Monday, January 25, 2021

శ్రీ పుష్య శుద్ధ ద్వాదశి / కూర్మ ద్వాదశి వ్రత పర్వదిన శుభాభినందనలు....😊🍨🍕🍟


శ్రీ పుష్య శుద్ధ ద్వాదశి / కూర్మ ద్వాదశి వ్రత పర్వదిన శుభాభినందనలు....😊🍨🍕🍟

శ్రీమహావిష్ణువు దాల్చిన ప్రశస్తమైన దశావతారాల్లో వచ్చే రెండవ అవతారం కూర్మావతారం...
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి 

" మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ "
అనే సంకీర్తనలో మనకు ఆచార్యుల సప్రామాణిక నామక్రమంలోని

శ్రీమత్స్యావతారం
శ్రీకూర్మావతారం
శ్రీవరాహావతారం
శ్రీనారసిమ్హావతారం (మనుష్యసిమ్హం)
శ్రీవామనావతారం
శ్రీభార్గవరామావతరం (ఇచ్చ రామ - పరశురాముడు)
శ్రీరామావతారం
శ్రీకృష్ణావతారం (బలరామహితుడు) 
శ్రీబుద్ధావతారం
శ్రీకల్క్యావతారం
( కాశ్మీర దేశంలో విష్ణుయశుడు అనే  
బ్రాహ్మణోత్తముడి ఇంట జన్మించి దుష్టులను చీల్చి చెండాడి కలి యొక్క ఘోరకలిని రూపుమాపే భవిష్యావతారం )

ఈ ప్రముఖ 10 అవతారాల్లో అత్యంత ప్రశస్తమైనది రెండవదైన శ్రీకూర్మావతారం....

తన భక్తుడిపైకి ఆవేశంతో విరుచుకుపడే క్రమంలో దూర్వాసోమహర్షి అంబరీష చక్రవర్తికి ఇచ్చిన శాపవాక్కులన్నీ కూడా తను స్వీకరించి, వాటిని లోకకల్యాణార్ధం దశావతారాలుగా శ్రీమన్నారాయణుడు స్వీకరించడం మరియు తద్వార ఈ లోకానికి అందివ్వబడిన శ్రేయస్సు అనుగ్రహం భక్తులకు విదితమే....

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాంతర్గత
క్షీరసాగరమధన వృత్తాంతాన్ని ఆలంబనగా గావించి ఆ శ్రీకూర్మనారాయణుడి వైభవాన్ని కొంత వివరించే ప్రయత్నంగావిస్తాను....

ఈ దశావతారాలు కూడా శ్రీమహావిష్ణువు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క నిర్దేశిత దేవకార్యానికి అనగా
శిష్టరక్షణార్ధం దుష్టశిక్షణార్ధం స్వీకరించడంలో
ఒక్కొక్క విశేష ఐతిహ్యం ఉండడం చాలామంది భక్తులకు విదితమే....

కాని ఈ అవతార క్రమాన్ని ఒకసారి జాగ్రత్తగా పరికిస్తే
డార్విన్ ఎవల్యూషన్ థియరి కి దర్పణం పట్టే రీతిలో ఉండడం అనేది లౌకిక విశేషమైతే, తత్త్వతః ఆ క్రమంలో ఎన్నెన్నో జ్ఞ్యాన విశేషాలు ఉండడం అధ్యాత్మ ప్రత్యేకత....

మత్స్యనారాయణుడిగా జ్ఞ్యాన రక్షకుడిగా ( సోమకాసురుడు తస్కరించిన వేదరాశిని రక్షించడంలో ) మొదలుపెట్టి,
క్రమక్రమంగా....

