శ్రీ ప్లవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి, ఆదిశంకరాచార్యుల జయంత్యుత్సవ శుభాభినందనలు.... 😊🙏🍕💐🍨🍟👏
శ్రీ ఆదిశంకరాచార్యుల వారి నామం వినగానే వారికి మనః పూర్వక నమస్సులు అర్పించని ఆస్తిక హృదయం ఉండదు అనేది జగద్విదితమైన సత్యం....
సనాతన ధర్మ వైభవ వీచికలతో అలరారే దైవిక సస్యశ్యామలమైన భరతభూమి అవైదిక అనాచార మౌఢ్యాలతో సతమతమవుతూ అంతర్గత కలహాలతో అస్తిత్వాన్ని కోల్పోతున్న సనాతనధర్మ ప్రాభవాన్ని పునః తేజోవిరాజితమై వర్ధిల్లే విధంగా ఉజ్జీవింపజేసిన అపర శివస్వరూపులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు....
శ్రీ చాగంటి సద్గురువుల
" శ్రీ శంకర విజయం / శంకరాచార్య వైభవం " ప్రవచానలు విన్నవారికి తెలిసినట్టుగా శ్రీశంకరులు ఈ కలియుగానికి లభించిన అమూల్యమైన అమేయమైన జ్ఞ్యాన రత్నం.....
ఆ జ్ఞ్యాన రత్నం అనుగ్రహించిన సుజ్ఞ్యాన ప్రజ్ఞ్యాన వెలుగుల్లో జీవితాలను తరింపజేసుకున్న / తరింపజేసుకుంటున్న భక్తులు అసంఖ్యాకం....
శ్రీ దక్షిణామూర్తి / శ్రీమన్నారాయణుడు మొదలుకొని శ్రీగోవిందభగవద్పాదుల వరకు గల
గురుపరంపర ఒకెత్తైతే.....
నర్మదా నదము యొక్క తీరమునందు
శ్రీగోవిందభగవద్పాదుల వారిని తమ పూజ్య గురుదేవులుగా స్వీకరించిన శ్రీఆదిశంకరాచార్యుల చే భరతభూమికి నాలుగు వైపుల నెలకొల్పబడి వ్యవస్థీకరింపబడిన చతురామ్నాయ పీఠాల్లో పరంపరాగతంగా జగద్గురువులై మానవాళిని అనుగ్రహించే అవిఛ్చిన్న గురుపరంపరలో భాగంగా ఆ చతురామ్నాయ పీఠాలకు గురుస్థానంలో అలరారే శ్రీశృంగగిరి దక్షిణామ్నాయపీఠ జదగ్గురువులు
శ్రీభారతీతీర్థ మహాస్వామి వారు మరియు వారి ఉత్తరాధికారులైన శ్రీవిదుశేఖరభారతీ మహాస్వామి వారి వరకు గల ఇప్పటి మన దర్శనయోగ్యమైన గురుపరంపర ఒకెత్తు....
మరియు శ్రీశంకరులే స్వయంగా తమ ఆరాధ్య పీఠంగా నెలకొల్పిన శ్రీకంచికామకోటి పీఠం లో ఆనాటి శ్రీఆదిశంకరులు మొదలుకొని మొన్నటి శ్రీకంచిమహాస్వామి తరువాత శ్రీజయేంద్రసరస్వతీ స్వామి వారి తరువాత ఉత్తరాధికారులుగా నెలకొన్న శ్రీశంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారి వరకు గల ఇప్పటి జగద్గురు పరంపర...
శ్రీకంచిమహాస్వామి వారి కరకమలములమీదుగా శ్రీకంచికామకోటి జగద్గురుపీఠాన్ని అలంకరించిన శ్రీజయేంద్రసరస్వతీ స్వామి వారు మరియు వారి ఉత్తరాధికారులు శ్రీశంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారు...
