Monday, April 15, 2019

శ్రీ శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్ల 28వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత, శ్రీ వికారి చైత్ర శుద్ధ సప్తమి నాటి, కళ్యాణమహోత్సవవైభవం... :)

శ్రీ శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్ల 28వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత, శ్రీ వికారి చైత్ర శుద్ధ సప్తమి నాటి, కళ్యాణమహోత్సవానంతరం, శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు అనే శ్రీవైష్ణవాచార్యాశిఖామణులు, శ్రీపాంచరాత్రాగమ స్రష్టలు, సముద్రందాటకుండా పదిలపరుచుకున్న తమ సదాచార సంపన్నమైన ఔపానసిక బలంతో, జ్యోతిష, వాస్తు, ఇత్యాది శాస్త్రాల్లో ఉద్దండులైన భాగవతవరేణ్యులు,
( అమరావతి రాకముందే ఎక్కడికి దెగ్గరగా నూతనాంధ్ర రాజధాని రాగలదో తెలిపి అక్కడ తమ వ్యాపార నివాస సముదాయములకనువైన స్థలసేకరణకు వాగ్సహాయం చేసి ఇవ్వాళ కొందరు కోటీశ్వరులుగా ఉండడానికి కారణమైన ఆచార్యులు వీరు....ప్రతి వార్షికబ్రహ్మోత్సవ ప్రత్యేక వ్యాఖ్యాన బ్రహ్మగా అసీనులయ్యె వీరి సద్వాక్కులను ఆలకించి జ్ఞ్యానార్జన చేసిన ఎందరో భక్తుల్లో నేనుకూడా ఒకడిని...వారి వాస్తు విశ్లేషణావైభవాన్ని చూసి ఎన్నోసార్లు ఆశ్చర్యంచెందాను. ఫలాన దోషం ఉన్నప్పుడు ఫలాన బాధలతో అక్కడి వారు ఇబ్బంది పడతారు...అని వారు వివరించిన విషయాలన్నీ కూడా నా జీవితం మరియు ఎందరో బంధుమితృల జీవితంలోతరచి చూసి..., ఔరా ఆచార్యుల అమృతవాక్కులు ఎంతటి ఘనమైనవి కదా అని వారిని చాల సార్లు తలచుకుంటు ఉంటాను.. అలా అందరికి మాట సహాయం చేసే సద్గుణం కేవలం సద్గురువులకు, ఆచార్యశిఖామణులకే కదా ఉండేది మరి....! )
స్వామి వారికి తలవ్రాలు (తలంబ్రాలు) గా సమర్పించిన మేలిమి ముత్యాల్లోనుండి ఆశీస్సులుగా నాకు అనుగ్రహించబడిన 2 ముత్యాలు మరియు అచ్చం మురళీకృష్ణమాచార్యుల వారిలా, మైకందుకుంటే కంచుకంఠం తో శ్రోతల మనోజాఢ్యం మాయమయ్యేలా, కర్ణభేరి తుప్పొదిలిపోయేలా శృతిగానం సాగించే శ్రీ కౌండిన్యాచార్యుల వారిచే 1 ముత్యం లభించగా, గైకొని సంతసించి భోజనప్రసాదస్వీకారానికి వెళ్ళినప్పుడు, ఆశ్చర్యంగా పైకిచూస్తే నేను, నా భార్య, నిల్చున్నది కదంబ వృక్షంకింద...!! 
వచ్చామా, స్వామిని దర్శించి ప్రసాదం ఆరగించి వెళ్ళామా
అని తప్ప, 10 సంవత్సరాలుగా గుడికి వెళ్తున్ననాకు ఈనాటివరకు అక్కడ ఉన్నది కదంబవృక్షం అనేసంగతే తెలియదని నాకు నేనే నవ్వుకొని స్వామికి నమస్కారం చేస్కొని, లైన్లో ఉండి ఈసారి ఏమేమి ఐటెంస్ పెడ్తున్నారా అని ఆలోచిస్తుండగా, స్వామి తో సాగిన చిరు మౌనసంభాషణలో,
" ఒరెయ్ నీకెంత సేపు తిండిగోలేనా, ఆచార్యముఖేన నాచే అనుగ్రహించబడినవి కేవలం మంచిముత్యాలా, లేక భక్తభాగవతానుగ్రహమైన జ్ఞానమౌక్తికములా అని ఒక్కసారైన సరిచూడవా....? మీ గురువర్యులు శ్రీమద్భాగవతంలో నా ఉళగళందపెరుమాల్ తత్వం గురించి ఏమని బోధించారో మరచితివా..? అచార్యులచే దత్తమైనవి 3 ముత్యాలు కాదు... వాటిని 1,2 ముత్యాలు అని సంబోధించవలే...
అదితి యొక్క ప్రార్ధనమేరకు, ఇంద్రునకు భ్రాతగా ఉపేంద్రుడనై 8 వత్సరముల వటువుగా ప్రభవించి, స్వర్గపీఠాధిరోహణకై తన అభీష్టాన్ని నెరవేర్చుటకు, బలిచక్రవర్తిని నేను ఈ క్రింది పోతనామాత్యుల వారి పద్యాలతో కదా ప్రార్ధించాను....
---------------------------------------------------------------