ఆ అమేయ అపౌరుషేయ వేద జ్ఞ్యానాన్ని ఆలంబనగా ఈ లోకానికి అందించి.....,

శ్రీకూర్మనారాయణుడిగా ఈ ప్రపంచం ఇప్పుడు అనుభవిస్తున్న సకల ఐహిక సంపదకు మూలమైన క్షీరసాగరమధనమనే అనితరసాధ్యమైన మహాశ్చర్య కార్యక్రమానికి తను మూలమై...,

ఆ తదుపరి తనచే దత్తమైన సకల సంపదలతో తులతూగే ఈ యావద్ భూమండలానికి లౌకికంగా రక్షకుడు కూడా తానే అని శ్రీభూవరాహమూర్తిగా ఈ లోకానికి చాటిచెప్పి...., 

ఆ తదుపరి తన అనుగ్రహమైన ఈ లౌకిక సంపత్తుతో సుఖజీవనం సాగిస్తూ తనే సర్వస్వంగా భావించి సేవించి జీవించే భాగవతోత్తములను ఇబ్బందులకు గురిచేసే వారిని కౄరాతికౄరంగా ఛీల్చిచెండాడి బుద్ధిచెప్పేది కూడా తానే అని శ్రీఉగ్రనారసిమ్హుడిగా ఈ లోకానికి నిరూపించి....., 

ఆ తరువాత తన అనుగ్రహమైన లౌకిక సంపత్తును ఆర్జించి తమకంటే గొప్పవారేలేరనే గర్వంతో బ్రతికే వారు తన భక్తుల సంతతికి చెందినవారైనా సరే ఒక్క దెబ్బ కూడా వెయ్యకుండా, ఒక్క కఠినమైన మాట కూడా మాట్లాడకుండ సామ దాన భేద దండోపాయాల్లోని దాన మార్గాన్ని ఉపయోగించి అమూలాగ్రం హరించి వేసి
యావద్ విశ్వాన్ని 3 అడుగుల కొలతతో 
తన వశంచేసుకొని ఈశ్వరుడి వశంకానిదంటూ ఈ విశ్వంలో ఏది ఉండజాలదు అని నిరూపించే శ్రీవామనమూర్తిగా ప్రభవించి.....

ఆ తదుపరి లోకపాలకులు తన అనుగ్రహమైన సంపదకు రక్షకులుగా కాక కేవల భక్షకులుగా, సాధుసత్పురుష హింసకులుగా మారితే
జ్ఞాన భూమిక నుండి కర్మభూమికకు ఆవేశంతో తను దిగివచ్చిన నాడు ఎంతటి కండలుతిరిగిన యోధుడి తలైనాసరే తన గండ్రగొడ్డలి వేటుకి తెగిపడవలసిందే అని 32 సార్లు భూప్రదక్షిణం గావించి 
ఎందరెందరో దుష్టపాలకులను వధించి తన సత్త్వగుణప్రధాన తత్త్వాన్ని తక్కువగా అంచనా వేసి అవమానించిననాడు తన రజోగుణ ఆక్రోషం ఎంతటి తీవ్రమైనదో ఈ లోకానికి చాటిచెప్పి.....,

ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో స్వయంప్రేరేపిత
స్వరపేటికతో లెక్కలేనన్ని మాటలు మాట్లాడగల ఎకైక ప్రాణిగా ఉండే మనుష్యుడి యొక్క గొప్పదనమెట్టిదో,
నరవానరులు నన్నేంచేయగలరులే అనే పొగరుతో విర్రవీగిన ఒక రాక్షసాధముడికి, సర్వసులక్షణశోభిత క్షత్రియుడి భుజబలమెట్టిదో తన కోదండంతో ఈ లోకానికి చాటిచెప్పిన ధర్మమూర్తిగా శ్రీరామచంద్రుడిగా 
సూర్యవంశఖ్యాతిని ఆచంద్రతారార్కం సమున్నతంగా నిలిపి మానవుడిగా జన్మించి మాధవుడిగా మారిన తన ఘనమైన జీవిత వృత్తాంతం శ్రీమద్రామాయణ ఇతిహాస మహాకావ్యమై సకల సిద్ధిదాయక సాహిత్య చింతామణి గా, సారస్వత కల్పతరువుగా ఈ లోకంలో శాశ్వతత్వాన్ని గడించిన నేపథ్యాన్ని అనుగ్రహించిన శ్రీరామావతారం తో ఈ సనాతన కర్మ భూమి యొక్క ప్రత్యేకతను మహిమ్నతను లోకానికి అందించి....

