శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర పౌర్ణమి ప్రయుక్త 2023 శ్రీహనుమద్ జన్మదినోత్సవ శుభాభినందనలు ....🙂🍦🍧🎂💐🍕🍿🇮🇳
ఋగ్, సామ, యజుర్, అథర్వణములుగా,
చతుర్వేదవిభాగాన్ని, అష్టాదశ పురాణములను, అనుహ్రహించిన శ్రీవేదవ్యాసమహర్షి గారి తండ్రిగారైన శ్రీ పరాశర మహర్షి యొక్క పరాశరసమ్హిత, హనుమంతుడి ఐతిహ్యానికి సప్రామాణికమైన సనాతన సారస్వతంగా అనాదిగా భాసిల్లుతున్నది అని సద్గురువుల ఉవాచ....
పరాశర సమ్హిత ప్రకారంగా హనుమద్ జన్మోత్సవం, వైశాఖ బహూళ దశమి....
శ్లో|| వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే|
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే||
అంటే వైశాఖ బహుళ దశమీ, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం లో హనుమ స్వామి జన్మించారు.
వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారవ్యవహారానుగుణంగా వివిధ తిధులలో శ్రీహనుమద్ జన్మదినోత్సవం నిర్వహింపబడడం అనేది లోకంలో ఒక నైసర్గిక ఉత్సవంగా కొనసాగుతున్నది...
అవ్విధంగా చైత్ర పౌర్ణమి రోజున కూడా శ్రీహనుమద్ జన్మదినోత్సవం చాలా ప్రాంతాల్లో నిర్వహింపబడడం గమనించవచ్చు....
ఒక మహాత్భుతమైన శక్తివంతమైన శ్లోక సంకలనంగా వినుతికెక్కిన శ్రీసుందరకాండషోడశి లోని 16 శ్లోకాల్లో ఒకటైన, కార్యసిద్ధిమంత్రం గా ప్రఖ్యాతి గడించిన,
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ |
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ||
(5.39.4 :: 5 వ కాండ, సుందరకాండ లోని, 39 వ సర్గంలో, అయిదవ శ్లోకం )
అనే శ్రీమద్రామాయణ శ్లోకంలో గమనించినట్టుగా....
ఎక్కడెక్కడైతే హనుమకొలువై ఉంటారో...
అక్కడ శోకం నశించి ప్రశాంతత లభ్యమౌతుంది అనేది పెద్దల మాట....
శ్రీచాగంటి సద్గురువులు అనుగ్రహించిన ఎంతో వైభవోపేతమైన సంపూర్ణ శ్రీమద్రామాయణం ప్రవచనాల్లో, గురువుగారు వివరించినట్టుగా " శోకోనాస్తిసమోరిపుః ",
అనగా, శోకాన్ని మించిన శత్రువు లేదు...
ప్రత్యేకించి ఈ కలియుగ వాసుల జీవితాలు శోకతప్తమై ఉండే కలహజీవితాలు...
(అందుకే ఆ పరమాత్మ, శ్రీవేంకటేశ్వరుడిగా, గోవిందుడిగా నేను "ఆనందనిలయుడిగా", ఈ కలియుగప్రత్యక్ష దైవంగా శ్రీవేంకటాద్రి పై కొలువై ఉన్నాను...అని సెలవిచ్చాడు....)
ఈ కార్యసిద్ధి శ్లోకమంత్రవ్యాఖ్యానానికి అనుగుణంగా
శ్రీహనుమద్ అష్టోత్తరశతనామావళి లోని కొన్ని పేర్లను మీరు గమనించినట్లైతే....
17. ఓం సర్వదుఖఃహరాయనమః...
26. ఓం సర్వరోగహరాయనమః...
29. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయనమః..
45. ఓం సీతాశోకనివారణాయనమః...
93. ఓం శాంతాయనమః...
అనే నామాల్లో హనుమంతుడి ఈ దుఖఃక్షయ తత్త్వం ప్రస్ఫుటంగా కీర్తింపబడుతున్నది....
ఏ మనిషైనా సరే జీవితంలో వారు ఎన్నుకున్న వివిధ మార్గాల్లో కష్టపడేది ఈ 5 నామాల్లో పేర్కొనబడిన దైవానుగ్రహాన్ని బడసి ఆనందంగా జీవించేందుకే అనేది ఎల్లరికీ తెలిసిందే....
శ్రీరాముణ్ణి ఆత్మారాముడిగా, పరమాత్మగా..
సీతమ్మను జీవాత్మగా....
హనుమను జీవజీవేశ్వరులను అనుసంధానించే ఆచార్యులుగా....,
తత్త్వశాస్త్రం శ్రీమద్రామాయణాన్ని దర్శించును....
