Tuesday, May 21, 2024

శ్రీ క్రోధి నామసంవత్సర 2024 స్వాతి నక్షత్ర ప్రయుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి / శ్రీనారసిమ్హ జయంతి శుభాభినందనలు.💐☺️🎂🎉🍧

💐☺️🎂🎉🍧

మన పురాణాల్లో, కన్నకొడుకు యొక్క హరిభక్తిప్రపత్తిని ఓర్వని అత్యంత దౌర్భాగ్యుడు, దుర్మార్గుడైన రాక్షస తండ్రి ఎవరు అని అడిగితే ఎవ్వరైనా సరే ఠక్కున చెప్పే వృత్తాంతం భక్తప్రహ్లాద చరితం...
ఈ కలియుగంలో వీధికొక్క హిరణ్యకశిపుడి వంటి తండ్రులు ఉండడం ఈ యుగలక్షణం యొక్క దౌర్భాగ్యం....
అయినా సరే శ్రీవేంకట్వశ్వరుడే ఉగ్రశ్రీనివాసుడిగా శ్రీవేంకటనారసిమ్హుడై భక్తులను పరిరక్షించడం ఈ కలియుగవాసుల సౌభాగ్యం...

కలియుగలక్షణం రీత్యా ఈ యుగంలో అత్యంత దుర్లభమైనది కావలసిన పుణ్యం సముపార్జించేందుకు తగిన శౌచము, శ్రద్ద, మనోలగ్నత, ఏకాగ్రత నిత్యం సమకూరి ఉండడం....
ఈశ్వరానుగ్రహంతో అవి సమకూరిన నాడు, 
కలియుగ సౌలభ్యం రీత్యా ఈ యుగంలో అత్యంత పుణ్యదాయకమైనది ఈశ్వరనామస్మరణం, సంకీర్తనం, మరియు "శృణ్వన్ తపః" అనే అత్యంత మహిమాన్వితమైన తపస్సుని ఆచరిస్తూ పురాణ ఇతిహాసాది సాధికారిక సారస్వతప్రోక్త భగవద్ కథాసుధామృత సేవనం...

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాలు శ్రద్ధగా వినే సౌభాగ్యం లభించిన ధన్యజీవులకు, పుణ్యజీవులకు, తెలిసినట్టుగా కొన్ని కోట్లకోట్లకోట్ల జన్మల పుణ్యసంచయం తరువాతమాత్రమే సంభవించే అంశం,
శ్రీమద్భాగవతాన్ని వినే సర్వోత్కృష్టమైన పుణ్యం లభించడం.....

అందరికీ "భారతరత్న" అనే సర్వోత్కృష్టమైన పౌరపురస్కారం
లభించడం దుర్లభం....
ఎందుకంటే అది వారువారు ఎన్నుకున్న మార్గాలో ఎంతో విశేషమైన పరిశ్రమ గావించిన వారికి మాత్రమే లభించే అరుదైన పురస్కారం కాబట్టి...
ఆ పురస్కారం లభించినవారికి యావద్ భారతదేశంలో వారు ఎక్కడికివెళ్ళినా సరే లభించే మరియాదా, గౌరవం, సత్కారం, రాయితీలు, ఫ్రీ ట్రైన్ ట్రావెల్స్ మరియు భారతప్రభుత్వం కల్పించే ఇతర పర్క్స్ ఎన్నో ఎన్నెన్నో.....

అవ్విధముగనే, జన్మాంతర సౌభాగ్యవిశేషంచే శ్రీమద్భాగవత ప్రవచనాలు శ్రద్ధగా ఒక తపస్సుగా అందుకున్న వారికి లభించే ఈశ్వరానుగ్రహం కూడా అట్టిదే....
ఎన్నో విధాలుగా జీవితంలో భక్తుణ్ణి ఎంతో గొప్పగా తరింపజేసే సాధనం "శ్రీమద్భాగవత శ్రవణం"....