ఈ ఇద్దరు మహనీయుల కరకమలముల మీదుగా పీఠంలోని శ్రీకామాక్షి అమ్మవారిని అర్చించిన కుంకుమ, విభూది, ఫలములను ప్రత్యక్షంగా ప్రసాదంగా అందుకొని, పీఠంలోని దేవతార్చనకు ( అప్పుడే వండి సిద్ధం గావించబడిన భగవతి ప్రసాద సేవనముకు ) ఆహ్వానింపబడడం, అటు పిమ్మట సాయంత్రం
శ్రీమహాస్వామి వారి స్వర్ణరథోత్సవం / శ్రీ పెరియవ బృందావనం యొక్క ప్రదక్షిణంలో పాల్గొనడం నాజీవితానికి ఆ కంచి కామాక్షి చే అనుగ్రహింపబడిన సౌభాగ్యం...
ఇక శ్రీకంచి కామాక్షి గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తి యొక్క శుక్రవార అభిషేకకైంకర్యంలో పాల్గొనడమైతే నిజంగా ఒక అవ్యక్తమైన ఆదిపరాశక్తి అనుగ్రహం....
సద్గురు శ్రీచాగంటి వారి శ్రీకంచికామాక్షి శుక్రవారాభిషేకం గురించిన ప్రవచనం విన్నవారికి తెలిసినట్టుగా
అమ్మవారు సర్వాలంకృతయై డజన్ కు పైగా కంచిపట్టుచీరలను ఎంతో చక్కని అలంకారవైభవంతో ఒక దొంతరగా ధరించి వివిధ స్వర్ణాభరణాలను కూడా అలకరించుకొని భక్తులకు దర్శనమిచ్చిన ఆ క్షణం మాత్రం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన దివ్యదైవికతన్మయత్వం....
( గురువారం సంధ్యాసమయ సందర్శనం..)
ఇక శుక్రవారం పొద్దున్నే...
" పసుపు నీళ్ళు..." అని అర్చకులు అనగానే...
అమ్మవారు నిజంగా మనుష్యుల వలే కనురెప్పలు వేస్తున్నారా అన్నట్టుగా ఉండే అమ్మవారి తిరుమేనిపై జాలువార్చబడే ఆ పసుపునీళ్ళ అభిషేకం లో, అమ్మవారి తిరుముఖ మండలాన్ని దర్శించడం నిజంగా వర్నించనలవి కాని వైభవం....
గర్భాలయంలో కొలువైన బిలాకాశం / బిలాహాసం నుండి వివిధ బ్రహ్మాండాల్లోని ఆదిపరాశక్తి స్వారూపాలన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి ఎదురుగా ఉన్న కంచికామాక్షిగా కొలువైనారా ఏమి అన్నంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ కామాక్షి అమ్మవారి స్వర్ణవస్త్రాలంకార దర్శనం....
( అనగా బంగారుపట్టుచీర గా భాసించే స్వర్ణతొడుగుతో ఉండే అమ్మవారి అలంకరణ...)
పద్మాసనంలో కొలువైన ఆ పద్మలోచని, మనం ఆర్తితో పిలిచిన మరుక్షణం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నదా అనేంత సజీవ మూర్తియై కొలువైనదా ఆ శ్రీకంచికామాక్షి పరదేవత అని అనిపించక మానదు ఆ శుక్రవారాభిషేకానంతర శ్రీకంచికామాక్షి సందర్శనంలో
....!
శ్రీకంచిక్షేత్రం లో ఎంతటి శాంతమూర్తియై ఆ పరదేవతకొలువై ఉన్నదో, ఇతర ఎన్నెన్నో క్షేత్రాల్లోకూడా వివిధ అమ్మవారి దేవతామూర్తుల శక్తిని స్థిరీకరించి ఈ కలియుగ మనుష్యులు మున్ముందు కూడా అర్చించి తరించే విధంగా అనుగ్రహించిన ఘనత కేవలం శ్రీఆదిశంకరులకే చెల్లింది....
