Sunday, July 14, 2024

శ్రీ క్రోధి నామ సంవత్సర 2024 జ్యేష్ట శుద్ధ ద్వాదశి / త్రయోదశి / చతుర్దశి ప్రయుక్త తిరుమల శ్రీమలయప్పస్వామివారి జ్యేష్టాభిషేక ఉత్సవ శుభాభినందనలు..🙂😊😊


తిరుమల శ్రీవారికి సంవత్సరాంతం నిర్వహింపబడే ఉత్సవాలు ఎన్నో ఎన్నెన్నో....ఒక్కో ఉత్సవానిది ఒక్కో ప్రత్యేకత...ఒక్కో మహిమ్నత..ఒక్కో ఫలితం / అనుగ్రహం...

తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేక ఉత్సవం ఎంతో విశిష్టమైన, ప్రత్యేకమైన, మహిమాన్వితమైన, వార్షికోత్సవం...

పంచామృతాలతో, వివిధ సుగంధద్రవ్యాలతో నిర్వహింపబడే అభిషేక ఉత్సవానంతరం,
ముచ్చటైన మూడు వస్త్రాలంకరణల్లో 
(వజ్రకవచం, ముత్యాలకవచం, స్వర్ణకవచం) భక్తులకు శ్రీమలయప్పస్వామివారు దర్శనం ప్రసాదించే అరుదైన అపురూపమైన వార్షికోత్సవం తిరుమల జ్యేష్టాభిషేక ఉత్సవం...

"గోప్త్రీ గోవిందరూపిణి" గా ఆరాధింపబడే ఆ ఆదిపరశక్తి యొక్క
శ్రీలలితాసహస్రనామాల్లో,
"త్రయి త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలిని"
అనే నామావళిని భక్తులు గమనించే ఉంటారు...

మూడు సంఖ్య మీద నడిచే ఆదిపరాశక్తి యొక్క త్రయి తత్త్వం ఎన్నో తత్త్వసమన్వయాలను, తత్త్వార్ధ విశ్లేషణలను సూచించే గౌణం.

ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః /
ఋగ్ సామ యజురేవచ / 
అనే నామాలను భగవతి / భగవద్ అర్చనల్లో ఎప్పుడో ఒకప్పుడు విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు...

ఈ కలియుగంలో మనుష్యుల మేధోసంపత్తి యొక్క పరిమితి రీత్యా, అందరూ అన్ని వేదశాఖలను కూలంకషంగా అధ్యయనం గావించడం దుర్లభమనే సత్యాన్ని దర్శించిన ద్రష్టలై, ఏకమైఉండే వేదరాశిని విభాగించిన శ్రీవేదవ్యాస మహర్షుల వారు ఒక్కోవిధమైన వైశ్విక శక్తిని ఒక్కో వేదశాఖలో నిఘూడపరిచి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అనే మూడు ముఖ్యమైన శాఖల్లో ఆ త్రయి యొక్క శక్తిని నిక్షిప్తం గావించి ఈ లోకానికి వారి శిష్యపరంపర ద్వారా అందించి అనుగ్రహించారు...

ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం ఎంత విచిత్రమైనదో ఎన్నో పురాణకథనాల్లో శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు....

వాయుదేవుడు ఎంతటి ప్రచండమారుతాలను సృజించినా సరే,
ఆదిపరాశక్తి ఆజ్ఞ్యను ఔదలదాల్చిన ఒక గడ్డిపరకను, అంగుళం కూడా కదపలేని వృత్తాంతం గురించి వినేఉంటారు కద...

"తాటంకయుగళీభూతతపనోడుపమండలాయై నమః" అనే నామావళిలో వాగ్దేవతలు వచించినవిధంగా,
ఆదిపరాశక్తి యొక్క ఒక తాటంకంలో సూర్యమండల శక్తి, మరో తాటంకంలో చంద్రమండల శక్తి, కొలువై ఉండును...

"తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయై నమః"
అనే నామావళిలో వాగ్దేవతలు వచించినవిధంగా,
ఆదిపరాశక్తి యొక్క నాసాభరణంలోని వజ్రం యొక్క కాంతి యావద్ తారామండలం యొక్క కాంతినే అధిగమించేంతటి శక్తివంతమైనదిగా ఉండును...

