Tuesday, April 2, 2019

శ్రీతాళ్ళపాక గురవేనమః...! 🙏 అన్నమాచార్యుల 516 వ తిథి ...

శ్రీతాళ్ళపాక గురవేనమః...!  🙏

516 సంవత్సరాల క్రితం దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళద్వాదశి నాడు స్వామివారి సూర్యకఠారి (నందక ఖడ్గం) లోనికి తమ దివ్యతేజస్సును లయింపజేసి, శ్రీవైకుంఠనిత్యసూరులతో గూడి స్వామివారి శ్రీపాదార్చనకు తమ పదకవితల సుమసరాలను సమర్పించేందుకు తరలి వెళ్ళిపోయిన అన్నమాచార్యుల వారి ఆ సంకీర్తనసంప్రదాయాన్ని ఆనందనిలయంలో ఈనాటికి కూడా వారి వంశీకులు కొనసాగిస్తూ,
మరియు మరో మహాభక్తురాలైన శ్రీతరిగొండవెంగమాంబ గారిచే ఆనాడు మొదలైన 'ఏకాంతసేవ సమయ ముత్యాల హారతి ' అనే సంప్రదాయాన్ని కూడా ఈనాటికీ కొనసాగిస్తూ, 

"తాళ్ళపాకవారి లాలి, తరిగొండవారి హారతి....."
అని ప్రాచుర్యం పొందిన స్వామివారి నిత్యకైంకర్యము భక్తులెల్లరికి విదితమే...

' సంకీర్తనాలోలుడు శ్రీనివాసుడు... ' అని కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులెందరో చెప్పడం మనం వింటూనేఉంటాం....
భక్తి, జ్ఞ్యాన, వైరాగ్య భరిత భావాలంకారాలతో 32000 సంకీర్తనలను రచించి, స్వామివారి శ్రీకైంకర్యంగా వాటిని మలిచిన అన్నమాచార్యులు నిత్యస్మరణీయులు....!

స్వామివారికి వారిచే సమర్పించబడిన సంగీతకైంకర్యంగా మాత్రమే కాకుండా,  అవి ఈ కలియుగ యావద్ మానవాళికి స్వామివారి అనుగ్రహంగా ఆచార్యులచే అందివ్వబడిన సంకీర్తనవేదం అని ఆచార్యులే తమ 'కలియుగంబునకు కలదిదియే....' అనే సంకీర్తనలో తేటతెల్లం గావించారు....

అస్మద్ గురుదేవులు, సద్గురువులు శ్రీచాగంటి గారు తమ ప్రవచనాంతర్గతంగా నుడివిన యుగలక్షణవైచిత్రి ని ఆధారంగా చేసుకొని చూస్తే,

17,28,000 సంవత్సరాల ఆయుః ప్రమాణం కలిగిన  సత్యయుగం / కృతయుగం నాడు ధర్మం 4 పాదాలమీద స్థిరంగా పరిఢవిల్లి, అంతటా శాంతిసౌఖ్యాలు, పాడిపంటలు, సిరిసంపదలతో లోకం కళకళలాడుతూ, అందరిచే నిత్యాగ్ని కైంకర్యం, బృహత్ యజ్ఞ్యయాగాది క్రతువులు నిర్వహించబడడం సర్వసామాన్యంగా వర్ధిల్లిన కాలం అది....!

12,96,000 సంవత్సరాల ఆయుః ప్రమాణం కలిగిన శ్రీరాముడి త్రేతాయుగం నాటికి, ధర్మం 3 పాదాలమీద చరించి,  
మహర్షులు, చక్రవర్తులు, మహాపురుషులు, ఇత్యాది సత్ప్రవర్తనాభరిత మాన్యులచే మాత్రమే యజ్ఞ్యయాగాది క్రతువులు నిర్వహించబడుతు, లోకంలో రాక్షసత్వం తన ఉనికిని బలోపేతంచేస్తున్న కాలం అది.... 
   
8,64,000 సంవత్సరాల ఆయుః ప్రమాణం కలిగిన శ్రీకృష్ణుని ద్వాపరయుగం వచ్చేసరికి, ధర్మం కేవలం 2 పాదాలపై నిలదొక్కుకొని, యజ్ఞ్యయాగాది క్రతువులు క్రమంగా తగ్గిపోతూ, లోకంలో రాక్షసత్వం పెచ్చుమీరి తన ఉనికిని నలుదిశలా వేగంగా వ్యాప్తిగావిస్తున్న కాలం అది....  