" స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్."
" ఒంటివాఁడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "
---------------------------------------------------------------
అప్పుడు మీ గురువుగారు వివరించిన అందలి వైశేషిక భావమంజరి తెలియును కదా....
" ఓ బలిదైత్య...నీకు స్వస్తి అగుగాక..." అని పైకి నేను అంటూనే...,
ఆంతరమున...." దేవకార్యఘాతకుడిగా మారిన ఇక నీ పని స్వస్తి....3 వ అడుగుతో నిన్ను పాతాళానికి సాగనంపెద..."
అనే భావం తో కదా నేను వచించితిని....
సమంత్రక జలాధారా పూర్వకంగా నేనడిగిన భూదానం చేయడానికి సిద్ధమైన బలిని, వద్దని వారిస్తు తీర్థపాత్రలో కీటకమై అడ్డు పడాలని జేరిన శుక్రచార్యుల వారి నేత్రాన్ని దర్భపుల్లతో చిదిమివేసి, బలిదైత్యుని తో
--------------------------------------------------------------------------------
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
--------------------------------------------------------------------------------
అని స్తుత్యుడనై, 3 అడుగుల భూదానం పట్టి,
--------------------------------------------------------------------------------
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
--------------------------------------------------------------------------------
అనే పోతనామాత్యుల వారి వర్ణనలా, అలనాడు సకల విశ్వాన్ని కొలిచిన నా త్రివిక్రమాకృతిని మరచితివా...? "
అనే భావలహరిలో మునకలు వేసిన నాకు ఒక్కసారిగా స్వామి వారి వామనావతార వైభవం స్ఫురించి, శరణువేడిన వారిని కాచిరక్షించే శ్రీహరి భక్తవత్సలత ఎంతటి చిత్రమైనదో కదా అనుకొని,
జనకమహారాజుకు నాగేటిచాలులో అనుగ్రహించబడిన సీతమ్మవలే, అలనాడు పెరియాళ్వారులకు శ్రీవిళ్ళిపుత్తూర్ తులసీవనంలో అనుగ్రహించబడిన ఆండాళ్ తల్లి (గోదమ్మ) , స్వామి వామనావతార వైభావాన్ని ప్రస్తుతిస్తు తన తిరుప్పావై లోని ఈ క్రింది 3వ పాశురంలో స్వామిని ప్రార్ధించిన విధానాన్ని,
--------------------------------------------------------------------------------
ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మూరి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.
--------------------------------------------------------------------------------
మరియు నేను కంచికి వెళ్ళినప్పుడు దర్శించిన ఉళగళందపెరుమాళ్ ఆలయంలోని (దివ్యదేశం) స్వామి వారి త్రివిక్రమాకృతి యొక్క విశ్వరూపాన్ని జ్ఞ్యప్తికి తెచ్చుకొని, స్వామికి మనసారా ముమ్మారు నమస్కరించి, భోజనప్రసాదం ఆరగిస్తూ అప్పుడెప్పుడో ఒకసారి స్వామివారి నిజపాదదర్శనాంతర్గత శ్రీపాదవైభవం గురించి నేను రాసుకున్న ఈ క్రింది కవిత గుర్తుకువచ్చి సంతసించాను.. 
గంగమ్మకు తెలియును ఆ పాదాల చల్లదనం....
అహల్యకు తెలియును ఆ పాదాల వెచ్చదనం....
బలిదైత్యునకు తెలియును ఆ పాదాల గట్టిదనం...
కాళీయునకు తెలియును ఆ పాదాల కాఠిన్యం....
కమలమ్మకు తెలియును ఆ పాదాల కోమలత్వం...
నా ఎదసవ్వడులకు తెలియును ఆ పాదాల తియ్యందనం...!! 
**************************************************
“విష్ణోః పదే పరమ” ఇత్యుదిత ప్రశంసౌ
యౌ “మధ్వ ఉత్స” ఇతి భోగ్య తయా‌உప్యుపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 10 || 🙏🙂

No comments:

Post a Comment