శ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి 2022 శ్రీ ఆదిశంకరాచార్య 1234th జయంత్యుత్సవ శుభాభినందనలు...🎂💐🍦🍕🍧😊🙏
సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం
అస్మదాచార్యపర్యంతాం వందేగురుపరంపరాం
అంటూ ఎంతో గంభీరంగా సాగే శ్రీచాగంటి సద్గురువుల వందలాది ప్రవచనాల్లో ప్రతీప్రవచనంలోను ఎక్కడో ఒకదెగ్గర శ్రీ ఆదిశంకరాచార్యుల ప్రస్తావన / వారి జీవితంతో ముడిపడిఉన్న ఏదో ఒక సంఘటన ఉటంకింపబడడం చాలా మందికి తెలిసే ఉంటుంది....
అంతటి అనన్యసామాన్యమైన అధ్యాత్మ వ్యక్తి / వ్యక్తిత్వం కాబట్టే ఇన్ని శతాబ్దాలైనా సరే వారు వ్యవస్థీకరించిన చతురామ్నాయ పీఠసంప్రదాయం / ఆచారవ్యవహారాలు / స్తోత్ర భాష్య సారస్వతం ఇప్పటికీ కూడా వాటి ప్రాభవాన్ని ప్రపంచం నలుదెసలా పరివ్యాప్తిగావిస్తూనే ఉన్నాయి....
బాహ్య ప్రపంచానికి సదరు వ్యక్తి ఎవ్విధంగా కనిపించినా, మైకుల్లో ఇతరులకు ఏమి చెప్పినా సరే...
ఈ సమాజంలో ఉండే అత్యంత ప్రభావశీలురు / సంపన్నులు / బడాబాబులు / బిగ్షాట్స్ అందరూ కూడా భారతీయ సనాతన ధర్మసంప్రదాయాన్ని / అర్చారాధనా వ్యవస్థను ఆంతరమున ఎంతో పద్ధతిగా పాటించే వారై ఉంటారు....
వారి వారి వృత్తి ప్రవృత్తుల్లో బిజీ గా ఉండి వారికి కుదరకపోతే ఇతరులతోనైనా అర్చారాధనలు గావింపజేస్తారు....
ఎందుకంటే ఈశ్వరానుగ్రహం తోనే వారు అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అనే సత్యం గురించి వారికి బహుబాగా తెలుసు కాబట్టి...
జీవితంలో మరింతగా అభివృద్ధిపథంలో మున్ముందుకు సాగాలి అని నిత్యం ఈశ్వరారాధన గావించని సంపన్నుడు / అధికారుడు ఉండడు అనేది నిర్వివాదాంశం....
ఎందుకంటే మన సనాతనధర్మం యొక్క మహత్తు / ఉనికిపట్టు మొత్తం భగవంతుడి అర్చారాధనల్లోనే కొలువై ఉందనేది అనాదిగా రూఢమైన సత్యం...
బాగా సంపన్నులైన పెద్ద పెద్ద సినిమా ప్రొడ్యూసర్స్ / బిజినెస్ మెన్ / ఇత్యాది బిగ్ షాట్స్ యొక్క ఇళ్ళను / వ్యాపార సముదాయాలను మీరు గమనిస్తే నిత్యం శ్రీలక్ష్మీనారాయణ / శ్రీలక్షీగణపతి / శ్రీపార్వతీపరమేశ్వర ఇలా ఏదో ఒక ఈశ్వర స్వరూప సమూర్త్యారాధన అక్కడ నిరంతరం కొనసాగుతుంటుంది..
కాబట్టి ఇవ్వాళ్టి సంపన్న భారతానికి, ఆనాటి శ్రీఆదిశంకరాచార్యులవారిచే సువ్యవస్థీకరింపబడిన
సవైదిక సత్ సంప్రదాయ ఆరాధనా విధానాలే మూలకారణం అనేది ఎందరికో ఎరుకలో ఉన్న సత్యం...
ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ శివగురు ఆర్యాంబ అనే పుణ్య దంపతులకు పరశురామక్షేత్రమైన కేరళలోని కాలడి అగ్రహారంలో జన్మించిన ఒక దివ్య తేజోవిరాజితమైన బాలుడు
" శంకర " అనే నామధేయంతో పెరిగి 8వ ప్రాయంలోనే అన్యులెవ్వరికి సాధ్యపడని రీతిలో సకల శాస్త్రాలను మధించి రచించిన విధంగా అప్పటికప్పుడు ఆశువుగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని
( గీర్ధేవదేతి + గరుడధ్వజసుందరీతి
శాకంబరీతి + శశిశేఖరవల్లభేతి )
సరస్వతీ అమ్మవారు + లక్ష్మీ అమ్మవారు + శాకంబరి అమ్మవారు + పార్వతీదేవి, ఈ నలుగురి సమ్మిళిత సమాహార స్వరూపంగా కనకధారా స్తోత్రంతో స్తుతించి, శ్రీమహాలక్ష్మి యొక్క అప్రతిహత శ్రీకటాక్షాన్ని ఒక నిరుపేద బ్రాహ్మణి ఇంటి ముంగిట
బంగారు ఉశిరికల జడివానగా కురిపించి,
వారు స్వీకరించిన ఒక్క ఎండిపోయిన ఉశిరికాయ దానం యొక్క ఫలితంగా ఆ బ్రాహ్మణి యొక్క తరతరాలకు తరగని సంపదను అనుగ్రహించడం కేవల మానవ మాత్రులకు ఎట్లు వీలవును...?
మామూలుగా ఉండే సరస్వతీ+లక్ష్మీ+పార్వతీ అనే కర్మఫలప్రదాయక శక్తి తత్త్వానికి అదనంగా ఒకానొక సమయంలో ఆదిపరాశక్తి స్వీకరించిన శాకంబరి అమ్మవారి అవతారాన్ని స్మరించి నిర్హేతుక సద్యో ఆగామి కర్మఫలానుగ్రహంగా ఆదిపరాశక్తిని అప్పటికప్పుడు ప్రసన్నం గావించుకొని ఆ పేద బ్రాహ్మణికి అంతటి అనుగ్రహాన్ని వర్షించిన వైనాన్ని శ్రీచాగంటి సద్గురువుల
" కనకధారా స్తోత్ర వైభవం " అనే ప్రవచనాల్లో
( అప్పుడు ఉండే శ్రీచాగంటి.నెట్ వెబ్సైట్ నుండి డవున్లోడ్ చేసుకున్నవారి దెగ్గర ఉండిఉండాలి ఈ అద్భుతమైన కనకధారా స్తోత్ర ప్రవచనాలు....) చాలా మంది వినే ఉంటారు కద.....
కేవల మానవ జ్ఞ్యాన కోవిదునకు భిక్ష స్వీకరించే ఆ సమయంలో శాకంబరి అమ్మవారిని స్మరించి స్తుతించి ఆ శక్తి తత్త్వం యొక్క అనుగ్రహన్ని సమ్మిళితం గావించి జీవుడి సంచిత ప్రారబ్ధాలకు అతీతంగా కర్మ ఫలానుగ్రహన్ని వర్షింపజేయడం సాధ్యమేనా....?
( ఆకలితో అలమటిస్తున్న ఎందరెందరికో అప్పటికప్పుడు ప్రభవించి తన తిరుమేని నుండి శాకములను సృజించి భక్తుల క్షుద్బాధను రూపుమాపిన శక్తి తత్త్వం యొక్క సద్యో అనుగ్రహమే శాకంబరి అమ్మవారు అని శ్రీ చాగంటి సద్గురువుల ఉవాచ కద..)