జంబుకేశ్వరం శ్రీఅఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకములలోకి అమ్మవారి అధిక శక్తిని కట్టడిచేయడం,
దక్షారామం లోని మాణిక్యాంబ అమ్మవారు సూటిగా సున్నా డిగ్రీలు కాకుండా కాస్త కోణాత్మాంగా అమ్మవారి నేత్ర శక్తిప్రసరణను వ్యవస్థీకరించడం..
ఓరుగల్లు శ్రీభద్రకాళి అమ్మవారిని అప్పటి ఉగ్రమూర్తి నుండి ఇప్పుడు మనం దర్శించే సౌమ్య మూర్తిగా కొలువైఉండేలా చేయడం ...
శ్రీశైల అభయారణ్యాల్లో భూగృహంలో కొలువైన అత్యంత అరుదైన శ్రీఇష్టకామేశ్వరి అమ్మవారి మూర్తిని
వెలికితీసి ఇప్పుడు మనకు దర్శనీయంగా ఉండేలా చేయడం....
ఇత్యాదిగా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాల్లో
ఎన్నెన్నో దైవిక సంస్కరణలు గావించి సనాతన ధర్మవైభవానికి ఆయువుపట్ట్లైన ఆలయాల వైభవాన్ని
దృఢపరిచిన ఘనత శ్రీఆదిశంకరులదే...!
ఇక మన ఇంట్లోనే మన పూజామందిరాల్లోనే అమ్మవారి శ్రీచక్రశక్తి ప్రస్ఫుటంగా పరివ్యాప్తమయ్యే విధంగా శబ్దశాస్త్రాన్ని మథించి భక్తకోటికి అందించిన వివిధ దేవతాస్తోత్ర పెన్నిధి ఎల్లరికి విదితమే.....
ఒక్కసారి అన్నపూర్ణాష్టకాన్ని, శ్రీశంకరుల హృదయంలో మెదిలిన వాగ్దేవి శక్తితో నిక్షిప్తం గావింపబడిన శబ్దశక్తి ప్రకటనమయ్యేలా చదివి చూడండి ఎంతటి ఆశ్చర్యకరంగా ఆదిశంకరులు ఆ శ్రీచక్రనవావరణదేవతామండలశక్తిని శబ్దశక్తిగా రూపాంతరం గావించి శక్తివంతమైన వారి స్తోత్రాల్లో నిక్షిప్తం గావించి మనకు అందించి తరించమని దీవించినారో....
ఇక శ్రీశంకరుల ఆసేతిహిమాచల పర్యతం పాదయాత్రలో భాగంగా ఎన్నెన్నో చోట్ల ఎన్నో శాస్త్రాల్లో జరిగిన చర్చోపచర్చల్లో వారికి, వారి శిష్యులకు లభించిన విజయం యావద్ భారాతావనికి అందించబడిన శంకరవిజయం....
శ్రీరుద్రం లో వేదస్వర ప్రామాణంతో
" నమః కపర్దినేచ...వ్యుప్తకేశాయచ..."
అని తెలియజేయబడినది కాబట్టి శ్రీ చాగంటి సద్గురువుల వివరణ ప్రకారంగా సాక్షాత్ కైలాస పరమశివుడే కాలడి ఆదిశంకరులుగా అవతరించి మానవాళిని అనుగ్రహించారు కాన వారు సాక్షాత్ ఈ భరత భువిపై నడయాడిన జ్ఞ్యాననటరాజస్వామి అనేది నిర్వివాదాంశం...
ఆధ్యాత్మికత తో ఆనాటి సమాజంలో నెలకొన్న అనేకజాఢ్యాలను రూపుమాపేలా తమ జ్ఞ్యానగళంతో సిమ్హగర్జన గావించిన సాంస్కృతిక సంఘసంస్కర్తలు శ్రీఆదిశంకరులు....