అందుకే కద పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజుల్లోనే కైవల్యాన్ని ప్రసాదించిన కల్పతరువై భాసిల్లింది శ్రీమద్భాగవత శ్రవణం..!

అందుకే కద..
"భాగవతంబు తెలిసిపలుకుట చిత్రంబు
శూలికైన తమ్మిచూలికైన...
విభుదజనులవలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరతు..."

అని చెప్పుకున్నారు, శ్రీవ్యాసమహర్షి ప్రణీతమైన 
శ్రీమద్భాగవత సంస్కృతమూలాన్ని ఆంధ్రీకరించిన, అనగా, తెనిగించిన, శ్రీ బమ్మెర పోతనామాత్యుల వారు...!

అందుకే కద..
"అది రాసారు...ఇది రాసారు...ఎన్నో విషయాల గురించి ఏవేవో రాసారు....కాని భగవంతుడి, భగవద్కథాసుధల మహిమ్నతను వర్నించే పురాణం ఒకటి రచింపవచ్చును కదా మహాత్మా....అప్పుడు మీ మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందం, లభించును..." అని సాక్షాత్తు శ్రీనారదమహర్షి వారు భువిపైకి ఏతెంచిమరీ, ఇంకా ఏదో వెలితితో సరస్వతీ నదీతీరం దెగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్న శ్రీవేదవ్యాసుల వారికి సెలవిచ్చింది....!
(ఆదిపరాశక్తి అనుగ్రహంగా మహాత్ములు ప్రభవించాలంటే బీజమైనా గొప్పదైఉండాలి....లేక క్షేత్రమైనా గొప్పదైఉండాలి..
లేక రెండు గొప్పవైఉండాలి....
నారదమహర్షి వారి సమ్రక్షణలో ఉన్న లీలావతి గావించిన భగవద్ తత్త్వ శ్రవణం యొక్క మహత్తువల్ల సంతరించుకున్న దైవికానుగ్రహ సంపత్తివల్ల ఎంతో సాత్వికతత్త్వభరిత క్షేత్రం యొక్క మాహాత్మ్యం వల్లె రాక్షసబీజమైనా సరే,
ప్రహ్లాదుడంతటి మహాభక్తుడు ప్రభవించినది...!)

అందుకే కద శ్రీవేదవ్యాసుల వారు వివరించే శైలికి, గణపతి కలం పట్టి రచిస్తున్న వేగానికి అచ్చెరువొందిన సరస్వతీ నదీ తన అత్యంత వేగవంతమైన ప్రవాహ సవ్వడులను లయించిమరీ ప్రశాంతంగా ప్రవహించినది...!
(శ్రీమద్రామాయణ, మహాభారతాలు, కూడా
శ్రీమద్భాగవతాంతర్గతంగా ఉండే ఇతిహాసాలు అని విజ్ఞ్యుల భావన)

అందుకే కద సర్వకాలసర్వావస్థల్లోను నిరంతరం బ్రహ్మమునందు చిత్తమును స్థితీకరించి బ్రహ్మవేత్తలుగా సంచరించే శ్రీశుకయోగీంద్రుల వారిచే ఈ లోకానికి అందివ్వబడిన అమరకథాసుధగా వినుతికెక్కిన పురాణశ్రేష్టమయ్యింది...!

అందుకే కద ఆనాటి కోవిదులనుండి ఈనాటి విద్వాంసులవరకు.....
శ్రీమల్లాది వారిలాంటి మహనీయులనుండి శ్రీచాగంటి వారిలాంటి మహనీయులవరకు....
ఎక్కువగా పారాయణ గావింపబడి / ప్రవచనాల ద్వారా అరుదైన భగవద్ ప్రసాదంగా ఈ ఆస్తికలోకానికి అందిన సౌభాగ్యమయ్యింది...!