అప్పటికప్పుడు ఏ దేవతా స్వరూపాన్ని స్మరిస్తే ఆ దేవతా స్వరూపం పలికేలా తపః శక్తిని కలిగి ఉండడం కేవల మానవులకు సాధ్యమా...?
నర్మదా నదము యొక్క తీరంలో గోవింద భగవద్పాదులను వారి గురువులుగా స్వీకరించి యావద్ అఖండ భారతావనిని తమ జ్ఞ్యాన గంగా ప్రవాహంతో పాదాక్రాంతం గావించుకోవడం కేవల మానవులకు సాధ్యమా...?
( ఇక్కడ లౌకికంగా చూస్తే ఏదో ఒక నదీ తీరంలో ఒక శిష్యుడు ఒక గురువుని లభింపజేసుకోవడం...
కాని ఆధ్యాత్మిక పరంగా తర్కిస్తే
నదులనీ కూడా తూర్పుగా ప్రవహించి సముద్రంతో సంగమిస్తే.....నదము మాత్రము పశ్చిమంగా ప్రవహించి సముద్రంతో సంగమిస్తుంది.....
నదులు ఎన్నో కలవు....నదములు కొన్ని మాత్రమే కలవు......
ఉత్తుంగ ఝరియై లోకాన్ని ముంచెత్తేలా ప్రవహించే నర్మదా నదమును తమ కమండలంలోకి ఒడిసిపట్టడం అంటే....
అనాడు భారతావని లో పెచ్చుమీరుతున్న ఎన్నో అవైదిక లపటాలన్నింటినీ కట్టడి గావించేందుకు ఒక మానవాతీత మహానుభావుడు మానవ రూపంలో
సన్యాసియై యావద్ భారతం పర్యటించేందుకు ఉద్యుక్తులై ఒక అవిఛ్ఛిన్న సనాతన ధర్మ సంప్రదాయ గురు శిష్య పరంపరను నెలకొల్పేందుకు వారు గురుస్వీకారం గావించారు అనేది తార్కిక సత్యం.....)
ఈ లోకంలో జ్ఞ్యాన ప్రచారంలో భాగమై ఉండే ఎవ్వరినైనను ఈ లోకం ప్రశ్నించే మొదటి ప్రశ్న....
"ఎవరిని గురువులుగా ఆశ్రయించి మీరు గురువులు అయినారు / మీరు జ్ఞ్యాన ప్రచారం గావిస్తున్నారు....?" అని.....
సదరు వ్యక్తి యొక్క గొప్పదనం....
పై ప్రశ్న యొక్క సమాధానం పై అధారపడి ఉండే అంశం అనేది లోకవిదితం....
భారతావని యొక్క నాలుగు దిశలనుండి ఎట్టి అవైదిక వాదనలు భారతదేశంలోకి జొరబడకుండా సనాతన ధర్మ సంప్రదాయ పరిరక్షణకు / సువ్యవస్థీకృత భారతీయ అర్చారాధనా విధానాలకు ఇబ్బంది కలగకుండా ఒక విధమైన రక్షణ వ్యవస్థను
చతురామ్నాయ పీఠాలుగా నెలకొల్పే కార్యక్రమంలో
"మీరు నెలకొల్పే గురుపరంపరకు మీరు గురువులైతే మీకు ఎవరిని గురువులుగా ఈ లోకం ఆరాధించాలి..."
అనే ప్రశ్న ఉదయించకుండా....
శ్రీమన్నారాయణుడు/శ్రీదక్షిణామూర్తి నుండి బ్రహ్మ గారు మొదలుకొని వారి గురువులైన గోవిందభగవద్ పాదులవరకు గల ఒక స్థిరమైన గురుపరంపరాగతంగా ఆ జ్ఞ్యాన తపోఫలం అట్లే భారతావనికి అందివచ్చేలా వారు ఎంచుకున్న నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులుగా గావించి వారు స్వయంగా కంచి కామకోటి పీఠాన్ని నెలకొల్పి అధివసించి యావద్ భారతదేశమునందు సుస్థిరమైన వైదిక ఆరాధనా విధానాలు పరిఢవిల్లేలా ఒక దైవిక వ్యవస్థను సృజించడం కేవల మానవులకు ఎట్లు సాధ్యం....?
