శ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి ప్రయుక్త 2022 శ్రీఆదిశంకర జయంత్యుత్సవాంతర్గత శ్రీ సహస్రచండీయాగ పూర్ణాహుతి మహోత్సవ వైభవం....😊🎂🍧🎇🍦🍕🙏
( నాంపల్లి ఎగ్సిబిషన్ గ్రౌండ్స్ )
కలౌ చండీ....
కలౌ వేంకటనాయకః...
కలౌ కపికుంజరః....
ఇత్యాదిగా ఈ కలియుగానికి విధిగా పెద్దలచే సెలవివ్వబడినవి వివిధ ఆధ్యాత్మిక తత్త్వసాధనా విషయములు.....
ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
శ్రీఆదిశంకరాచార్యులచే సువ్యవస్థీకరింపబడిన పంచాయతన ఆరాధనాంతర్గత
దైవిక సమ్మేళనం ఈ మూడు వాక్యాల్లోకి క్రోడీకరింపబడింది.....
అభిన్నమైనది శివశక్తి తత్త్వము....
శాక్తేయము యొక్క మరో పార్శ్వమే వైష్ణవము...
శివశక్తి తత్త్వ సామ్యమును కలిగి ఉండునునవి గాణాపత్యము, సౌరము....
అగ్ని ఆరాధనే సనాతన ధర్మానికి ఉనికిపట్టు కాబట్టి కౌమారము అన్నిటికి అంతర్నిహితమై ఉండునది.....
అనాదిగా వస్తున్న సంప్రదాయాచరణాంతర్గతమైన
వైవిధ్యమే కాని తత్త్వతః అన్నీ కూడా అగ్ని ఆరాధనను ఆధారంగా గావించి పరతత్త్వాన్ని ఆరాధించే మార్గములే.....
స్వాహాకారంలో తత్ ఉపాస్య దేవతాస్వరూపానికి సంబంధించిన గాయత్రి మరియు ఇతర శ్లోక మంత్ర పఠనంలోని మార్పులు మరియు ఇతరత్రా స్వల్పమైన తారతమ్యముల మినహా అందరి దేవుళ్ళకు యజ్ఞ్య క్రతువు అనేది దాదాపుగా ఒకేవిధంగా ఉండే ప్రక్రియ....
శీఘ్రస్పందన అనేది శాక్తేయ సంప్రదాయంలోని విశేషం... కాబట్టి అమ్మవారి ఆరాధన అనేది త్వరితగతిన అనుగ్రహాన్ని సమకూర్చే ఆరాధనావ్యవస్థ అని శ్రీచాగంటి సద్గురువులు కూడా పలుమారు వారి ప్రవచనాల్లో తెలిపిఉన్నారు....
వైదిక వాజ్ఞ్మయ వైభవం అనేది శాస్త్రాన్ని అధ్యయనం గావించే పండితులు, కోవిదులు, ఇతర మాన్యులచే బహుధా అధ్యాత్మ ప్రపంచానికి సర్వదా బోధింపబడి ఉండే అంశమే....
కాబట్టి నేను మరో విధంగా యజ్ఞ్యయాగాది క్రతువుల వైభవాన్ని వివరించే ప్రయత్నంగావిస్తాను....
యజ్ఞ్యవేది లో సమర్పణకు ఉపయోగింపబడే వివిధ పదార్ధముల దెగ్గరి నుండి
(పంచగవ్యములు, చెరువు, పరమాన్నము, వివిధ ఫలాలు, ఇత్యాదివి),
యాగశాల / హోమప్రదేశం ఆవరణలో ఉండే వివిధ సరంజామా అంతాకూడా సత్త్వగుణప్రధానమై,
అక్కడికి విచ్చేసిన వారందరికి కూడా సత్త్వగుణసంపత్తిని ప్రోది చేసే వాతావరణం అక్కడ నెలకొనిఉంటుంది....
