Tuesday, April 4, 2023

శ్రీశోభకృత్ చైత్ర శుద్ధనవమి 2023 శ్రీరామనవమి పర్వదిన శుభాభినందనలు.....🙂🍕🍿🍨🎂🍦🍧💐

సీతాముఖాంబోరుహచంచరీకః... 
సమస్తకల్యాణగుణాభిరామం
నిరంతరం శుభమాతనోతు...

ఎల్లరికీ శ్రీశోభకృత్ చైత్ర శుద్ధనవమి 2023 శ్రీరామనవమి పర్వదిన శుభాభినందనలు.....
🙂🍕🍿🍨🎂🍦🍧💐

శ్రీచాగంటి సద్గురువులు ఒక గొప్ప స్వాధ్యాయ దీక్షను స్వీకరించి అనుగ్రహించిన " సంపూర్ణ శ్రీమద్రామాయణం " ప్రవచనాలు విన్నభాగ్యవంతులకు తెలిసినట్టుగా...

ఒక ఉన్నతమైన మానవుడిగా, కొడుకుగా, అన్నగా, శిష్యుడిగా, భర్తగా, మితృడిగా, సుక్షత్రియ వీరుడిగా, అప్రతిహత ధనుర్వేదవిద్యాపారంగతుడిగా, 
చక్రవర్తిగా, ఈ భువిపై 11000 సంవత్సరాలకు పైగా నడయాడిన ఇక్ష్వాకుకులతిలకుడు, రఘురాముడు,
ధర్మాత్ముడైన శ్రీరాముడు....!

**
దశ వర్షసహస్రాని దశ వర్షశతానిచ....
భ్రాతృభిః సహితః శ్రీమాన్రామో రాజ్యమకారయత్... 

తాత్పర్యం : 10 వేల 10 వందల సంవత్సరాలు..అనగా 11000 సంవత్సరముల పర్యంతం తన తమ్ముళ్ళతో కలిసి శ్రీరాముడు కోసల మహాసామ్రాజ్యాన్ని పరిపాలించెను.
**

కేవలం రావణసమ్హారం మాత్రమే శ్రీరామావతారం యొక్క ప్రయోజనమై ఉండిఉంటే, 11000 సంవత్సరముల రాజ్యపరిపాలన అనంతరమే సరయు నదీప్రవేశం చేసి శ్రీరాముడు బ్రహ్మలోకం చేరి తిరిగి శ్రీవైకుంఠంలోని పర వ్యూహంలోకి తన శ్రీవైష్ణవతేజస్సును లయింపజేయడం అనే సుదీర్ఘప్రయాణం......,
శ్రీమద్రామాయణంలోని
బాలకాండ,అయోధ్యకాండ,అరణ్యకాండ,కిష్కింధకాండ,
సుందరకాండ,యుద్ధకాండ అనే 6 కాండలకు అదనంగా ఇంకో కాండగా, ఉత్తరకాండ గా, లోకంలో ప్రచరింపబడి ఉండేదికాదు....

కౌమార ప్రాయంలో ఉన్న తన కొడుకులు లవకుశులతో యాగాశ్వం కొరకై యుద్ధాన్ని చేస్తూ, 
"కోదండాన్ని చేతబూని ఉండగా శ్రీరాముడితో ఇంత గొప్పగా ఆరితేరిన విలువిద్యాకౌశలంతో తలపడుతున్న 
ఈ సుక్షత్రియ వీరబాలురు ఎవరు...?"
అని శ్రీరాముడే విస్తుపోయేంతటి రీతిలో ఉన్న ఘటన గురించి విన్నవారికి తెలిసినట్టుగా.....
శ్రీరాముడు తన వారాసులకు
కుశపురి, లవపురి అనే సామంతరాజ్యాలకు
యవ్వరాజ్యపట్టాభిషేకం గావించిన తదుపరి,

[ more info on the RaamaLakshamanaBharataShatrughna's children's empires...@ https://lm.facebook.com/l.php?u=https%3A%2F%2Farungovil.in%2Fthe-places-ruled-by-shri-rams-sons-after-his-time.html&h=AT1MSSRqtzAjf0WDsUCL6zmd8XP4wUuOwiyyJVuxjYYlOIClmJFJmcRxIXAVLnTUcOpVgF3aQNPswNNiTAW84txHQlyewWrHXM-r6M1DThEftmbfKIk6bptA-E8G1V8sZQ ]

త్రేతాయుగ శ్రీరామావతార పరిసమాప్తికి సమయం ఆసన్నమయ్యిందని మారువేషంలో వచ్చిన యమధర్మరాజు గారు ఏకాంతంలో తెలియజేసిన తదుపరి కావించిన సరయు నదీప్రవేశంతో ఈ భూలోకానికి తన పాంచభౌతిక శరీరం స్వస్తి పలికిన సందర్భంలో తనతో సరయు నదీప్రవేశం గావించిన కోసలవాసులకు మరియు ఇతర సకల ప్రాణులకు కూడా మోక్షాన్ని ప్రసాదించిన మరియాదా పురుషోత్తముడిగా ఖ్యాతిగడించిన శ్రీరాముడి చరితము శ్రీమద్రామాయణం,
సీతాయాశ్చరితం మహత్, పౌలస్త్యవధ అనే పేర్లతో పిలవబడుతూ, ఆనాటినుండి ఈనాటి వరకూ కూడా అత్యద్భుతమైన ఆదికావ్యంగా, వేదోపబృహ్మణం గా వినుతికెక్కిన సాటిలేని ఆర్షసారస్వతం....!

