Friday, September 27, 2019

శ్రీరంగనాథుని దివ్యగోపురం.....! :)

కావేరి వర్ధతాం కాలే కాలే వర్షతువాసవః.....
శ్రీరంగనాథోజయతుశ్రీరంగశ్రీశ్చవర్ధతాం..... 🙏😊
శ్రీరంగనాథుని దివ్యగోపురం.....!
అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల ప్రవచానాలు విన్నవారికి గుర్తున్నట్టుగా, ఒకానొక సమయంలో గణపతి విఘ్నకారకుడై అభిన్నమైన పరతత్వ స్వరూపాలైన శివకేశవులిరువురు కూడా ఈ పవిత్రభరతభూమి దాటివెళ్ళకుండ తనదైన శైలిలో వ్యూహాన్ని రచించి 2 మహాపుణ్యక్షేత్రాలు ఈ భరతభూమిపై కొలువై ఉండడానికి కారకుడయ్యాడు.....
ఒకసారి రావణుడు పరమేశ్వరుడిని మెప్పించి ఆత్మలింగాన్ని వరప్రసాదంగా సాధించి లంకలోప్రతిష్ఠించడానికి వెళ్తుండగా సంధ్యావందన సమయం కావడంతో పక్కనే ఉన్న ఒక సత్బ్రాహ్మణ బాలుడిని పిలిచి కాసేపు ఈ శివలింగాన్ని భూమిపై పెట్టకుండ అలాగే పట్టుకొనినిల్చొమ్మని చెప్పి వెళ్ళాడు....
ప్రఛ్ఛన్న రూపంలో బాలబ్రాహ్మణుడిగా ఉన్న ఆ గణపతి, " నాకు ఈ శివలింగం మోయలేనంత బరువనిపించిన్నప్పుడు నిన్ను పిలుస్తాను.... 1 2 3 లెక్కపెట్టెలోగా వచ్చి తీస్కోకపోతే నేను కింద పెట్టి వెళ్ళిపోతా సరేనా మరి....?"
అని అనగా..." హా పర్లేదు...అలా వెళ్ళి సంధ్యవార్చి ఇలా వచ్చేస్తాను....అంతేగా......కాసేపు అలా పట్టుకొని నిల్చొ చాలు...."
అని చెప్పి రావణుడు అలా వెళ్ళాగానే ఈ పిల్లవాడు "అమ్మో ఈ బరువు నేను మోయలేను.....వచ్చి తీస్కొ అని చెప్పి...." టక్కుమని 1 2 3 అని అంకెలు లెక్కపెట్టి ఆ ఆత్మలింగాన్ని భూమి పెట్టి పారిపోతాడు.....
ఆ ఆత్మలింగానికున్న వైశేషికస్వభావంచేత
భూసంపర్కం పొందిన మరుక్షణం అది అక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది.....
అక్కడినుండి తరలించడం ఇక అసాధ్యం......
గణపతి పరబ్రహ్మం యొక్క ఈ లీలతో మనకు మహామహిమాన్వితమైన గోకర్ణక్షేత్రం లభించి ధన్యులమయ్యాము......
ఇంకోసారి రావణుడి తమ్ముడు విభీషణుడికి శ్రీరాముడు తన పట్టాభిషేకానంతరం తనకు సహాయం ఒనరించినవారందరికి తగురీతిలో కానుకలు ఇస్తూ, తరతరాలుగా ఇనవంశ కులదైవమై పరిఢవిల్లిన, తన ఆరాధ్యదైవమైన, ఏకంగా శ్రీరంగనాథ మూర్తినే కానుకగా ఇచ్చాడు..!
విభీషణుడు సంతసించి ఆ మూర్తిని లంకకు తీస్కెళ్తుండగా, అంతటి ఘనదైవం భరతభూమి దాటి వెళ్ళడం ఇష్టంలేని ఆ గణపతి పరబ్రహ్మం, అన్న రావణుడి విషయంలో చేసినట్టుగానే ఉపాయంపన్ని కావేరి తీరంలో ఆ శ్రీరంగనాథమూర్తి శాశ్వతంగా కొలువైఉండేలా చేసాడు......
విభీషణుడు బాధతో," అదేంటి గజానన ఎందుకు నాకు శ్రీరామానుగ్రహాన్ని దూరంచేసావు.....లంక సుభిక్షంగా ఉండడం నీకు ఇష్టంలేదా......" అంటూ చింతించగా,
" సప్తచిరంజీవుల్లో ఒకరిగా ఉండే వరాన్ని పొందిన నీకు శ్రీరామానుగ్రహం సర్వకాలసర్వావస్థల్లోను పరిపూర్ణంగా శాశ్వతమై ఉన్నది...
ఇంతటి పవిత్రమైన మూర్తి వేదభూమి అయిన భరతఖండాన్ని వీడి అగస్త్య మహర్షి విసర్జితమైన సముద్ర జలాన్ని దాటి లంకకు వెళ్ళి తన శక్తిని కోల్పోకూడదు కాబట్టి లోకశ్రేయస్సుకై ఈ మూర్తిని ఇక్కడే దక్షిణాభిముఖంగా కొలువైఉండేలా చేసాను......
సదా నీ లంకను ఈ శ్రీరంగనాథుడు
తన అమృతదృక్కులతో చల్లగా కరుణిస్తూనే ఉంటాడు......కాబట్టి ఈ మూర్తిని ఇక్కడే వదిలి నీ రాజ్యానికి తరలి వెళ్ళు అసురేంద్ర.....ఇక సెలవు...." అని ముగించాడు ఆ గణపతి పరబ్రహ్మం.......
అట్లే మరొక సందర్భంలో కూడా మహర్షికమండలంలో మంత్రబంధనంతో కుంభకమై ఉన్న గంగను తన ఉపాయంతో ఒలికించి, ద్రవిడ దేశపు జీవధార అయిన కావేరి నది జన్మకు కారకుడు కూడా గణపతే...
అందుకే సనాతన సంప్రదాయాలకు ఆచార్యవైభవానికి ఉనికిపట్టుగా వెలుగొందే ద్రవిడ దేశంలో అనగా ఇప్పటి తమిళనాడులో, లంబోదర స్వామి ఒనరించిన వెలకట్టలేని సహాయానికి కృతజ్ఞ్యతగా " పిళ్ళయార్ కోయిల్ " అని వీధికో వినాయకుడి గుడి ఉంటుంది......😊

No comments:

Post a Comment