శ్రీ శార్వరి ధనుర్మాస శ్రీవ్రతం / తిరుప్పావై ప్రత్యేకత మరియు రాబోయే భోగి నాటి శ్రీగోదారంగనాథ తిరుక్కల్యాణమహోత్సవ శుభాభినందనలు........🍕💐🍟🍨😊
ప్రతిసంవత్సరం చాంద్రమానం ప్రకారంగ రమారమి మార్గశిర/పుష్య మాసంలో, సౌరమానం ప్రకారంగ వచ్చే మకరసంక్రాంతి పర్వదినం ముందు రోజున అనగా భోగి రోజున, శ్రీగోదారంగనాథ కల్యాణం ప్రతీ శ్రీవైష్ణవాలయంలో అంగరంగ వైభవంగా జరుపబడి భక్తుల్లెల్లరికి తీర్థప్రసాదాలను అనుగ్రహించి ఎల్లరి జీవితాలు భోగభాగ్యాలతో అభివృద్ధి చెందేల మన పెద్దలు ఏర్పాటు చేసిన సత్సంప్రదాయం గూర్చి ఎల్లరికి విదితమే కదా...
కర్కటేపూర్వఫల్గుణ్యాంతులసీకాననోద్భవాం
పాండ్యేవిశ్వంభరాంగోదాంవందేశ్రీరంగనాయకీం...
అని కీర్తించబడే ఆ శ్రీవిళ్ళిపుత్తూర్
పెరియాళ్వారుల ప్రియపుత్రిక గోదమ్మ, ద్రావిడంలో కోదై గా పిలువబడే పేరు తెలుగునాట గోదా గా ప్రసిద్ధి నొంది, అలనాడు శ్రీరంగడిమీద అనన్యభక్తిప్రపత్తులతో తను స్వయంగా రచించి ఆలపించి అర్చించి సేవించి తరించి తరింపజేసిన ముప్పదిపాశురాలను తిరుప్పావై / శ్రీవ్రతం అనే పేరుతో భక్తలోకానికి అందించి ఆ కన్నయ్యను తను ఏవిధంగా మధురభక్తితో సేవించి తరించిందో, ఆ గొప్ప మధురభక్తిలోని మాధుర్యాన్ని భక్తలోకం కూడా అనుగ్రహంగా అందుకొని స్వామివారి అమేయ అనుగ్రహానికి పాత్రులై తరించేలా భక్తులందరికి ఒక ఎనలేని సారస్వతపెన్నిధిని అందించిన మహనీయురాలు ఆ పన్నిద్దరాళ్వారుల్లోని ఒకేఒక్క స్త్రీమూర్తి....
ద్రావిడంలో రచింపబడిన ఆ మహామహిమాన్వితమైన 30 పాశురాలను ఈ ధనుర్మాసంలో రోజుకొక్కటి చొప్పున భక్తితో పఠించి తిరుప్పావై సేవాకాలంగా స్వామివారికి నివేదించి, ఆఖరి రోజున జీవాత్మ పరమాత్మల సమ్యోగస్థితికి నిజంగా నిదర్శనంగా నిలిచిన ఆ గోదారంగనాథులు ఐక్యమైన సంఘటనను ఈ లోకం ఎప్పటికీ స్మరించి అనుగ్రహాన్ని బడసేలా మన సత్సంప్రదాయ ద్రష్టలు శ్రీగోదారంగనాథతిరుక్కల్యాణ మహోత్సవాన్ని భోగి రోజున స్థిరీకరించారు....
ఒకసారి చరిత్రను / భారతీయ సనాతనధర్మ ప్రతిపాదిత శాస్త్ర పురాణ వాంజ్మయాన్ని తిరగేస్తే,
ఇనవంశం పరంపరాగతంగా వారి పెద్దల నుండి అందుకొని అర్చింపబడి దశరథుడి వరకు వచ్చిన దివ్యమూర్తి ఆ శ్రీరంగనాథుడు.....