అందలి అధ్యాత్మ శాస్త్ర వస్తు విషయ సామాగ్రి పై వారి వారి ఉపాసనకు తగ్గట్టుగా ఉండే అవగాహనతో అంతర్వివేచన సాగిస్తూ, ఆయా
యజ్ఞ్య / హోమ క్రతువుల్లో వేదమూర్తులచే అనుసంధింపబడే వైదిక మంత్ర శ్లోక సారస్వతాన్ని శ్రద్ధగా అవధరించే విజ్ఞ్యులకు ఆంతరమున ఆ సత్త్వగుణసమృద్ధి అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా శాశ్వతమైన సద్గుణసంపదగా అభివృద్ధి చెంది సర్వకాల సర్వావస్థల్లోను వారిని శ్రేయోమార్గంలో నిలిపే అధ్యవసాయంతో కూడిన జీవితంవైపుగా నడిపిస్తుంది.....
అనగా వారి బౌద్ధిక పరిణతి అనేది
దైవిక తత్త్వంతో అలరారే ఉన్నతమైన స్థాయిలో స్థిరీకరింపబడుతుంది......
ఇదే యజ్ఞ్య / హోమ / కల్యాణ / అభిషేకాది వివిధ వైదిక క్రతువులకు గల అత్యంత విశేషమైన గొప్పదనం.....
ఇప్పుడు ఈ తరం వారు కమ్యూనికేషన్ / ఇంటర్పర్సనల్ / సాఫ్ట్ స్కిల్ల్స్ / అనే పేర్లతో వ్యవహరించే సకల నైపుణ్యవర్ధక కళలను మన సనాతన ధర్మం సత్త్వగుణసమృద్ధిని ప్రోది చేసి భక్తజనులకు అయాచితంగానే లభ్యపరిచింది....
( కాకపోతే ఇప్పుడు సంస్కృతం మరియు మాతృభాషకు బదులుగా వాడుకలో ఇంగ్లీష్ భాష ఎక్కువైనందువల్ల జ్ఞ్యానమార్గంలో గల భావగాంభీర్యం మరియు భావసౌకుమార్యం అనే భాషాత్మక కళ ఇంగ్లీష్లో ఉటంకించబడితేనే జనబాహుళ్యానికి ఎక్కువగా చేరడం అనేది మనం ఈనాడు గమనించే విషయం.....)
మిగతా ఎన్నో కూడా చిరుతిండ్ల రూపంలో మన జీవితాల్లోకి వచ్చిచేరినా, మన ఆహార ఆహార్యాల్లో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చిచేరినా.......
ఆనాడైనా....ఈనాడైనా....మరియు ఏనాడైన......
అన్నం, రొట్టెలు, కూర, పప్పు, చారు, పెరుగు, నీళ్ళు,
పండ్లు, అనేవి శ్రేయస్కరమైన ఆహారంగా అనాదిగా అందరు స్వీకరిస్తూ వచ్చిన ఆహార సంప్రదాయం.....
అదే విధంగా ఆధునికతరీత్యా ఈ లోకంలో / మన జీవితాల్లో ఎన్ని మార్పులు వచ్చిచేరినా సరే....
ఆనాడైనా....ఈనాడైనా....మరియు ఏనాడైన......
దేవభాష సంస్కృతం యొక్క మహత్తు తరగనిది......
ద్యులోకాలతో / దేవతాలోకాలతో / అనుసంధానాత్మక జ్ఞ్యాన సముపార్జనకు సంస్కృతమే కీలకమై ఉంటుంది...
అందుకే దేవభాషగా ఆరాధింపబడుతుంది......
ఒక్క 2 లైన్ల సంస్కృత శ్లోకంలో 20 లైన్ల సమాచారం నిక్షిప్తమై ఉండడం సంస్కృత భాషకు గల గొప్పదనం.....
" సారస్వతాన్ని తర్జుమా చేస్తే వాటి యొక్క శక్తిని, మహత్తును, సంపూర్ణంగా పొందలేము..."
అనే సత్యం గురించి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో వివరించి ఉన్నారు...