4,32,000 సంవత్సరాల ఆయుః ప్రమాణం కలిగిన ఈ కలియుగంలో ఇక ధర్మం కేవలం ఒకేఒక పాదంపై నిలిచి, యజ్ఞ్యయాగాది క్రతువులు నీరసించి క్రమంగా కనుమరుగైపోతు, దైవానుగ్రహం మెండుగా ఉన్న చోట్ల మాత్రమే, భగవద్భక్తి సత్ప్రవర్తన కలిగిన సత్పురుషుల సహాయసహకారాలతో కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే అంశంగా పరిణమించింది....!

ఇక ఈనాడు రాక్షసత్వం అనేది, ఏకంగా మనిషి యొక్క మనసునే తన ఉపాధిగా చేసుకొని ఈ యుగంలో తన అప్రతిహత స్వైరవిహారం కొనసాగిస్తూ, అందరిని కలిబాధలకు గురిచేస్తూ హింసించడం నిత్యకృత్యమైన సంగతి అని ఎల్లరికి విదితమే....

పరిపూర్ణావతారమైన పరమాత్మ పాదం భూమిపై తిరుగాడుతున్నంత కాలం కలిపురుషుడు కాలుమోపలేని స్థితిన, రమారమి 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ నిర్యాణం అవ్వగానే, కాలచక్రనియమానుసారంగా లోకంలోకి కలిప్రవేశం జరగాలి కాబట్టి తనకు ఆవాస స్థానాలు కొన్ని ఇమ్మని పరీక్షిత్ మహారాజుని ప్రాధేయపడి బంగారం, మద్యపానం, జూదం, ఇత్యాదుల్లో తను ఉండొచ్చునని అనుమతినిపొంది, ఇక ఆనాటి నుండి ఈనాటి వరకు కలి సాగించిన ఘోరకలి అంతాఇంతాకాదని అందరికి తెలిసిందే....

తన ఆవాసానికి అనుమతిచ్చిన పరీక్షిత్ మహారాజునే నిలువెల్లా ధరించబడిన విశేషమైన బంగారం ద్వారా ఆవహించి వేటలో ఉండగా, అడిగినప్పుడు త్రాగునీరివ్వలేదని తపోసమాధిలో ఉన్న శమీక మహర్షిపై మృతసర్పాన్ని పడేయగా, ఆశ్రమమునిబాలుర ద్వార ఆ విషయాన్ని తెలుసుకున్న ఋష్యశృంగులచే,
"ఈ పాపానికి ఒడిగట్టినది ఎవ్వరైనా సరే 7 రోజుల్లో తక్షకుని విషజ్వాలలకు ఆహుతై మరణించెందరు గాక......" అని శాపంపొంది....తనువుచాలించేలా చేసిన కలిఘాతుకాలు, అలా ఎన్నెన్నో ఉండనే ఉన్నాయి కదా....!

ఇక ఈ యుగంలో అందరు ఇలా కలిధాటికి నిత్యం బలౌతూ యాతనలు పొంది అంతమవ్వాల్సిందేనా...? అటువంటప్పుడు,

"యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా...అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం...." 
అని భగవద్ గీతలో తను ఇచ్చిన మాటని
భగవంతుడు విస్మరించినట్టే అవుతుంది కదా....? :)

అందుకే, పరమాత్మ ఒక బోయబాడి బాణం తన బొటనవేలికి తగిలేలాచేసి భౌతిక శరీరాన్ని చాలించి ' శ్రీకృష్ణనిర్యాణం ' అనే చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కృతమయ్యేలా చేసి, యదుకులముసలం ద్వారా ద్వాపర యుగానికి చరమగీతంపలికి, తన స్వస్థానమైన శ్రీవైకుంఠ దివ్యలోకానికి ఏగుతున్నప్పుడు, సప్తర్షులు, మహర్షులు, తనను ప్రాధేయపడి, కలి తన పాదాన్ని మోపిన క్షణం నుండి ఇక తాము భూమిపై సుఖంగా దైవకార్యాలను చేయలేమని విన్నవించి మహాభారత సమయంలో తను చేసిన పై ప్రతినను గుర్తిచేసినప్పుడు, స్వామి దయతలిచి తన శ్రీవేంకటేశ్వర అవతార వైభవం గూర్చి వారికి వివరించి, ఈ కలియుగ ప్రత్యక్షదైవమై ఆశ్రితులను ఎప్పటిలాగే తను రక్షిస్తూ ఉంటానని, కాకపోతే ఇదివరకు తను స్వీకరించిన మిగతా అవతారాల్లో ఉన్నట్టుగా కాకుండా, అంటే అందరితో కలిసి భూమిపై సంచరించకుండ, అప్రాకృతమైన తన శ్రీవైకుంఠ క్రీడాద్రి స్వరూపమైన శ్రీవేంకటాద్రిపైనే తను తిరుగాడుతానని చెప్పి ఆనాటినుండి పరమాత్మ తన భక్తవత్సలత్వాన్ని, భాగవతప్రియత్వాన్ని, చాటిచెప్తూనే ఉన్నాడు కదా పిలిస్తే పలికే 7 కొండల గోవిందుడిగా....! :)