రావణవధానంతరం పుష్పకవిమానంలో అయోధ్యకు చేరుకొని కోసల మహాసామ్రాజ్యానికి
దశరథమహారాజు యొక్క పెద్దకొడుకు స్థానంలో ఉన్నందుకు శ్రీరాముడిని 500 నదీజలాలతో అభిషేకించి చక్రవర్తిగా వారి కులగురువులు మహర్షులు సామంతులు సచివులు ఇత్యాది వారందరు కలిసి పట్టాభిషేకం చేసిన తదుపరి, శ్రీరాముడు అప్పటివరకు సాగిన తన సుదీర్ఘప్రస్థానంలో తనకు సహాయసహకారాలు అందించినవారికి వివిధ కానుకలు / బహుమతులు అందించే సమయంలో అక్కడున్న విభీషణుడికి బహుమతిగా ఏకంగా తమ సూర్యవంశ ఆరాధ్య దైవమైన శ్రీరంగనాథుడి మూర్తిని అనుగ్రహంగా ఇవ్వడం, అంతటి మహామహిమాన్వితమైన దైవమూర్తి ఒక అసురుడికి చెంది భరతఖండం దాటి లంకకు తరలి వెళ్ళడం ఇష్టం లేని దేవతలు, గణపతి సహాయంతో ఆ మూర్తి ఇప్పటి పవిత్ర కావేరి తీర శ్రీరంగక్షేత్రంలో దక్షిణాభిముఖంగా లంకను చూస్తు అనుగ్రహిస్తూ కొలువై ఉండేలా చేసిన సంఘటనను శ్రీచాగంటి సద్గురువులు శ్రీమద్రామాయణ ప్రవచనంలో మనకు విశదీకరించి ఉన్నారు కద....
అనగా శ్రీరాముడి వరకు తరతరాలుగా
అర్చింపబడిన మూర్తి ఆ తరువాత అయోధ్య నుండి తరలి శ్రీరంగక్షేత్రానికి వచ్చి అక్కడ ఆలయంలో కొలువై అర్చాదికాలు అందుకోవడం అనే సత్యంలో, మనం గమనించవలసిన విషయం ఏంటంటే
ఒక యజమాని తను నిరంతరం అర్చించి ఆరాధించే మూర్తి యొక్క శక్తికి ప్రతిరూపమైన శక్తిసామ్యమును తను పొందుతాడు కాబట్టి, రఘువంశంలోని శ్రీరాముడి వరకు తరతరాలుగా అర్చింపబడుతూ వచ్చిన ఆ మూర్తి యొక్క ఆఖరి యజమాని శ్రీరాముడు..
అనగా శ్రీరంగనాథుడే శ్రీరాముడు...
శ్రీరాముడే శ్రీరంగనాథుడు...
అందుకే అలనాడు జనకమహారాజుగారికి నాగేటి చాలులో భూదేవి అంశలో అయోనిజగా శ్రీసీతామహాలక్ష్మి గా ప్రభవించి, శ్రీరాముడిని వరించి శ్రీసీతారాములుగా ఏ విధంగా అలనాడు త్రేతాయుగంలో ప్రత్యక్షంగా ప్రజలందరిని అనుగ్రహించారో,
అచ్చం అదే విధంగా తులసీవనంలో పెరియాళ్వారులకు అయోనిజగా శ్రీగోదాదేవిగా భూదేవి అంశగా ప్రభవించి శ్రీవ్రతాన్ని తను ఆచరించి సాటి భక్తులతో ఆచరింపజేసి తుదకు ఆ శ్రీరంగనాథుడిలోకి ఐక్యమైన ఐతిహ్యం
" ఆముక్తమాల్యద " గా భక్తుల్లెల్లరికి విదితమే....
ఈనాటి కలియుగభక్తులను అనుగ్రహించేందుకు శ్రీగోదారంగనాథుల కల్యాణం తో మకరసంక్రాంతి / ఉత్తరాయణపుణ్యకాలంతో మొదలయ్యే మాఘపంచక శుభసమయం లో వచ్చే చైత్రశుద్ధనవమి, శ్రీరాముడి జన్మదినోత్సవం నాడే , శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణమహోత్సవం
భగవద్ కల్యాణంగా ఆచరింపబడడం
ఎల్లరికి విదితమే కద...
