Tuesday, April 22, 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆర్ద్ర ప్రయుక్త భృగువాసర వైశాఖ శుద్ధ పంచమి (02-మే-2025) శ్రీఆదిశంకరజయంత్యుత్సవ శుభాభినందనలు...🙂💐🙏

శ్రీఆదిశంకరజయంత్యుత్సవ శుభాభినందనలు...🙂💐🙏

1.శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం....
2.శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతం....
3.శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం...

అనే సిద్ధాంతత్రయతత్త్వసౌధాలపైనే యావద్ భారతదేశ సనాతనధర్మవైభవం వర్ధిల్లుతూ ఉన్నది...

జీవుడు వేరు..దేవుడు వేరు....
అనే సహజమైన ద్వైదీభావనయొక్క తత్త్వదర్శనం శ్రీమధ్వాచార్యుల ద్వైత సంప్రదాయ దర్శనం...
అనగా...
భుజింపబడుతున్న అన్నం వేరు...
భుజిస్తున్న శరీరం వేరు...
అనే తత్త్వదర్శనమే ద్వైతసంప్రదాయ దర్శనం......

జీవజీవేశ్వర సంఘాతంలోని జీవేశ్వరుణ్ణి విశిష్టమైన రీతిలో ఆరాధిస్తూ, భగవంతుడిగా తెలుసుకొని తరించడమే శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైతసంప్రదాయ దర్శనం...
అనగా...
భుజింపబడుతున్న అన్నమే 
భుజించే శరీరంగా పరిణమించును...
కాబట్టి అన్నము పరబ్రహ్మస్వరూపమై ఒప్పారుచున్న కారణంగా ఎంతో విశిష్టమైన అన్నమే పరమాత్మ అనే తత్త్వదర్శనమే శ్రీరామానుజాచార్యుల విశిష్టాద్వైతసంప్రదాయ దర్శనం...

జీవజీవేశ్వర సంఘాతమే అభిన్నమైన జీవాత్మపరమాత్మ తత్త్వం..
భగవదారాధనలోని తారాస్థాయిలో, ఆరాధింపబడే భగవద్ తత్త్వానికి, ఆరాధించే భక్తుడికి, భేదం ఉండని రీతిలో ఏకత్వసిద్ధి సంప్రాప్తించును కాబట్టి జీవుడు దేవుడు ఒక్కరే అని తెలుసుకొని తరించడమే శ్రీ ఆదిశంకరాచార్యుల
అద్వైతసంప్రదాయ దర్శనం...
అనగా...
భుజింపబడుతున్న అన్నమే భుజించే శరీరంగా పరిణమిస్తూ ఉండును...
కాబట్టి భుజింపబడే అన్నానికి, భుజించే శరీరానికి అభేదం...
అనే తత్త్వదర్శనమే శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైతసంప్రదాయ దర్శనం...

ఈ మూడు సిద్ధాంతాలు కూడా సత్యమే....
ఈ మూడు సిద్ధాంతాలు కూడా వేటికవే వాటివాటి ప్రత్యేకతలు కలిగి ఉన్నవి....
ఈ మూడు సిద్ధాంతాలు కూడా భక్తుణ్ణి భగవంతుడి తీరానికి చేర్చే ఆరాధనా / సాధనా మార్గాలై వర్ధిల్లుచున్నవి....

చెరుకు భగవంతుడికి ప్రతీక...
(శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం)

చెరుకు రసం భగవద్ తత్త్వానికి ప్రతీక....
(శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతం)

చెరుకురసం నుండి సంప్రాప్తించే నిలవదోషం లేని బెల్లం ఘనీభవించిన శాశ్వతమైన, నిత్యసత్యమైన, నిరాకార నిర్వికార ప్రత్యక్ష భగవద్ దీపికకు ప్రతీక....
(శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం)

ఫలాన చోట చెరుకుచేను ఉన్నది..
వెళ్ళి స్వీకరించి తరించండి...
(శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం)

