తెలుగు సినిసంగీత జగత్తును తమ కలంతో ఏలిన అగ్రగణ్యుల్లో ఆరితేరిన భాషాకోవిదులు....
వారు ఉపయోగించని పదం లేదు...
వారు వినియోగించని పదప్రయోగంలేదు...
వారి కవనంలో ఒలకని రసం లేదు...
వారి మధుకావ్య కృతుల్లో పలకని శ్రుతిలేదు...
వారి కలంలో కలవని సాహిత్య సౌరభం లేదు...
"ఈ పాట యొక్క సాహిత్యం ఎంత అత్యద్భుతంగా ఉంది...ఇది వేటూరి గారిదా సిరివెన్నెల గారిదా..."
అనేది సర్వసామాన్యంగా ఎవ్వరైనా అడిగే ప్రశ్న అనడం అతిశయోక్తి కానేరదు....
అంతగా ఆ ఇరువురు సాహితీ లోకాన్ని తమ కలంలో బంధించిన భాషాప్రవీణులు.....
భావవ్యక్తీకరణ ఏదైనాసరే....అది బహు గంభీరంగా వారి కలం యొక్క కొనల్లో తాండవించింది....
భావమేదైనా సరే బహుభంగిమల్లో వారి కలం యొక్క కదలికల్లోని లాస్యంలో రంగరించబడింది....
పదబంధనం ఎంతటి సరళమైనా ఎంతో గహనమైనా అది వారి సిద్ధహస్తానికి సహజమైన అల్లికగా
అమరి ఆనందించింది....
తిరుమల శ్రీవైకుంఠం Q కాంప్లెక్స్ సర్వదర్శనం Q లైన్ ఎప్పటికీ అట్లే నిరంతరం కొనసాగేరీతిలో...
సత్యలోక స్థిత సరస్వతీ కరకలిత కఛ్ఛపీ గమకిత వీణాతంత్రుల స్వరమధురిమలన్నీ కూడా వారి కలం లోకి నిరంతర అక్షరఝరులై దిగివచ్చి కొలువై ఈ తెలుగు సీమకు ఆ పుంభావ సరస్వతీ స్వరూపుల అసామాన్య సాహితీ ఝరిని అందించి సాహితీ ప్రియులను ఓలలాడించింది...
భౌతికంగా వారు ప్రత్యక్షంగా ఈ తెలుగు నేలకు దూరమై ఆ సత్యలోకంలోని శ్రీశారదను సేవించడానికి తరలి వెళ్ళినా సరే ....
వారు అందించిన వేలకొలది పాటల్లోని వారి అక్షర విన్యాసాల్లో సదా సజీవులై ఉండి అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ మనకు వారి సారస్వతసిద్ధిని వీణులవిందుగా అందిస్తూనే ఉండడంలో....
వారు ఎప్పటికీ మన మధ్య సజీవంగా ఉన్నట్టే కదా...
1.
"షడ్జమాం భవతి వేదం..
పంచమాం భవతి నాదం..
శృతి శిఖరే..నిగమఝరే.. స్వరలహరీ...."
అనేలా సంగీత సప్తస్వరాల శక్తి ప్రస్ఫుటంగా ప్రకటించబడేలా ఉండే సాహితీ ఝరి తో ఉండే ఎత్తుగడతో ప్రారంభించి కడు గంభీర సౌమ్య భావాల కలబోతగా దూసుకెళ్ళిన
"ఉప్పొంగెలే గోదావరి...ఊగిందిలే చేలో వరి..."
అనే పాటను,
దక్షిణ భారత గంగానది గా ఉన్న గోదారమ్మ వైభవంతో దక్షిణ అయోధ్యాపురి శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాచల శ్రీరామచంద్రుడి వైభవాన్ని ప్రకటించేలా రాసినా అది వారికే చెల్లింది...
[
స రి గ మ ప ద ని స
అనే సప్తస్వరాల్లో షడ్జమానికే వేద శక్తి ప్రకటన స్థానం ఎందుకు ఆపాదించబడింది....
పంచమానికే నాద శక్తి ప్రకటన స్థానం ఎందుకు ఆపాదించబడింది....
సా..పా..సా...పా..సా.. అనే స్వర విన్యాసంలో
షడ్జమమే ఎందుకు అతిమంద్ర మరియు తారా స్థాయి లో...
పంచమమే మంద్ర స్థాయి లో
( ఆరోహణ అవరోహణ యందు కూడా )
జీవాత్మకు పంచమం....,
పరమాత్మకు షడ్జమం....,
సంకేత స్వరాలుగా.........
ఎందుకు శాస్త్రీయ కర్ణాటక సంగీత విద్వాంసులు స్థిరీకరించారు...
ఇత్యాది గహనమైన సంగీత/నాదోపాసన సంబంధిత చర్చ వేరే పోస్ట్లో కొనసాగిద్దాం...