అనగా సూర్యుడు తన రథగమనాన్ని ఉత్తమమైన ఉత్తరదిశకు మళ్ళించి దేదీప్యమానంగా వెలుగుతూ తన సకల శక్తిని ఎంతో ఘనమైన రీతిలో భూమండలానికి ప్రసరింపజేసే ప్రశస్తమైన ఉత్తరాయణపుణ్యకాలం లో మొట్టమొదట
ఆ సూర్యవంశ ఆరాధ్యమూర్తియైన శ్రీరంగనాథుడి / శ్రీగోదారంగనాథుల కల్యాణం జరిగిన తర్వాత
శ్రీసీతారామచంద్రస్వామి వారి దివ్యతిరుక్కల్యాణమహోత్సవం జరిగి భక్తులకు ఎనలేని అనుగ్రహం లభించేలా మన పెద్దలు ఏర్పాటు చేసిన సత్సంప్రదాయం నిజంగా ఎంత ఘనమైనదో కద...
ఈ కలియుగం ధనప్రధానమైన యుగం...
ఎవరు ఎన్ని బోధలు చేసినా చివరకు అన్నీ కూడా ధనంతో ముడిపడి ఉండే అంశాలే...
అది ఈ కలియుగ విచిత్రము కాబట్టే
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు తమ హుండిల్లోకి భక్తుల ధనాన్ని ఆకర్శిస్తూ వారికి పాపక్షయం గావించి పుణ్యసంచయం గావించి అనుగ్రహిస్తున్నాడు...
శ్రీవ్రతం పేరిట తిరుప్పావై నోమును భక్తులకు అందించి తద్వారా ఎనలేని సిరిసంపదలు, భోగభాగ్యాలు అనుగ్రహించే పరమదయాస్వరూపిణి శ్రీ ఆండాళ్ తల్లి....
ఆవిడ క్రీగంటిచూపులతో కూటికి కష్టపడే వారైనా సరే కోటీశ్వరులై వర్ధిల్లడం అనేది ఆ శ్రీవిళ్ళిపుత్తూర్ నివాసిని శ్రీగోదమ్మ యొక్క అనుగ్రహవిశేషం....
అది ఈ కలియుగంలో ఎందరెందరో భక్తులకు స్వానుభవపూర్వకంగా రూఢమైన సత్యం.....
" మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నిరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్...."
అంటూ ఎంతో గంభీరంగా సాగే తిరుప్పావై 30 పాశురాలు సాక్షాత్ శ్రీభూదేవి అమ్మవారి అంశలో ప్రభవించిన ఆండాళ్ తల్లి రచించి అందించడంలో, పైకి ఎంతో చక్కనైన ద్రావిడసాహిత్యంతో ఆకట్టుకునే పదబంధనాలతో కన్నయ్యను కీర్తించే ద్రావిడవేద భావగాంభీర్యంతో సాగిపోతున్నా, ఆంతరమునందు ఎన్నెన్నో శక్తివంతమైన బీజాక్షరాల సంపుటిని అనుసంధిస్తూ సదరు భక్తుడు తనకు తెలియకుండానే
ఎంతో ఘనమైన, శక్తివంతమైన బీజాక్షరార్చన గావించి భగవదనుగ్రహాన్ని బడసి తరించడం అనేది అందలి ఆంతరంగిక నిఘూడసారస్వత విశేషం..!
అందుకే అది శ్రీవ్రతమైనది....!!
అనగా శాక్తేయ ప్రణవమైన శ్రీ కారంలో దాగిఉండే అమేయమైన దైవిక శక్తిపుంజముల అనుగ్రహాన్ని
ఆ పాశురాలను అనుసంధించే భక్తుడు
అందికొని తరిస్తున్నడన్నమాట.....
ఒక శ్రేయస్కర పరిధి దాటి బీజాక్షర సంఘాతం గూర్చి విశ్లేషించకూడదని అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల ఉవాచ కాబట్టి నేను ఆ శాక్తేయ శక్తిసంఘాతాల గురించిన వ్యాఖ్యానం కాకుండా ఎవ్విధంగా అత్యంత శక్తివంతమైన ఆ బీజాక్షరాలు తమను ఉపాసించే వారికి ఘనమైన అనుగ్రహాన్ని వర్షిస్తాయో చాలా సింపుల్ గా వివరిస్తాను..
వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడంకోసం మనం సాధారణంగా చేసేది ఫస్ట్ బకీట్లో నీళ్ళు పోసి అందులో సర్ఫ్ వేసి ఆ నీళ్ళను బాగా కలిపితే అప్పుడు విపరీతంగా నురగ రావడం అనేది అందరికి తెలిసే ఉంటుంది కద...
మామూలుగా నీళ్ళలో సర్ఫ్ వేసి అట్లే వదిలేస్తే కాసేపటికి అది కరిగి నీళ్ళలో కలిసిపోతుంది....
అప్పుడు ఆ సర్ఫ్ పొడి యొక్క శక్తి గురించి పెద్దగా ఏమి తెలియదు...
ఎందుకంటే ఆ సర్ఫ్ కణముల్లో దాగిన
నురగ విస్ఫోటక శక్తి మొత్తం నీటి కణముల్లోకి ఇంకిపోయింది...
కాని
ఆ స్థితిశక్తిని ఎప్పుడుకావాలంటే అప్పుడు గతిశక్తిగా మార్చినప్పుడు, అనగా స్తబ్దుగా ఉన్న బకెట్లోని నీటిని బాగా కలియబెట్టినప్పుడు ఆ అగోచర సూక్ష్మ సర్ఫ్ కణముల విశ్వరూపం నురగ గా మనకు తెలియవస్తుంది....
మరి ఇంతసేపు అంతగా ఉన్న ఆ నురగమొత్తం ఎక్కడ దాగునట్టు..??
ఆ నీటిలోనే సూక్ష్మ రూపంలో గుప్తంగా గుంభనమై ఉన్నట్టు...కద...
అచ్చం అదేవిధంగా బీజాక్షరాల శక్తికూడా అంతే...
వాటిని అనుసంధించబడిన భక్తుడిలో / ప్రాంగణంలో / యంత్రంలో / మూర్తిలో నే సూక్ష్మ రూపంలో గుప్తంగా కొలువైఉండి ఎప్పుడు వాటిని మంత్ర / శ్లోక రూపంలో స్వరంతో యాక్టివేట్ చేస్తామో అప్పుడు వాటి శక్తిని అవి ప్రకటిస్తాయి....
కాని వాటిని తగు తర్ఫీదుతో గురువానుగ్రహంగా / దైవానుగ్రహంగా విజ్ఞులైన వారు మాత్రమే ఉపయోగించవలెను....లేనిచో వాటి శక్తిని హాండిల్ చేయడం రగులుతున్న నిప్పు కణికలతో చెలగాటంలా ఉంటుంది...
ఎందుకంటే బీజాక్షరాలు అనేవి లెటర్స్ ప్రెగ్నంట్ విత్ సౌండ్...
అవి ఎంత సౌండ్ అనేవి వాటిని ఉపయోగించే సదరు వ్యక్తి యొక్క
ఉపాసనాబలం,
ఉపయోగించబడే తీరు,
ఉపయోగించడానికి గల కారణం,
ఉపయోగించిన తదుపరి ఆ శక్తిని అందిపుచ్చుకునే మాధ్యమం,
ఇత్యాది గా ఎన్నెన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది...
శ్రీఆదిశంకరాచార్యుల వంటి మహామహిమాన్విత ఉపాసనా బలం కల వ్యక్తులచే అనుసంధించబడే బీజాక్షరాలు కొన్ని వేల సంవత్సరాల పర్యంతం వాటి శక్తితో యావద్ ప్రపంచంలోని సంపద తమ వద్దకు ఆకర్షించబడేలా తమ శక్తిని నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి....
తిరుమలలో స్వామి వారి ఆనందనిలయ ప్రాకారంలో కుబేర స్థానంలో ఉత్తరాన కొలువైన హుండీల క్రింద భూభాగంలో కొలువైన అత్యంత శక్తివంతమైన శ్రీచక్రోపరి బీజాక్షరసంపుటివలె అన్నమాట...
ఇంకా చాలా సింపుల్ గా చెప్పాలంటే
తమ ఆశ్చర్యకరమైన విస్త్రుత విస్ఫోటక శక్తిని సంక్షిప్తం గావించుకొని ఒక 15 కేజీల బరువులుగల ఎల్.పీ.జి సిలిండర్లో కొలువైన లిక్విఫైడ్ పెట్రోలియం గాస్ యొక్క కణముల శక్తివలె అన్నమాట
...