ఫలాన చోట ఉండే చెరుకుచేను దెగ్గరికి వెళ్ళి, ఫలాన పెద్దాయన ఇచ్చే ఆ చెరుకు యొక్క రసాన్ని స్వీకరించి తరించండి...
(శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతం)

ఫలాన చోట ఉండే చెరుకుచేను దెగ్గరికి వెళ్ళి, ఫలాన పెద్దాయన ఇచ్చే ఆ చెరుకు యొక్క రసాన్ని స్వీకరించి ఇవ్విధంగా ఒక పాచక పద్ధతిలో తపింపజేయగా ప్రభవించే నిలవదోషం లేని బెల్లానికి మీకు విహితమైన నామరూపాత్మక విశేషాలను ఆపాదించి, స్వీకరించి తరించండి....
(శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం)

ఇక్కడ చెరుకు అనే పరతత్త్వ పదార్ధాన్ని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా సంగ్రహించి అందలి సారాన్ని వివిధ రీతుల గ్రహించి, తరిస్తున్నారు....

అవ్విధముగనే...
భగవంతుడు అనే పరతత్త్వ పదార్ధాన్ని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా సంగ్రహించి అందలి సారాన్ని వివిధ రీతుల గ్రహించి, తరిస్తున్నారు....

ఈ మూడు తత్త్వదర్శనాల్లోనూ ఎక్కడా కూడా ఎక్కువతక్కువలు, భేదభావాలు, ఇత్యాది వాటికి తావులేదు...
కేవలం ఆయా సంప్రదాయ ఆచరణమార్గంలో వైవిధ్యం ఉన్నది...

అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే....
జిజ్ఞ్యాస, దాహం, ఆకలి
అనే ప్రాకృతిక తత్త్వ సమన్వయానికి సమాధానాలుగా
ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం 
అనే తత్త్వసంప్రదాయాలు ఆవిర్భవించాయి అని విజ్ఞ్యులు గ్రహించవలసి ఉంటుంది...
మరియు తత్త్వసంప్రదాయానికి, అర్చారాధనాసంప్రదాయానికి గల అంతరం, అందలి ఆంతర్యం కూడా విజ్ఞ్యులు గ్రహించవలసి ఉంటుంది..
అట్టి భగవద్తత్త్వగ్రాహ్యలేమివల్లే కొందరి అపరిపక్వతత్త్వభావన, మౌఢ్యం ఆస్తిక సమాజాన్ని పెడద్రోవపట్టించి పనికిరాని ప్రశ్నలను, సిద్ధాంతాలను తెరమీదికి తెచ్చి సామాన్యులకు ఆధ్యాత్మికత యొక్క అసలైన అర్ధాన్ని తెలియజెప్పడంలో
కొందరు సంకుచిత తత్త్వవాదుల ఆస్తికవాదం తడబడుతున్నది...

ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనేవి భగవద్తత్త్వగ్రాహ్య సంప్రదాయాలు...
గాణాపత్యం, శ్రీవైష్ణవం, శాక్తేయం, శైవం, సౌరం అనేవి 
అర్చారాధనా సంప్రదాయాలు...

కాబట్టి ఏది ఎక్కువ, ఏది తక్కువ,
ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ,
ఎవరు జగద్గురువులు, ఇత్యాది అర్ధంలేని ప్రశ్నలు, వాదాలు, అభిప్రాయాలు ఆస్తికవాదం యొక్క గౌరవానికి కళంకంగా పరిణమించే అంశాలుగా విజ్ఞ్యులచే భావింపబడుచున్నవి...

మీరు ఆరాధించే భగవద్ తత్త్వసంప్రదాయానికి...
మీరు ఆచరించే భగవద్ అర్చనాసంప్రదాయానికి...
మరియు వీటి యొక్క సమన్వయానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను...

మీరు...
"భగవద్ బంధువులందరికీ సాదర స్వాగతం..."
అని వచించినప్పుడు మీ చిత్తం ద్వైతతత్త్వప్రస్తుతిలో ఉన్నది...

