Sunday, July 14, 2024

శ్రీ క్రోధి నామ సంవత్సర 2024 ఆషాఢ శుద్ధ నవమి, శ్రీ చాగంటి సద్గురువుల చాంద్రమాన జన్మదినోత్సవం మరియు రానున్న శ్రీవ్యాసపౌర్ణమి / గురుపౌర్ణమి శుభాభినందనలు...🙂💐


ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని శ్రీగురుస్వరూపంగా భావించి, విశ్వసించి, సేవించి, ఆరాధించడంలోని ఆంతర్యం / వైభవం ఏమి...?

ఒక సామాన్యుడికి కూడా అర్ధమయ్యే విధంగా వివరించాలంటే....

గురువుగారి ప్రవచనాల్లో ఒకచోట ఉటంకింపబడిన విధంగా...
భగవంతుడి పూజ చేయడం ఎందుకు..? అని అంటే...
భగవద్ పూజ చేయడం ద్వారా మనం పూజ్యులం అవుతాము..(తద్ భగవద్ కృపతో)
అంతేకాని భగవంతుడికి పూజచేసే వారు లేకకాదు...

శ్రీచాగంటి సద్గురువులకు ఆప్తమితృలైన శిష్యులు,
శ్రీ గోపాలకృష్ణ గారి..
"ఇప్పుడిక పూజ్యగురువులను వారి ప్రవచనం ప్రారంభించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను..." అనే పలుకులు...
కొందరికైనా బాగా గుర్తుండే ఉంటాయ్....

[ మరెందరో మాన్యులు కూడా అవ్విధమైన వచనములే పలికినా ఇక్కడ శ్రీగోపాలకృష్ణ గారి వచనములే ఎందుకు ప్రస్తావించానంటే...,
"ఉదాహరణకు, మీరు గోపాలకృష్ణ గారిని భోజనానికి పిలవకుండా, కేవలం నన్ను మాత్రమే ఆహ్వానిస్తే నేను వస్తానా..?" అని శ్రీ చాగంటి సద్గురువులు ఒకచోట ఒకానొక సందర్భంలో చమత్కరించడం కొద్దిలో కొద్దిమందికైనా గుర్తుండిఉండాలి....]

అనగా పూజ అనేది పూజింపడే వారికంటే, పూజించే వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే సాధనం ..

అనగా ఒక ఉదాత్తమైన, ఉత్తములైన, విజ్ఞ్యులను గురువుగారిగా ఆరాధించడం ద్వారా...
వారి యందు మనయొక్క గురుభావనతో,
అమేయమైన గురుబలం సంప్రాప్తించును...

ఇక్కడ "గురుబలం" అనే పదాన్ని మీరు వివిధ రీతుల సమన్వయపరచవలసి ఉంటుంది...

అది లౌకికమైన గురుగ్రహబలం అనేది ఒక అర్ధం...
శ్రీమేధాదక్షిణామూర్తి ఆదిగురువుగా ఉండి,
చతుర్ముఖబ్రహ్మగారి తో మొదలై,
ఎందరెందరో బ్రహ్మజ్ఞ్యానుల నుండి ఎన్నో యుగాలుగా కొనసాగుతూ...
ఇప్పుడు మనం ఉన్న ఈ కలియుగంలో...
శ్రీవ్యాసమహర్షి గారు మరియు వారి పుత్రులు శ్రీశుకయోగీంద్రుల వారి అనుగ్రహంగా ఎందరెందరో విజ్ఞ్యులు గురుస్వరూపంగా ఈ లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు......
అట్టి గురుపరంపరానుగ్రహబలం అనేది ఇంకో అర్ధం....

అక్కడెక్కడో శ్రీశైలం హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్లాంట్ దెగ్గర నిరంతరాయంగా ఉత్పాదన చెందే విద్యుత్ శక్తి, ఒకానొక గహనమైన వ్యవస్థ ద్వారా నా ఇంటి వరకు ప్రసరింపబడి, నా ఇంట్లో కూలర్ స్విట్చ్ వేయగానే చల్లని గాలి లభించి నేను సేదతీరుతున్నాను అని అనడం ఎంత నిజమో...