ఇక భావితరాలకు, ఎనలేని భగవద్భక్తిని ఆలంబనగా ఇవ్వడానికి తన శ్రీవైకుంఠగత నిత్యసూరులను, వివిధ అంశారూపాల్లో ఈ కలియుగంలో  12 - పన్నిదర్  ఆళ్వారులుగా అవతరింపజేసి శ్రీవైష్ణవ భక్తిప్రపత్తులను లోకం నలుచెరగుల వ్యాపింపజేసి, తన అరివీరభయంకరమైన నందకఖడ్గ అంశలో అన్నమాచార్యులను అవతరింపజేసి, చిరకాల చింతామణులుగా, సద్యో పారిజాతాలుగా అనుగ్రహించే పెక్కు సంకీర్తనలను రచింపజేసి, వాటిని ఈ కలియుగ భవరోగాలకు భవ్యౌషధములుగా అందించి,
' కలౌ సంకీర్త్య కేశవం ' అనే నానుడి ద్వార తన సంకీర్తనా మహాత్మ్యాన్ని మనుజులకు తెలియజెప్పి అనుగ్రహించాడు ఆ మాధవుడు..!
           
మనుష్యుల మనసుల్లో కొలువైఉండే రాక్షసత్వాన్ని, ఇదివరకులా తన ఆయుధాలను ప్రత్యక్షంగా ప్రయోగించడం ద్వారా కాకుండా, భగవద్ రూపనామగుణవైభవాలను గానం చేయడమనే జ్ఞ్యాన తపస్సు ద్వారానే నిర్మూలించే ఆ నీరజనాభున్ని, నిఖిలలోకాలపాలకుడిని, సగుణసాకార పరమాత్మను, ఎన్నో రకాలుగా సేవించుకునే మహద్భాగ్యాన్ని మనకు అందించిన అన్నమాచార్యులకు ఈ యావద్ కలియుగం ఋణపడిపోయింది...!!

గీతాచార్యుడనై కేవలం ఆ ద్వాపరం నాటి మహాభారతకాలపు పార్ధునకు మాత్రమే కాదు, సంకీర్తనాచార్యుడనై ఈ కలికాలపు విషమపరిస్థితుల్లో నిత్యం కొట్టుమిట్టాడుతూ బ్రతికే ప్రతీ జీవికి, అర్జునుడిలా తనను ప్రేమగా పిలిచినంత మాత్రమే, దరిజేరి జగద్గురువుగా నేను ఇప్పటికీ, ఎప్పటికీ ఉన్నానని / ఉంటానని మనల్ని పరమాత్మ సదా అనుగ్రహిస్తూనే ఉన్నాడు....
అది తెలుసుకుని స్వామి శ్రీపాదశరణాగతిని మనసావాచాకర్మణా గావించి, జీవితాన్ని ధన్యం చేసుకోవడమే మానుష కర్తవ్యం..!! :)

అందుకే ఇప్పటికీ ఆనందనిలయంలో, స్వామివారు తన సూర్యకఠారిని / నందకఖడ్గాన్ని మిగతా అన్నిరోజులు వస్త్రాభరణంగా ధరించినా,
గురువారం మాత్రం అలా ధరించకుండా ప్రస్ఫుటంగా భక్తులందరూ దర్శించేలా పక్కన నిలిపి, తన జగద్గురుత్వాన్ని చాటి చెప్తూనే ఉన్నడు ఆ శ్రీవేంకటవిష్ణుమూర్తి...!

