****************************************************
ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు
చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు
చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు
చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు
http://annamacharya-lyrics.blogspot.com/2010/05/700nityatmumdai-yumdi-nityumdai.html?m=1
****************************************************
నిత్యము, సత్యము, ప్రత్యక్షము, బ్రహ్మము, అయిన శ్రీవేంకటాద్రివిభుడు సదా సంస్తుత్యుడు...
శ్రీవైకుంఠ లోకంలోని క్రీడాద్రి పర్వతం, అప్రాకృతమైన తిరుమల కొండగా ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం సువర్ణముఖరీనదీతీరప్రాంతమైన ద్రవిడదేశ సమీపంలో వచ్చి భక్తులను అనుగ్రహించడానికి కొలువైయ్యిందో అనేది అమెరికన్ కార్బన్ డేటింగ్ ఎక్స్పర్ట్స్ మరియు శ్రీతరిగొండవెంగమాంబ విరచిత శ్రీవేంకటాచలమాహాత్మ్యం వివరించును....
అనాటి నుండి నిత్యమూ శ్రీవేంకటాచలంపై ఎన్నెన్నో రూపాల్లో తిరుగాడే నిత్యమైన, సత్యమైన, ప్రత్యక్షమైన, పరమాత్మగా తిరుమలేశుడు సదా సంస్తుత్యుడు....
ధర్మసంస్థాపనార్ధమై "సంభవామి యుగేయుగే..." అని నాలుగు యుగాల్లోను అవతారాలు స్వీకరించి ప్రాణికోటిని అనుగ్రహించేది ఈ శ్రీదేవుడే...
" యద్ భావం తద్ భవతి " అనే ఆర్ష వాక్కుకు తగ్గట్టుగా,
భక్తులు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా వారి భావనాకాశజగత్తులో ప్రభవించి విహరించే పరదైవమే ఈ శ్రీవేంకటపతి...
కాబట్టి ఇతడి త్రిమూర్తులు ఏకమైన త్రైమూర్త్యాత్మక పరతత్త్వ మూర్తి..
త్రిమూర్త్యాత్మక పరతత్త్వమూర్తిగా కొలువైన అన్నవరం శ్రీరత్నగిరి సత్యదేవుని ఆలయ స్థలవృక్షమైన "అంకోలవృక్షం" యొక్క విశేషం గురించి విజ్ఞ్యులు శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించే ఉంటారు కద....
ఏ విధంగా ఒక అంకోల వృక్షం అసంఖ్యాక అంకోలబీజాలను సృష్టించి, విస్తరించి, మళ్ళీ తనలోకే లయింపజేస్తుందో...
అవ్విధముగా... ఈ శ్రీవేంకటపతి కూడా సకలచరాచర జగత్తును తననుండే సృష్టించి, లోకాల్లో విస్తరించి, మళ్ళీ తనలోకే లయింపజేసుకునే పరతత్త్వమూర్తి....
నిత్యమైన సూర్యచంద్రులను నేత్రాలుగాగల ఈ విరాట్విశ్వమూర్తి యొక్క ఆత్మశక్తి, మనోశక్తి సకల జీవులకు ఆధారమై వర్ధిల్లే జీవశక్తి...
కాబట్టి ఈ లోకానికి అవ్యక్తమైన, అద్వంద్వమైన మూర్తి ఈ శ్రీవేంకటపతి...
ఆనాడు దేవతలకు స్వర్గాధిపత్యాన్ని అనుగ్రహించడానికై బలిచక్రవర్తి నుండి 1,2 అడుగుల భూదానాన్ని అర్ధించి భూమ్యాకాశాలను 2 పాదాల్లో కొలిచి, 3 వ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సుపై అలంకరించి ఆతడికి సుతలలోకాధిపత్యాన్ని అనుగ్రహించిన త్రివిక్రముడు ఈతడే...కాబట్టి ఇతడి శ్రీపాదయుగళమే ఇలాకాశములై వర్ధిల్లుచున్నవి...
కంటికి కనిపించేదంతా ఒకపాదంతో కొలిచి,
కనుచూపుమేర నుండి కడుగహనమైన బ్రహ్మాండానంతాల వరకు ఈ విశ్వంలో ఉన్నదంతా మరో పాదంతో కొలిచిన అనిర్వచనీయమైన కడు సూక్ష్మాతి సూక్ష్మమైన, మరియు ఎంతో గహనాతిగహనమైన తత్త్వంతో అలరారే పరమాత్ముడు కాబట్టి భక్తులు నిర్వచించగలిగే సర్వస్వానికి కూడా ఈశ్వరత్వాన్ని వహించిన పరమేశ్వరుడే సదా సంస్తుత్యుడైన ఈ తిరువేంకటవిభుడు.. ...
సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు...😊💐
No comments:
Post a Comment