ఆ తరువాత పరిపూర్ణావతారమైన
శ్రీకృష్ణావతారంతో తననే నమ్ముకుని జీవించే వారికి, యావద్ ప్రపంచమే ఎదురుగా నిలిచినా సరే  తనను ఆశ్రయించినవారికి విజయాన్ని సిద్ధింపజేసి తీరడమే తన భక్తరక్షణా వైచిత్రి అని కురుక్షేత్రమహాసంగ్రామంలో చాటిచెప్పిన కారుణ్యమూర్తిగా శ్రీకృష్ణపరమాత్మగా ఈలోకానికి తన జ్ఞ్యాన సింధువును శ్రీమద్భగవద్గీత గా అందించి భక్తులను తరింపజేసిన ఘనదైవంగా ప్రభవించడం....

ఇవ్విధంగా పరమాత్మ తన ఒక్కొక్క అవతారంలో ఒక్కొక విశేషమైన తత్త్వసందేశాన్ని కూడా అనుగ్రహిస్తూ పరిఢవిల్లిన క్రమంలో రెండవదైన శ్రీకూర్మనారాయణుడి ప్రాముఖ్యత చాల విశేషమైనది....

మనం ఎప్పుడూ ఈ క్రింది వాటిని పెద్దగా పట్టించుకోము కాని వీటన్నికి తన శ్రీకూర్మనారాయణుడి అవతారమే మూలకారణం అనేది మనకు క్షీరసాగర మధనవృత్తాంతం తెలిపరుస్తుంది...

జీవులకు మనోశక్తిని, సస్యములకు ఓషధీ శక్తిని, షోడశ కళలతో ఉండే సకల దేవతా అనుగ్రహకారకములకు, మూలభూతమైన చంద్రుడు ఎక్కడి నుండి వచ్చాడు...?
( క్షీరసాగరంలో తన ఉనికిని లయింపజేసుకున్న తదుపరి పునఃప్రభవించడం )

దేవతల అమృతాన్ని పక్కనపెడితే,
ఆ అమృతతుల్యమైన కమ్మని దేశవాళి ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వాటితో తయారుచేయబడే స్వీట్లు, సున్నుండలు మొదలైనవన్నీ మనం హాయిగా తినడానికి మూలకారణం అయిన ఆవు ఈ బ్రహ్మ సృష్టిలోని ప్రాణికాదు....క్షీరసాగరమధన జనిత కామధేనువు సురభి యొక్క సంతతి..!

అందుకే ఆవును " గావః విశ్వస్యమాతరః " అని పూజించి పరదేవతగా ఆరాధించేది....

శ్రీచాగంటి సద్గురువులు పలుమారు నుడివినట్టుగా

గజ పూజ పశుపూజ అవ్వొచ్చు...
అశ్వ పూజ పశుపూజ అవ్వొచ్చు...
కాని గోపూజ ఎప్పటికీ పరదేవతా పూజయే..!

బాగా తిని పెంచిన ఒళ్ళుకి ఇబ్బంది కలిగినప్పుడు అవసరమైన సకల ఔషధ సేవలకు మూలపురుషుడిగా
ఆరాధించబడే శ్రీధన్వంతరి దేవతావిర్భావానికి కారణం కూడా క్షీరసాగరమధనమే....
ఇవ్వాళా మనం వేసుకునే ప్రతీ టాబ్లెట్ కూడా మనకు స్వస్థత కలిగిస్తుందంటే అది ఆ ధన్వంతరీదేవతానుగ్రహమే కద...

ఊర్ధ్వ లోకాలైన దేవతా లోకాలకే పరిమితమైన
కల్పతరువు, ఐరావతం, అమృతం, ఉఛ్ఛైశ్రవం, ఇత్యాదివన్నీ పక్కనపెడితే, సిరులతల్లి శ్రీమహాలక్ష్మిని తన ఎదపై నిలిపి మనం ప్రార్ధించిన సకల సంపదలను
అనుగ్రహిస్తూ శ్రీ కి నివాసుడిగా శ్రీనివాసుడిగా నారాయణుడు విరాజిల్లడానికి కారణం ఆ క్షీరసాగర తనయగా కీర్తించబడే శ్రీమహాలక్ష్మి ఏ కద.... 