మీరు...
"ఇవ్విధముగా మన పెరుమాళ్ళ సేవలో మనం తరించడం మనందరి సౌభాగ్యం..."
అని వచించినప్పుడు మీ చిత్తం విశిష్టాద్వైతతత్త్వప్రస్తుతిలో ఉన్నది...

మీరు...
"శ్రీసీతారాముల అట్టి ఆచరణే మనకు స్ఫూర్తి, మార్గదర్శనం, అనుసరణీయం..." 
అని వచించినప్పుడు మీ చిత్తం అద్వైతతత్త్వప్రస్తుతిలో ఉన్నది...

మీ పెద్దల, పూర్వీకుల నైసర్గికాచారానుగుణంగా...
మీ పూజామందిర భగవద్ సిమ్హాసనమునందు ఏ భగవద్ తత్త్వం యొక్క నామము, స్వరూపము కొలువై ఉండునో...
ఆ సంప్రదాయాన్ని మీరు ఆచరిస్తున్నట్టు అర్ధం....
తదనుగుణంగా..
గాణాపత్యులు, శ్రీవైష్ణవులు, శాక్తేయులు, శైవులు, సౌరులు...
అనే పేర్లతో భగవద్ అర్చారాధనా సంప్రదాయం గౌరవించబడుతున్నది...

మీరు స్మార్తులైనచో...,
మీ పంచాయతన ఆరాధనలో, శ్రీ ఆదిశంకరాచార్యులచే స్థిరీకరింపబడిన 
గణపతి,
లక్ష్మీనారాయణ,
జగదాంబిక,
శివ,
సూర్య,
అనే పంచ భగవద్ తత్త్వ మూర్తుల్లో, పూజామందిర సిమ్హాసనమునందు మధ్యలో, మీ ఇంటి పెద్దలు, పూర్వీకులు వారివారి నైసర్గికాచారానుగుణంగా ఆరాధిస్తూవస్తున్న భగవద్ తత్త్వం యొక్క నామము, స్వరూపము కొలువై ఉండి,
ఇతర భగవద్ తత్త్వ నామరూపములు పరివారదేవతలుగా చుట్టూ కొలువై ఉందురు...

మీరు మీ యొక్క పరంపరాగతమైన దైవాన్ని ఆరాధించడం అనునది ద్వైత సంప్రదాయాన్ని గౌరవించడం అనబడుతుంది...

మీరు మీ యొక్క పరంపరాగతమైన దైవాన్ని విశేషంగా ఆరాధిస్తూ అందలి విశిష్టమైన తత్త్వార్ధాన్ని గ్రహిస్తూ తరించడం అనునది విశిష్టాద్వైత సంప్రదాయాన్ని గౌరవించడం అనబడుతుంది...

మీరు మీ యొక్క పరంపరాగతమైన దైవాన్ని విశేషంగా ఆరాధిస్తూ అందలి విశిష్టమైన తత్త్వార్ధాన్ని గ్రహిస్తూ, ఆ భగవద్ తత్త్వానికి మిమ్మల్నిమీరు సాక్షిగా స్థిరీకరించుకొనే తత్త్వదర్శనం అనునది అద్వైత సంప్రదాయాన్ని గౌరవించడం అనబడుతుంది.....

ఇంటినుండి ఓలా / ఊబర్ క్యాబ్ ఎక్కి, బస్ లో ఏర్పోర్ట్ కి చేరుకొని, ఏర్ లుఫ్థాన్స లో ప్రయాణించి వయా ఫ్రాంక్ఫర్ట్ సాన్ఫ్రాన్సిస్కో చేరుకోవడం అనేది ప్రయాణం యొక్క క్రోనాలాజికల్ ఆర్డర్....
ఇందులో ఏది కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు...
అవన్నీ కూడా మన గమ్యానికి గొనిపోవు వివిధ మార్గములు / ప్రయాణ సాధనములు...

అవ్విధముగనే...

మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే...