ఒక సర్వోత్తమ నరుడు వానరులతో సలిపిన స్నేహపయనాన్ని వర్నించే రసరమ్యమైన కావ్యంగా ఎల్లరికీ సుపరిచితమైన శ్రీమద్రామాయణాన్ని ఒక్కో విజ్ఞ్యుడు ఒక్కో కోణంలో దర్శిస్తూ, ఎన్నో శాస్త్రాల సమ్మిళిత సారంగా శ్రీమద్రామాయణాన్ని అనాదిగా కోవిదులు కీర్తిస్తూండడం ఈనాటికి కూడా మనం గమనించవచ్చు....

త్రేతాయుగంలో భద్రుడికి వరమిచ్చిన ఆనాటి వనవాసంలోని శ్రీసీతారాముడే,
శ్రీవైకుంఠరాముడిగా భద్రగిరీశుడిగా ఈ కలియుగంలో తన స్వయంవ్యక్త స్వరూపాన్ని కలియుగ అర్చామూర్తిగా గౌతమీతట ప్రాంతంలో స్థిరీకరించగా,
శ్రీకంచర్లగోపన్న గారిని రామదాసుగా కరుణించి, ఏకశిలా ఆలయాన్ని నిర్మింపజేసుకొని, ఆ ఆలయానికి ఖర్చైన సొమ్మును తన త్రేతాయుగం నాటి రామమాడల పైకంతో తానీషా ప్రభు చెరలో బంధీగా ఉన్న కంచర్లగోపన్నను విడిపించేందుకు రామోజి, లక్ష్మోజి, అనే వీరుల రూపాల్లో నాటి గొల్లకొండ నేటి గోల్కొండ కోటకు ప్రత్యక్షంగా విచ్చేసి మరీ చెల్లించగా, ఆ బంగారు రామమాడలను, మరియు శ్రీరామదాసు గారు శ్రీసీతారామలక్ష్మణులకు తయారుచేయించిన ఇతర విలువైన బంగారు ఆభరణాలను నేటికీ మనము భద్రాచల ఆలయంలో ఉన్న మ్యూజియంలో దర్శించవచ్చు....

వామాంకస్థిత జానకీపరిలసత్‌ కోదండదండంకరే
చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం, శరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే
 
అని సాక్షాత్తు శ్రీఆదిశంకరాచార్యుల వారిచే కీర్తింపబడిన కలియుగ పునః వ్యక్త దైవం శ్రీభద్రాద్రివరరామచంద్ర మూర్తి..!

ఆ భవ్యమైన అపసవ్యశంఖచక్రధరమూర్తిని వివరిస్తూ స్వామివారి వామాంకంపై కొలువైన సీతమ్మ వారి కుడిచేతిలోని కమలం వెనకవైపు ఉండి కనిపించకుండా ఉండే అంశం గురించి శ్రీచాగంటి సద్గురువులు వివరించడం చాలమందికి గుర్తుండే ఉంటుంది .....

నరుడిగా జన్మించిన కౌసల్యాతనయుడైన దశరథాత్మజుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారం గా జన్మించిన శ్రీరాముడే అని రూఢపరిచే ఏకైక కలియుగ ఆలయ అర్చామూర్తి శ్రీభద్రాచలక్షేత్ర స్థిత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి....

శ్రీవైకుంఠరాముడిగా స్వామి వారు శ్రీవైకుంఠం నుండి గోదావరీ తీరానికి రావడానికి ఆలస్యం అవుతుందని తొందరపాటులో అలా శంఖచక్రాలు అటు ఇటుగా అపసవ్యంగా ధరించి ప్రభవించారు...అని కొందరు భక్తులు ఏవో నిర్వచనాలు చెప్తూ ఉంటారు.....

త్రేతాయుగంలో ఒక సుక్షత్రియుడిగా జన్మించి కుడిచేతిలో కోదండమనే ఆయుధాన్ని ధరించి,
మరే అవతారంలోనూ కూడా కానించనంతగా,
ఎంతో మంది రాక్షసులను శ్రీరాముడు నేలకూల్చిన వైనాన్ని శ్రీచాగంటి సద్గురువులు శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో వివరించి ఉన్నారు...

మరి అటువంటి సుక్షత్రియుడు దైవిక సుదర్షనచక్రానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేలా దక్షిణహస్తంలో చక్రాన్ని ధరించి వస్తే ఈ కలియుగంలో ఎంతమంది పాపాత్ములు నేలకూలవలె..?