అంతటి సర్వోత్కృష్ట శ్రీమద్భాగవత పురాణకథనంలో 
భక్తప్రహ్లాదోపాఖ్యానం అనేది ఒక మేటిశిఖరాగ్రమణిభాసవంటి 
దైవికకథామృతద్యుతి.....!

శ్రీకరమైన, సర్వోన్నతమైన, సార్వకాలిక సత్యమైన, ఈశ్వరతత్త్వం ఎల్లప్పుడూ కూడా ఎవ్వరికీ ఎప్పటికీ సంపూర్ణంగా అర్ధంకానంతటి ఎత్తులో అలరారుతూ ఉండును అనేది మనకు భక్తప్రహ్లాదోపాఖ్యానం ద్వారా రూఢమైఉన్నది.....
అటువంటి ఆశ్చర్యకరమైన భగవద్ తత్త్వం నిర్మల భక్తిప్రపత్తికి ఎల్లవేళలా బంధీకృతమై ఉండును అనేది భక్తప్రహ్లాదోపాఖ్యానం ద్వారా రూఢమైఉన్న మరో సత్యం....

ఆఫ్ట్రాల్ ఒక అంతఃపుర స్తంభమే కదా...అని
"ఇందులో ఉన్నాడా నీ శ్రీహరి...?"
అనే తండ్రి యొక్క వితండవాదానికి...
"ఎందెందువెదకిచూచిన అందందే గలడు...
చక్రి సర్వోపగతుండు..."
అనేది భక్తప్రహ్లాదుడి ఉపనిషద్ సంవాద సమాధానం....
[ అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః ]

అందుకు తగ్గట్టుగానే...
చరిత్రలో ఎన్నడూ కనీవినిఎరుగని రీతిలో, హిరణ్యకశిపుడు అడిగిన వరాన్ని, బ్రహ్మగారు అనుగ్రహించిన వైనాన్ని గౌరవిస్తూనే....

సద్యోస్తంభోద్భవ రుద్రాంశభరిత నారసిమ్హశక్తిగా ప్రహ్లాదుడి వచనాలకు ప్రభవించి....
పగలు కాదు, రాత్రి కాదు సంధ్యవేళలో....
మనిషి కాదు, మృగం కాదు శ్రీనారసిమ్హుడై....,
భూమికాదు, ఆకాశం కాదు, అంతఃపుర గడపపై,
తన తొడలపై,
జీవమున్నవి కాదు, జీవంలేనివి కాదు, తన వజ్రసదృశనఖములతో...
హిరణ్యకశిపుడి హద్దెరగని ఆసురిక మూర్ఖత్వాన్ని సమ్హరించిన దేవనారసిమ్హుణ్ణి ఆనాటి కృతయుగం నుండి ఈనాటి కలియుగం వరకు ఆరాధించని భక్తులుండరు.....

ఎందుకంటే ఆర్తితో పిలిచే భక్తులకోసం వాయువేగంతో ఎక్కడినుండైనా ప్రభవించే తత్త్వంతో అలరారే అనుగ్రహమూర్తి శ్రీనారసిమ్హుడు....!

సకలతత్వకోవిదులైన శ్రీఅదిశంకరులే 
"లక్ష్మీ నృసిమ్హ మమదేహి కరావలంబం" అని ఎంతో ఆర్తితో ఆరాధించిన శక్తి శ్రీనారసిమ్హశక్తి...!

శ్రీపరాశరసమ్హితోక్తమైన,
వానర, నారసిమ్హ, ఖగరాట్ (గరుడ), క్రోడ (వరాహ), అశ్వ,
అనే శ్రీపంచముఖహనుమద్ ఉపాసనలో, నృసిమ్హవదనోపాసన అనేది విశేషశక్తిదాయక, సకలప్రతికూలశక్తిదమన తత్త్వానికి ప్రతీకగా విజ్ఞుల ఉవాచ...