ఉమాపతిని రమాపతి వేడుకొవడంతో క్షీరసాగర జనిత హాలాహలం లోకాలను దహించివేయకుండా తన కంఠమునందు ఒడిసిపట్టి శ్రీకంఠుడిగా ఆ భోలాశంకరుడు మనలను అనుగ్రహించడానికి కారణం కూడా శ్రీకూర్మనారాయణుడే కద...

( ఆ లోకభీకరమైన హాలాహలాన్ని
శివుడు ఒక చాక్లేట్ లా చుట్టచుట్టి కంఠంలో మాత్రమే ఎందుకు బంధించాడు..? జుట్టులోనో లేదా మరెక్కడైన బంధించిపెట్టొచ్చు కద..?
ఈ హాలహలభక్షణం తో శివుడు శ్రీకంఠుడిగా మారడంలో గల విశేషమేంటో హరుడి అనుగ్రహంగా ధ్యానసిద్ధిలో చాలమంది సాధకులకు అందే ఉంటుంది....అది శ్రీమహాశివరాత్రి కి రాసే పోస్ట్లో డిస్కస్ చేద్దాం...)

ఇవ్విధంగా అసలు మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో అనుభవిస్తున్న సంపదలన్నిటికీ కూడా మూలకారణం ఆ క్షీరసాగరమధనం....
అది దేవదానవ పరస్పరసంఘీభావంతో చక్కగా జరగడానికి మూలకారణం మరియు మూలసాధనం ( తను శ్రీమహాకూర్మావతారాన్ని దాల్చి 
కవ్వంగా ఉపయోగించబడిన ఆ మందరగిరిని క్షీరసాగరంలో మునిగిపోకుండా తన వీపుపై మోసినందువల్లే కద ఆ మధనం మనకు సకాలార్ధసాధనమై ఒప్పారింది....)

కాబట్టి ఈ శ్రీమహాకూర్మావతారం తో శ్రీకూర్మనారాయణుడిగా ఆ మహావిష్ణువు లోకానికి అందించినది అంతని ఇంతని వర్నించలేనంతటి అనుగ్రహం...

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలో బహుచిత్రంగా 

" అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు..." 

అని ఆచార్యులు చమత్కరించడం గమనించవచ్చు...

ఈ భూమండలంపై గల సకల మనుష్యకోటి తరించాలని అన్నమాచార్యుల వారు సంకీర్తనలు మనకు అందించారు కద...

క్షీరసాగరం ఉన్నది శ్రీవైకుంఠ ప్రాకారాల్లో ఐతే, దేవదానవులంతా కూడా ఇరుజట్లుగా
చేరి అక్కడ క్షీరసాగరమధనం గావిస్తే....

సకల శాస్త్ర పురాణ వాంగ్మయాన్ని తమ మేధో మండలంలో ఒడిసిపట్టిన అన్నమాచార్యుల వారు మరి మనుష్యులను వెళ్ళి పాతాళలోకంలో వెతికితే మీకు శ్రీకూర్మనారాయణుడు కనిపిస్తాడు అని చెప్పడంలో ఆంతర్యమేమి...??

ఇందలి తత్త్వసామ్యమును పరికిస్తే మనకు ఆ శ్రీకూర్మనారాయణుని వైభవం గోచరమై భగవద్ అనుగ్రహానికి పాత్రులమై తరించేది....
ఓహో ఇంతటి ఘనమైనదా శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి సరళ సాహిత్యాంతర్గత భావగాంభీర్యం అని ఆ పదకవితాపితామహులకు పరిపరివిధముల ప్రణతులర్పించి తరించేది....

ప్రతీ పదబంధనానికి గల లౌకికం, పారమార్ధికం అనే ఇరు దృక్కోణాల్లో పరిశీలన గావించబడినప్పుడు ఆ సారస్వత ప్రతిపాదిత తత్త్వ గాంభీర్యత భావగ్రాహ్యమై మనలను అనుగ్రహిస్తుంది.....