కాబట్టి ఇక్కడ "ఓం సీతాశోకనివారణాయనమః " అంటే....
జీవాత్మగా ఉండి పరమాత్మను ప్రార్ధించే ప్రతిఒక్కరికి సీతమ్మ ప్రతిరూపం...
కాబట్టి భక్తుల యొక్క శోకనివారకుడిగా ఇక్కడ హనుమ కీర్తింపబడుతున్నాడు అని విజ్ఞ్యులు గుర్తించవలె.....
ప్రార్ధనలకు అనుగుణంగా అన్ని రకాల దుఖఃములను, రోగాలను హరించి....,
ప్రార్ధనలకు అనుగుణంగా అన్ని రకాల విద్యలను, సంపత్తిని అనుగ్రహించి....,
ప్రార్ధనలకు అనుగుణంగా అన్నివిధాలా శోకాన్ని నివారించి, ప్రశాంతతను ప్రసాదించగా...,
ఇక భక్తులకు మిగిలేది ఆనందమే కద..!
ఆనందమే పరమాత్మయొక్క స్వస్వరూపము కాబట్టి,
ఆచార్యస్థానములో ఉండి యోగ్యులైన భక్తులకు ఆత్మానందాన్ని, అనగా భగవదనుగ్రహదీప్తిని దర్శించగలిగే భావస్థాయిని, ప్రసాదించే హనుమంతులవారిని...
హనుమద్ అష్టోత్తరశతనామావళి లో
5. ఓం తత్త్వజ్ఞ్యానప్రదాయ నమః
40. ఓం ప్రాజ్ఞ్యాయ నమః
59. ఓం మహాతపసే నమః
61. ఓం శ్రీమతే నమః
80. ఓం వాగధీశాయ నమః
81. ఓం నవవ్యాకరణపండితాయ నమః
84. ఓం మహాత్మనే నమః
96. ఓం యోగినే నమః
88. ఓం వాగ్మినే నమః
106. ఓం లోకపూజ్యాయ నమః
అంటూ వివిధ రీతుల శాస్త్రం కీర్తిస్తున్నది...!
ఇందులో 5 వ నామం
" ఓం తత్త్వజ్ఞ్యానప్రదాయ నమః "
చాల విశేషమైన అనుగ్రహదాయకమైనది....
ఎందుకంటే మనిషికి కావలసిన అతిముఖ్యమైన జ్ఞ్యానం తత్త్వ జ్ఞ్యానం....
అది లభించినతదుపరి మిగతా అన్ని రకాల జ్ఞ్యానములు,
అనగా విజ్ఞ్యానము, ప్రజ్ఞ్యానము, సుజ్ఞ్యానము, చివరికి బ్రహ్మజ్ఞ్యానము కూడా, ఈశ్వరానుగ్రహంగా వాటంతట అవే లభ్యమౌతాయ్ కాబట్టి...
ఒక ధూర్తుడు వాడి యొక్క ఓర్వలేనితనంతో మన ఉన్నతిని ఓర్వలేక పక్కదారిపట్టించాలని అనుకుంటున్నప్పుడు,
వాడి యొక్క అతితెలివిని, తద్వారా వాడి మనసులోని అసూయ, ద్వేషం, ఈర్ష్య, ఇత్యాది సకల సంకుచిత సరంజామాను గణించాలంటే సదరు మనిషి యొక్క మనస్తత్త్వం తెలిసిఉండగలగాలి.....
ఒక విజ్ఞ్యుడు తన యొక్క దూరదృష్టితో, సత్య ద్రష్టుడై ఫాలానా విషయంలో మన ఉన్నతికి చేయూతనందిస్తున్నప్పుడు, ఆ జ్ఞ్యాన విశేషాన్ని అందుకొని ఆకళింపు జేసుకొని తరించేందుకు సదరు అంశం యొక్క తత్త్వం తెలిసిఉండగలగాలి.....
ఎదుట ఉన్న 100 వస్తువుల్లో ఏ వస్తువులను దేశకాలానుగుణంగా మన శ్రేయస్సుకై స్వీకరించాలో తెలియాలంటే సదరు వస్తువు ఎట్టి ఫలితాన్ని ఇస్తుందనే వస్తుతత్త్వం తెలిసిఉండగలగాలి....
ఒక మనిషి, ఒక అంశం, ఒక వస్తువు, ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ విశ్వంలో ఒక చిన్న చీమ దెగ్గరి నుండి, ఒక చీమ లా కనిపించే మెరిసే బృహత్ నక్షత్రం వరకు, ప్రతీది కూడా ఒక తత్త్వమే...!