శ్రీకైలాసం, శ్రీవైకుంఠం, సత్యలోకం, లో ఉండే దేవతల అనుగ్రహం మొదలుకొని...
అపరశంకరావతారులైన శ్రీఆదిశంకరుల తపఃశక్తి తో భువిపై నెలకొల్పబడిన చతురామ్నాయ పీఠాలు మరియు అందలి గురుపరంపరాగతమైన జగద్గురువులు, వారి అనుగ్రహసంపాకభరిత విజ్ఞ్యులచే అర్చారాధనలు అందుకునే ఆలయాలు, ఇత్యాది ఒక వ్యవస్థ ద్వారా గురువానుగ్రహం, దైవానుగ్రహం స్మరణ మనన నిధిధ్యాసనమనే మాధ్యమాల ద్వారా శిష్యులకు అందివచ్చును అని అనడం కూడా అంతే నిజం...

మనకు హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్లాంట్ గురించి
తెలియకపోయినా..
అనగా అందులో ఉండే పేద్దపేద్ద టర్బైన్ల గురించి, డ్యాంలో ఉన్న జలం యొక్క స్థితిశక్తి గతిశక్తిగా రూపాంతరం చెంది ఆ జలశక్తి నిరంతరాయంగా భ్రమణం గావించే టర్బైన్ల ద్వారా విద్యుత్ శక్తిగా రూపాంతరం చెందుతూ, వివిధ స్టెప్ అప్ / స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా మన ఇంటివరకూ అల్యూమినియం తీగల ద్వారా ప్రసరింపబడుతూ ఉండగా, మన ఇంట్లో ఉన్న డొమెస్టిక్ మీటర్ కి అనుసంధానమై ఉండే ఎలెక్ట్రిక్ వ్యస్థకు 230 వోల్ట్ల విద్యుత్ శక్తి గా అందుబాటులోకి వచ్చే ఆ గహనమైన వ్యవస్థ గురుంచి మనకు ఏమి తెలియకున్నా....
మనం ఇంట్లో స్విట్చ్ వేయగా, బల్బ్, మిక్సి, కూలర్, టీ.వి, ఇత్యాది వివిధ గృహోపకరణాల ద్వారా ఆ విద్యుత్ శక్తి యొక్క అనుగ్రహం లభించి తరించడం ఎట్లో...,
సనాతనధర్మాంతర్గత గురుపరంపరాగతమైన ఈశ్వరానుగ్రహం కూడా అట్లే...

గురువానుగ్రహం / ఈశ్వరానుగ్రహం అనేది విద్యుత్ శక్తి..
విశ్వాసం అనేది విద్యుత్ తీగ...
మనోసంకల్పం అనేది స్విట్చ్...
ఈ మూడు అనుసంధానింపబడినప్పుడు సాధింపబడజాలనిదంటూ ఈ లోకంలో లేదు...

సదరు విద్యుత్ శక్తికి సంబంధించిన లౌకిక వ్యస్థను మరియు ఆ శాస్త్రాన్ని మీరు ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్ అనే పేరుతో గౌరవిస్తే...
సదరు గురువానుగ్రహం / ఈశ్వరానుగ్రహానికి సంబంధించిన అలౌకిక వ్యస్థను మరియు ఆ శాస్త్రాన్ని మీరు అధ్యాత్మ శాస్త్రం / స్పిరిట్చువల్ ఎంజినీరింగ్ అనే పేరుతో గౌరవించవలసి ఉంటుంది...

సదరు గహనమైన అధ్యాత్మ శాస్త్రం గురించి మనకు పెద్దగా ఏమితెలియకపోయినా...
అనగా...
సంస్కృత భాషా పాండిత్యం,
రేచక పూరక కుంభక సమ్మిళిత ప్రాణాయామ శక్తి, 
శ్లోక / మంత్ర / పద్య / గద్యాది సారస్వత శక్తి, గాయత్రి ఉపాసకులు, త్రికాలవేదులు, తపోధనులు, మహర్షులు, సాధుసత్పురుషసజ్జనులు, బ్రహ్మజ్ఞ్యానులు, ఇత్యాది మాన్యుల గురించి పెద్దగా ఏమితెలియకపోయినా...
త్రికరణశుద్ధిగా గురువులు బోధించిన సద్విషయాలను క్షీరనీర న్యాయంతో సంగ్రహించి, విశ్వసించి, నమస్కరించి, ఆరాధించి, తరించడం కూడా స్విట్చ్ వేసి కూలర్ ఆన్ చేసి చల్లగాలిని ఆస్వాదించడం లాంటిదే...