శాస్త్రోక్త పూజా క్రతువులు నిర్వహించబడే ఆలయాల్లో పఠించబడే మహాసంకల్పంలో చెప్పేట్టుగా

1. సత్యలోకం
2.తపోలోకం
3.జనోలోకం
4.మహర్లోకం
5.సువర్లోకం
6.భువర్లోకం
7.భూలోకం

8.అతల
9.వితల
10.సుతల
11.తలాతల
12.రసాతల
13.మహాతల
14.పాతాళ

అనేవి మన సనాతన ధర్మశాస్త్ర వాంగ్మయమునందు ఉటంకించబడిన చతుర్దశభువానాలు.

ఇందులో ఆఖరిది పాతాళ లోకం...
అనగా అత్యంత క్రింది స్థాయిలో
తిర్యక్కులు ఉండేది ఈ 14 వ తలం / ప్రపంచం లో....

వీటి యొక్క లౌకిక ఉనికి గురించి ఉండే వివిద వాదోపవాదాలు కాసేపు పక్కనపెడదాం....
( " ఇన్ని లోకాలున్నయని ఎలా నమ్మేస్తామండి....ఏదో పెద్దలు చెప్పారు అంటూ ఈ సైన్స్ యుగంలో
కూడా అన్నీ చాదస్తాలు, మూఢనమ్మకాలు..."  అంటూ మూతులుతిప్పే మూర్ఖులకు ఎన్ని చెప్పినా దండగే...
ఎందుకంటే చెప్తే వినరు....చెప్పినా
నమ్మరు... సొ అలాంటి వాళ్ళ గురించి పెద్దగా మన శక్తియుక్తులను వేస్ట్ చేసుకోవడం శుద్ధదండగ...

వాటి ఉనికి గురించి ఆసక్తి గల వారికి మనచుట్టూ ఉండే పాంచభౌతిక ప్రపంచంలోనే ఉన్న ఎన్నో అనుసంధాయక మార్గాలను మన పెద్దలు మనకు చెప్పిఉన్నారు....

కర్ణాటక లోని కుక్కే / కుక్షి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి సమీపంలో ఉన్న "వాసుకి గుహ" అనే 
పెద్ద బిల మార్గంలో సాహసం చేసి ప్రయాణించగలము అని అనుకునే వారు ఈ అధోలోకాల గురించి నిజంగా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు....

కాని అంతటి మొనగాడు ఈ లోకంలోనే లేడు అనేది పెద్దలు చెప్పిన మాట....
ఎందుకంటే ఎంతటి సాహసవంతుడైన కండలుతిరిగిన ధీరుడైనా సరే మనుష్యుడే కాబట్టి, మనుష్య ఉపాధికి ఉండే పరిమితి వల్ల ఆ అధోలోక ప్రయాణం కుదరనిది....

మనుష్యుడి ఊపిరితిత్తులకు కావలసినంత ప్రాణవాయువు అందదు....
కంటికి కావలసినంత కాంతి ఉండదు....
ఆ సన్నని ఇరుకైన మార్గాల్లో నేల పైన నడుచుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళడం కుదరదు....
ఆ బిలాల్లో ఆవరించి ఉండే అత్యంతవిషపూరిత వాయువులను మానుష శరీరం సహించజాలదు...

మరి ఇన్ని పరిమితులు ఉండగా ఎవ్విధంగా
ఒక మనిషి అక్కడికి వెళ్ళి ఆ లోకాలు ఉన్నాయని ఫోటోలు తీసిపంపితేనే నమ్ముతాము అని అనగలరు...?

కాబట్టి మనుష్యోపాధి ద్వారా వాటిగురించిన సామాచారం పొందడం అసంభవం....

కాబట్టి ఇక మిగిలిన మార్గాలు రెండే...

ఒకటి ధ్యానమార్గంలో....
ఇంకోటి యోగమార్గంలో....

ధ్యానమార్గ ప్రయాణానికి ఉపాసనా/సాధనా బలం కావాలి....
యోగమార్గ ప్రయాణానికి సిద్ధి బలం కావాలి....

ఊర్ధ్వ లోకాలకు కూడా ఈ మార్గాల్లో చేరుకోవాలంటే వీటికి తోడుగా పుణ్యబలం కూడా కావాలి...!