ఆ తత్త్వజ్ఞ్యానం అనేది ఈశ్వరానుగ్రహంగా లభించిననాడు, జీవనసాఫల్యత అనే తీరం చేరేందుకు జీవితం అనే రైలుబండి ఏ పట్టాలపై ముందుకుసాగాలి అనే ముఖ్యమైన అంశంలో మనిషికి తడబాటు ఉండదు...
తత్త్వజ్ఞ్యానం అనే ఆ ఈశ్వరానుగ్రహం లభించనినాడు,
"పరోపదేశవేళాయాం సర్వే వ్యాసపరాశరాః..." అని శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనాల్లో ఒకచోట చమత్కరించినట్టుగా,
ప్రతి అడ్డగాడిద కూడా, వాడి జోబులు నింపుకునేందుకు మనకు బోధించడానికే తయారవుతాడు...
శ్రీరాముడి సన్నిధి దెగ్గర గోదావరిలో తీర్థస్నానానికని బయలుదేరి...
కాజిపేట్ అనే జంక్షన్లో ఆగిన రెండు రైలుబండ్లు కూడా చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కదా అని.....
ఎవరో ఒక అడ్డగాడిద చెప్పాడని....
భద్రాచలం వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కకుండా కాగజ్ నగర్ వెళ్ళే ట్రైన్ ఎక్కితే....
తెల్లారితే శ్రీభద్రగిరి ఆలయానికి చేరవలసిన వ్యక్తి ఏదో పేపర్ మిల్ ఉన్న ప్రాంతానికి చేరడం అనేది...
ఎట్లుంటదో.....
జీవితంలో అన్నీ తెలిసిఉండడం అనేది కుదరకపోయినా....
ఎవరి మాట వినాలో.... ఎవరి మాట పెడచెవిన పెట్టాలో తెలియని నాడు......
ఆ జీవన ప్రయాణం పైన పేర్కొన్న విధంగా పొరపాటు, తడబాటు అనే పేరుతో గతితప్పి గమ్యానికి దూరంగా సాగుతుంది.....
అటువంటి అతిముఖ్యమైన తత్త్వజ్ఞ్యానాన్ని అనుగ్రహించే వరదైవంగా శ్రీఆంజనేయుడు అనాదిగా విజ్ఞ్యులచే ఆరాధింపబడుతూ,....
ఎవ్విధంగానైతే ఆనాడు హనుమంతుడు వాయుదేవుణ్ణి ప్రార్ధించి, శ్రీరాముడు సంధించిన కోదండ వినిర్ముక్తమైన బాణం యొక్క గతిని మార్చి రావణవధ అనే శ్రీరామావతారం యొక్క ముఖ్య ప్రయోజనం సాధింపబడడానికి కారకుడైనాడో....
అవ్విధంగా, భక్తుల మానుషప్రయత్నాలకు తన అనుగ్రహాన్ని జతపరిచి హనుమంతుడు వాటిని సరైన గమ్యం వైపుగా సాగేలా చేసి భక్తుల జీవితాలను ఘనంగా తీర్చిదిద్దుతాడు కాబట్టే, ఆ భక్తాగ్రేసరుణ్ణి, భాగవతోత్తముణ్ణి, చిరంజీవిని,
భగవంతుడిగా మార్చిన శ్రీమద్రామాయణం,
వేదోపబృహ్మణం గా ఖ్యాతిగడించి,
" రామాయాణమహామాలారత్నం వందే అనిలాత్మజం..." అని ఆ శ్రీరామపాదసేవాదురంధరుణ్ణి కొనియాడుతున్నది...
అందుకే సంకీర్తనాచార్యులైన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఆ శ్రీవేంకటరాముడి ఆలయానికి ఆవల బేడిహనుమంతుడిగా, ఆలయంలో ఆజ్ఞ్యాపాలకహనుమ గా, సవినయుడై కొలువైన ఆంజనేయుణ్ణి....
*****
సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ
ఆతతప్రతాపశౌర్యా అసురాంతకా
కౌతుక శ్రీవేంకటేశు కరుణాసమేత
శాతకుంభవర్ణ కలశాపురనివాస
శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు
అరుదైన రామ కార్యదురంధరా....
*****
అంటూ కీర్తించినారు....
@
http://annamacharya-lyrics.blogspot.com/2007/06/243saranu-saranu-veda.html?m=1
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా సమామి !!
అని భక్తుల్లెలరిచే నమస్కరింపబడే ఆ శ్రీరామదూత, మనోజవానికి కారణమయ్యే సకల మనోశక్తులను చైత్రపౌర్ణమి యొక్క షొడశకళలతో శోభించే పూర్ణచంద్రుడి అనుగ్రహంగా భక్తుల్లెలరికీ అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ....
చైత్రపౌర్ణమి శ్రీహనుమద్ జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు....🙏🙂🍿🇮🇳🍕💐🎂🍧🍦🍨
No comments:
Post a Comment