Saturday, February 27, 2021

శ్రీశ్రీనివాసమగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వీడియో...🙏😊

శ్రీశ్రీనివాసమగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వీడియో...🙏😊

"శ్రీవారి మెట్ట్ల మార్గం" నుండి తిరుమలకు చేరుకునే చంద్రగిరి మెట్లదారి త్రోవన తిరుమలకు చేరుకునే వారికి సుపరిచితమైన పురాతన ఆలయం మరియు ఇతర చాలా మంది శ్రీవారిభక్తులు వారి వారి తిరుమల యాత్రలో తప్పకుండా దర్శించే ఆలయం శ్రీనివాసమంగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామి వారి ఆలయం...

సదాచార సంపన్నులైన పెద్దలు చెప్పేదానిప్రకారంగా

1. తిరుపతి తాళ్ళపాక గంగమ్మ తల్లి ఆలయం.....
( తిరుపతి బస్టాండ్ కి దెగ్గర్లో)

2. తిరుచానూరు / అలర్మేల్మంగాపురం
లోని శ్రీపద్మావతీదేవి ఆలయం....

3. కపిలతీర్థం దెగ్గరి శ్రీకపిలేశ్వరాలయం.....

4. గోవిందరాజస్వామి ఆలయం...
( మరియు ఆ ఆలయ పరిసర అన్ని ఉపాలయాలు..)

మరియు

5. శ్రీనివాసమంగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయం....

ఈ ఐదు ఆలయాలు కూడా తప్పకుండా ఒక్కసారైనా తిరుమల శ్రీవారి దర్శనం తో పాటుగా దర్శించుకోవడం అత్యంత శుభప్రదం అని....

ఎందుకంటే ఇవన్నీ కలిపి శ్రీవేంకటాద్రిపై ఉన్న తిరుమల ఆలయానికి గల ఒక పెంటాగొనల్ రక్షకవ్యవస్థ లాంటివి అన్నమాట....

అనగా ఒక 3D పెంటగాన్ యొక్క 5 కొసలను కలుపుతూ ఉండే రక్షణ కవచాన్ని అనుసంధానిస్తూ ఊర్ధ్వమున ఉండే శ్రీవేంకటనిలయంలోని  శ్రీశ్రీనివాస పరమాత్మ మరియు తన యెదపై కొలువైన వ్యూహలక్ష్మీ అమ్మవారు ఒక దివ్యమైన దైవిక వ్యవస్థలోకి తమ భక్తులను అనుసంధానపరిచి విశేషమైన అనుగ్రహాన్ని వర్షించి ఆనందిస్తూంటారు...

పంచకోణాల పెంటగాన్ అమేయమైన శక్తినిలయం....

అమెరికా సమ్యుక్త రాష్ట్రాల రక్షణ కవచం మొత్తం వారికి గల పెంటగాన్ ( Pentagon : The abode of all the USA Security Units ) అనే పంచకోణాత్మక బిల్డింగ్ నుండే ప్రసరించబడుతూ ఉండడం ఎల్లరికి తెలిసిందే కద....

వాళ్ళది భౌగోళిక పెంటగాన్ అనే కట్టడం నుండి వెలువడే రక్షణ కవచం....

ఇక్కడ మన తిరుమలది ఒక దైవిక పెంటగాన్ నుండి ప్రోది గావించబడే అధ్యాత్మ జీవరక్షణ వ్యవస్థ.....

కేవలం భౌతికవాదం గురించి మాట్లాడే వారి గురించి నేను పెద్దగా ఏమి మాట్లాడను కాని,

భౌతికతను ఆధ్యాత్మికతతో అనుసంధానించి విశ్వసించే వారికి తెలిసినట్టుగా...

తిరుమల అనేది కేవలం ఈ భూమండలం పై గల మరొక పర్వతప్రాంతం మాత్రమే కాదు...

అది అప్రాకృతం...

అది శ్రీవైకుంఠ గత క్రీడాద్రి...

అది ఆదిశేషుడి / వాయుదేవుడి ద్వారా శ్రీవైకుంఠం నుండి భూలోకానికి శ్రీహరి అనుగ్రహంగా రప్పించబడిన శ్రీవేంకటాద్రి.....

కాబట్టి ఈ భూతలానికి ఉండని ఎన్నెన్నో ప్రత్యేకతలు శ్రీవేంకటాద్రి సొంతం...

అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళమనబడే 7 అధో లోక తలాలకు...

భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకమనబడే 6 ఊర్ధ్వ లోకాలకు శ్రీవేంకటాద్రి నుండి ప్రత్యక్షముగా మార్గములు కలవు..!