( పాండవాగ్రేసరుడైన ధర్మరాజంతటి వారైతే స్వర్గానికి సశరీరంగా కైలాసపర్వతం దెగ్గరుండే ఊర్ధ్వలోక మార్గంలో ప్రయాణించి చేరుకోవచ్చు గాని....మనలాంటి వారైతే ఆ చలికి ఒళ్ళంత కొయ్యబారి ఆ మంచులో మంచుబొమ్మగా మారిపోతాం...)

కాబట్టి వీటి ద్వారా ఒక మనుష్యుడు భూమండలం కాని ఆ ఇతర 13 లోకాల గురించి మరియు వాటన్నిటిపై ఉండే అత్యున్నతమైన గోలోక స్థిత రాధికాహృదయేశ్వరుడైన గోపాలుడి గురించి, కేవల ఈశ్వరానుగ్రహంగా మాత్రమే తెలుసుకొనగలిగేది....

మనుష్యుడి ఓవర్ యాక్షన్లు కాకపోతే,
మన చుట్టూ ఉన్న సమసమాజంలోనే ఉండే కొందరు మనుష్యులకు వారి వారి పెద్దల ద్వారా సమకూరిన కోటానుకోట్ల సంపదను దాచి ఉంచబడిన అత్యంత దుర్భేద్యమైన గృహాంతర్గత కట్టడాల్లోకే ( బంకర్ల లాంటివి అన్నమాట ) వారి అనుమతి లేకుండా వెళ్ళలేమే...
అటువంటిది ఈశ్వరానుగ్రహం వినా ఈశ్వరసృష్టిలోని ఈ విశేషలోకాలన్నిటిని ఒక మంత్లి పాస్ లాంటిది ఎదైనా ఉంటే కొనుక్కొని ప్రయాణించి చూసినతదుపరి మాత్రమే నమ్ముతాము అని అనడం ఎంత విడ్డూరం..!

కాబట్టి ఇక అసలు విషయానికి వస్తే,
వివిధ ధ్యాన స్థితుల్లో మనుష్యుడికి వీటి గురించిన అవగాహన ఏర్పడే క్రమంలో,
అనగా శ్రీవేంకటేశ్వరుడి శ్రీచరణాలను ధ్యానించే చిత్తానికి ఆ పాతాళ లోకమంతటి లోతైన స్థాయిలో కూడా పరివ్యాప్తమై ఉండే శ్రీమన్నారాయణుని దివ్యవిభూతులు దర్శనీయమవుతాయి అనేది అందలి తాత్విక సమన్వయం...

మత్స్య, కూర్మ ప్రాణులు వాటి సంతతిని 
(అనగా వాటి అండములను / గుడ్లను) తమ దృక్కులతోనే పోషించి పిండములుగా అనగా ప్రాణులుగా మార్చే శక్తికలవు అనే విషయం గురించి వినే ఉంటారు...

కాబట్టి మీన దృక్కులలా కూర్మ దృక్కులు కూడా శక్తివంతమైనవి....

మరియు తాబేలుకు ఒక ప్రత్యేకత కలదు.....
అవసరమనిపిస్తే తన శరీరం మొత్తాన్ని తన వీపు పైన ఉండే డిప్ప లాంటి కవచంలోకి లాక్కొని బయటికి చూడ్డానికి కేవలం ఒక రాయిలా / జడంలా కనిపిస్తుంది...దాని డిప్పపై ఎంత బరువేసినా ఏమి 
పట్టనట్టుగా ఉండగలుగుతుంది....

అలా ముడుచుకున్నంక తనకు ఇష్టమొచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ 4 పాదాలను మరియు తలను బాహిరప్రకటనం గావించి మెల్ల మెల్లగా ముందుకి సాగిపోతుంటుంది...

అచ్చం అదే విధంగా... ఒక కూర్మశైలిలో...

ఈ పాంచభౌతిక ప్రపంచమనబడే  
మాయకు పైన ఉండే తన శక్తిని ఎరుకపరచాలంటే,
మన పంచేంద్రియ సంఘాతమైన స్థూలతనువు యొక్క అలజడులన్నీ సమసి అవన్నీ మెల్ల మెల్లగా ఆంతరమున కుదురుకునే ఆ ధ్యాన స్థితిలోకి లాక్కొనబడిన తదుపరి మన ఆంతర జ్ఞ్యాన నేత్రమునకు వాటన్నిటిని అనుగ్రహంగా ఎరుకపరిచి అనుగ్రహిస్తుంటాడు...