అనగా సూర్య చంద్ర తారామండలాల శక్తిని తన ముఖపంకజమయూఖ శక్తిగా సృజించే ఆదిపరాశక్తి,
ఆయా ఖగోళ మండలాల శక్తిని, అనుగ్రహాన్ని, వాటిచే ప్రభావింపబడే జీవుల ప్రార్ధనలకు అనుగుణంగా వారికి అనుగ్రహించి తరింపజేయడం ఇక్కడి తత్త్వసమన్వయం....

బెజవాడ / ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర దేవాస్థానం గురించి అవగాహన కలిగిన వారికి తెలిసినట్టుగా, అక్కడ అమ్మవారు మనకు కనిపించే సౌమ్యమూర్తిగా ఉన్న దుర్గమ్మ గా కాకుండా, సాధారణంగా భక్తులకు కనిపించని మహోగ్రరూప దుర్గమ్మ గా కొలువైఉన్న కథనం కొందరిలోకొందరు భక్తులకైనా ఎరుకే అనుకుంటా...

అనగా ఒకే ఆదిపరాశక్తి, ఒకదెగ్గర ఎంతో ఉగ్రస్వరూపంలో ఎవ్వరూ ఎదురునిలవలేనంతటి లయకారక శక్తిప్రకటనంతో ఉండడం...
ఇంకో దేగ్గర ఎంతో ప్రసన్నవదనంతో సామాన్య భక్తులెవ్వరైనా సరే దర్శించుకోగల చిద్విలాసభరిత సౌమ్యమూర్తిగా షోడశకళాత్మక అనుగ్రహ శక్తిప్రకటనంతో ఉండడం....
మనకు లౌకికంగా విదితమైన సత్యమే...

ఒకానొక సందర్భంలో మనం ఎంతో కఠినంగా ఉంటూఉంటాం...
ఒకానొక సందర్భంలో మనం ఎంతో సౌమ్యంగా ఉంటూఉంటాం...
సామాన్యంగా చాలా సందర్భాల్లో మనం సాధారణంగా ఉంటూఉంటాం...

ఈ మూడు సందర్భాల్లో కూడా ఉన్నది
ఒక్కరే అయిన మనమే కద..
దేశకాలనుగుణంగా, సందర్భానుసారంగా, ఆయా కార్యాచరణకు ఆవశ్యకమైన రీతిలో అలా వివిధ రీతుల మన సామాన్య శక్తి ప్రకటనమే ఉన్నప్పుడు...

మానవమేధోపరిధికి అందనంత ఉన్నతంగా ఉండే దేవతాతత్త్వశక్తి కూడా అట్లే తీవ్రాతితీవ్రము, సౌమ్యాతిసౌమ్యము, సాధారణము అనే మూడు విధాలా ఉండును అని విజ్ఞ్యులు అంటే మీరు కాదని అనగలరా...?

ఎక్కడివరకో, ఎవరివరకో ఎందుకు...
మన శ్రీమద్రామాయణంలో మన శ్రీరాముణ్ణే ఎగ్సాంపుల్ గా తీసుకుందాం...

శ్రీరాముడు సాధారణంగా మితభాషి, స్మితభాషి, హితభాషి, పూర్వభాషి...
అనగా విజ్ఞ్యులైన ఎవ్వరైనా సరే శ్రీరాముడితో ఇట్టే స్నేహితులై ఉందురు...

సౌమిత్రి సహిత సీతారాములను గంగ ఆవలి తీరము నుండి ఈవలి తీరానికి కొనిపోవుటకు పడవ నడిపిన గుహుడి దెగ్గరినుండి....,
సీతారాముడికి అడవిలో సాధారణంగా దొరికే బదరి ఫలాలను / రేగు పండ్లను అందించి, సద్యో అనుగ్రహఫలితంగా ఏకంగా ఊర్ధ్వలోకాలకు ఏగిన భక్తశబరి వరకు....,
శ్రీరాముడి సౌజన్యాన్ని, స్నేహాన్ని, మైత్రిని ఎవ్వరైనా సరే ఎంతో ఘనంగా కొనియాడుతారు.....