ద్వైత సంప్రదాయంలో ఉన్న చిత్తవైభవానికి భగవద్ తత్త్వం పట్ల సరైన ఎరుకను కలిగించి.., 

విశిష్టాద్వైత సంప్రదాయానికి చేరుకున్న చిత్తవైభవానికి భగవద్ తత్త్వం యొక్క మహత్తును నిత్యం ఆపాదించి తరిస్తూ..., 
 
అద్వైత సంప్రదాయానికి చేరుకున్న చిత్తవైభవానికి భగవద్ తత్త్వం యొక్క సాక్షిత్వాన్ని వహించే చిత్తవైభవమే జీవజీవేశ్వరాభిన్నమైన పరమేశ్వర అద్వైతస్థితి గా ఎరుకలోకి వచ్చిన ధీశక్తియే పరమాత్మ....
అని తెలుసుకొని తరించడమే భగవదారాధనలోని వైభవం, విశేషం, మాహాత్మ్యం...

ఇదంతా కొంచెం కాంప్లెక్స్ గా అనిపించవచ్చు నాయనా....
కొంచెం సింపుల్ పరిభాషలో చెప్తే బావుంటుంది కద...
అని అనుకునే వారికి కొంచెం సింపుల్ గా చెప్తా....

కొందరు...
"మేము భోజనంగా బియ్యం / అన్నం, తోటకూర మాత్రమే భుజిస్తాము..." అని...
మరికొందరు...
"మేము భోజనంగా గోధుమ రొట్టెలు, పాలకూర మాత్రమే భుజిస్తాము..." అని..
ఇంకొందరు...
"మేము భోజనంగా పిజ్జా బర్గర్ మాత్రమే భుజిస్తాము..." అని...
ఇంకొందరు...
"మేము భోజనంగా పైన పేర్కొనబడినవన్నీ భుజిస్తాము..." అని...
ఇంకొందరు...
"మేము భోజనంగా పైన పేర్కొనబడినవన్నీ, మరియు ఈ లోకంలో లభ్యమయ్యే ఇతర భోజ్య పదార్ధాలన్నీ భుజిస్తాము..." అని...
అంటే....
దాని అర్ధం లోకో భిన్నరుచిః...
కాబట్టి ఎవరికి నచ్చినవి, లేక ఎవరికి ఉపయుక్తమైనవి వారు భుజించడం అనేది లోకరీతి...

కాబట్టి, ఫలాన పదార్ధాలను భుజించే వారు ఎక్కువ....
ఫలాన  పదార్ధాలను భుజించే వారు తక్కువ..
అనే ప్రశ్నే అర్ధంలేని ప్రశ్న....
ఇక ఫలానా పదార్ధం ఎక్కువ...ఫలానా పదార్ధం తక్కువ...
అనే ప్రశ్న ఎట్లు ఉత్పన్నమౌను...?

అనగా, ఫలాన దేవతా నామ రూపములను ఆరాధించే వారు ఎక్కువ....
ఫలాన దేవతా నామ రూపములను ఆరాధించే వారు తక్కువ..
అనే ప్రశ్నే అర్ధంలేని ప్రశ్న....
ఇక ఫలానా దేవుడు ఎక్కువ...ఫలానా దేవుడు తక్కువ...
అనే ప్రశ్న ఎట్లు ఉత్పన్నమౌను...?

శ్రీచాగంటి సద్గురువుల శ్రీశంకరవిజయం /మాధవీయశ్రీశంకరవిజయం, శివానందలహరి, సౌందర్యలహరి,
కనకధారాస్తోత్రం, ఇత్యాది ప్రవచనాలు, విన్నవారికి గుర్తున్నట్టుగా...
శ్రీచాగంటి సద్గురువులు శ్రీఆదిశంకరుల గురించి ఒక గొప్ప వాక్యాన్ని ప్రస్తుతించారు....
""Can there be anyone who can talk as best as ShreeAadiShankara...?"

