Sunday, July 14, 2024

శ్రీ క్రోధినామ 2024 సంవత్సర భౌమ్యవాసర ప్రయుక్త ఆషాఢ శుద్ధ తదియ, శ్రీ బల్కంపేట్ రేణుకా హేమలాంబ (ఎలమ్మతల్లి) కళ్యాణ మహోత్సవ శుభాభినందనలు


పెద్దపెద్ద ఆకాశహర్మ్యాలు, సముద్రమధ్యలో, దీవుల్లో పెద్దపెద్ద భవంతులు, కళ్ళకు స్వాంతన కలిగించే పచ్చగడ్డి కూడా కనిపించనంతగా విస్తరించిన నున్నని సిమెంట్ రోడ్లపై శరవేగంతో దూసుకెళ్ళే కాలుష్యకారక వాహనాలు, 
ఇత్యాది భౌతిక వస్తుసామాగ్రి వల్ల కొన్ని ఇతర దేశాలకు పేరుప్రఖ్యాతలు కలవు...
ఇవన్నీ కూడా మనస్సుకు ప్రశాంతమైన
ఆలంబనను ఇయ్యజాలని నశ్వరమైన భౌతికసిరులు...
ఆధునిక ప్రపంచానికి, పెరిగిపోతున్న ప్రపంచజనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న మహానగరాలకు ఇవి ఆనవాళ్ళు మరియు ఆవశ్యకమైన కట్టడాలు అన్నది నిజమే...కాబట్టి వీటిని తక్కువచేసి మాట్లాడడం ఇక్కడి అభిమతం కాదు....

అవి మనిషి యొక్క మనసుకు నిజమైన ప్రశాంతతను, ఆనందాన్ని, అనుగ్రహించే సాధనములుగా అన్నివేళలా పరిగణించలేము అని చెప్పడం మాత్రమే ఇక్కడి అభిమతం...

అనాదిగా ఈ భారతదేశం యొక్క ఖ్యాతి మొత్తం ఈ నేలపై వెలసిన దేవతలవల్లే ఒనగూరుతున్నది అనేది జగమెరిగిన సత్యం....

మనిషి యొక్క పరిమితమైన మేధకు అందనంత ఎత్తులో ఉండే దేవతా తత్త్వం గురించి తెలుసుకోవడానికి అనాదిగా విజ్ఞ్యులు ప్రయత్నిస్తూనే ఉన్నారు..
ఆ ప్రయత్నంలో ఒక్కో మాన్యుడు ఒక్కోలా వారు తరించి, ఇతరులను తరింపజేస్తున్నారు...

"ఫలానా దేశంలో ఫలానా పేద్ద పేద్ద బిల్డింగ్లు ఎక్కివచ్చాము...
ఫలానా ప్రదేశాలను, కట్టడాలను చూసి వచ్చాము....
ఈ విహారయాత్రలో అవన్నీ తిరుగుతూ తిరుగుతూ ఇంటికి వచ్చేసరికి ఎంతగా అలిసిపోయామో తెలుసా..."
అని ఎవరైనా ఎప్పుడైనా క్యాజువల్ గా అనేయడం గురించి వినేఉంటారు కద...

అంటే, మీరు ఎన్నెన్నో భౌతిక ప్రదేశాలు తిరిగినాసరే, అనందం, ప్రశాంతత యొక్క అన్వేషణలో ఉండి తుదకు మీరు అలసటను మాత్రమే ఫలితంగా పొంది తిరిగివచ్చారు....కద..
ఎండమావిలో నీటి యొక్క అన్వేషణలా, అలసట అనేదే కేవల భౌతికత యొక్క స్వభావం...

"మేము ఫలానా తీర్థయాత్రలో భాగంగా, ఫలానా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి వచ్చాము... మనసు ఎంత ప్రశాంతంగా, ఆనందంగా ఉందో తెలుసా..."
అని ఎవరైనా ఎప్పుడైనా క్యాజువల్ గా అనడం గురించి వినేఉంటారు కద...
పూదోటలో పరిమళాన్వేషణలా, ఆనందం అనేది దైవత్వం తో ముడిపడిన భౌతికత యొక్క స్వభావం...

అందుకే ప్రపంచంలోని ఎందరో విజ్ఞ్యులు, మేధావులు, పండితులు, వైజ్ఞానికులు, శాస్త్రవేత్తలు, కోవిదులు, కవులు, రాయబారులు..,
మన భారతావని యొక్క భవ్యమైన దైవత్వసిరులకు, దైవత్వం మేళవించి ఉండే,
శిల్ప, నృత్య, సంగీత, సాహిత్యాది కళలను వేనోళ్ళా కొనియాడి చరిత్రలో కీర్తికాయులైయ్యారు....