శ్రీవేంకటేశ్వర తత్త్వమే సర్వస్వంగా భావించి వారు తరిస్తూ, ఎల్లరినీ తరింపజేస్తూ, జీవించిన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు కూడా, వారి భగవద్భక్తిని ఓర్వని వారికాలం నాటి మానుష ప్రభువుల మూర్ఖపు హింసకు బాధితులైన సమయంలో అనుసంధింపబడినది శ్రీవేంకటనారసిమ్హ సంకీర్తన...
అనగా చిద్విలాసంతో అలరారుతున్న ఆనందనిలయుడికి తన నారసిమ్హ తత్త్వాన్ని గుర్తుచేసి తనవద్దకు సద్యోరక్షక తత్త్వంగా రప్పింపబడిన శక్తి శ్రీనారసిమ్హశక్తి..!

ప|| ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా | కేళీ విహార లక్ష్మీనారసింహా ||

చ|| ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార | లలిత నిశ్వాసడోలా రచనయా |
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- | చలన విధినిపుణ నిశ్చల నారసింహా ||

చ|| వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- | లవదివ్య పరుష లాలాఘటనయా |
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ | నవనవప్రియ గుణార్ణవ నారసింహా ||

చ|| దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- | కార స్ఫులింగ సంగక్రీడయా |
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- | కారణ ప్రకట వేంకట నారసింహా ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/04/170palanetranala-prabala.html?m=1

మీరు గమనిస్తే....
ఈ కలియుగభక్తజనోద్ధరణకై ఎక్కడెక్కడ ఈశ్వరుడు విశేషమైన వైభవంతో కొలువైఉంటే.....అక్కడక్కడికి శ్రీనారసిమ్హశక్తి కూడా తదనంతరకాలంలో వచ్చి కొలువై ఉన్నది....

క్షేత్రపాలక రుద్రశక్తి కొన్ని కారణాలరీత్యా ఆలాయానికి దూరంగా పాండవతీర్థం దెగ్గర రుద్రశిల గా కొలువుతీర్చబడిఉండగా...
తిరుమల ఆలయ వెండివాకిలి లోపల సద్యోజాతరుద్రశక్తికి సామ్యముగా శ్రీయోగనారసిమ్హుడిగా వచ్చికొలువై ఉన్నాడు...
భద్రాచల ఆలయానికి సమీపంలో, కొండపై క్షేత్రపాలకుడిగా శ్రీయోగనారసిమ్హుడిగా వచ్చికొలువై ఉన్నాడు...

ఇక ఎన్నెన్నో స్వయంభూ క్షేత్రాల్లో ఆయా క్షేత్ర ఐతిహ్యానుగుణంగా వెలసిన శ్రీలక్ష్మీనారసిమ్హ వైభవం
భక్తులెల్లరికీ విదితమే...
 
ధర్మపురి శ్రీలక్ష్మీనృసిమ్హస్వామి,
యాదగిరి శ్రీలక్ష్మీనృసిమ్హస్వామి,
మంగళగిరి పానకాల శ్రీలక్ష్మీనృసిమ్హస్వామి,
అంతర్వేది శ్రీలక్ష్మీనృసిమ్హస్వామి,
అహోబల శ్రీలక్ష్మీనృసిమ్హస్వామి,
సిమ్హాచల శ్రీవరాహనృసిమ్హస్వామి,
నాచారం శ్రీలక్ష్మీనృసిమ్హస్వామి,
చీర్యాల మీసాల శ్రీలక్ష్మీనృసిమ్హస్వామి,

ఆలయాలను వివిధ సందర్భాల్లో దర్శించి వారి అనుగ్రహాన్ని
బడసి తరించడం నా జన్మాంతర సుకృతం....

 
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్మృత్యుం నమామ్యహం

సర్వం శ్రీలక్ష్మీనారసిమ్హ శ్రీచరణారవిందార్పణమస్తు....
🇮🇳🙏💐🎉🙂🍨🍿🍊