అవి ఒక పద్ధతిగా జాగ్రత్తగా భక్తితో ఉపయోగిస్తే రోజు పప్పు చారు అన్నం వండుకోవడానికి ఉపయోగించుకోవచ్చు....
అజాగ్రత్తగా లేదా కావాలని మరో విధంగా ఉపయోగిస్తే ఎంతటి కట్టడాన్నైనను ధ్వంసం చేయగల శక్తి విస్ఫోటక సముదాయం...
(రాం సినిమాలో విలన్ డెన్ ని ఒక్క గాస్ సిలిండర్ తో హీరో ధ్వంసం చేసినట్టుగా అన్నమాట..)
అంతటి విస్ఫోటక శక్తిని తమలో ఒడిసి పట్టిన ఒక సిలిండర్ని మనకు ఒక రెగ్యులేటర్ సహాయంతో కట్టడిచేయబడిన నియమిత విధానంతో ఉపయోగించుకునేలా ఎట్లైతే మన ప్రభుత్వాలు మనకు వంట కోసం అందిస్తున్నాయో,
అచ్చం అట్లే మన సనాతనధర్మశాస్త్ర / మంత్రశాస్త్ర / తంత్రశాస్త్ర / యంత్రశాస్త్ర / యోగశాస్త్ర నిపుణులు ఆ బీజాక్షరాల శక్తిని తమ స్తోత్ర / శ్లోక / సారస్వతాల్లోకి ఒడిసిపట్టి వాటిని ఒక నియమిత శ్రేయస్కర పద్ధతిలో మనం ఉపయోగించి లబ్ధి పొందేలా అనుగ్రహించారు.....
దూసుకొచ్చే ఎంతటి వాహన ప్రమాదమైనా సరే అక్కడికక్కడే కట్టడి చేయబడి భక్తులకు ఇబ్బందికలగని రీతిలో వాహనాల యొక్క రాకపోకల శక్తి నిలువరించబడేలా అత్యంత శక్తివంతమైన శాక్తేయ బీజాక్షర కవచాన్ని మనం తిరుమల మోకాళ్ళ పర్వతం ఎక్కేముందు గోపురం ఎదురుగా ఉన్న మలుపులో శాక్తేయ మంత్ర శాస్త్ర కోవిదులు ఏర్పాటు చేయడం అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకునే భక్తులందరికి విదితమే కద....
ఇవ్విధంగా బీజాక్షరాల శక్తి ఇంతని అంతని ఎవ్వరు వర్నించలేనిది...
అది ఎంతటి కార్యమునైనను సాధించిపెట్టగల వైశ్విక శక్త్యానుసంధాయక ఎదురులేని సనాతన శాక్తేయ వ్యవస్థ....
ఒక్కో బీజాక్షరం, తత్ సామ్యము గల ఒక్కో బీజాక్షర సంపుటి ఒక్కో లౌకిక ప్రయోజనానికి ఉపకరించే విధంగా మన మహర్షులు / శక్తి ద్రష్టలు సువ్యవస్థీకరించారు....
అటువంటి వాటిలో సిరిసంపదలను వర్షించే శ్రీకార సామ్యము గల అనేకానేక బీజాక్షర మంత్ర రూప శ్లోకాలుగా ఉండే తిరుప్పావై పాశురాలను / శ్లోకాలను భక్తులెల్లరు శ్రద్ధగా పఠించి భగవదనుగ్రహానికి పాత్రులై తరించెదరు గాక...
తిరుమల అలిపిరి కాలిబాట ప్రారంభంలోనే స్వామివారి మహిమాన్విత పాదాలమండపం పక్కనే ఉన్న శ్రీలక్ష్మీనారాయణస్వామి వారి ఆలయంలో కొలువైన ఆ అమేయదయాస్వరూపిణి శ్రీఆండాళ్ తల్లి శ్రీశ్రీనివాసుడి భక్తులెల్లరిని సకల సిరిసంపదలతో భోగభాగ్యాలతో అనుగ్రహించి చల్లగా కాపాడుగాక....😊
ఆండాళ్ దివ్య తిరువడిఘళే శరణం....🙏
ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం....🙏
No comments:
Post a Comment