ఎందుకంటే వారు సాక్షరసారంగా అందించిన సకల దేవతాతత్వార్ధసారస్వత పెన్నిధి అట్టిది...
అది వారు నుడివిననాటి నుండి నేటి వరకు మరియు ఎప్పటికీ కూడా అమృతతుల్యమైన భగవదనుగ్రహదాయక బ్రహ్మపదార్ధమై వర్ధిల్లుచూఉన్నది...

"మీరు ఫలాన దేవతా నామ రూప తత్త్వ సంప్రదాయాన్ని ఆరాధించండి..." అని చెప్పినందుకు కాదు....
"మీరు ఫలాన దేవతా నామ రూప తత్త్వ సంప్రదాయాన్ని ఫలాన పద్ధతిలో ఆరాధిస్తూ శ్రేయోకరమైన అనుగ్రహన్ని అందుకొని తరించండి..." 
అని సకలదేవతారాధనా సంప్రదాయాలను సువ్యవస్థీకరించి ఆస్తికలోకానికి అందించినందుకు,
వారు జగద్గురువులై, సనాతన భారతదేశం యొక్క హృదయం ఎప్పటికీ విహిత కర్తవ్య ప్రయుక్త ధర్మాచరణభరిత దేవతారాధనా వైభవంతో పరిఢవిల్లుతూ ఉండాలనే సత్సంకల్పంతో నెలకొల్పిన చతురామ్నయా పీఠాలను పరంపరాగతంగా అధిరోహించే బ్రహ్మవేత్తలు వారిలా జగద్గురువులుగా ఆరాధింపబడేదరుగాక అని ఆస్తికలోకాన్ని శాసించి అనుగ్రహించారు...

ఈ 4 చతురామ్నాయ పీఠాలకు గురుస్థానంగా నెలకొల్పబడిన దక్షిణభారత కన్నడప్రదేశ శృంగేరి శారదా పీఠాధీశులైన బ్రహ్మవేత్తలు, ఈ భారతదేశంలోని అన్ని ఆస్తిక వ్యవస్థలకు కూడా జగద్గురువులై వర్ధిల్లుతూ భక్తులెల్లరినీ అనుగ్రహిస్తూ పరిఢవిల్లడం అనేది అనాదిగా ఈ భారతదేశం యొక్క ఆస్తిక వైభవానికి ఆధారమై ఉన్నది...

శ్రీఆదిశంకరాచార్యుల శ్రీచరణాలకు ప్రణమిల్లే 
శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణాలకు,
జగద్గురు శ్రీభారతీతీర్థ స్వామివార్ల శ్రీచరణాలకు, 
ఉత్తరపీఠాధిపతులైన శ్రీవిదుశేఖరభారతీ స్వామివార్ల శ్రీచరణాలకు ,
మరియు శ్రీఆదిశంకరుల హృదయాన్ని ఆవిష్కరించే ఆస్తికవరేణ్యులెల్లరికీ, 
ప్రణమిల్లుతూ....,
శ్రీఆదిశంకరకృపతో ఆస్తిక లోకం ఎప్పటికీ అమరుల అనుగ్రహంతో ధర్మార్ధకామ్యమోక్షములుగా వ్యవహరింపబడే చతుర్విధపురుషార్ధాలను అందుకొని తరిస్తూ వర్ధిల్లెదరని ఆకాంక్షిస్తూ...,
విజ్ఞ్యులెల్లరికీ శ్రీఅదిశంకరజయంత్యుత్సవ శుభాభినందనానమస్సుమాంజలి....🙂🙏💐

(ఇట్టి పర్వసమయంలో, శ్రీఆదిశంకరభగవద్పాదుల శ్రీచరణాలకు సభక్తికంగా సమర్పింపబడే సారస్వత నమస్సుమాంజలిగా "తోటకాష్టకం" ఖ్యాతి గడించిన కారణంగా భక్తులెల్లరూ తోటకాష్టకాన్ని పఠించి తరించెదరు గాక... 💐)

శ్రీశంకరభానవేనమః...🙏💐🙂

No comments:

Post a Comment