Sunday, February 20, 2022

శ్రీ కాశినాథుని విశ్వనాథ్ గారికి 92వ జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు.....🎂🍧🍨😊🍦🙏


కొందరు కళను ఆరాధిస్తారు.... 
ఇంకొందరు కళను అనుకరిస్తారు....
మరికొందరు కళను అనుసరిస్తారు....

కాని అతి కొద్ది మంది కళను అనన్యసామాన్యమైన రీతిలో ఆవిష్కరిస్తూ, తమచే సృజింపబడే
కళ కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైన రీతిలో ఉండే కళాత్మక జీవనంతో తరిస్తూ తరింపజేస్తారు....

ఎంచుకున్న మార్గంలో ప్రయాణించడం ఒకెత్తు....
ఆ ప్రయాణమే ఎందరెందరికో మార్గాన్ని ఏర్పరచే రీతిలో జీవించగలగడం ఒకెత్తు.....
అలా గౌరవభరితంగా జీవిస్తూ ఎల్లరిచే మాన్యులుగా ఆరాధింపబడడం ఒకెత్తు....

ఇవ్విధంగా వారి 9 పదుల పైచిలుకు జీవిత ప్రస్థానంలో కళాతపస్వి శ్రీ కేవిశ్వనాథ్ గారు, వారి సినీదర్శకత్వంలో సృజింపడిన మేటికళాత్మక చిత్రాలతో సమాజానికి అందించిన సందేశాత్మక సినీవినోదంలో తళుక్కుమన్న జ్ఞ్యాన సౌదామినీ సరాలు ఎన్నో ఎన్నెన్నో....

డబ్బులు పోసి కొనుకున్న లౌకిక చదువుతో సంపాదించిన గవర్నమెంట్ ఉద్యోగాలలో గౌరవభరితమైన పదవుల్లో ఉంటూ,
వెలకట్టలేని వేదవిజ్ఞ్యానాన్ని శిష్యులకు బోధిస్తూ జీవించే ఒక ఘనాపాటి గారికి ఇవ్వవలసిన కనీస గౌరవము, మరియు ప్రభుత్వం వారిచే ఇవ్వబడే గౌరవభృతి ఇవ్వడానికి నిరాకరిస్తూ, వయోవృద్ధులైన వేదమూర్తిని ఎకసెక్కాలాడుతూ ఇబ్బందిపెడుతున్న సంఘటనలో వెంకి యొక్క అత్యద్భుతమైన నటనను చిత్రీకరించిన వైనం శ్రీ చాగంటి సద్గురువుల వంటి మహనీయులచే వారి ఒక ప్రవచనంలో కొనియాడబడడం గురించి కొందరికైనా గుర్తుండి ఉండాలి....

కొన్ని సంవత్సరాల క్రితం నాంపల్లి లలితకళాతోరణంలో జరిగిన సంగీత-సాహిత్య వైభవం గురించిన ప్రవచనాల్లో, శ్రీ చాగంటి సద్గురువులచే శ్రీ కాశినాథుని విశ్వనాథ్ గారి ఎన్నో సినిమాల్లోని ఎన్నెన్నో కథాంశాల గురించిన ప్రస్తావనలు, ప్రశంసలు అనాడు అక్కడికి విచ్చేసిన వారందరికి కూడా గుర్తుండే ఉంటాయ్....

చూసిన తర్వాత కొన్ని రోజులకే మర్చిపోయేలా ఉండే సినిమాలకి, చూసి ఎన్నో సంవత్సరాలైనా సరే మళ్ళి మళ్ళి చూడాలనిపించేలా ఉండే సినిమాలకి....
ఉండవలసిన అత్యున్నతమైన సంగీత సాహిత్య ప్రమాణాలను ఎంతో గొప్పగా మేళవించి చిత్రీకరించిన విశ్వనాథ్ గారి కీర్తి చిరంతనమైనది.....

తినడం కోసం జీవిస్తున్నామా.... లేదా
జీవించడం కోసం తింటున్నామా....
అనేది ఎంతగా ప్రాచుర్యం పొందిన మాటో....

సొమ్ము కూడబెట్టుకోవడానికి ఏ సినిమా అయితే ఏముందిలే.....అని ఏదో ఒక కథాంశానికి దర్శకత్వం వహించడమా...
లేదా.... 
దర్శకత్వం వహించబడిన సినిమా దశాబ్దాల పాటు చెక్కు చెదరని రీతిలో తన ప్రాభవాన్ని 
ప్రదర్శించాలి అనేలా చిత్రాలను రూపొందించడమా అనేది కూడా అంతగా ప్రాచుర్యం పొందిన బాట...

మాటని, పాటని, ఆటని, మాత్రమే కాదు మౌనాన్ని కూడా ఎంతో గొప్పగా అవిష్కరించిన  అనన్యసామాన్యమైన బాట విశ్వనాథ్ గారిది....

సాగరసంగమం లోని ఒక సన్నివేశంలో శైలజ గారికి నాట్యంలోని వివిధ మెళకువళను ప్రదర్శిస్తూ...వెళ్ళే ముందు కమల్ హాసన్ యొక్క ఈ క్రింది డైలాగ్స్ అప్పుడూ ఇప్పుడూ మరియు ఎల్లప్పుడూ శ్రీ విశ్వనాథ్ గారి కళాత్మక సృజనకు అద్దంపట్టే ఆణిముత్యాలవంటి చిత్రీకరణలు.....

"
యతో హస్తః తతో దృష్టిః...
యతో దృష్టిః తతో మనః...
యతో మనః తతో భావః...
యతో భావః తతో రసః....

దృష్టి, మనసు, భావము, చేసే కళలమీదే లగ్నమైఉండాలి.... అప్పుడే రససిద్ధి కలుగుతుంది....
"

వెండితెర చిత్రాల వెలుగుజిలుగులు బహు కాలాల పాటు వేనోళ్ళా కొనియాడబడేలా రూపొందింపబడి వాటికి అమరత్వాన్ని అలదిన శ్రీ కాశినాథుని విశ్వనాథ్ గారికి వారి 92వ జన్మదిన శుభాభినందనా నమస్సులను అర్పిస్తూ వారికి, వారివారికి  ఈశ్వరానుగ్రహం మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ 
ఒక సుసంగీతసాహిత్యాభిమాని యొక్క చిరు కవన కుసుమాంజలి...🙏

No comments:

Post a Comment