( "శ్రీహనుమాన్ చాలీసా" తులసీదాస్ గారు అనుగ్రహించిన అవధ్ భాషలోనే పారాయణం గావించడం గురించి....,
సంకల్పంలో.....
" శ్రీ శ్వేతవరాహకల్పే...."
అని ఉంటే అది
"తెల్లపంది కల్పం..." అనే తర్జుమాతో చదవకూడదు అంటూ....
ఇలా చాలా సందర్భాల్లో వినే ఉంటారు కద...)
రజోగుణం / తమోగుణం గురించి మనుష్యుడు లేదా మరే ఇతర ప్రాణి కూడా అంతగా ప్రయాస చెందనవసరం లేదు....
ఎందుకంటే అవి వాటంతట అవి సహజంగా ఉద్భవించేవి కాబట్టి.....
సత్త్వగుణ సంవృద్ధి గురించి మాత్రమే మనుష్యుడి ప్రయాస మొత్తం.....
మీరు గమనించి ఉండి ఉంటే.....
ఎదైనా అభిప్రాయభేదం వచ్చినప్పుడు,
"నువ్వెంత.. అంటే....నువ్వెంత....."
అని ఇరువర్గాలు కయ్యానికి దిగడానికి పెద్దగా ఏ ప్రయాస అక్కర్లేదు.....
కాస్త పరుష పదజాలం చాలు
అగ్నిలో ఆజ్యం పోసినట్టు పరిస్థితులను
ఉద్రిక్తపరచడానికి......
" నన్నే అంత మాట అంటవ.......
నువ్వెంత...నీ బతుకెంతరా బద్మాష్ బాడ్ఖావ్....మందిని ముంచి బతికే నీకె అంత రేషముంటే.....ఎవ్వరి జోలికి పోకుండా....ఎవ్వరి పైస తినకుండా.,..పద్ధతిగా బతికే నాకెంత ఉండాలిర లత్కోర్ బాడ్ఖావ్....
ఇంకోసారి నా జోలికి వస్తే రొడ్డుకీడ్చి గుడ్డలిప్పి ఇరగదంత గాడ్దికొడక....మంది పైస మింగి మింగి బాగ బల్సింది బాడ్ఖావ్లకు....ఎట్లబడ్తే అట్ల మాటలనుడే....మీ బత్కులను బొందబెట్ట.... మీకు దినాల్బెట్ట.... "
అంటూ ఎవరైన పరుషంగా నాలుగు మాటలంటే ఇక అది ఎంత పెద్ద లొల్లి లొల్లి ఐతదో అందరికి ఎరుకే....
అట్లుకాక.....
" మీకు అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా....మీ పరిధి తెలుసుకొని పద్ధతిగా గౌరవంతో, సమ్యమనంతో వ్యవహరిస్తే మంచిది...."
అంటూ సంస్కారభరితంగా ఇరువర్గాలు మాట్లాడుకోగలిగిన నాడు ఆ లొల్లి అక్కడే సద్దుమణగడం అనేది అందరికి ఎరుకే....
కాబట్టి ఇక్కడ గమనిస్తే......
మొదటి ఎగ్సాంపుల్లో చూసినట్టుగా....
రజోగుణ / తమోగుణంతో రెచ్చిపోవడానికి పెద్దగా ఏ అధ్యవసాయం అవసరంలేదు.......
అది మనిషికి సహజంగానే పెల్లుబికే శైలి......
సత్త్వగుణ సమృద్ధితో కూడి ఉండే కార్యసాధక శైలిలో సమాధానపరచడానికే అధ్యవసాయం అనేది అవసరమయ్యేది....
అప్పటికప్పుడు మనుష్యునకు, సత్త్వగుణసమృద్ధి అనేది షాపుల్లో కొనుక్కోవడానికి / ఫ్రెండ్స్ దెగ్గర అడిగి తీసుకోవడానికి.....
అది వస్తువో / వర్తకవ్యాపారమో కాదు కద.....
అది కేవలం ప్రయత్నపూర్వక కృషితో మాత్రమే సాధించుకొనబడే సద్గుణసంపద......