ఇలా చెప్పుకుంటూ పోతే 32వ ఏట వారు కేదార క్షేత్రంలో నడుచుకుంటూ అదృశ్యమయ్యేంతవరకు కూడా వారిలోని పరిపూర్ణ పరమశివాంశ ఈ లోకాన్ని ప్రస్ఫుటంగా అనుగ్రహిస్తూనే వచ్చింది....
సత్ బ్రాహ్మణ కోవిదులుగా...
సన్యాసాశ్రమ చక్రవర్తులుగా...
సత్యదండధారులైన యతీశ్వరులుగా....
ఎనలేని యోగీశ్వరులుగా.....
పరమ జ్ఞ్యానతపో పుంజంగా...
వెలకట్టలేని వైదిక సారస్వతాన్ని సృజించి లోకానికి అందించిన అపర పరమేశ్వరులుగా......
శ్రీఆదిశంకరాచార్యులవారు ఎప్పటికీ కూడా త్రికాల స్మరణీయ మననీయ వందనీయ మహనీయులు.....
శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా శ్రీఆదిశంకరాచార్యజయంతి నాడు ప్రతి ఆస్తికుడు,
వారి శిష్యులైన తోటకాచార్యులచే ( శ్రీఆదిశంకరుల ఒక్క మనోసంకల్పంతో సకల విద్యలను గడించి గంగానది సృజించిన సద్యో పద్మాలపై ఆవలి తీరమునుండి ఈవలి తీరానికి నడిచి పద్మపాదాచార్యులుగా పేర్గాంచిన వారు ) రచింపబడిన తోటకాష్టకాన్ని పఠించి వారికి నమస్కరించడం అనేది ఎల్లరి విహిత ధర్మం.....
विदिताखिल शास्त्र सुधा जलधे
महितोपनिषत्-कथितार्थ निधे ।
हृदये कलये विमलं चरणं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 1 ॥
करुणा वरुणालय पालय मां
भवसागर दुःख विदून हृदम् ।
रचयाखिल दर्शन तत्त्वविदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 2
भवता जनता सुहिता भविता
निजबोध विचारण चारुमते ।
कलयेश्वर जीव विवेक विदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 3 ॥
भव एव भवानिति मे नितरां
समजायत चेतसि कौतुकिता ।
मम वारय मोह महाजलधिं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 4 ॥
सुकृतेஉधिकृते बहुधा भवतो
भविता समदर्शन लालसता ।
अति दीनमिमं परिपालय मां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 5 ॥
जगतीमवितुं कलिताकृतयो
विचरन्ति महामाह सच्छलतः ।
अहिमांशुरिवात्र विभासि गुरो
भव शङ्कर देशिक मे शरणम् ॥ 6 ॥
गुरुपुङ्गव पुङ्गवकेतन ते
समतामयतां न हि कोஉपि सुधीः ।
शरणागत वत्सल तत्त्वनिधे
भव शङ्कर देशिक मे शरणम् ॥ 7 ॥
विदिता न मया विशदैक कला
न च किञ्चन काञ्चनमस्ति गुरो ।
दृतमेव विधेहि कृपां सहजां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 8 ॥
శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవద్పాదశంకరం లోకశంకరం
🙏🙏🙏🙏🙏
(
గతసంవత్సరాల శ్రీఆదిశంకరజయంతి సందర్భంగా నేను రచించిన పాత పోస్ట్లు ఈ క్రింది లింకుల్లో లభ్యమౌను..
http://shreeguravenamah-aithavk.blogspot.com/2021/05/blog-post_17.html
http://shreeguravenamah-aithavk.blogspot.com/2020/04/2020_26.html
)
No comments:
Post a Comment