Sunday, July 14, 2024

భారతరత్న, స్వతంత్రభారతదేశ 9వ ప్రధానమంత్రివర్యులు,శ్రీ పి.వి నరసిమ్హారావ్ గారి 103వ జయంతి శుభాభినందనలు..🙂💐

భారతరత్న, స్వతంత్రభారతదేశ 9వ ప్రధానమంత్రివర్యులు,
శ్రీ పి.వి నరసిమ్హారావ్ గారి 103వ జయంతి శుభాభినందనలు..
🙂💐

ఒక ఉన్నతమైన అధికారం భగవంతుడి దయతో ఎప్పుడు, ఎట్ల, ఎందుకు లభించింది అనేదానికంటే...
ఆ లభించిన అనుగ్రహంతో ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎవరికి, ఎంత, ఎట్ల అధికారాన్ని వెచ్చించి ధర్మపూరితమైన, సంపూర్ణమైన అధికారవినిమయంతో, శాశ్వతమైన కీర్తిని గడించి ప్రజల హృదయాల్లో, విజ్ఞ్యుల వచనాల్లో అమరులై జీవించడమే ప్రధానం అని విశ్వసిస్తూ జీవించే అతికొద్ది భారతదేశ ప్రఖ్యాత మాన్యుల్లో శ్రీ పి.వి గారి ఒకరు....

ఈనాడు మనం నాటే ఒక విత్తనం, ఒక మొక్క, ఒకనాడు యావద్ సమాజానికి గొప్పమేలును కలిగించే విధంగా ఉండాలి అనే ఒక గొప దార్శనికప్రజ్ఞ్యతో సమాలోచనగావించి, కుశాగ్రబుద్ధివైభవజనిత విద్వత్తుతో కార్యాచరణ గావించడం ఉత్తముల శైలి...
అటువంటి విజ్ఞ్యులవల్లె ఈనాడు మనం జీవితాభివృద్ధిని అందుకునేందుకు ఆవశ్యకమైన స్వేచ్ఛావాయువులకు పాత్రులమై, ప్రశాంతజీవనం అనే అనుగ్రహంతో వర్ధిల్లడం సాధ్యమయ్యేది...

మీ వద్ద ఒక పెద్ద మూటనిండా గోధుమపిండి ఉందనుకుంటే...

మీరు ఆ గోధుమపిండిని ఎవ్విధంగానైనా వినిమయపరుచుకోవచ్చు...

కేవలం మీరే రొట్టెలు చేసొకొని ఆరగించవచ్చు...
మీ శ్రేయోభిలాషులకు రొట్టెలు, పరోటాలు, భక్ష్యాలు ఇత్యాదివి వడ్డించి వినిమయపరుచుకోవచ్చు...
ఆలయంలో భక్తులకు అన్నదాననిమిత్తమై / గోవులకు దాన, తౌడు గా కూడా వినిమయపరుచుకోవచ్చు...

ఎవ్విధంగా వినిమయపరుచుకోవడం అని మాత్రమే అలోచించేవాడు సామాన్యుడు...
(మనం తిన్నది మరునాటికి మట్టిలో మట్టిగా అవుతుంది...)

ఎవ్విధంగా, ఎవరెవరికై వినిమయపరచడం అని అలోచించేవాడు మధ్యముడు...
(మనశ్రేయోభిలాషులకు పెట్టింది మనకు కృతజ్ఞ్యతను, పుణ్యాన్ని సముపార్జిస్తుంది...)

ఎవ్విధంగా, ఎవరెవరికై వినిమయపరిచి ఆ వినిమయానికి ఒక సార్ధకతను సంతరింపజేయగలము అని అలోచించేవాడు ఉత్తముడు...
(ప్రత్యక్షంగా భక్తభాగవతులకు / గోవులకు సమర్పించింది, తద్వారా పరోక్షంగా ఎన్నో జీవులకు, ఎందరో మనుష్యులకు, దేవతలకు కూడా సమర్పింపబడినదై అక్షయపుణ్యసిద్ధిని అనుగ్రహించును...)

ఇవ్విధముగనే, ప్రధానమంత్రి అనే ఒకానొక సర్వోన్నతమైన అధికార సంపత్తి కూడా....