ఈ కలియుగం ఎంత విచిత్రమైనదో ఆ శ్రీవైకుంఠ రాముడికి తెలుసు....
దేవుళ్ళ పేర్లు పెట్టుకొని రాక్షసులలా జీవించే ఎంతోమంది ఉండే ఈ కలియుగంలో, సద్బుద్ధిని ప్రసాదించడమే ప్రాధాన్యతగా ప్రభవిస్తేనే ఈ కలియుగంలో జనులను ఉద్ధరించగలిగేది.....
కాబట్టి జ్ఞ్యానదాయకమైన శంఖానికి అధికప్రాధాన్యత ఉండేలా ఒక సుక్షత్రియుడైన రాముడు
పాంచజన్యాన్ని అధికప్రాధాన్యత గల కుడిచేతిలో ధరించి, సుదర్షనచక్రానికి ప్రాధాన్యతను తగ్గించి ఎడమచేతిలో ధరించి కలియుగ శ్రీవైకుంఠరాముడిగా ప్రభవించాడు.....!

కుడిచేతిలో శంఖాన్ని ధరించి ఉండే
కేశవ,
మధుసూదన,
దామోదర,
సంకర్షణ,
వాసుదేవ,
ప్రద్యుమ్న 
అనబడే 6 శ్రీమహావిష్ణుస్వరూపములను.....

మరియు
ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి ఉండే
కేశవ,
త్రివిక్రమ,
పద్మనాభ,
వాసుదేవ,
అచ్యుత,
ఉపేంద్ర
అనబడే 6 శ్రీమహావిష్ణుస్వరూపములను.....

ప్రతీరోజూ ఆచమనం గావించేటప్పుడు ఉఛ్ఛరింపబడే కేశవాది చతుర్వింశతి నామాల స్వరూపాల్లో గమనించే ఉంటారు కద...
( the images of 24 / chaturvimshati swaroopams for the reference are available at 
https://images.app.goo.gl/TqQGsL7pYNS6WvbW8
)

కాబట్టి శ్రీవైకుంఠరాముడు తన  శంఖచక్రాలు అలా తిరగేసి ధరించడం ఏదో తొందరతొందరలో శ్రీవైకుంఠం నుండి రావడంవల్ల...అది ఇది అనేవి ఎవరో ఏమి తోచక చెప్పిన మాటలు....అది ఒక ప్రయోజనార్ధమై ధరింపబడే శైలి....

ద్యులోకాల నుండి దేవతలు దిగిరావడానికి లేట్ అవ్వడాలు, ట్రాఫిక్ జాములు, ఆభరణాలను సర్దుకోవడాలు లాంటివి ఏమి ఉండవు....
ఎందుకంటే వారు కాంతివేగంతో ప్రభవించే అప్రాకృత తైజసిక దివ్యదేహధారులు...

అటువంటి శ్రీరాముడు శ్రీవైకుంఠరాముడిగా వెలసిన శ్రీభద్రగిరి ప్రాంతంలో ప్రవహించే గోదావరి నదీ ఎంతో పరమపవిత్రమైన, శక్తివంతమైన సిద్ధగౌతమిగా అలరారుతూ, ఎన్నెన్నో మనుష్యాగోచర దేవతీర్థములతో,
సిద్ధఝరులతో, ఆవాహితమై వర్ధిల్లే మహిమోపేతమైన తీర్థం....

దార్లో వెళ్ళే ఒక మేకల గుంపుకు ఒక మారేడు చెట్టుకు మరియు ఒక తుమ్మ చెట్టుకు,
దార్లో వెళ్ళే కొందరు మూర్ఖులకు ఒక సాధారణ గుండ్రని నల్ల రాయికి మరియు ఒక సాలగ్రామానికి,
ఎవ్విధంగానైతే పెద్దగా ఏ భేదంకూడా తెలియదో....
అదేవిధంగా సామాన్యులకు అది కేవల గోదావరి జీవనది దరి....
మాన్యులకు అది శ్రీభద్రగిరి తట సిద్ధగౌతమి తీర్థస్థలి....

ఆ శ్రీవరభద్రగిరి వాసుడైన శ్రీవైకుంఠరాముడి మరియు వాడవాడలా వెలసిన శ్రీవైష్ణవాలయాల్లో గొప్ప వేడుకగా శ్రీచైత్రశుద్ధ నవమి సీతారాములకల్యాణం అత్యంత వైభవోపేతమైన ఉత్సవంగా నిర్వహింపబడుతున్నంతకాలమూ ఈ కలియుగవాసులకు శ్రీరామానుగ్రహం మెండుగా లభించి తరిస్తూనే ఉంటారు....

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల హృదయంలో మెరిసిన శ్రీరామచంద్రుణ్ణి దర్శించాలంటే...
ఈ సంకీర్తనలో చాలా చక్కగా వివరింపబడినది....

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు
యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు

ఖరదూషణాదులను ఖండతుండముల సేసె
అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె
ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము

కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల
తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె
యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన

పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-
కొడుకుల( గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె
అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె

http://annamacharya-lyrics.blogspot.com/2007/07/272itade-raghuramudita.html?m=1

శ్రీవేంకటరామచంద్రపరబ్రహ్మణేనమః...
🎂🍿💐🙂🍧🍧🍨🍕

No comments:

Post a Comment