కపిలతీర్థం దెగ్గరి వకుళమాతగుహ
నుండి అధోలోకాలకు గల మార్గం గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు చెప్పిఉన్నారు......

అట్లే పైన శ్రీవేంకటాద్రి పైన గల కొండలు లోయలు పైకి చూడ్డానికి ఏవో మామూలు కొండలు గుహలు లోయలు అని అనుకుంటాము కాని నిజానికి అవన్నీ
కూడా ఈ విశ్వంలో పరివ్యాప్తమై ఉన్న వివిధ ఆశ్చర్యకరమైన లోకాలకు / ఉపరితల ఖేచర తలాలకు / వివిధ సిద్ధవాటికలకు  గల అనుసంధాయక మార్గములు....

మనకు తెలిసిన అవ్వాచారి కోన / తుంబురు కోన / మలయ కోన ఇవన్నీ కూడా మన భూతలానికి దెగ్గరగా ఉండే ప్రాంతాలు....

స్వామిపుష్కరిణి, కపిలతీర్థం, ఆకాశగంగా తీర్థం, పాపనాశి తీర్థం, నాగతీర్థం, జపాలి తీర్థం, ధృవతీర్థం, సనకసనందన తీర్థం, రామకృష్ణతీర్థం, కుమారధార తీర్థం, తుంబురు తీర్థం, .....
ఇవన్నీ కూడా మన భూతలానికి దెగ్గరగా ఉండే తీర్థాలు....

తిరుమల ఆలయం నుండి దూరం పెరుగుతున్నాకొద్ది, దట్టమైన శేషాచలాభయారణ్య అడవుల్లో మన భూతల ప్రాణులకు అనగా ముఖ్యంగా మనుష్యులకు, అందేవి కొన్ని అందనివి ఎన్నో... ఎన్నెన్నో.....

సిద్ధ కోనలు / సిద్ధ వాటికలు / సిద్ధ తీర్థాలు /
దేవ గరుడ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధర నాగ గంధర్వ చారణ ఇత్యాది వివిధ ఉన్నతమైన బుద్ధిగత ఉపాధులు గల మనుష్యేతర ప్రాణులకు / కామరూపధారులకు / ఆ కోనలు / వాటికలు / తీర్థాలు నెలవు....

కేవలం శ్రీశ్రీనివాసానుగ్రహం తో మాత్రమే వాటిని కడు దూరము నుండైనా వీక్షించసాధ్యము....

సకలదేవతా సార్వభౌముడైన శ్రీవైకుంఠధాముడు తన నిత్యసూరులతో సహా శ్రీవేంకటపరబ్రహ్మమై భువికి తరలి వచ్చినప్పుడు తనతో పాటుగా తనను ఆశ్రయించి ఉండే వివిధ ఇతర లోకాలు / తలాలు / ఆ ఉపాధిగత దైవిక ప్రాణులు కూడా వాటి సంక్షిప్త ప్రచ్ఛన్న రూపాల్లో శ్రీవేంకటగిరిపై కొలువైఉన్నాయనడం అతిసయోక్తికానేరదు కద....

ఆ మార్మికత కేవల భౌతిక దృష్టికి / సైంటిఫిక్ తర్కానికి / ఫిసిక్స్ సూత్రాలకు / కెమిస్ట్రి ఫార్ములాలకు / గణిత లెక్కలకు అందేదైతే అది అప్రాకృత శ్రీవేంకటాద్రి ఎందుకు అవుతుంది..?

అది కేవలం అమేయ పుణ్య సంచయ భరిత శ్రీశ్రీనివాస అనుగ్రహ పరిపుష్టమైన శ్రీహరి భక్తులకు మాత్రమే ఆ శ్రీవేంకటముడయవర్ ఎరుకపరిచే దివ్యదైవిక విలాసం.....

5వ తరగతిలో ఉండి ఎక్కాలే ఇంకా సరిగ్గా రానివారికి 10వ తరగతిలో కూర్చొబెట్టి లాగరితంస్ గురించి చెప్తే ఎవ్విధంగా అయోమయంగా అగ్రాహ్యంగా ఉంటుందో

ఇది కూడా అంతే....

ఆగి ఉన్న ఒక బైకో / కారో ఎక్కి ఫోటోలకు పోజులిచ్చినంత మాత్రాన......
ఆ బైక్ / కార్ కొనేసి, నడిపేసి, ఒక చోట నుండి ఇంకో చోటుకు తరలి వెళ్ళినట్టు కాదు కద......

