Sunday, February 21, 2021

Wishing one and all a very happy International Mother Language day 2021....😊💐🍕🍟🍨👏

శ్రీకరమైన మాతృభాషావైభవం
ప్రస్ఫుటంగా కొనియాడబడేలా
"అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..."
పేరిట ఒక రోజుని ప్రత్యేకంగా కేటాయించి మాతృభాషాభిమానులెల్లరూ ఆనందించడం న్యూస్ పేపర్లలో / టీవీల్లో ఎల్లరూ చూసే ఉంటారు...

కాబట్టి ఎల్లరికీ వారి వారి మాతృభాషాదినోత్సవ శుభాభినందనలు....

Wishing one and all a very happy International Mother Language day 2021....😊💐🍕🍟🍨👏

మొన్న వాలెంటైన్స్ డే...
ఇవ్వాళ ఇంటర్నాష్నల్ లాంగ్వేజ్ డే..
రేపు ఇంకోటి... ఎల్లుండి మరొకటి....

ఇలా ఆ డే, ఈ డే, అంటూ ప్రతిరోజు ఏదో ఒక డే అని నామకరణం చేసి వాటిని ఉత్సవంగా జరుపుకోవడం లో, మిగతా డేస్ అన్నీ వాటికి నిర్దేశించబడిన ఒకానొక సంఘటన / ప్రత్యేకత / గురించి ఉటంకించబడి
ఉత్సవంగా భావించబడితే...

ఇవాళ్టి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది నిజానికి మనం ప్రతి నిత్యం జరుపుకునే ఉత్సవమే....

ఎందుకంటే ఎవరికైనా సరే అసలు మాతృభాషను నుడవని రోజంటూ ఉండదు కనక....

జన్మనిచ్చిన మాతృమూర్తిని సైతం వారు గతించిన తదుపరి ఎప్పుడో ఏడాదికోసారి సంస్మరణ దినంగా వారి ఆబ్దీకముల రోజున గుర్తుకుతెచ్చుకొని గౌరవిస్తామేమో కాని జన్మించి మాటలు నేర్చినది మొదలు అసలు మాతృభాష ని మాట్లాడకుండా / తద్వార తత్ వైభవాన్ని ప్రత్యక్షంగా / పరోక్షంగా గుర్తించని రోజంటూ ఉండనేరదు....

ఎందుకంటే
మాతృభాషే మన ఉనికికి చిహ్నం......
మాతృభాషే మన మనికికి మూలం ....
మాతృభాషే మన జీవిత పురోగతికి ఆధారం......
మాతృభాషే మన మేధో వికసనమునకు సిద్ధౌషధం....
మాతృభాషే మన దైనందిన కార్యసాధక మాధ్యమం.....

ఇలా జీవితంలో ఎన్నెన్నో సాధించబడడానికి, సాధించి తరించబడడానికి కారణం మాతృభాష...

మనిషి సహజంగా సంఘజీవి....
దృఢమైన భాషా  నైపుణ్యం వల్లే తనకు ఈశ్వరప్రసాదితమైన సకలవిధమైన గొప్పదనాన్ని, చాతుర్యాన్ని, చాణక్యాన్ని, ఈ సమాజంలో స్థిరీకరించి తన్మూలంగా ఖ్యాతిని, సంపదను బడసి
సుఖించడం సంభవమయ్యేది.....

మీరు వివిధ పరిశోధనల ఫలితాలను పరీశీలించి ఉండి ఉంటే మాతృభాషపై ( ప్రోక్త / లిఖిత )
ఎనలేని పట్టు సాధించిన వారు
ఇతర భాషలపై మరియు ఎన్నో కళలపై చాల బలమైన పట్టున్నవారిగా సమాజంలో పురోగమించడం తద్వారా వారి వివిధ మార్గాల్లోని కీర్తికిరీటాల వెలుగుజిలుగులకు మూలకారణం మాతృభాషావైభవమే అయ్యి ఒప్పారడమనేది ఎంతో మందికి స్వానుభవపూర్వకంగా బోధపడే సత్యం.....

ఇంకా మాటలు కూడా సరిగ్గా నేర్వని చిన్నతనంలో మా అమ్మమ్మవాళ్ళింట్లో ఉన్నప్పుడు కొత్తగూడెం, రామవరంలోని అప్పటి మామిడితోటల దెగ్గర్లోని చెట్టు కింద స్కూల్లో పలకా బలపం పట్టించి అ ఆ ఇ ఈ  దిద్దించిన పద్మ పిన్ని తో మొదలై రాం నగర్లో / భరత్ నగర్లో అవే ఓనామాలు సాగుతూ, 1991 నుండి  ఇప్పటి అస్బెస్టాస్ హిల్ల్స్ లోని రాజధాని స్కూల్లో తెలుగు అక్షరాలను దాటి,