ఆధ్యాత్మికత అంటే ఏదో గుడికెళ్ళి దండాలు పెట్టామా, దేవుడిని కోరికలు కోరుకొని జీవితంలో లౌకికాభివృద్ధి
సాధించేందుకు ఒక సాధనంగా స్వీకరించామా అనిమాత్రమే కాకుండా....
ఎన్నోవిధాలుగా మనిషిని ఆధ్యాత్మికత ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దగలదో తమ జీవితాన్నే అందుకు ఉదాహరణగా గావించి జీవించిన మహాసాధు సత్పురుష సన్యాసాశ్రమ చక్రవర్తులు శ్రీఆదిశంకరులు....
అది వేదమైనా వేదాంగములైనా ఉపనిషత్తులైనా...
శాస్త్రమైనా...స్తోత్రమైనా....
ధ్యానప్రక్రియలైనా...
యోగప్రక్రియలైనా....
యంత్రమంత్రతంత్రసిద్ధవస్తువిషయసామాగ్రియైనా.....
ఏదైనాసరే
శ్రీఆదిశంకరాచార్యుల వారికి అవన్నీ కూడా కొట్టినపిండి....
వెన్నతోఅబ్బినవిద్య....
గురువానుగ్రహముతో లభించిన దైవానుగ్రహ విశేషములు....
వీటన్నిటి సమ్మిళితసమాహారమైన జ్ఞ్యానమూర్తిగా తిరుగాడిన శ్రీఆదిశంకరులను సరిగ్గా వర్నించాలంటే ఎవ్వరికైనా అది సాహసమే అవుతుంది.....
ఎందుకంటే వారిది ఏ కొలామానాలకు అందని ఉన్నతమైన జ్ఞ్యానభూమిక కాబట్టి...
కాని ఒక్క వాక్యంలో శంకరుల మహిమ్నత గురించి,
సనాతనభారతీయవైభవం అంటే శ్రీఆదిశంకరులు....
శ్రీఆదిశంకరులు అంటే సనాతనభారతీయవైభవం అనేలా ఉండేలా వర్నించాలంటే....
వారు 33 కోట్ల దేవతాసమూహానికంటే కూడా మిక్కిలి
ఆరాధ్య మూర్తిగా ఏ దేవతకి/దేవుడికి, ఏ సద్గురువులకు/జగద్గురువులకు,
ఏ యతీశ్వరులకు/యోగీశ్వరులకు లేని విధంగా 108 + 8 = 116 నామాలతో
అష్టోత్తరశతం + అష్ట ప్రత్యేకం = షోడశోత్తరశతనామావళితో గావించే వారి
ఆరాధనావైభవమే,
శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన విధంగా ఎల్లరూ ఆ మహాయోగీశ్వరేశ్వరులకు అర్పించే శాశ్వత గౌరవనీరాజనాలు....
కరోనా కారణంగా ఈసారి కూడా నల్లకుంట శ్రీశృంగగిరి సంస్థానానుబంధ శ్రీశారదాంబాలయం లోని శ్రీఆదిశంకరాలయంలో గావించబడే
శ్రీశంకరుల పల్లకీసేవలో పాల్గొనడం దుర్లభమేమో....
ఈశ్వరానుగ్రహంగా వచ్చేసంవత్సరానికైనా అన్నీ సద్దుమణిగి భక్తులు ఆనందంగా ఆదిశంకరుల జయంత్యుత్సవాల్లో పాల్గొని తరించాలని ఆశిద్దాం.....
కాబట్టి ఈసారి కూడా ఇంట్లోనే తోటకాష్టకం పఠించి వారికి సాష్టాంగనమస్సుమాంజలులు సమర్పించి తరిద్దాం....
నమః శంకరభానవే నమః...
(
శ్రీశృంగగిరి సంస్థానం వారి శ్రీప్లవనామసంవత్సర పంచాంగంలో ముద్రింపబడిన శ్రీఆదిశంకరుల అష్టోత్తరనామావళిని ఈ పోస్టుకు జతపరిచాను.....ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోగలరు....
)
No comments:
Post a Comment