అచ్చం అట్లే ఒక తీర్థం / ఆలయం / ఒక దైవిక ప్రదేశం కేవలం భౌతికంగా దర్శించినంతమాత్రాన ఆ తీర్థం / ఆలయం / దైవిక ప్రదేశం యొక్క శక్తిని ఆకళింపు చేస్కొని వాటి అనుగ్రహం పొందడం తో సమానం కానేరవు.....

కొండ కింద ఆగి ఉన్న ఒక బైక్ / కార్ ఎదురుగా నిలుచొని తిరుమల ఆలయం ఫ్లెక్సీ పక్కన నిల్చొని ఫొటో దిగడం వేరు....

వాటిని అధిరోహించి వందలఫీట్ల ఎత్తైన శ్రీవేంకటాద్రిపైకి చేరుకొని అక్కడ స్వామి వారిని దర్శించి నిజంగా శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఫొటో దిగడం వేరు....

చూసే వారికి రెండు ఫోటోలు చూడ్డానికి ఒకేలా ఉన్నా.....

అందులో ఉన్న వారికి భేదం తెలుసు....

అచ్చం అట్లే

ఒక తీర్థాన్ని / దైవిక ప్రదేశాన్ని కేవలం భౌతికంగా చేరుకోవడం వేరు...

వాటిని ఆధ్యాత్మిక దృక్కోణంలో సేవించి తరించడం వేరు..

ఇవ్విధంగా తిరుమలతిరుపతి పరిసర దైవిక ప్రాంతాల్లో శ్రీనివాసమంగాపురం కూడా ఒక పరమపవిత్ర పుణ్యస్థలి....

నారాయణవనం లో శ్రీనివాసపద్మావతీ పరిణయాంతరం ఆకాశరాజు నుండి సెలవుగైకొని తన తిరుమల ఆనందనిలయానికి చేరుకోవడానికి ఆ వేంకటపతి ఇప్పటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి కొండకు చేరుకున్నాడనేది తరతరాలుగా మన పెద్దలచే మనకు తెలపబడిన సత్యం...

పెళ్ళై గృహస్తాశ్రమం లోకి అడుగిడిన తదుపరి 6 మాసాలవరకు కొండలు ఎక్కకూడదు అనే పెద్దల సూచన మేరకు అక్కడి శ్రీ అగస్త్య మహర్షి వారి ఆశ్రమంలో /మునివాటికలో అనగా ఇప్పటి శ్రీనివాసమంగాపురంలో ఆ శ్రీవేంకటహరి పద్మావతీ సమేతుడై 6 మాసాలు బసచేసిన పుణ్యస్థలి....

అందుకే ఆ ప్రాంతమంతా కూడా ఇప్పటికీ ఎంతో మనఃశాంతి కారకమైన ఆహ్లాదభరితంగా, పచ్చదనంతో, స్వచ్ఛదనంతో, భక్తులను ఒక అలౌకికానందానుభూతికి, ధ్యానసిద్ధి కారక నిర్మల స్థితికి గురుచేసి అనుగ్రహిస్తూంటుంది....

తిరుపతి నుండి శ్రీనివాసామంగపురానికి ప్రయాణం గావించేటప్పుడు బస్ గవాక్షం (కిటికీ) లోనుండి కుడిపక్కకు తిరిగి చూస్తే ఆశ్చర్యానందకారకమైన తిరుగిరుల శ్రీహరి రూపం దర్శనమై...

" కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు.....
కొండలంత వరములు గుప్పెడు వాడూ...."
అనే అన్నమాచార్యుల సంకీర్తన అప్రయత్నంగా స్ఫురించి మనల్ని ఆనదింపజేయడం కద్దు....

ఏడు కొండలే తన రూపంతో కొలువుతీరేలా చేసి...

కొండ తానై, కొండల్లో తానై, కొండపై తానై, వెలసిన ఆ కోనేటి రాయడి దైవిక రాచరిక వైభవం ఎంత వర్నించినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.....

పెళ్ళైన కొత్తలో తను బస చేసిన దైవిక ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో శ్రీకళ్యాణవేంకటేశ్వరుడిగా కొలిచిన భక్తుల కొంగుబంగారమై కొలువై, ప్రత్యేకించి అక్కడ జరిగే తన నిత్యకళ్యాణ కైంకర్యోత్సవం లో ప్రసాదించబడే హరిద్రాకంకణధారణ గావించే వారికి త్వరలోనే కళ్యాణవైభవం సమకూరుతుందని వరమిచ్చిన మహామహిమాన్విత పుణ్యక్షేత్రం శ్రీనివాసమంగాపుర శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామి వారి ఆలయం....