అ అమ్మ
ఆ ఆవు
ఇ ఇల్లు
ఈ ఈక

పదాల్లోకి అనురాధా టీచర్ అనుగ్రహించి, ఆ తదుపరి వచ్చిన కీ.శే శ్రీ నాగసూర్యకళా టీచర్ గారి పర్యవేక్షణలో నా తెలుగు అభ్యాసం అప్రతిహత గంగాప్రవాహంలా దూసుకెళ్ళడంతో సాగిన నా మాతృభాషాభ్యాస ప్రస్థానం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అడపాదడపా నాలో దాగున్న మరొక నేను ని అనగా తెలుగు భాషాభిమానిని ప్రతినిత్యం పలకరిస్తూ అసంఖ్యాక తెలుగు భాషా పదపరిజాతాలతో ఆ సాహితీకళామతల్లికి అక్షరార్చన గావిస్తూ తరించేలా అనుగ్రహించబడిన మహత్వపూర్ణమైన మాతృభాషామంజరులెన్నెన్నో....

శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా ఆ శారదాదేవి ఒక్కొక్కరికి ఒక్కోలా తన శ్రీకటాక్షాన్ని అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి అక్షరమయి గా అంతులేని పదసంపదతో వర్ధిల్లే ప్రౌఢపదబంధనభరిత కావ్యానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి వేదమయి గా అంతులేని వేదస్వరసంపదతో వర్ధిల్లే సుస్వర వేదపఠనానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి నాదమయి గా అంతులేని రాగసంపదతో వర్ధిల్లే ప్రౌఢస్వరబంధనభరిత సంగీతానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి శబ్దమయి గా అంతులేని
రాగాలాపనసంపదతో వర్ధిల్లే గానానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి యోగమయి గా అంతులేని
అక్షరాంతర్గత దైవికానుగ్రహంతో వివిధ యోగరాహస్యావిష్కారక భరిత యోగానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా వారి వారి పూర్వజన్మపరంపరార్జిత పుణ్యపరిపాకంతో వారి వారి ఉపాసనా బలానుగుణంగా ప్రార్ధించి సేవించిన భక్తుల్లెల్లరిని ఆ గీర్వాణి తన అనన్యసామాన్య అమేయ సంగీతసారస్వత విశేషానుగ్రహాన్ని వర్షించి జీవితాలను తరింపజేస్తూంటుంది....

చిరకీర్తికాయులై ఉండడం అనేది అవ్విధంగా ఆ సరస్వతీ అనుగ్రహవిశేషమై లభిస్తుంది....

ఒక్కొక్క మహానుభావులచే రచింపడిన పద్య గద్య గాన కావ్య సంకీర్తన భజన సారస్వతాలు ఆ అక్షరమయి అనుగ్రహంతో లోకానికి అందివ్వబడినవి కాన అవి కొన్ని వందల వేల సంవత్సరాల పర్యంతం తమ శక్తిని ప్రపంచంలో నిరంతరం వ్యాప్తి గావిస్తూ వాటిని ఉపాసించిన ఎల్లరినీ అనుగ్రహిస్తూనే ఉంటాయి....

శ్రీ బమ్మెర పోతనామాత్యూల వారి శ్రీమద్భాగవతం...
కవిత్రయం గా వినుతి కెక్కిన
శ్రీ నన్నయ, ఎర్రన, తిక్కన, గారి శ్రీమదాంధ్రమహాభారతం.....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి శ్రీవేంకట ముద్రాంకిత సంకీర్తనా భాండాగారం...
శ్రీ త్యాగరాయ, శ్రీ భద్రాచల రామదాసు వంటి మహనీయుల సంగీతసాహిత్య సమ్మిళిత
సారస్వతం.....

ఇత్యాదిగా ఎందరో కవుల, రచయితల,
సాహితీకర్తల నుండి వెలువడిన అక్షరమయి యొక్క అనుగ్రహం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనకు ప్రాతఃస్మరణీయమే కద....

టీ.టీ.డి వంటి సనాతన వైదిక ధర్మ పరిరక్షక సంస్థల్లో కొలువై ఉండే వేదపాఠశాలల్లో వేదాధ్యయనం / వేదపఠనం గావించే భూసురోత్తముల గలసీమల్లో కొలువైఉండే వేదమయి యొక్క అనుగ్రహం తరతరాలుగా సుస్వర వేదపఠన / శ్రవణంతో ఈశ్వరుడితో సహా ఎందరెందరికో స్వాంతనను అనుగ్రహిస్తూనే ఉన్నది కద...

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు,
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు,
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు,
శ్రీ వేదవ్యాసభట్టర్ గారు,
శ్రీ మంగళంపల్లి బాలమురళి గారు,
ఇత్యాది నాదకోవిదుల ద్వార లోకానికి అందిన స్వర రాగ సంపద ఆ నాదమయి యొక్క అనుగ్రహంగా
చిరంతనకీర్తి గడించడం ఎల్లరికీ తెలిసిందే కద...

