Tuesday, December 3, 2024

శ్రీకరమైన శ్రీవాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణాంతర్గతమైన మహిమాన్విత" గంగావతరణము " అనే ఘట్టం యొక్క ప్రవచనం సామగానసమ్మేళణాత్మక సంగీత విభావరితో జోడించి శ్రోతలకు అందించడం అనే సాహితీ యజ్ఞ్యంలో విజ్ఞ్యులెల్లరినీ తరింపజేసిన శ్రీచాగంటి సద్గురువుల అనుగ్రహవీచికల్లో ఓలలాడిన భక్తుల మనోల్లాసమంజరుల్లో ప్రవహించిన గంగావైభవాన్ని ఈశ్వరానుగ్రహంతో కొంత విశదీకరించే ప్రయత్నం

శ్రీకరమైన శ్రీవాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణాంతర్గతమైన మహిమాన్విత
" గంగావతరణము " అనే ఘట్టం యొక్క ప్రవచనం సామగానసమ్మేళణాత్మక సంగీత విభావరితో జోడించి శ్రోతలకు అందించడం అనే సాహితీ యజ్ఞ్యంలో విజ్ఞ్యులెల్లరినీ తరింపజేసిన శ్రీచాగంటి సద్గురువుల అనుగ్రహవీచికల్లో ఓలలాడిన భక్తుల మనోల్లాసమంజరుల్లో ప్రవహించిన గంగావైభవాన్ని ఈశ్వరానుగ్రహంతో కొంత విశదీకరించే ప్రయత్నం గావిస్తాను...

ఒక్కోదేశం ఒక్కోగొప్పదనంతో లోకంలో ప్రాచుర్యంపొంది ఉండడం అనేది ఎల్లరికీ తెలిసిందే ...

ఒక స్టాట్యూ వల్ల ఒకదేశం...
ఒక టవర్ వల్ల మరోదేశం..
ఎడారినేలల్లో త్రికోణాంతర కట్టడాల వల్ల మరోదేశం....

ఇలా ఒక్కోదేశం ఒక్కో మానవనిర్మిత భౌతిక పురావస్తుసంపదను 'వండర్స్ ఆఫ్ ద వల్డ్' అనే ఒక గొప్పదనంగా భావించడం అందరికీ తెలిసిందే...

భారతదేశం మాత్రం అనాదిగా ఎంతో ఉన్నతమైన దైవిక పురావస్తుసంపదతో అలరారే అందాల ఆనందాల అద్భుతాల ఆశ్చర్యాల అమరుల దేశం...

అట్టి సనాతన భారతీయ దేశంలో సర్వోన్నతమైన మహిమోపేతమైన పురావస్తుసంపదగా ఖ్యాతి గడించిన గంగానది యొక్క వైభవం అనిర్వచనీయం...

అందుకే ప్రపంచంలోని ఇతర ఉత్తమదేశాలెన్నో 
"జిస్ దేశ్ మే గంగా బెహ్తీహై....." అని ముక్తకంఠంతో భారతదేశవైభవాన్ని వేనోళ్ళా కీర్తించెదరు...

భారతదేశంలోని అన్ని జీవనదులకు కూడా గంగానది యొక్క అంతర్వాహినులైన ఝరులే మూలం అనేది విజ్ఞ్యులకు విదితమైన అంశం...

సహ్యాద్రిసానువుల్లో బ్రహ్మగిరిపర్వత ప్రాంతంలో నంది నుండి ఒక్కోచుక్కగా వినిర్ముక్తమౌతూ అంతర్వాహినిగా ప్రవహించి నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంలో గుప్తగోదావరిగా ఉద్గమించే దక్షిణభారతగంగగా ఖ్యాడిగడించిన గోదావరి నది యొక్క మూలం కూడా గౌతమిమహర్షి తపఃశక్తితో ఉత్తరభారతదేశం నుండి అంతర్వాహినియై దక్షిణభారతానికి ప్రయాణించే గంగాఝరి...

మీరెప్పుడైనా నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు బ్రహ్మగిరి పర్వతంపైకి మెట్లదారిలో నడిచి ఎక్కి అక్కడ ఇప్పటికీ కొలువై ఉన్న ఒక కొండగుహలాంటి గౌతమమహర్షి యొక్క తపోస్థలి దెగ్గర కొంతసేపు విశ్రమించి, ధ్యానించి ఈశ్వరానుగ్రహంగా, సూర్యవంశ సంజాత భగీరథ చక్రవర్తి తపఃశక్తి యొక్క అనుగ్రహమైన గంగానదికి, గౌతమ మహర్షి యొక్క తపఃశక్తి జతైనతదుపరి గోదావరి గా రూపాంతరం చెందే గంగావైభవాన్ని దర్శిస్తే ఎంతో ఆశ్చర్యంచెందుతారు...

"ది మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా" గా ఖ్యాతి గడించిన,
గౌ || భారత మాజీ రాష్ట్రపతి, శ్రీ అబ్దుల్ కలాం గారు, వారి ప్రతిభకు పట్టంకడుతూ భౌతికపరంగా సంపన్నమైన ఎన్నో విదేశాలు వారిని రెడ్ కార్పెట్ వెల్కం తో ఆహ్వానించినా కూడా, వారు మాత్రం ఎంతో సున్నితంగా..
"మీరు నాకు సకల సదుపాయాలను, సకల సంపదలను మీ దేశంలో కల్పించగలరేమో...కాని నా దేశంలో మాత్రమే ప్రవహించే గంగానదిని మీ దేశంలో నాకోసం 
ప్రవహింపజేయలేరు కద..." అని చమత్కరించి నిజమైన దేశభక్తిగల మాన్యులుగా భారతదేశ వైభవభరిత
చరిత్రలో చిరస్మరణీయులై వినుతికెక్కారు...

శ్రీఆదిశంకరభగవద్పాదుల వారు రచించిన అనేకానేక మహిమాన్విత దైవిక రచనల్లో ఒకటైన గంగాష్టకంలో,
ఈ క్రింది విధంగా ఎంతో గొప్పగా గంగానది యొక్క వైభవాన్ని స్తుతించారు...

***** ***** ***** ***** ***** ***** ***** ***** 
 
గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణి స్వర్గమార్గే |
ప్రాయశ్చితం యది స్యాత్తవ జలకణికా బ్రహ్మహత్యాదిపాపే
కస్త్వాం స్తోతుం సమర్థః త్రిజగదఘహరే దేవి గంగే ప్రసీద ||

***** ***** ***** ***** ***** ***** ***** *****

అనగా, గంగ సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణి...
ఆ విశేషాన్ని అనుభవైకవేద్యమైన సత్యంగా అందుకున్న మహానుభావులెందరో...

ప్రభాస్ లేటెస్ట్ వల్ద్ వైడ్ హిట్ అయిన " కల్కి " మూవిలో, చూపినట్టుగా, గంగ సంపూర్ణంగా శోషించుకుపోవడం అనేది ఏనాటికి కూడా సంభవించని ప్రక్రియ...
ఏ విధంగా అయితే, ఈ కలియుగ మానవులకు తన అనుగ్రహం అంత తేలికగా అందకూడదని సరస్వతీ నది కలియుగానికి వచ్చేసరికి అంతర్వాహినిగా రూపాంతరం చెందిందో,
అవ్విధముగనే...
కలియుగాంతం వచ్చేసరికి, గంగ కొన్ని కారణాలరీత్యా తననుతాను అంతర్వాహినిగా గావించి, సత్యయుగస్థాపనకు కావలసిన కాలధర్మాన్ని పరమేశ్వర ఆజ్ఞ్యగా  
నిర్వహించును....
[ సాయుధ ఇండియన్ ఆర్మి దేశంలో పరివ్యాప్తమై ఉండగా, దేశంలోకి అన్యుల చొరబాటు కుదరదు...
అదే విధంగా, ఈ భూమిపై సకల అమరశక్తిసమ్యుక్తమై ప్రవహించే గంగ ఉన్నంతకాలం, ప్రళయజలాలు భూమిని కబళించడం కుదరదు.... ]

ఏనాడు గంగ అంతర్వాహినిగా రూపాంతరంచెంది ఈ కలియుగమానవులకు అలభ్యమౌనో,
ఆనాడు అన్ని జీవనదులు కూడా కనుమరుగై, కేవలం తిరుమల కొండపైన మాత్రమే జలధారలు ప్రవహించే సమయంలో, మహాజలప్రళయం సంభవించి, యావద్ ప్రపంచం మొత్తం లయించే సమయంలో కూడా, కాశిపుణ్యక్షేత్రం మాత్రం ఆ ప్రళయజలాలతో ఏమాత్రం సంబంధంలేకుండా అట్లే నిలిచి ఉండి, సత్యయుగానంతరం పునరావృతమయ్యే త్రేతాయుగంలో తిరిగి భూమిపైన ప్రవహించే జీవనదిగా గంగ రూపాంతరంచెందును....

అంతర్వాహిని అంటే అన్ని చోట్లా అందరికీ లభ్యమ్మయేవిధంగా కాకుండా కొన్ని చోట్ల కొందరికి మాత్రమే లభ్యమయ్యే విధంగా తన ప్రవాహ విస్తారాన్ని పరిమితం గావించుకోవడం అని అర్ధం....

ద్విపుష్కరాయుఃప్రమాణంతే ద్విజసంస్కారవర్జితౌ
కల్యాంతేచ మందాకినీ అలభ్యంచ అదర్శనాద్భవేత్

అని యోగులు దర్శించిన విధంగా,

లోకంలో ద్విజసంస్కారం తో వర్ధిల్లే దేవతార్చనాదికైంకర్యములను సలిపే సద్బ్రాహ్మణులు / పురోహితులు కనుమరుగౌతూ, 24 సంవత్సరాల పూర్ణాయుర్దాయంతో ప్రజలు లయించే సమయంలో, గంగ అలభ్యమై, అంతర్వాహినిగా రూపాంతరం చెందును....

గంగ అలా మెల్లమెల్లగా అంతర్వాహినిగా రూపాంతరం చెందే సమయంలో, కాశ్మీరప్రాంతంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణోత్తముని ఇంట, కల్కి అవతారంగా శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాం ప్రభవించి, పాపుపలను పరిహరించి, కృతయుగస్థాపనకు కావల్సిన ధర్మరక్షణ ఒనరించడానికి ఇంకా రమారమి 4 లక్షల సంవత్సరాల కలియుగసమయం ఉన్నది...

అంతటి విశేషమైన వైభవంతో అలరారే గంగానది యొక్క మహిమ్నతను, శ్రీమల్లాదివారిచే అనుగ్రహింపబడిన ఘనమైన సంప్రదాయ సామగానరంజితమైన సహితీఝరుల్లో ఒలలాడుతూ చెవులారా వినేభాగ్యానికి, పుణ్యానికి కారకులైన వారందరికి కూడా కృతజ్ఞ్యతావందనములను ఆవిష్కరిస్తూ, శ్రీగురవేనమః..🙏💐🙂

లవకుశుల శ్రీమద్రామాయణగానమంజరిని చిత్రలేఖనం గావించి వేదికపై ఎంతో వైభవభరితంగా అలంకరించడం ఈ కార్యక్రమానికి మరింతగా వన్నెతెచ్చింది...🙂


No comments:

Post a Comment