మొదట్లో కేవలం వరదకటి హస్తాలతో నిరాయుధపాణిగా మాత్రమే కొలువైన పరమాత్మ, తదనంతర కాలంలో శ్రీరామానుజాచార్యుల వారి శ్రీవైష్ణవస్థిరీకరణలో భాగంగా, శాశ్వత శంఖచక్రధారిగా స్థితికారుడిగా నిలిచి, శ్రీభాష్యకారులను తమ ఆచార్యులుగా ఉత్తరోత్తరా కలియుగంలో అన్ని కైంకర్యాలు సజావుగా సాగేలా శ్రీవైఖానసాగమ శాస్త్రనియమనిబంధనలను కట్టుదిట్టంగావించి, ఉత్తర ఈశాన్యభాగాన, అన్నమాచర్యుల సంకీర్తనాభాండాగారానికి మరియు యోగనారసిమ్హమూర్తికి పక్కన అన్ని సంశయాలను తమ క్రీగంటి చూపులతోనే నివారించే శ్రీదక్షిణామూర్తి గురుస్వరూపంగా దక్షిణాభిముకంగా నిలిపి, భాగవతుల ద్వారాకూడా తన జగద్గురుత్వానికి శాశ్వతత్వాన్ని సమకూర్చుతూ, సకలలోకాలు ఏలుతూనే ఉన్నాడు ఆ అన్నమాచార్యనుతుడు......!

అంటే లౌకికంగా, ఆయుధాలను పక్కన పెట్టేసాడు కాబట్టి ఇక పాపాత్ములను, భాగవతులను హింసించే దుర్మార్గులకు సైతం అలా కేవలం జ్ఞ్యాన బోధ చేస్తూనే ఉంటాడా...?
అని అనుకోవడానికి వీలు లేకుండా, శిశుపాలుడిని 100 తప్పులతర్వాతే సమ్హరిస్తానని ఆనాడు పలికినట్టుగా, అవసరమైనప్పుడు స్మరణమాత్రంచేతనే తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి దుష్టుల పీచం అణచే కాళియమర్దనుడిగా, ఈ చక్రధారి సదా సన్నద్ధుడే అని చాటి చెప్పేందుకు కూడా, ఆచార్యులు అలా స్వామివారిని శాశ్వత శంఖచక్ర ధారిగా నిలిపారు.....!!

( అభిషేక సమయంలో కూడా, అన్ని ఆభరణాలు సడలించినా సరే, స్వామి వారు శంఖచక్రాలు సదా ధరించే ఉంటారు..... )

ధవళవస్త్రాలు ధరించి (అంటే పంచెకట్టు / లుంగీ / ఇత్యాది ధవళవస్త్రాలు ధరించి) తనను ఆరాధించే వారిని, మందస్మితుడై ఎంతగా అనుగ్రహిస్తాడో.....

' కడక్ ' ధవళ దుస్తులు ధరించి, ప్రజలను పీడించి బ్రతకడమే జీవితంగా కలవారిని, సమయమాసన్నమైన క్షణంలో మందస్మితుడై ఉంటూనే అంతగా హరించేస్తాడు....

అందుకే కదా అన్నమాచార్యుల వారు స్వామిని, " ఈతడే హరుడు యీతడే యజుడు ఈతనికి నీ చేతలెంత ఘనమటుగాన..." అంటూ కీర్తించారు .....!

జీవితాంతం స్వామివారిని తమ సంకీర్తనాక్షీరసముద్రంలో ఓలలాడించి, ఆ సంకీర్తనలను భక్తభాగవతలోకానికి ప్రసాదంగా అనుగ్రహించి, స్వామిని సేవించి తరించండని మనకు సెలవిచ్చి, మనదెగ్గర సెలవుతీసుకుని, శ్రీవైకుంఠానికి ఏగిన తమ తండ్రిని, ఆచార్యులను,
( ' హరిజేరుమనియెడి తండ్రి తండ్రి ' అని కదా శ్రీమద్భాగవతంలో ప్రహ్లాద ఉవాచ...),
వారి పుత్రులైన పెద్ద తిరుమలాచార్యుల వారు,
అందరికి ఆ ఆచార్యశిఖామణి యొక్క తిథి, వైభవం, సదా స్మరణీయమై ఉండాలని, తమ ఈ క్రింది సంకీర్తనలో ఎంతో ఆర్తితో సేవించిరి కదా......!

https://annamacharya-lyrics.blogspot.com/2006/12/105dinamu-dwaadasi-nedu.html?m=1

No comments:

Post a Comment