శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి హార్దిక 67 వ జన్మదిన శుభాభినందనా నమస్సులు...🙏😊
తెలుగు సినీజగత్తుకు ఒక ధృవం వేటూరిగారైతే మరో ధృవం సిరివెన్నెలగారనేది జగద్విదితమైన సత్యం....
అంతగా తమ అసమాన పదబంధనప్రౌఢిమతో తెలుగు సినీ సాహిత్యాన్ని విశ్వవినీలాకాశంలో ధృవతారగా నిలిపిన అక్షర బ్రహ్మలు ఈ ఇరువురు పుంభావసరస్వతీ స్వరూపులు...
సమాజాన్ని అత్యంత శక్తివంతంగా ప్రభావితం చేసే మాధ్యమం అక్షరమాధ్యమం...
అక్షరాలు మాటలుగా ...
మాటలు పదాలుగా ...
పదాలు పాటలుగా ...
మారినప్పుడు వాటి యొక్క శక్తి మరింతగా హెచ్చించిన ప్రభావంతో మనుష్యుల జీవితాలను ప్రభావితం చేసి వారిని శాసించేంతగా తమ ప్రాభవాన్ని చాటుతాయి....
అందుకే ఈ కలియుగంలో శ్రీహరినందకాంశ సంభూతులైన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు
పదకవితాపితామహులుగా కీర్తిగడించి వాటిని సంకీర్తనల రూపంలో రాగతాళ యుక్తంగా భక్తులకు అందేలా కృషి సలిపిన అమర భాగవతోత్తములై ఇలలో శ్రీహరి శ్రీవేంకటగిరిపై శ్రీనివాసుడిగా కొలువై ఉండగా ఆ పరమాత్మ పాదపద్మములను వారి పదికవితల పారిజాతాలతో అర్చించి తరించి మనల్ని తరింపజేసినారు....
ఎందుకంటే పాటలకు / జానపదాలకు
గల శక్తి అటువంటిది....
పండితపామర భేదంలేకుండా ఎల్లరినీ రంజింపజేయగల శక్తి సంగీతానిది.....
అటువంటి సంగీతానికి ఈడుజోడైన సాహితీ సంపద అలదబడినప్పుడు..
పార్వతీపరమేశ్వరుల వోలే..
లక్షీనారాయణుల వోలే...
సీతారాముల వోలే...
ప్రకృతి పురుషుడిగా...
జీవాత్మ పరమాత్మగా...
రెండైననూ ఒక్కటిగా...
ఒక్కటిగా ఉండే రెంటిసమ్మేళనంగా...
అత్యున్నతమైన అద్వైత స్థితిలో మనుష్యుడిని ఓలలాడించగల శక్తి సంగీతసాహిత్య సమ్మిళిత సారస్వతానిది..
ఆకలితో రగిలిపోతున్న వారికి
అప్పుడే పోపు పెట్టి ఘుమఘుమలాడుతున్న కొబ్బరి చట్నీలోకి నెయ్యి తో అలదబడిన ఇడ్లీలు తిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా...
ఎంత చిరాకులో ఉన్నాకూడా ఒక
వినసొంపైన సంగీత స్వరసంపదకు సుసాహితీ మేళవింపుగా ఉన్న ఒక చక్కని పాటను వింటే కలిగే ప్రశాంతత ఆనందము మిక్కిలి సంతోషదాయకము......
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు వినే వారికి తెలిసినట్టుగా చెవుల యొక్క వినికిడి శక్తి మనుష్యులకు లభించిన అమూల్యమైన వరం...
"శృణ్వన్ తపః..." అని కదా సద్గురువుల ఉవాచ...
మిగతా జ్ఞ్యానకర్మేంద్రియాలు దాదాపుగా ఇతర అన్ని ప్రాణులకు సమానంగా తమ తమ నిర్దేశిత జీవక్రియలను గావించగా...
ఒక్క చెవులు మాత్రం మనిషికి తద్వార
జీవుడికి చేసే ఉపకారం అంతా ఇంతా కాదుకద....
ఒక చక్కని పదార్ధం తిన్నాం...
కొన్నాళ్ళకి అది అంతగా గుర్తుంచుకొనేంతటి లిస్ట్లోకి పెద్దగా ఏమి ఉండదు....