ఒక సాధారణ ఇనుపకడ్డి నిరంతరం ఒక అయస్కాంతపదార్ధం తో అనుసంధానింపబడగా, ఆ కేవల ఇనుపకడ్డి కాలక్రమంలో అయస్కాంతంగా రూపంతరంచెందును అనేది లౌకిక సైన్స్ అనే శాస్త్రం యొక్క విశ్వాసం...
ఈ సిద్ధాంతాన్ని 'లా ఆఫ్ మాగ్నెటిసం' అని సైన్స్
నిర్వచించును....

అచ్చం అదేవిధంగా ఒక సాధారణ సజ్జనుడు నిరంతరం ఒక సద్గురువుల బోధలతో అనుసంధానింపబడిఉండగా, ఆ కేవల సజ్జనుడు కాలక్రమంలో బ్రహ్మజ్ఞ్యానిగా రూపంతరంచెందును అనేది అలౌకిక సైన్స్ / అధ్యాత్మ శాస్త్రం యొక్క విశ్వాసం...
ఈ సిద్ధాంతాన్ని 'భ్రమర కీటక న్యాయం' గా శాస్త్రం నిర్వచించును...

అట్టి భ్రమర కీటక న్యాయంతో, కొన్ని కోట్లాది శిష్యులను బ్రహ్మజ్ఞ్యానులుగా తీర్చిదిద్దిన అభినవశుకయోగీంద్రులుగా, శ్రీ చాగంటి సద్గురువులు మన ఈకాలం నాటి విజ్ఞ్యులెందరికో సదా ఆరాధ్యులు...

ఆనాడు బాలకాండలోని దశరథప్రియసుతుణ్ణి,
అరణ్యాలకు యాగసమ్రక్షణార్ధమై తోడుకొనివెళ్ళిన తదుపరి,
ఆ కోమల, సుకుమార అంతఃపుర బాలరాముణ్ణి, అనన్యసామన్యమైన అప్రతిహత సుక్షత్రియ వీరుడిగా,
భూనభములు అచ్చెరువొందుతూ ప్రణమిల్లిన కోడండరాముడిగా, దేవతలు కూడా నమస్కరించే శ్రీరాముడిగా తీర్చిదిద్దిన శ్రీవిశ్వామిత్ర మహర్షుల వారంటే శ్రీరాముడికి ఎంతో ప్రేమభరిత గౌరవపూరిత అనిర్వచనీయమైన భక్తి...
ఎందుకంటే అది నిజమైన నిస్వార్ధమైన గురుశిష్యుల ఆజన్మాంతర మైత్రీబంధం....

అనాడు శ్రీవిశ్వామితృల వారికి ఒక్క శ్రీరాముడే శిష్యుడై ప్రణమిల్లెను...
ఈనాడు శ్రీచాగంటి సద్గురువులకు యావద్ ప్రపంచంలో ఎందరెందరో శ్రీరాముడి వంటి శిష్యులు ప్రణమిల్లడం ఈ తరానికి లభించిన విశేషమైన ఈశ్వరానుగ్రహం....

గురువానుగ్రహానికి శతధా ప్రణమిల్లడమే శిష్యుడి సౌభాగ్యం😊
వారి జన్మదినోత్సవం మరియు రాబోయే వ్యాసపౌర్ణమి / గురుపౌర్ణమి పర్వసందర్భంగా వారి శ్రీపాదపద్మములకు ప్రణామములతో సమర్పింపబడే చిరుకావ్యాంజలి ప్రయుక్త సవినయ నమస్సుమాంజలి...💐🙏



No comments:

Post a Comment