అట్టి సర్వోన్నత పదవిని అలంకరించే సాధారణ స్థాయిలో అలోచించే మాన్యులు, వారి ఆస్తులను బాగా వృద్ధిపరుచుకునేందుకై వారి అధికారవినిమయాన్ని గావిస్తుంటారు...

అట్టి సర్వోన్నత పదవిని అలంకరించే మధ్యస్థ స్థాయిలో అలోచించే మాన్యులు, వారి, వారిని అశ్రయించిఉండే వారి ఆస్తులను బాగా వృద్ధిపరిచేందుకై వారి అధికారవినిమయాన్ని గావిస్తుంటారు...

అట్టి సర్వోన్నత పదవిని అలంకరించే ఉత్తమ స్థాయిలో అలోచించే మాన్యులు, వారిచే ప్రభావింపబడే ప్రతీ వ్యక్తి యొక్క శ్రేయస్సుకై, తద్వరా దేశం అనే వ్యష్టి యొక్క శ్రేయస్సుకై, తద్వారా ప్రపంచశాంతి అనే వైశ్విక ధర్మంద్వార విశ్వశ్రేయస్సుకై అధికారవినిమయాన్ని గావిస్తుంటారు...
తద్వారా దేవుడు మెచ్చిన, లోకం మెచ్చిన నాయకులుగా, శాశ్వతకీర్తిని గడించిన అమరులై సదా ప్రజలహృదయాల్లో జీవిస్తుంటారు...

ఎల్లప్పుడూ,
స్వవర్గం, పరవర్గం, మిత్రపక్షం, అఖిలపక్షం, ప్రతిపక్షం, అనే సాధారణ చట్రం గురించే కాకుండా, 
సదరు సమాన్యభారతీయుడి ఆర్ధికస్థాయిని / వికసనను, తద్వారా వారి జీవితాభ్యున్నతసూచిని, తద్వారా ఈ దేశప్రజల విమయశక్తిని, తద్వార యావద్ ప్రపంచయవనికపై భారతదేశ ఆర్ధికసంస్కరణల ప్రభావజనిత నవభారత శక్తిని, ఖ్యాతిని, ఎవ్విధంగా ఎంతగా ప్రభావింపచేయగలమో మాటల్లో కంటే చేతల్లోనే ఎక్కువగా చాటిచెప్పిన ఘనులు శ్రీ పి.వి గారు....

'ఆ పెద్ద ఈయనగనక చేసాడులే..'
'ఆ ఏముందిలే ఎవ్వరైనా చేస్తారు...'
ఇత్యాది పెదవివిరుపు మాటలే ఎక్కువగా మాట్లాడేవారు చుట్టూ ఉన్నాకూడా,
ఎంతో గొప్పగా మాట్లాడగల బహుభాషాకోవిదులైనా సరే, చాలాసార్లు మౌనాన్ని ఆశ్రయించి కార్యాన్ని సాధించే దీక్షాదక్షతగల నాయకుడిగా వారి హయాంలోనే ఎందరో విజ్ఞ్యులైన ప్రముఖులనే ఆశ్చర్యచకితులను గావించిన ప్రతిభగల ప్రధాని శ్రీ పి.వి గారు...

మన ఈ తరంవారందరికీ కూడా ప్రపంచీకరణ యొక్క మెరుగైన ఫలాలను, ధీటైన ఆర్ధికసంస్కరణల ఉపయుక్తమైన ఫలితాలను, వన్నెతరగని దేశాభివృద్ధి యొక్క గౌరవాన్ని,
వారి అనుగ్రహంగా అందించిన శ్రీ పి.వి గారికి భారతదేశ విజ్ఞ్యులు, మేధావులు, పండితులు, సమాన్యులు, అందరూ కూడా సదా కృతజ్ఞ్యులే...

అట్టి సహృదయులైన విజ్ఞ్యుల జయంతిని పురస్కరించుకొని వారి స్మృత్యర్ధం చిరు అక్షరాంజలి ప్రయుక్త నమస్సుమాంజలి...
🙏🙂💐


No comments:

Post a Comment