" శన్నో అస్తు ద్విపదే...శం చతుష్పదే....."
అని వచించే మన వైదిక శాస్త్ర సారస్వతం మొత్తం సత్త్వ గుణప్రధానమై ఉంటుంది.....
వాటి ఆలంబనతో నిర్వహింపబడే యజ్ఞ్య / యాగాది / క్రతువుల్లో పాల్గొనడం కూడా మనిషికి ఆ సత్త్వగుణ సంపద అనేది భగవదనుగ్రహంగా బాగా సమకూరి జీవితమనే నిరంతర ప్రయాణంలో ఎన్నో దైవిక భూమికలకు తన ఇహలోక జీవితమే ఆవాసం అయ్యేలా ఆధ్యాత్మిక ఆలంబనను అందుకొని విజయవంతంగా మున్ముందుకు వికసన పథంలో ప్రయాణింపజేసి భగవద్ మార్గంలో తడబడకుండా స్థిరంగా నిలిపే సాధనమై ఒప్పారుతుంది....
వారి వారి ప్రార్ధనలకు అనుగుణంగా సకల ఈప్సితములను అనుగ్రహించే మహోత్కృష్టమైన
చండీయాగం,
శ్రీఆదిశంకర 2022 జయంత్యుత్సవాంతర్గతంగా,
శ్రీ శృంగేరి ఉభయజగద్గురు అనుగ్రహ సంపాక భరిత దక్షిణామ్నాయ శ్రీశారదాంబ పీఠానుబంధ వివిధ వేదమూర్తుల ఆధ్వర్యంలో,
శ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి తిథిన మహాపూర్ణాహుతితో సంపూర్ణమవ్వడం,
ఇతర ఎంతో మంది భక్తులతో కలిసి నేను కూడా అందులో పాల్గొనడం....,
టీ.వీ ల్లో మనం దర్శించే.....
ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైన శ్రీ అనంతలక్ష్మి గారు,
శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు,
ప్రముఖ పారిశ్రామికవేత్తలు/అధ్యాత్మతత్పరులు, శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు ( శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు), మరియు ఇతర వివిధ అధ్యాత్మతత్పరులను వారికి అతిచేరువలో ఉండి ప్రత్యక్షంగా దర్శించడం, ఇత్యాదిగా ఎన్నో మధురస్మృతులతో, తుదకు రాత్రి 10 గంటల ప్రాంతంలో, శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు యాగశాలలో సోమయాజిగా అవబృథ స్నానం ఆచరించగా అందులో కూడా పాల్గొని వేదమూర్తులచే మహత్తరమైన ఆశీస్సులను అందుకోవడం నా జన్మాంతర సుకృతం.....😊🍕🍦🎇🍧🎂🙏
ముఖే ముఖే సరస్వతీ అని మన పెద్దలు సెలవిచ్చినట్టుగా.....
యజ్ఞ్యానికి విచ్చేసిన వందలాది భక్తులలో / ఋత్విక్కులలో ఏ మహానుభావుడి గాయత్రి శక్తి ఎంత మహిమాన్వితమైనదో ఎవ్వరికెరుక....
ఒక్కొక్కరి అనుగ్రహం ఎక్కడ మనకు ఎవ్విధంగా అనుగ్రహించనుందో ఎవ్వరికెరుక....
ఒక్కో మహానుభావుడు నిండు హృదయంతో, మంచి మనసుతో....
" ఈం " అని పిలవగా,
ఎక్కడ ఏ సరస్వతీ ఉపాసకులు ఉన్నా సరే అక్కడికి వారిని రప్పించగల గాయత్రీ వైభవం తో అలరారే ఆధ్యాత్మికవేత్తలు గల మహోన్నత దేశం / సంస్కృతి సంప్రదాయం మన సనాతనధర్మానిది....😊
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే.....
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే......
సర్వం శ్రీ చండికా పరదేవతార్పణమస్తు.....
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment