ ఆదిపరాశక్తి శ్రీగిరి భ్రమరాంబికాదేవిగా తనను కొలిచిన భక్తులకు తన భ్రామరికళను అనుగ్రహంగా ప్రసాదిస్తుంది.....

అనగా సాధారాణంగా అగోచరమైనది, భ్రామరికళతో గోచరమౌతుంది.....

సాధారణంగా వినపడనిది....భ్రామరికళతో వినపడుతుంది......

సాధారణంగా జగత్తులో సంభవం కానివి....భ్రామరికళతో సంభవమౌతాయి....

ఇలా పలువిధాలుగా "సాధరణంగా గ్రాహ్యమయ్యే ప్రకృతి " యొక్క పరిధి ఎదైతో ఉందో.....

దానికి పైస్థాయిలో ఉండే యోగవిభూతులన్నియు కూడా ఆ శ్రీభ్రామరి యొక్క అనుగ్రహంగా వర్షించబడే దైవప్రసాదములు....

తిరుచానూరులో ( శ్రీశుకపురంలో ) ఊర్ధ్వహస్త కమలధారిణి గా కొలువైన ఆ శ్రీనివాసుడి విశేష శ్రీశక్తికి ప్రతీకగా.....

అనగా ఆ

" ప్రకృతిం వికృతిం విద్యాం....
సర్వభూతహితప్రదాం..... "

అట్లే శ్రీశైల అభయారణ్యంలో ఊర్ధ్వహస్త కమలధారిణి గా, పైరెండు చేతుల్లోను కమలాన్ని ధరించి ఏ ఆగమానికి అందని రీతిలో ఉండే శిల్పకళతో అలరారే ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీగిరి పై నెలకొన్న లయకారకుడి విశేష శ్రీశక్తికి ప్రతీక....

పేరుకు తగ్గట్టే ఇష్టకామ్యార్ధ సిద్ధిని అనుగ్రహించే చిరకాల చింతామణి గా భక్తులకు ఉపాస్యమైన ఘనదైవం ఆ శ్రీశైల ఇష్టకామేశ్వరి అమ్మవారు.....

ఎంతైనా శ్రీఆదిశంకరాచార్యులచే
భూగృహమునుండి బయల్వడి వారి అద్వితీయమైన తపోశక్తితో పునఃస్థాపించబడిన మూర్తి కాబట్టి, సాక్షాత్తు శ్రీఆదిశంకరాచార్యుల తపోస్థలికి
ప్రతీక ఆ అభయారణ్యగత ఆలయం....

జీపుల్లో తీస్కెళ్ళే వర్తకులు "తొందరగా దర్శనం చేసుకొని వచ్చేయండి సాయంత్రం లోపు శ్రీశైలం తిరిగి చేరుకోవాలి అని..." ఒకటే తొందరపెడ్తుంటారు కాని....

కొంచెం టైం తీస్కొని కొద్దిసేపట్లో వస్తాం అని చెప్పి.....

ఆ ఆలయ పరిసర ప్రాంతాలను, అక్కడి
ఆదివాసీల ప్రాంతాలను, అక్కడి సెలయేళ్ళను, అక్కడి ప్రశాంతమైన ప్రకృతి రమణీయతను, బాగా పరికించి చూడండి......
ఎన్నెన్ని వింతలు విశేషాలు ఆ పరిసరాల్లో దాగున్నయో......
బహు శక్తివంతమైన సహజసిద్ధ శ్రీచక్రములు అక్కడి పరిసరాల్లో ఎవరో మహర్షుల తపోశక్తికి ప్రతీకలుగా ఇప్పటికీ దర్శనీయమే...

ఈ కరోనా వల్ల ఈ సారి కార్తీకశోభ కాస్త మందగించిందేమో...
వచ్చే కార్తీకమాసం వరకు అన్నీ సద్దుమణిగి శ్రీగిరి వైభవం ధగధగ తణుకులీనుతూ భక్తులను సదా అనుగ్రహించుగాక....😊

"శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాధృతాం
దీనానామతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలఙ్కృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే...."😊🙏💐

No comments:

Post a Comment