"నువ్వు నన్ను పదే పదే ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నా కూడా ఇబ్బంది పెడుతున్నావు...
నేను శ్రీరాముడిని అగ్నిసాక్షిగా మనువాడిన ధర్మపత్నిని....
ఈ కాంచనలంక అనే భోగభూమిలో నీకు ఏం తక్కువయ్యిందని నన్ను ఇంతగా ఇబ్బందిపెడుతున్నావ్....
నన్ను దోచుకోవాలని నువ్వు పరిపరివిధాలా గావించే నీ కుయుక్తులను మానుకో రావణ...
లేనిచో శ్రీరామబాణానికి నీతో పాటు నీ కాంచనలంక మొత్తం నశించును....
ఏరా రావణ...నీకు ఈ కాంచన లంకలో మంచి చెప్పే వారు లేరా..
లేక చెప్పినా నువ్వు వినవా...."
అని సీతమ్మ ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదు రావణుడు....
ఎందుకంటే రావణాసురుడికి ఇతరుల సొత్తును దోచుకొని తనవిగా చెప్పుకుంటూ బ్రతకడం అనే మౌఢ్యం ఎక్కువ....
కుబేరుడి పుష్పకవిమానంతో అలరారే కాంచనలంకను దోచుకోవడం దెగ్గరినుండి దండకారణ్యంలో సీతమ్మను అపహరించడం వరకు.....
అనుభవించేదంతా మంది నుండి దోచుకున్న సొమ్మే...
ఒకరు ఒకరికి ఇవ్వడం వేరు....
అది బహుమతి అయినా, దానం అయినా, కానుక అయినా, మరే విధమైన గౌరవభరిత పరస్పరసుహృద్భావపూర్వక
ఇచ్చిపుచ్చుకోవడాలైనా....
ఒకరినుండి ఒకరు దోచుకోవడం వేరు....
అది మోసం అయినా, కపటం అయినా, కుయుక్తి అయినా, దౌర్జన్యమైనా, మరే విధమైన అరాచకమైన దోపిడీ అయినా....
"నాయనా రామా, ఇప్పటివరకు ఈ లోకంలో ఎవ్వరికీ లభించని ధనుర్వేదవిద్యానిధిని నీకు అనుగ్రహిస్తున్నాను నాయనా....
సావధానమనస్కుడవై ఈ మహా అస్త్రాలన్నీ నిధిధ్యాసనంతో స్వాధీనంగావించి ఎప్పుడు ఎక్కడ ఏ అస్త్రం ఉపయోగించవలెనో లోకోపకారనిమిత్తమై అట్లు ప్రయోగించి
పరిఢవిల్లు నాయన...శుభమస్తు..."
అని శ్రీరాముడికి శ్రీవిశ్వామితృల వారు అనంతమైన ధనుర్వేదశాస్త్రాన్ని విద్యాదానంగా ఇచ్చారు...
మామగారైన దశరథమహారాజు లౌకిక స్వర్ణాభరణాలను, చీనిచీనాంబరములను, వనవాసానికి ఉద్యుక్తమైన సీతమ్మకు కానుకలుగా ఇచ్చి పంపించారు..
వనవాసంలో ఉండగా శ్రీ అత్రిఅనసూయ ఋశ్యాశ్రమానికి చేరుకున్న సీతారాములను సగౌరవంగా స్వాగతించి, సీతా మాహాసాధ్వికి అనసూయ మహాసాధ్విమణి అలౌకిక మహిమాన్విత ఆభరణాలను, లేపనాలను, కానుకలుగా ఇచ్చి
గౌరవించారు....
ఆ మహిమాన్విత దేవతాభరణాల, లేపనాల వల్లే రావణాసురుడి అశోకవనంలో బంధీగా ఉన్నా కూడా సీతమ్మ అగ్నిశిఖలా వర్ధిల్లారు....
అప్పుడు వారు ఆహారంగా స్వీకరించింది కూడా దేవలోకము నుండి దేవేంద్రుడు సమకూర్చిన పాయసాన్ని.....
అందుకే ఒక గడ్డిపరకను మధ్యలో అడ్డుగా పెట్టి రావణుడితో సంభాషించిన సీతమ్మ అగ్నిపునీతగా గౌరవింపబడెను.....
సహస్రాపరమాదేవి శతమూలాశతాంకురా
సర్వగుమ్హరతుమేపాపం దూర్వాదుస్స్వప్ననాశినీం
గా గౌరవింపబడే ఆ గడ్డిపరక సీతమ్మకు, రావణాసురుడుకి మధ్యలో స్థాణువుగా ఉన్న ఆగ్నేయాస్త్రమయ్యింది....
అందుకే రావణుడికి ఆ గడ్డిపరక యొక్క పరిధిని దాటి సీతమ్మను అగౌరవపరచశక్యం కాలేదు....
ఒకప్పుడు ఏ వేదవతి అయితే ఈ రావణాసురుడి అరాచకం వల్ల భంగపడి,
"ఇప్పటి నుండి నాతో ప్రవర్తించినట్టుగా మరే స్త్రీమూర్తిపట్ల అయినా వారి సమ్మతి లేకుండా నువ్వు అరాచకాన్ని గావిస్తే నువ్వు సమూలంగా నశించిపోయెదవుగాక..."