శ్రీమతి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి గారు,
శ్రీ ఘంటసాల గారు,
శ్రీమతి శోభారాజు గారు,
శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు,
శ్రీ ప్రియాసిస్టర్స్ గారు,
ఇత్యాదిగా ఎందరెందరో గాయకుల గలసీమల్లో కొలువైన శబ్దమయి యొక్క అనుగ్రహంగా లోకానికి వినిపించబడి చిరంతన కీర్తిని గడించిన దైవిక గానాలపనలు అనేకం ఎల్లరికి విదితమే కద....

శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు,
శ్రీ చాగంటి గారు, ( అస్మద్ గురుదేవులు... 😊🙏)
శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు,

శ్రీ టీ.కే రాఘవన్ గారు,
శ్రీ కాకునూరి సూర్యనారయణమూర్తి గారు,
శ్రీమతి అనంతలక్ష్మి గారు,

ఇత్యాదిగా ఎందరో మహనీయులైన ప్రవచనకర్తల, ఆధ్యాత్మికవేత్తల, మాన్యుల రసనపై కొలువైన యోగమయి అనుగ్రహంగా ఈ లోకానికి అందిన అక్షర విజ్ఞానాంతర్గత యోగరహస్య విశేషములు సిద్ధ సారస్వతానుగ్రహ విశేషములు, మంత్ర సారస్వతానుగ్రహ విశేషములు...ఎల్లరికి విదితమే కద....

ఇవ్విధంగా భాషా / మాతృభాష అనేది ప్రతీ సంస్కృతికి జీవగర్రగా నిలిచిన ఒక శక్తివంతమైన సాధనం....

ఆ సాధనంతో సాధించబడు విశేషానుగ్రహములు ఎన్నో ఎన్నెన్నో....

అది అందుకున్న వారికి అందుకున్నంత....
ఆరాధించిన వారికి ఆరాధించినంత....
ఆకళింపుచేసుకున్న వారికి ఆకళింపుచేసుకున్నంత...

అక్షరం అనగా క్షరము కానిది...
అనగా నశించనిది...
అనగా శాశ్వతమైనది....

అదేవిధంగా అక్షరోపాసన గావించేవారు కూడా ఈ లోకంలో అమరత్వాన్ని గడించి చిరంతనకీర్తికాయులై వర్ధిల్లుతారు....

ఆ నిరంతర అక్షరసేద్యానికి ఆలంబన మాతృభాష....

కాబట్టి ఎల్లరూ కూడా తమ తమ మాతృభాషపై గౌరవం పెంపొందించుకొని మన భావితరాలకు కూడా అక్షర విజ్ఞ్యానానుగ్రహం అందేలా జీవితాలను తీర్చిదిద్దుకొని తరించెదరు గాక...

అక్షరం యొక్క శక్తి అటువంటిది కనుకే శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ శ్రీవేంకటముద్రాంకిత సంకీర్తనా సారస్వత పూదోటలోని ఈ క్రింది ఒక చక్కని శ్రీశ్రీనివాసశ్రీపాదార్చిత సాహితీసుమంలో

" ఈ సిద్ధ సాహిత్యాన్ని తలచుకున్నంత మాత్రాన శ్రీవేంకటేశ్వరానుగ్రహంతో సకల ఇహ పర సంపదలు అనుగ్రహింపబడి జీవితాలు ధన్యతనొందుతాయి..."

అని ఆచార్యులు బహు రసరమ్యంగా నుడివినారు.😊

http://annamacharya-lyrics.blogspot.com/2008/01/381narayanaya-namo-namo-nanatmane.html?m=1

ప|| నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో |
యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

చ|| గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో |
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు |
యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

చ|| దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో |
శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో |
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

చ|| పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో |
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో |
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో |
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

pa|| nArAyaNAya namO namO nAnAtmanE namO namO |
yIracanalanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||

ca|| gOviMdAya namO namO gOpAlAya namO namO |
BAvajaguravE namO namO praNavAtmanE namO namO |
dEvESAya namO namO divyaguNAya namO yanucu |
yIvarusalanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||

ca|| dAmOdarAya namO namO dharaNISAya namO namO |
SrImahiLApatayE namO SiShTarakShiNE namO namO |
vAmanAya tE namO namO vanajAkShAya namO namO |
yImEralanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||

ca|| paripUrNAya namO namO praNavAgrAya namO namO |
ciraMtana SrI vEMkaTanAyaka SEShaSAyinE namO namO |
narakadhvaMsE namO namO narasiMhAya namO namO |
yiravuga nIgati nevvaru dalacina yihapara maMtramu liMdariki ||

https://youtu.be/4AKMDwCDOxs

No comments:

Post a Comment