దేవభూమి, వేదభూమి, జ్ఞ్యానభూమి, ధర్మభూమి, కర్మభూమి, అని ఒక్కొక్కరూ ఒక్కోలా వారివారి స్మృతుల, అనుభవాల, ఆశ్చర్యాల, అద్భుతాల, ఆనందాల సమాహారంగా ఈ భారతదేశం యొక్క గొప్పదనం గురించి ప్రపంచానికి వారివారి భాషాత్మకవైభవంతో వివరించి సంతసించినారు..తద్వారా భావితరాలకు కూడా భారతదేశ దైవిక సంపత్తి పట్ల గౌరవాన్ని, మక్కువను, కలిగించి తరింపజేసిన మాన్యులైనారు..

అట్టి భారతావని యొక్క కీర్తిసిగలో మేలిమివజ్రాలవంటి స్వయంభూ ఆలయాలు ఈ దేశంలో అనేకం కలవు...
శ్రీ ఆదిశంకరాచార్యుల అనుగ్రహమైన పంచాయతన ఆరాధనా విధానంలో, శాక్తేయ సంప్రదాయంలో
ఎంతో విశేషమైన వైభవంగల 18 శక్తిపీఠాలతో పాటుగా, ఆదిపరాశక్తి ఎన్నెన్నో ఇతర స్వయంభూ క్షేత్రాల్లో ఎంతో మహత్వభరిత ఐతిహ్యాంతో కొలువై, భక్తులను విశేషంగా అనుగ్రహిస్తూ అలరారుతున్నది...

అట్టి మహత్వభరిత పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా,
వందలాది సంవత్సరాల వైభవంతో, విశేషమైన శక్తిక్షేత్రంగా అలరారుతున్నది, బల్కంపేట్ శ్రీ రేణుకా హేమలాంబ ఆలయం...
నైసర్గిక పరిభాషలో నూతిలో స్వయంభూ మూర్తిగా వెలసిన 
ఎల్లమ్మతల్లిగా ఆరాధనలు అందుకుంటూ, భక్తులను ఘనంగా అనుగ్రహించే అమ్మవారిగా భాగ్యనగరవాసులకు ఆరాధ్యదైవంగా భాసిల్లే ఎల్లమ్మతల్లి ఎందరికో సుపరిచితమైన చల్లనితల్లి...

హేమము అనగా అర్ధం స్వర్ణము/బంగారం అనిమాత్రమే కాదు..
స్వర్ణసదృశమైన శ్రేయోతత్త్వాసమూహానికి, శ్రేయోదాయక తత్త్వానికి కూడా హేమము అని అర్ధం...
అందుకే శ్రీమహాలక్ష్మి అమ్మవారిని

" సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమయే"

అని కీర్తించేది....

లోహ, తామ్ర, తగర, రజత, సీసాది, భూజనిత ఖనిజ
సామాగ్రి యందు స్వర్ణానికి అనాదిగా ఉన్న ప్రాముఖ్యత, ప్రాభవం, విలువ, వాడుక, వర్తకవాణిజ్య వైభవం ఎల్లరికీ తెలిసిందే....

కారణం ప్రత్యక్షపరమాత్మైన సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే 7 రకాల కిరణాల్లో ఒకటైన హేమతత్త్వ కిరణం యొక్క ప్రభావం వల్ల, భూమిపొరల్లో ఆ హేమశక్తి ప్రోదిచెంది బంగారు ఖనిజంగా రూపాంతరం చెందును..అందుకే
శుద్ధిప్రక్రియానంతరం లభించే 100% స్వర్ణంతో నగలను, వస్తువులను తయారు చేయడం కుదరదు...
పరిశుద్ధమైన స్వర్ణానికి చాలా తక్కువ మోతాదులో రాగిని జోడించి అప్పుడు నగలను, ఇతర బంగారు వస్తువులను స్వర్ణకారులు తయారుచేస్తారు...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్నవారికి గుర్తున్నట్టుగా, అనాదిగా భారతీయులు పరిమితమైన మోతాదులో
స్వర్ణాభరణాలను ధరించేది కేవలం ఫ్యాషన్ కోసం కాదు..
ఆయుర్వేదశాస్త్రప్రకారంగా మన శరీరానికి సూక్ష్మస్థాయిలో స్వర్ణం పుష్టికారకమైన చక్కని ఔషధం...