అనే శాపాన్ని రావణుడికి ఇచ్చి యోగాగ్నిలో తనని తాను ఆహుతి గావించుకొని దేవలోకానికి చేరుకొనెనో...
ఆ వేదవతికి బదులుగా అశోకవనంలో నిజంగా సీతమ్మే ఉండిఉంటే...
ఆవిడ ఆగ్నేయాస్త్రంతో అభిమంత్రించే ఒక్క గడ్డిపరకతోనే కాంచనలంక మొత్తం ఎప్పుడో కాలి బూడిద అయ్యేది...
కాని అగ్నిదేవుడి సమ్రక్షణలోకి సీతమ్మ వెళ్ళడం, సీతమ్మ స్థానంలోకి వేదవతిని ప్రవేశపెట్టడం అనే దైవిక ఘటనలో భాగంగా, దేవతల తరపున అగ్నిదేవుడికి వేదవతికి జరిగిన సంభాషణయొక్క సారంగా,
వేదవతి మరలా అగ్నిదేవుడి అధీనంలోకి వచ్చేంతవరకు సీతమ్మ గా రావణుడి చెరలో బంధీయై ఉండాలి కాని అయోనిజ అయిన సీతమ్మలా ఆదిపరాశక్తి యొక్క శక్తిప్రకటనం గావించకూడదు.
ఎందుకంటే నరవానరులైన శ్రీరాముడు మరియు హనుమంతుల వారి వల్లే, చతుర్ముఖ బ్రహ్మగారి వరం గౌరవింపబడి, రావణకుంభకర్ణులు హతులవ్వవలెను....
జయవిజయులనే శ్రీవైకుంఠ ద్వారపాలకులు, సనకసనందనులచే శాపగ్రస్తమై ముమ్మారూ శ్రీహరి విరోధులుగా భువిపై జన్మించి తిరిగి వైకుంఠానికి తిరిగిరావడం,
ఇత్యాది ఎన్నో దేవతాంశాల సమన్వనయమంతా కూడా వేరు విషయం...
ఇక్కడ గమనించవలసిన ముఖ్యాంశం ఏంటంటే....
అపౌరుశేయమైన వేదశక్తి ఒక మూర్తీభవించిన దేవకాంతగా ప్రభవించగా, అట్టి దేవకాంత తనను హింసించిన రావణాసురుడికి ఇచ్చిన శాపం ఊరికే పోదు....
ఎందుకంటే వేదశక్తి సాక్షాత్తు పరమాత్మ యొక్క శక్తి..
మరియు సత్యలోకవాసులైన సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి వాక్కు ఎల్లప్పుడూ గౌరవింపబడే, గౌరవింపబడవలసిన, వేదమూర్తి యొక్క వాక్కు....
అందుకే దేవతలు ఈ సమీకరణం కార్యరూపాన్ని దాల్చడానికి ఆవశ్యకరమైన సందర్భాన్ని సృజించేందుకు,
ఏ వేదవతి అయితే శోకంతో యోగాగ్నిలో లయించెనో ఆ వేదవతివల్లె రావణాసురుడు లయించాలి...
ఏ నరవానరులైతే రావణుడి వల్ల పరిహసింపబడి చతుర్ముఖ బ్రహ్మగారిచే వరప్రదాన సందర్భంలో విస్మరింపబడేనో ఆ నరవానరుల వల్లె రావణాసురుడు నిధనమవ్వాలి...
అందుకే మానవమేధకు అందనంత ఎత్తులో సంచరించే దివిజులు, అలా లోకోపకార దేవకార్యసాధనలో
వారివారి విహితకర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు...
ఒకరిని హింసించి వారి సొత్తును వారి సమ్మతికి విరుద్ధంగా దోచుకునే వారికి ఆ సంపద తదనంతర కాలంలో ఎవ్విధంగా నెత్తిన పోసుకున్న నిప్పుల కుంపటిలా పరిణమించి వారిని లయింపజేయునో, శ్రీమద్రామాయణ ఇతిహాస కథనం మనకు ఇవ్విధంగా బోధిస్తున్నది....
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || 4 : 7
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 4 : 8
తాత్పర్యం :
ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి (గ్లాని చెంది), అధర్మము వృద్ధి పొందుతుందో, అప్పుడప్పుడు నేను నన్ను నేనే సృజించుకుంటాను (అంటే అవతరిస్తాను).
సజ్జనులను (మంచివారిని) రక్షించడానికి, దుష్టులను (చెడ్డవారిని) శిక్షించడానికి మరియు ధర్మమును తిరిగి స్థాపించడానికి, నేను యుగయుగాన అవతరిస్తాను.
అనే భగవద్గీత యొక్క బోధ చాలమందికి తెలిసిన అంశమే...
యోగనారసిమ్హుడిగా అన్నీ గమనించడమే కాదు, సమయం ఆసన్నమైనప్పుడు ఉగ్రనారసిమ్హుడిగా పైకి లేవడం కూడా పరమాత్మకు తెలియును....
సర్వం శ్రీప్రహ్లాదవరద శ్రీస్తంభోద్భవ ఉగ్రనారసిమ్హ శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙏
No comments:
Post a Comment