(వైశాఖ బహుళ తదియ (May-4-2026) అనురాధ నక్షత్రం)
ఈ శతాబ్దపు నిజమైన సన్యాసవరేణ్యులుగా ఎందరో మాన్యులచే ఆరాధింపబడే మరో శ్రీఆదిశంకరాచార్యులు అని పరమాచార్యుల వైభవం గురించి శ్రీచాగంటి సద్గురువులు వచించడం విజ్ఞ్యులకు విదితమే....
మన భారతదేశ చరిత్రలో ఎందరో మహనీయులు వారివారి విద్యుక్త సన్యాసాశ్రమధర్మంలో భాగంగా ఎన్నో గొప్పగొప్ప లోకోద్ధారక కార్యక్రమాలను చేపట్టి తరించారు...
అట్టి మహనీయుల్లో చిరస్మరణీయులైన శ్రీకంచిమహాస్వామి వారు భక్తలోకానికి ఒనరించిన అనుగ్రహం బహువిశేషమైనదిగా ఎందరో విజ్ఞ్యుల ఉవాచ...
"నడయాడుందైవం" / "నడిచేదైవం" గా భక్తలోకంచే నిత్యం నమస్కరింపబడే శ్రీకంచిపరమాచార్యుల అనుగ్రహం ఇప్పటికీ ఎందరో ఆర్తులను, భక్తులను కరుణిస్తూనే ఉన్నది....
మీకోసం మేము ఏమైనా ఇవ్వాలని అనుకుంటున్నాము పెరియవ అని భక్తులు ప్రేమతో ప్రార్ధిస్తే...
"మీ జీవితంలో ప్రతీరోజు ఓ 5 నిమిషాలు నా కోసం కేటాయించండి. ఆ సమయంలో శ్రీరామనామస్మరణతో తరించండి" అని వచించిన సాధువరేణ్యులు చాలాచాలా అరుదు....
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించి బయటకు వచ్చినప్పుడు అక్కడి పాత్రికేయులు అడిగిన,
"లోపల ఉన్నది ఏ దేవుడని మీరు అంటారు మహాస్వామి వారు.." అనే ప్రశ్నకు....
"లోపల ఉన్నది శ్రీవేంకటేశపరబ్రహ్మము...."
అని మందస్మితులై సమాధానం ఇచ్చిన బ్రహ్మవేత్తలు శ్రీకంచిమహాస్వామి వారు...
వారి సంపూర్ణ వందసంవత్సరాల జీవనయాత్రలో అనుగ్రహింపబడిన భక్తులు కోకొల్లలు...
ఇప్పటికీ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా శ్రీకంచిమహాస్వామి వారి అనన్య సామాన్య అనుగ్రహ విశేషాల గురించి వివరిస్తూనే ఉంటారు....
గురువాయూర్ శ్రీకృష్ణదేవాలయంలో సంప్రదాయ కావ్యపఠనంగా వర్ధిల్లే "నారాయణీయం" లోని
" అస్మిన్ పరాత్మన్ ననుపాదల్మకల్పే
త్వమిత్థముత్తాపితపద్మయోనిః
అనంతభూమామమరోగరాశిం
నిరుంథివాతాలయవాసవిష్ణోః "
అనే మహత్తరమైన శ్లోకాన్ని అనుగ్రహించి ఎందరో భక్తులకు ఆరోగ్యసిరిని అనుగ్రహించిన వైదీశ్వరస్వరూపులు శ్రీమహాస్వామి వారు...!!!
శ్రీస్కందగిరిగా అలరారే సికింద్రాబాద్ లోని శ్రీసుబ్రహ్మణ్య ఆలయ వైభవం మరియు ఆ ఆలయంతో మహాస్వామివారి అనుబంధం విజ్ఞ్యులకు విదితమే...
కులమతవర్గవర్ణాది అన్ని రకాల అనివార్యమైన గుర్తింపులకు అతీతంగా విజ్ఞ్యులైన ఎందరో విదేశీయులను కూడా ఎంతగానో అనుగ్రహించిన అపార కరుణామయులు శ్రీకంచిమహాస్వామి వారు...!
విశ్వసించే వారికి అది సాక్షాత్తు సకలదేవతా స్వరూపమైన తులసిమొక్క...
ఇతరులకు అది సదరు ఇతర అన్ని మొక్కల్లో ఒక తిలసి మొక్క....
అట్లే...
విశ్వసించే వారికి అది సాక్షాత్తు సకలదేవతా స్వరూపమైన శ్రీకంచిమహాస్వామి వారి బృందావనం. ఎందుకంటే ఇప్పటికీ వారు ఆర్తిగల భక్తులకు శ్రీకంచిశ్రీమఠం నుండే పలుకుతారు కాబట్టి...
ఈ లోకంలో మంచి చెప్పే వారు ఎక్కువే ఉంటారు...
మంచిదే....
కాని మంచి చేసే వారు చాలా తక్కువగా ఉంటారు.....
అదే విధంగా
ఈ లోకంలో మంచి అధ్యాత్మ అంశాల గురించి చెప్పే వారు ఎక్కువే ఉంటారు...
మంచిదే....
కాని ఎంతో గొప్ప మంచి చేసే వారు చాలా తక్కువగా ఉంటారు.....
అట్టి చిరస్మరణీయులైన మహనీయుల్లో శ్రీకంచిమహాస్వామి వారిది ఎల్లప్పుడూ భక్తుల హృదయాల్లో సదా సర్వోన్నతమైన సగౌరవస్థానం...
అట్టి శ్రీకంచిమహాస్వామి వారి శ్రీపాదపద్మములచెంత సవినయ సాష్టాంగ ప్రణామ ప్రయుక్త చిరు కవనసుమాంజలి.....💐🙏
No comments:
Post a Comment