తెలుగు నేలపై కళ్యాణానుగ్రహదాయక
పుణ్యక్షేత్రాలుగా వాసికెక్కినవి

1. మురమళ్ళ శ్రీభద్రకాళిసమేతశ్రీవీరేశ్వర ఆలయం...

మరియు

2. తిరుపతి శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి
ఆలయం.....

విశ్వాసంతో నమ్మి కొలిచిన ఎందరెందరో భక్తులకు అది వారి వారి జీవితాంతర్గత స్వానుభవసత్యం...

నేను బల్లగుద్ది మరీ చెప్పగలను...

మురమళ్ళ లో వధూవరుల జన్మనక్షత్రానుగుణంగా
ఇచ్చే డేట్స్ లో శ్రీభద్రకాళివీరేశ్వర కళ్యాణం గావించి..
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామి వారి కళ్యాణకంకణం ధరించిన వారికి

30 యేళ్ళు దాటినా, ఎన్ని సంబంధాలు చూసినా, సరే ఇంకా పెళ్ళి సెట్ అవ్వట్లేదని బాధపడేవారికి....

వారి వారి జాతకరీత్య, కర్మరీత్య, గృహవాస్తురీత్య, ఎన్ని దోషాలున్నా సరే, అవన్నీ కూడా శ్రీభద్రకాళివీరేశ్వరుల వీక్షణాలకు క్షయించబడి దోషాలన్నీ సమసి

శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి అనుగ్రహంతో వారు కళ్యాణతిలకం ధరించడం తథ్యం....!

అవసరమైతే సకల దోషభరిత గృహమునుండి విడిపించి కొత్త ఇంటిని అనుగ్రహించి మరీ తన కళ్యాణ కంకణం ధరించిన భక్తుడి నొసట కళ్యాణ బాసిగం కట్టబడేంతవరకు వరకు ఆ శ్రీహరి భక్తుడిని అనుగ్రహిస్తూనే ఉంటాడు.....అంతటి వాత్సల్యమూర్తి ఆ శ్రీకళ్యాణవేంకటేశ్వరుడు....!!

(
సామాన్యులకు పెద్దగా అర్ధంకాకపోవచ్చు కాని,
వాస్తు శాస్త్రంపై అవగాహన గల పెద్దలకు, పండితులకు, బాగా తెలిసినట్టుగా.....

ఈశాన్య దోషాలు ఉన్న గృహాల్లో, వెంటిలేషన్ కోసం తూర్పు / ఉత్తర ఈశాన్యాల్లోని స్లాబ్ కత్తిరించబడిన గృహాల్లో,

ఆ ఈశాన్య దోషకారణంగా ఇంట్లో ఏ శుభకార్యాలు జరగవు....

30 లు దాటినా సరే, 5 ఏళ్ళ నుండి వెతుకుతున్నా సరే ఆ ఇంట్లోని పిల్లలకు వివాహభాగ్యం ఆమడదూరంలోనే ఉండిపోతుంది....

ఈశాన్య దోషాలకు పశ్చిమ దోషాలు కూడా తోడైతే ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యం కూడా అంతకంతకు దెబ్బతినడంతో ఇక పెళ్ళిళ్ళ గురించి చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా అనుకూలించవు....
)

" కళ్యాణం " అంటే శుభం...

చుట్టూ బురద పెట్టుకొని శుభ్రత గురించి మాట్లాడడం ఎట్లుంటదో....

సకల వాస్తు దోషాలతో, జాతకదోషాలతో నివసించే వారికి శుభాల గురించి మాట్లాడడం కూడా అట్లే ఉంటది....

మన భక్తికి అనుగుణంగా అన్నీ సరిదిద్దబడేలా గావించి సకల కళ్యాణాలను ఒసగే శ్రీనివాసమంగాపుర శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి దర్శనం
సాక్షాత్తు తిరుమలేశుడి దర్శనంతో సమానం......

కొండపైన భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం చాలసేపు కుదరదేమో కాని శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి సురుచిర స్మితవదన భరిత దివ్యమంగళ స్వరూపాన్ని ఆపాదతలమస్తకం తనివితీరా మళ్ళి మళ్ళి లైన్లో వెళ్ళి దర్శించి తరించవచ్చు.....

వార్షిక బ్రహ్మోత్సవ వైభవంతో అలరారే ఆ శ్రీనివాసమంగాపుర శ్రీకళ్యాణవేంకటేశ్వరుడు భక్తుల్లెలరిని చల్లగా అనుగ్రహించుగాక.....😊💐🍟🍕🍨


No comments:

Post a Comment