( అంటే మళ్ళీ ఎప్పుడైనా అదే కనపడితే అప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం వేరు...)
ఒక చక్కని సినిమా చూసాం...
కొన్నాళ్ళకి అందులో ఉన్న దృశ్యావళి అంతగా గుర్తుంచుకొనేంతటి లిస్ట్లోకి పెద్దగా ఏమి ఉండదు....
( అంటే మళ్ళీ ఎప్పుడైనా అదే చూస్తే అప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం వేరు...)
కాని ఒక చక్కని మాటను / పాటను విన్నాం అనుకోండి అది నిరంతరం స్మరణ మనన నిధిధ్యాసనతో మన జీవితంలో చూపే ప్రభావం అంతా ఇంతా కాదు....
ఇది కేవలం వాక్కును వరంగా మలుచుకోగల మానవుడికి మాత్రమే ఈశ్వరానుగ్రహంగా లభించిన అమూల్యమైన సంపద...
అది ఈశ్వర సంబంధమైన మాట/పదం
పాదం పద్యం గద్యం ప్రవచనం సంకీర్తన అయితే ఇక అంతకు మించిన వరం మనుష్యుడికి లేనేలేదు...
అందుకే అన్నమాచార్యుల వారు ఏకంగా
"వినికియు నీవే విఠ్ఠలుడా..." అంటూ
వినికిడి యొక్క మహత్తును సాక్షాత్తు ఈశ్వరుడితో పోల్చి వర్నించారు తమ
" అంతయునీవే హరి పుండరీకాక్ష..." అనే సంకీర్తనలో....
అటువంటి శక్తివంతమైన మనుష్యుడి వినికిడిని ఆధారంగా గావించి వారి హృదయంలో స్థానం సాధించేంతగా పదసంపదను సృజించి ఎల్లరినీ ప్రభావితం చెయ్యగలగడం కేవలం జన్మజన్మల పుణ్యబలంగా ఈశ్వరుడి అమేయానుగ్రహంగా లభించే అక్షర పరిజ్ఞ్యానం వల్ల మాత్రమే అది సాధ్యం.....
ఎన్నో రకాల బాణాలు మన దెగ్గర ఉన్నాసరే...
వాటిని సరైన సమయంలో సరైన దిశలో సరైన వేగంతో దూసుకుపోయి లక్ష్యాన్ని సరిగ్గా భేధించేలా సంధించడంలోనే ఆ బాణాలకు, ఆ విలుకాడికి, ఆ విద్యకు సార్థకత....
మరియు ఏకకాలంలో ఎన్నో బాణాలకు
విషాన్ని పూసి ఒకేసారి వివిధ లక్ష్యాలకు గురి చూసి సంధించడం అనేది మరింత అరుదైన ప్రత్యేకత...
ఇప్పటికీ శ్రీశైల అభయారణ్యాల్లో ఉండే చెంచుల విలువిద్యాకౌశలాన్ని చూస్తే ఎవ్వరైనా ఔరా అని ఆశ్చర్యంచెందవలసిందే...
ఆ గరళశరప్రహారాలకు ఎంతటి మదించిన కౄరమృగమైనా సరే క్షణాల్లో నేలకూలవలసిందే...
సరే ఇక అసల్ టాపిక్ కి వస్తే...
శ్రీ సిరివెన్నెల గారు అటువంటి అరుదైన ప్రత్యేక కవనశైలి గలిగిన ఆరితేరిన అక్షరవేదవిదులు....
ఏ జన్మలో ఆ సరస్వతీ దేవిని శ్వేతపద్మాలతో అర్చించే సౌభాగ్యంతో జీవించారో ఏమో....
ఈ జన్మలో వారి హస్తంలో ఒదిగిన కలానికి అందని కవనగుంభనం లేదు...
వారి మదిలో మెదలని మకరంద మధురిమలొలుకు మధుర భావన లేదు....
వారి సిరాఝరిలో సామగాన సౌరభ సోయగాలను అలదుకోని సాహితీ సుమంలేదు...
సిరివెన్నల గారి పాటకోసమే పదబంధన పారిజాతాలు అలా పరిమళించాయా....
లేదా ఆ సాహితీ సరాలన్నీ సిరివెన్నెల గారి సిరాప్రవాహంలో అలా తణుకులీనాయా....