అటువంటి సౌమ్యమూర్తి అయిన శ్రీరాముడు, ఖరదూషణయుద్ధ సమయంలో...
"ఓ సౌమిత్రి కాసేపు నువ్వాగు......
ఇవ్వాళ ఈ రాముడి భుజస్కందములనుండి వినిర్ముక్తమయ్యే ఆగ్రహభరిత శరసమూహాలకు ఈ మూడులోకాల్లో ఎవరు ఎదురునిలవగలరో చూసెద..."
అని, ఆ కోడండ సంధిత శరప్రహార శక్తికి అడుగు వెనక్కి జరిగినా సరే అది ధనుర్వేదశాస్త్ర ప్రకారంగా సంధించడానికి తగినంత చోటులేనప్పుడు గావించే అపసర్పణం మాత్రమే అని విజ్ఞ్యులచే సమన్వయం అందుకున్న రాముడి తీవ్ర అవేశాన్ని,
ఆ తీవ్రాతితీవ్రమైన కోపం ముందు యావద్ ఖరదూషణసేన  రమారమి మూడు ముహూర్తాల వ్యవధిలో లయింపబడిన వృత్తాంతాన్ని మీరు శ్రీమద్రామాయణంలో వినే ఉంటారు కద...

కాబట్టి ఏకత్వంలోనే వైవిధ్యం అనే ప్రత్యేకత, అందరిలోను, అన్ని తత్త్వాలలోను అనాదిగా కొలువైఉన్నదే...

వజ్రకవచం దుర్భేద్యమైన, కఠినమైన, తత్త్వాలకు ప్రతీక...

ముత్యపుకవచం సౌమ్యతకు, చల్లదనానికి, మృదుత్వానికి, ప్రతీక...

స్వర్ణకవచం దారుఢ్యానికి, పుష్టికి, ఓషధీశక్తికి, ప్రతీక...

ఇవ్విధమైన దేశకాల తత్త్వానుసంధీకృత మేధోపాటవాన్ని, బౌద్ధికశక్తిని అనుగ్రహించే పరమాత్మయొక్క వైభవమే తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేక ఉత్సవం....

ఈ కలియుగంలోని పరిమితుల దృష్ట్యా అందరూ అన్నిరకాల ఉపాసనలను గావించలేరు...
ఆనాడు ద్వాపరంలో ధర్మరాజు ఎన్నో యజ్ఞ్యయాగాలను చేసి, దేవతల అనుగ్రహాన్ని అందుకున్నాడు కాబట్టి, ఈనాటి కలియుగంలో ధర్మాత్ములందరూ అట్టి ఎన్నో యజ్ఞ్యయాగాలను చేయుదురు అని అనుకోవడానికి కుదరదు...
ఈ కలియుగంలో తిరుమలేశుడి దర్శనం ఎన్నో యజ్ఞ్యయాగాలను నిర్వహించిన పుణ్యఫలితాన్ని భక్తులకు అనుగ్రహించును...

ఇక లౌకికంగా తిరుమల ఆచారసంప్రదాయానుగుణంగా నిర్వహింపబడే జ్యేష్టాభిషేకం యొక్క విశేషాలు భక్తులకు విదితమే...

https://youtu.be/dgq31BdDfuo?si=FKpLQyK47tS4GDAI

అట్టి మహిమాన్వితమైన తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేక ఉత్సవం భక్తులెల్లరూ అంతర్జాలంలోనైనా దర్శించి తరించెదరు గాక...
🙂💐

స్వామి వారికి త్రివిధ కవచాలాను అలంకరిస్తున్నాము అని అనుకోవడం కంటే, స్వామివారికి త్రివిధ కవచాలను అలంకరించడంతో వివిధ అనుగ్రహాన్ని అందుకొని భక్తులు తరిస్తున్నారు అని అనడం భక్తిప్రదమైన భావన...

అందుకే అన్నారు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు,

జగతికి నీపాదజలమే సంప్రోక్షణ
జిగినీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్నునేడు పావనము సేయుటకు
అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే

అని, వారి ఈ క్రింది మహిమాన్వితమైన సంకీర్తనలో...

యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను
యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే

పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతి( బ్రాణప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ముగాచెడికొరకు
హరి నీమూర్తి ప్రాణ మావహించవే

జగతికి నీపాదజలమే సంప్రోక్షణ
జిగినీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్నునేడు పావనము సేయుటకు
అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే

వేదములు తిచ్చిన శ్రీవేంకటేశ నేము నీకు
వేదమంత్రముల పూజావిధి సేసేమా
యీదెస నీదాసులమయిన మమ్ముగాచుటకు
వేదమూర్తివై యిందే విచ్చేశి వుండవే

https://annamacharya-lyrics.blogspot.com/2007/11/339yajnamurti-yajnakarta.html?m=1

సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీశ్రీనివాసపరబ్రహ్మార్పణమస్తు...🙏💐


No comments:

Post a Comment