]
2."మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా... శంకరా... శంకరా...
"
అంటూ తమ కలంలోని కవన శక్తిని కళామతల్లికి ఘనమైన నీరాజనం గా అందిచే రీతిలో ఆ దివిగత చంద్రమౌళీశ్వర జటాజూట బంధిత సలిల గంగా ఝరిని వారి కలం లోని సిరా వినిర్గత సాహితీ ఝరిగా ఒలికించి శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులను సైతం పరవశించేలా చేసినా అది వారికే చెల్లింది....
3. "ఆకాశాన సూర్యుడుండడు - సంధ్య వేళకి...
అంటూ పల్లవిని అందుకొని..
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన - కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు - రోజే చాలులే...
"
అంటూ చరణం లో ఎంతో హృద్యంగా జీవిత సారాన్నే ఒలికించినా సరే....అది వారికే చెల్లింది....
అంటే ఒక తుమ్మెదలా లోకంలోని సారవంతమైన విషయాలను సంగ్రహిసూ కొద్దికాలం బ్రతికినా సరే అది ఎంతో ఘనమైన జీవితం అనే ఎంతో గంభీర భావమంజరిని అంత సులభంగా ఒలికించినా సరే అది వారికే చెల్లింది.....
"ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకే...
జన్మ బంధమూ ప్రేమ గంధమూ పూటే చాలులే..."
అంటూ..
శ్వాసకోశంలో ఊపిరితిత్తులను మెలిపెట్టి తిప్పేసినట్టుగా ఉండే బాధామయ జీవితమైనా సరే....
బాహ్యమున నవ్వుతూ ఆ బాధను దిగమింగి జీవించేంతటి పరిణత తో జీవించగలగాలి అనేలా ఉండే జీవిత సత్యాన్ని అంత సరళంగా ఒలికించినా సరే అది వారికే చెల్లింది....
"4. ఏడుకొండలకైనా.. బండతానొక్కటే..
ఏడు జన్మల తీపి.. ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక..
నేను మేననుకుంటే.. యెద చీకటే..హరీ.. హరీ.. హరీ
రాయినై ఉన్నాను ఈ నాటికి..
రామ పాదము రాక ఏనాటికీ....
వేణువై వచ్చాను భువనానికి...."
అంటూ శ్రీశంకరాచార్యుల అద్వైత సిద్ధాంత సారాన్ని రంగరించి రచించి,
"ఋణానుబంధేన పునర్జన్మవిద్యతే...."
అన్నట్టుగా జీవుడి యొక్క జన్మపరంపరలకు తన సంచిత ప్రారబ్ధాలే కారణమనే కర్మసిద్ధాంత విశేషాన్ని కూడా మేళవించి ఒలికించినా సరే అది వారికే చెల్లింది...
5. "ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో | పూసేటి పూవులా గంధాలతో
మంచు తాకి కోయిల... | మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా | ఆమని పాడవే హాయిగా
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా యెద | స్వరాల సంపద
తరాల నా కథ | క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని..."
అంటూ వారి అనంతమైన ఆశ్చర్యకరమైన పదసంపద యొక్క ప్రాభవం ఉట్టిపడేలా రచించినా సరే...
అది వారికే చెల్లింది......
ఇలా ఒకటా రెండా....5 వేల పైచిలుకు పాటలతో తెలుగు సినీసాహిత్య రథసారధిగా....
అనన్యసామాన్యమైన భాషావైదుష్యంతో..
అపురూప పదబంధనాలతో...
ఆశ్చర్యకరమైన పదప్రౌఢిమతో.....
అనంతమైన పదవిన్యాసంతో....
అమేయమైన పదవిజ్ఞ్యానంతో...
సినీసాహితీ లోకానికి మకుటంలేని మహారాజులై, శ్రోతల హృదయాల్లో శాశ్వతంగా జీవించే పదచక్రవర్తి గా చిరకీర్తికాయులైన వేటూరి గారు నిజంగా ఈ తెలుగు నేల చేసుకున్న పుణ్యాలపంటగా అవతరించిన అరుదైన మహనీయుల్లో ఒకరైన మాన్యులు...
వారి అమరసాహితీఝరి ఎల్లరికీ వీణులవిందుగా ఉండి ఆనందింపజేస్తూనే ఉంటుంది.....
ఊర్ధ్వలోక గతులైన ఆ పదసార్వభౌములు మళ్ళీ భువిపైకి నరులై తిరిగివచ్చి మరో కొత్త చరిత్ర సృష్టించేలా ఈశ్వరుడు ఈ తెలుగు నేలను అనుగ్రహించు గాక...
శ్రీ వేటూరి గారి 85వ జయంత్యుత్సవ సందర్భంగా
వారికి ఒక సాహిత్యాభిమాని సవినయంగా సమర్పించే చిరు కవనకుసుమాంజలి....🙏😊💐🍟🍨🍕
No comments:
Post a Comment