ఊపిరిని నియంత్రించించే వివిధ ప్రాణాయామ సాధనలపైనే ధ్యానస్థితి యొక్క దృఢత్త్వం ఆధారపడి ఉంటుంది.....

ఒక తాబేలు తన ఊపిరిని ఎంత పొదుపుగా వాడుకుంటుందో ఆ తాబేలు యొక్క జీవన శైలిలోనే మనకు అర్ధమైపోతుంది.....

కొన్ని కొన్ని తాబేల్లైతే 200 సంవత్సరాలకు పైగా కూడా బ్రతికి ఉండడం అప్పుడప్పుడు న్యూస్ లో వింటుంటాం కద....

కాబట్టి తాబేలు ద్వారా ఆ ధ్యాన స్థితి యొక్క గొప్పదనాన్ని మనం నేర్చుకోవచ్చు....

ఇవ్విధంగా శ్రీకూర్మావతారాన్ని దాల్చి ఆ కూర్మనారాయణుడు లోకానికి అందించిన అనుగ్రహం ఎంతో ఘనమైనది.....

ఈ కలియుగ జీవనప్రమాణానికి సరిపడేలా ఉండే మిని శ్రీకూర్మాలను చూడాలంటే ఎప్పుడైనా చీర్యాల శ్రీలక్ష్మీనారసిమ్హస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం వెలుపల టాంక్లో ఉండే ముచ్చటైన తాబేళ్ళను చూసి ఆనందించండి.....వాటికి ఉండే తిరునామంతో అవి చూడ్డానికి ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి...😊

ఇంతటి విశేషమైన పర్వదినమైన 'శ్రీకూర్మ ద్వాదశి వ్రత పర్వదినం' / ( శ్రీ ప్రభవ పుష్య శుద్ధ ద్వాదశి / ఆ సంవత్సరం నాటి తిరుమల శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి / వైకుంఠ ద్వాదశి పర్వదినం ) / నా చాంద్రమాన జన్మతిథి కూడా కావడం ఆ ఈశ్వరుడి నిర్హేతుక కరుణాకటాక్ష విశేషం.....!

శ్రీకాకులం లోని ఆ ప్రశస్తమైన శ్రీకూర్మనాథ దేవాలయ దర్శనం త్వరలోనే నాకు ఈశ్వరుడు అనుగ్రహించుగాక అని ఆకాంక్షిస్తూ...

21 వ పడినుండి నా జీవితంలోకి హనుమద్ అనుగ్రహంగా ప్రవేశించిన ఒక సద్గురు కంఠం ఆ తదుపరి కొంతకాలానికి శ్రీమద్రామాయణాంతర్గతమైన
గంగావతరనం / షణ్ముఖోత్పత్తి ప్రవచనాలతో నా జీవితంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించి, ఆ తదుపరి ఎన్నో సార్లు ప్రత్యక్షంగా ఆ శ్రీపాదాలకు (చుట్టూ ఉన్న మరెందరో శిష్యభక్తులతోపాటుగా) నమస్కరించే భాగ్యం పొంది, ఆ వాక్కునే నా జీవితాంతర్భాగమైన ఒక దివ్యమైన దైవిక పెన్నిధిగా ప్రసాదించిన ఈశ్వరుడికి మరియు ఆ ఈశ్వరుడితో అభేదమైన అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ......
🙏🙏🙏🙏🙏🙏💐
ఆదిమధ్యాంత రహితుడైన ఆ శ్రీకూర్మనారాయణుడికి 
శ్రీకూర్మ ద్వాదశి వ్రత పర్వదిన శుభాభినందనలు
మరియు 35వ పడిలోకి అడుగిడిన నా తనువుకు
హ్యాపి బర్త్డే విషెస్......😊🍟🍕

********** ********** ********** **********
ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||

మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||

పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు || 
********** ********** ********** **********


No comments:

Post a Comment