అనేంతగా వారి ఒక్కోపాట ఒక్కో ప్రత్యేక అక్షరసేద్యమే....
DD1 లో నా స్కూల్ డేస్ లో విన్న " లిటిల్ సోల్డర్స్ " సినిమాలోని
" ఓ ఓ... వెండి వెన్నెల..." సాంగ్ లో ఉన్న...
"పడిపోతాననీ పసి పాదాలకీ పరుగే నేర్పవా
మదిలో దాగినా మధుభావాలకి వెలుగే చూపవా
మనసుంటే మార్గముంది ....."
అనే పదబంధనం నుండి....
రీసెంట్ గా " అల వైకుంఠపురములో " సినిమాలోని " సామజవరగమన " సాంగ్లో ఉన్న
"
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన..ఎదురుపడిన వెన్నెల వరమా..
విరిసిన పింఛమా..విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..
"
అనే పదబంధనం వరకూ....
మదిలో మెదిలి మనసును అమితంగా అలరించిన సిరివెన్నల గారి సరళ సారస సుసాహితీ సౌగంధికా సుమసోయగాలు ఎన్నో ఎన్నెన్నో.....
" క్షణక్షణం " సినిమాలోని
"జామురాతిరి జాబిలమ్మా..." పాటలో ని ఈ క్రింది పదప్రయోగాన్ని ఒకసారి పరికించండి....
అడవికాచిన వెన్నెలని వడపోసి మన మనసనే చకోరానికి అందించినంత మధురంగా ఎలా పదాలను ఒలికించారో...!!
"
జామురాతిరి జాబిలమ్మా...
జోల పాడనా…. ఇలా...
కుహు కుహు స-రా-గా-లే... శృతులుగా...
కుశలమా అనే....స్నేహం పిలువగా...
కిల కిల సమీపించే సడులతో...
ప్రతి పొద పదాలేవో పలుకగా...
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని..
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని....
"
"శృతిలయలు" సినిమాలోని
"శ్రీశారదాంబా నమోస్తుతే..." పాటలో ని ఈ క్రింది పదప్రయోగాన్ని ఒకసారి పరికించండి....
మన గళపీఠమే శ్రీవాణి సౌధమై
ఉండేలా ఎంతటి ప్రౌఢిమతో అల్లిన
పదమల్లియలో ఈ పాటలోని పదాలు...!!
"
శ్రీ శారదాంబా నమోస్తుతే
శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే
నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం
నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం
గళపీఠమే రత్న సింహాసనం సరిగమల స్వరసలిల సంప్రోక్షణం
"
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు 2008/2009 నుండి నాజీవితంలో గత 13 సంవత్సరాలుగా అంతర్భాగమై అల్లుకుపోయిన వైనాన్ని పలుకుతున్నట్టుగా ఉండే
" క్రిమినల్ " సినిమాలోని
"తెలుసా మనసా..." పాట విన్నపుడైతే నాకు నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో...
"
తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా… మనసా… ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది!
తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా… మనసా… ఇది ఏజన్మ సంబంధమో
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే.. మారినా.. కాలమే.. ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ !
తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో
ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే… నీవుగా… ప్రాణమే… నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ !
"
ఇలా ఎన్నో ఎన్నెన్నో....వారి కలం నుండి జాలువారిన రసప్లావితములైన పాటలపూదోటలో ఆ సాహితీ మందారమకరందాలను గ్రోలుటకు భృంగములై విహరించే శ్రోతల మనసులను హత్తుక్కున్న వారి పదసంపద అజరం అమరం అమేయం అనంతం అచింత్యం ఆహ్లాద ఆనందామృతానుసంధాయక అద్భుతార్ణవం...
ఇంకా ఎన్నెన్నో అత్యద్భుత విప్లవాత్మక సాహితీ సవ్వడులతో వారి సిరాప్రవాహం నిరంతరం సురగంగాప్రవాహసరాగాల లహరులై
ఎల్లరినీ ఆనందడోలికల్లో విహరింపజేయుగాక అని ఆకాంక్షిస్తూ వారి జన్మదినోత్సవ సందర్భంగా వారికి ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు కవనకుసుమాంజలి ప్రయుక్త శుభాభినందనా నమస్సులు....🙏💐👏🍕👍🍟😊
No comments:
Post a Comment