Friday, December 27, 2024

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర మార్గశిర శుద్ధ ఏకాదశి / మోక్షద ఏకాదశి / "శ్రీమద్భగవద్గీతాజయంతి" శుభాభినందనలు...😊💐

మోక్షద ఏకాదశి / "శ్రీమద్భగవద్గీతాజయంతి" శుభాభినందనలు...😊💐

గోవు, గోవిందుడు, గంగ, గాయత్రి, గీత అనే గకారపంచకం భారతదేశ చిరంతన ఔన్నత్యానికి, వైభవానికి, మహిమ్నతకు మూలకారణం...

గోవు నుండి లభించే పంచగవ్యాలు భూమిని నివాసయోగ్యంగా మలిచే మహత్తరమైన సాధనాలు...
గోఘృతం / ఆవునెయ్యి అమృతసమమైన భగవద్ప్రీతికరమైన మహౌషధం...

గోవులున్న ప్రాంగణంలో ఎంతో ప్రీతితో వసించే గోవిందుడు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం...

భారతదేశ మహత్తుకు, మహౌన్నత్వానికి, మాన్యతకు, పవిత్రతకు గంగాజలమే ఆధారం...
గంగ యొక్క స్మరణం కూడా సర్వదురితహరం...

గాయత్రి ఉపాసన అనేది ఒక్కోవిజ్ఞ్యుడికి ఒక్కోస్థాయిలో భాసించే భగవదనుగ్రహం..
ఒక సామాన్యుడు కేవల సాధారణ సూర్యనమస్కారమే గాయత్రి ఉపాసనగా కలిగిఉంటాడు....
ఒక మాన్యుడు సవైదిక సారస్వతభరిత సూర్యనమస్కారాలను గాయత్రి ఉపాసనగా కలిగిఉంటాడు....

దేశకాలములతో సంబంధంలేకుండా ఎల్లరినీ ఎల్లప్పుడూ తరింపజేయగల గొప్ప అధ్యాత్మ సాధనం శ్రీమద్భగవద్గీత...
శ్రీమద్భగవద్గీత యొక్క 18 అధ్యాయాల సారస్వతం, శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహంగా ఈ లోకానికి లభించిన గీతామృతంగా విజ్ఞ్యులు గౌరవింతురు....
ఎందుకంటే,
సముద్రం కంటే లోతైనదిగా,
ఆకాశం కంటే విస్తారమైనదిగా,
ఎంత గ్రాహ్యమైనా కూడా ఇంకా ఎంతో గ్రాహ్యమవ్వవలసిన గహనమైన తత్త్వం భగవద్ తత్త్వం......

అట్టి సర్వోత్కృష్టమైన భగవద్ తత్త్వాన్ని శక్తియుక్తులమేర అర్ధం చేసుకుంటూ జీవితంలో తరించగలగాలంటే అది కేవలం భగవంతుడు మాత్రమే అనుగ్రహించగల తత్త్వబోధ...

ప్రశస్తమైన దశావతరాల్లో పరిపూర్ణావతారంగా, 
దేవకీవసుదేవుల పుత్రుడిగా, బలరాముని అనుజుడిగా, మథురలో ప్రభవించిన మహోన్నతమైన మాధవమూర్తి శ్రీకృష్ణపరమాత్మ అవతారం...
చిన్నపిల్లలనుండి వయోవృద్ధులవరకు,
స్కూల్ విద్యార్ధులనుండి, పి.హె.డి స్కాలర్ల వరకు,
సాధారణ భక్తులనుండి, అనన్యసామాన్యమైన యోగీశ్వరుల వరకు, ఎల్లరూ కూడా వారివారి భగవదనుగ్రహస్థాయిలో శ్రీకృష్ణపరమాత్మను అభిమానించి, ఆరాధించి, తరించేవారే....

ఒక గంగిగోవు తన జీవితం మొత్తం పంచగవ్యాల రూపంలో ఈ లోకానికి ఎంతగానో మేలుచేసి చివరకు తనువుచాలించి కూడా గోరోచనరూపంలో తన త్యాగనిరతియొక్క పరిమళాలను వెదజల్లే విధంగా తరించే వైనంలోనే....
భువిపై ప్రభవించిన అంతటి మహనీయమూర్తి, తన దేవతాంశ యొక్క అనుగ్రహం ఈ లోకంలో శాశ్వతంగా నిలిచి ఉండి, ఆరాధించిన భక్తులను ఘనంగా తరింపజేసే సాధనంగా వర్ధిల్లాలని...
భీష్మపితామహులచే శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రాన్ని అనుగ్రహించాడు...
అర్జునుడితో కురుక్షేత్రంలో గావించిన భక్తి, జ్ఞ్యాన, తర్క, మీమాంసాది శాస్త్రసారంగా, కర్తవ్యసంవాదంగా, సారస్వతలహరిగా శ్రీమద్భగవద్గీతను అనుగ్రహించాడు...
చివరకు తన అనన్యసామాన్యమైన యోగశక్తిని శ్రీవేంకటాచలపరతత్వమూర్తిలోకి లయింపజేసి భూలోక కర్మసిద్ధాంతానుగుణంగా తనువుచాలించి, తన భౌతిక హృదయమండలాన్ని ఉడుపి శ్రీకృష్ణమూర్తిగా ఈ లోకానికి శాశ్వత శ్రీకృష్ణానుగ్రహంగా అందించి తరింపజేసాడు...

ఇంతటి ఘనమైన అనుగ్రహాన్ని లోకానికి అందించినందుకు, ఇప్పటికీ భక్తులు ఎన్నెన్నో పేర్లతో తననూ పిలుస్తున్నాసరే...
గోవింద నామం అంటే ఆ శ్రీవేంకటాచలపరతత్త్వమూర్తికి ఎంతగా ప్రీతికరమైనదో భక్తులెల్లరికీ స్వానుభవైకవేద్యమైన సత్యమేకదా..!

తమ గానామృతఝరితో గొప్ప సాటిలేని గాయకులుగా ఖ్యాతిగడించిన అమరగాయకులు శ్రీ ఘంటసాల గారు, శ్రీమద్భగవద్గీతను ఎంతో హృద్యంగా ఆలపించి, ఇప్పటికీ తిరుమలగిరుల్లో నిత్యం ప్రతిధ్వనించే భక్తిసారస్వతాల్లో ఒకటిగా అలరారే భగవద్గీతాగానంగా వారి కీర్తిని అజరామరనైనదిగా స్థిరీకరించుకోవడం విజ్ఞ్యులైన భక్తుల భాగ్యవిశేషం...!
2008 నుండి ఇప్పటివరకు నా తిరుమల యాత్రల్లో ఎన్నోసార్లు అలిపిరి మెట్లమార్గంలో ప్రతిధ్వనించిన ఘంటసాల గారి గీతామృతగానం అందించిన స్ఫూర్తి ఎంతో ఘనమైనది....

కొందరు మహనీయులను దర్శిస్తే అమేయమైన పుణ్యం సమకూరును...
కొన్ని మహత్వభరిత పదార్ధాలను, వస్తువులను దర్శించి, స్పర్శిస్తే అమేయమైన పుణ్యం సమకూరును...
కొన్ని భగవద్ ప్రీతికరమైన సారస్వతాలను పఠిస్తే, ఆలకిస్తే అమేయమైన పుణ్యం సమకూరును...
అట్టివాటిలో శ్రీమద్భగవద్గీత ఎంతో విశేషమైన పుణ్యదాయక సాధనం...!

శ్రీఆదిశంకరాచార్యులు వారి మోహముద్గరం / భజగోవింద స్తోత్రంలో ఈ క్రింది పంక్తులలో ఉటంకింపబడిన విధంగా రెండు సార్లు భగవద్గీతను ప్రస్తావించడం, భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని, మహిమ్నతను, లోకానికి తెలియపరుస్తున్నది...

*****************************
భగవద్గీతా కించిదధీతా
గంగాజల-లవకణికా పీతా ।
సకృదపి యేన మురారిసమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ॥ 21 ॥

భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే ।

గేయం గీతా-నామసహస్రం
ధ్యేయం శ్రీపతి-రూపమజస్రమ్ ।
నేయం సజ్జన-సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్ ॥ 28 ॥

భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే ।
*****************************

దేనికీ కూడా తగినంతగా సమయంలేనంతగా ఈనాటి మన ఉరుకులపరుగుల ఆధునిక జీవితంలో శ్రీమద్భగవద్గీతను సవిస్తరంగా అధ్యయనం చేయలేకపోయినా...,
కనీసం ఈ క్రింది రెండు శ్లోకాలను ప్రతీరోజు భోజనస్వీకరణ సమయంలో పఠించి తరించగలగడం మన అధ్యాత్మ విజ్ఞ్యులు మనకు అనుగ్రహించిన భగవద్గీతామాధుర్యం..!

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా 
|| 4 : 24 ||

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 
|| 15 : 14 ||

ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశా ధ్యాయినీమ్
అంబ త్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం 

సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు..😊💐🙏

No comments:

Post a Comment