సాధారణంగా ఇతర ఏ వస్తువులతోను కూడా పెద్దగా ప్రభావితం కాని పదార్ధం స్వర్ణం...
అందుకే రాజులకాలం నుండి ఇప్పటి మన ఆధునిక కాలం వరకు కూడా ఒక దేశం యొక్క కరెన్సి నీ ఆ దేశం యొక్క బంగారునిల్వలకు అనుగుణంగామాత్రమే ముద్రిస్తారు..
ఎందుకంటే యుగాలు గడిచినా కూడా ఆ బంగారు నిల్వలు ఎప్పటికీ అట్లే ఉంటాయి కాబట్టి....

పరమాత్మ తత్త్వం కూడా పరిశుద్దమైన స్వర్ణతత్త్వం వంటిది...
శాశ్వతమైన, సార్వజనీనమైన, సకల శ్రేయోదాయక తత్త్వం...
యుగయుగాల్లో జగజగాల్లోను సర్వేసర్వత్రా నిండినిబిడీకృతమైన స్వర్ణం వంటి పరమాత్మతత్త్వాన్ని ఉపాసనతో భక్తులు అందుకొని శాశ్వతత్త్వం యొక్క మహత్తును ఆకళింపు చేసుకోవడమే భగవతత్త్వంలోని విశేషం...

అదే అసలైన పరసువేది విద్య...
అనగా పరతత్త్వంతో అనుసంధానం చెంది మృణ్మయం చిమ్మయం గా రూపాంతరం చెంది, మనిషి మహర్షిగా రూపంతరం చెందుతూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఘనంగా అందుకొని పరతత్త్వ ప్రాభవానికి ఆవాసమై చివరికి పరతత్త్వంలో ఐక్యం అవ్వడమే మనిషి జన్మకు సిద్ధించే సవోన్నతమైన అనుగ్రహం..
అని తెలుసుకునే విధంగా జీవిస్తూ, అభివృద్ధిచెందడం...

శ్రీశైల పాతాలగంగా జలసిరుల్లో అదృశ్యరూపంలో నిక్షిప్తమైఉన్న పరసువేదివిద్య గురించి కాదు నిజమైన సాధకులు ఆలోచించవలసింది...
నిత్య సూర్యోపాసనతో, మనశరీరమే పరసువేదికి వేదికగా రూపాంతరం చెందేవిధంగా, పరమాత్మయొక్క ఆరాధనలోని మహత్తును గ్రాహ్యపరుచుకుంటూ, వారివారి వర్ణాశ్రమధర్మాలకనుగుణంగా తగిన గాయత్రిని ఉపాసిస్తూ, జీవితంలో, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, శక్తియుక్తులను, సిరిసంపదలను, గడిస్తూ, వాటిద్వారా పరమాత్మ తత్త్వాన్ని మరింత మెండుగా ఉపాసిస్తూ సార్ధక్యం చెందడమే విజ్ఞ్యులకు జీవనసాఫల్య సిద్ది...

అట్టి పరతత్వాన్ని, పరతత్త్వం యొక్క అనుగ్రహాన్ని, భక్తులకు మెండైన రీతిలో అనుగ్రహించే పరదేవతగా,  శ్రీ రేణుకా హేమలాంబ అమ్మవారు వెలసిఉన్న బావిలోని నీళ్ళు ఎంతో ఔషధీమహత్తుతో ఉండే జలప్రసాదం అని అనాదిగా భక్తుల విశ్వాసం....

నిన్నటి వార్షిక ఆషాఢమాస కళ్యాణమహోత్సంలో,
అట్టి హేమతత్త్వభరిత పరాశక్తిగా కొలువైఉన్న ఎల్లమ్మతల్లి దర్శనప్రసాదములతో తరించిన భాగ్యవిశేషానికి ప్రణమిల్లుతూ, శ్రీ హేమలాంబ అమ్మవారి శ్రీపాదపద్మములకు సవినయ సాక్షరాంజలి ప్రయుక్త నమస్సుమాంజలి...💐😊

మాణిక్యవీణాముపలాలయంతీం 
మదాలసాం మంజులవాగ్విలాసామ్ ।
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం 
మాతంగకన్యాం మనసా స్మరామి ॥

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ ।
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ॥

నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం 
త్రికాలజ్ఞ్యానసంపన్నాం నమామి భువనేశ్వరీం..🙏
💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment