Saturday, September 7, 2019

Happy Teacher's day - Sep-5-2019.... :)

శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని జాతీయ ఉపాధ్యాయదినోత్సవం గా జరుపుకునే సెప్టెంబర్-5 ప్రతి విద్యార్ధికి ప్రత్యేకించి స్కూల్లో ఉండే విద్యార్ధులకు ఒక పెద్ద సంబరమే..... ఇప్పుడెలా ఉన్నాయో కాని మా స్కూల్ రోజుల్లో మాత్రం అగస్ట్-15, జనవరి-26 ఎంత పెద్ద పండుగలో అంతే స్థాయిలో సెప్టెంబర్-5 కూడా జరిపేవారు..... టీచర్స్ డే కి ప్రత్యేకంగా పిల్లలందరు ఆ ఒక్కరోజు తామే టీచర్లు / సార్లు గా అవతారాలెత్తి, ఆ రోజంతా దిగువ తరగతులకు బోధనా సిబ్బందిగా వెళ్ళి సాయంత్రం ఇచ్చే ప్రైజ్లకోసం ఎదురు చూసే ముచ్చటైన రోజు..... 
వేదికపై నిల్చొని ఎన్నైనా ఉపన్యాసాలు ఇవ్వొచ్చు...అందులో ఏముందిలే అని మనం అవతలి వైపు గుంపులో ఉన్నప్పుడు ఎంతో ఆషామాషిగా అనేస్తాం..... కాని ఒక్కసారి వేదికనెక్కి నలుగురు అభినందించే రీతిలో ప్రసంగించాలన్న, బోధ చేయాలన్నా ఎంత కష్టమో, ఎంత సాహసమో, ఎంత పెద్ద విషయమో చిన్నప్పుడు ఈ ఒక్క సెప్టెంబర్-5 నా మాత్రమే అర్ధమయ్యేది మాకు..... ఆ రోజున ఒక టీచర్ / సార్ పడే కష్టం ఎంటో ప్రత్యక్షంగా అర్ధమయ్యి వారి గొప్పదనాన్ని అర్ధంచేసుకునేవాళ్ళం..... స్వ / కుటుంబ పోషణార్ధమై నెలజీతం అందుకుని కష్టపడి పనిచేసే అన్ని వృత్తుల్లా బోధన కూడా ఒక వృత్తే అయ్యుండొచ్చు...కాని ఏ వృత్తికి కూడా లేని గొప్పదనం, ప్రత్యేకత, కష్టం, కేవలం బోధకవృత్తిలో మాత్రమే మనం గమనించగలం.....
84 లక్షల జీవరాశుల్లో మరే ప్రాణికి లేని బుద్ధికుశలత ప్రేరేపిత స్వకౌశల సంబంధిత స్వరపేటికను ( రామచిలుకకు ఉండేది మానుష ప్రేరేపిత స్వరపేటిక...అందుకే కద చిలకపలుకులు పలకడం అని అనేది...  , తదంతర్లీనంగా వాక్కును వెచ్చిడంతో తమ ఆయువును కూడా వెచ్చించి ఇతరుల ఉన్నతికై జీవిస్తూ జీవించడం అనేది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే చెల్లిన ఘనత...! అందుకే ఎవ్వరైనా సరే తమ జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాసరే తల్లితండ్రుల తర్వాత అంత గౌరవం ఇచ్చేది వారి గురువులకు మాత్రమే...! జన్మనిచ్చి ఈ భువిపైన మన ప్రస్థానం కొనసాగేందుకు కృతజ్ఞ్యతగా తల్లితండ్రులకు ఇవ్వబడే గౌరవమే, ఆ జన్మను వ్యర్ధంకాకుండా విద్యావినయసంపన్నులుగా మనలను తీర్చిదిద్దిన గురువులకు కూడా ఇస్తాము అనేది లోకసహజమైన సత్యం.....
ఎందుకంటె ఒక మొక్కను నాటిన వారికి ఆ ఘనత ఎంత సొంతమో, దానికి సకాలంలో కావలసిన సమ్రక్షణను అందించి అది పుష్పించి ఫలించేందుకు కారణమైన తోటమాలికి కూడా అంతే ఘనత సొంతం....ఇంకా చెప్పాలంటే ఆ తోటమాలి గొప్పదనమే ఎక్కువ.... ఎందుకంటే తోటమాలి వినా ఆ మొక్క చెట్టై దానివల్ల నలుగురు లబ్ధిపొందే స్థితి రావడం జరగదు కాబట్టి.....అచ్చం అదే విధంగా నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఒక వ్యక్తి ఇవ్వాళ ఒక స్థాయిలో ఉన్నాడంటే ఆ ఘనత తనను తీర్చిదిద్దిన గురువులకే చెందుతుంది....
అదే గురువులు మరి ఇంకెందరికో కూడా బోధించారు కదా మరి ఇతరులెందుకని అంతగా జీవితంలో పైకిరాలేకపోయారు అని వితండవాదం చేసే వారికి ఒక్కటే సమాధానం,
మేఘం తను సముద్రమునుండి గ్రహించిన నీటిని తియ్యని వర్షపుబిందువులుగా మార్చి భువిపైకి వెదజల్లినప్పుడు అది స్వీకరించి లబ్ధి పొందిన ఒక సుక్షేత్రంలో కొలువైన విత్తనం మొలకెత్తింది కాని ఒక బండరాయిపై పడిఉన్న విత్తు మొలకెత్తలేదు అంటే అది విత్తు యొక్క స్థానబలిమి కాని మేఘం యొక్క దానలేమి కానేరదు కద.....
అట్లే ఒక గురువు తన బోధామృతాన్ని ఎందరో విద్యార్ధులకు సమంగా అందించినప్పుడు, దాని విలువ తెలిసి అది గ్రహించి యోగ్యతను సిద్దింపచేసుకోవడం సదరు విద్యార్ధి యొక్క బాధ్యత అవుతుంది కాని ఆ విద్య అందించిన గురువుది కాదు....
విద్యను అందించే స్థానంలో ఉన్న గురువుకి అది తన కర్తవ్యం....
విద్యను అర్ధించే స్థానంలో ఉన్న వ్యక్తికి అది సంగ్రహించి లబ్ధి పొందడం తన బాధ్యత.....
మన స్కూల్, కాలేజ్ జీవితాల్లో అటువంటి మహనీయులైన గురువులు ఎందరో మనకు వారి బోధతో పాటుగా వివిధ సహాయసహకారాలు అందించి ఇవ్వాళ మనం ఉన్న స్థితికి కారకులై ఉండడం, ఎవరికి వారు వారి వారి జీవితాల్లోకి తరచి చూస్తే గుర్తొచ్చే సత్యం.....
అలా మనకు లౌకిక విద్యను నేర్పి జీవితంలో నిలదొక్కుకునేందుకు కారకులైన గురువులు ఒకెత్తైతే......
ఎంతో గొప్ప పుణ్యసంచయంతో లభించిన మానవ జన్మను సార్ధకం చేసుకునే దిశలో మన జీవన ప్రస్థానం సాగేలా మనకు అధ్యాత్మ మార్గనిర్దేశకత్వాన్ని అనుగ్రహించే ఆధ్యాత్మిక గురువులు / ఆచార్యులు / పురాణప్రవచనకర్తలు / పీఠాదిపతులు ఇత్యాది సాధుసత్పురుష భక్తభాగవతోత్తములు ఒకెత్తు......
వీరిరువురి వల్లే ఎవరి జీవితమైనా సార్ధక్యం చెందేది.....
కేవల లౌకిక విద్యను మాత్రమే ఆర్జించడం అంటే జీవితాన్ని కేవల భోగానుభవానికి ఒక నిరంతర ప్రయాణంగా, ఈ శరీరం భోగలాలసకు ఒక ఉపకరణంగా ఉండిపోయి ఒకనాడు పడిపోవడం అనే ఘట్టంతో ముగిసిపోతుంది.....
ఆ లౌకిక విద్యతో పాటుగా, ఆధ్యాత్మిక విద్యను కూడా జీవితానికి ఆపాదించుకొని, మరింత ఉన్నతమైన జన్మలను పొందేదుకు అనగా ఆత్మోద్ధరణకై సాగే ప్రయాణంగా మన జీవితాన్ని మలుచుకున్న నాడు, ఈ రెంటి సమ్మిళిత సంఘాతమై జీవితం పూర్ణత్వాన్ని సంతరించుకుని అది " ముంగించడం " కాకుండా " సంపూర్ణం " కావించడం అనే ప్రక్రియతో ఒకనాడు ఈ జీవితానికి తెరపడుతుంది.....
" గు " అనగ అంధకారం / " రు " అనగా తన్నిరోధకః
అంటే మన అజ్ఞ్యానం అనే అంధకారాన్ని రూపుమాపే బృహస్పతి శక్తినే గురువు అనే నామవాచకంతో మనం పిలుస్తాము.....
ఇక ఎవరికి ఎవరు దేనికి ఎందుకు గురువు అవుతారు అంటే, ఒకరికి ఎవరి బోధపై గురి కుదిరితే వారు తమకు గురువై ఒప్పుతారు అనేది లోక సామాన్యమైన భావం.....
అస్మద్ గురుదేవులు, సద్గురు శ్రీ చాగంటి గారి మాటల్లో చెప్పాలంటే,
" గురుబోధ అనేది నరనరాన జీర్ణించుకునిఉండి అనుక్షణం వారి సద్వాక్కుతో జీవితపు ప్రతి సంఘటనని, మనసులో జనించే సంకల్ప వికల్పాలను చెక్ చేస్కుంటూ ఉండగలగాలి....
అనగా ఇప్పుడు మా గురువుగారు ఇక్కడే ఉంటే నా కర్తవ్యాన్ని ఏమని సూచించేవారు.....నా ఈ నిర్ణయం ధార్మిక జీవితానికి సరితూగేలా ఉంటుందా....."
ఇత్యాదిగా గురుబోధాంతర్గతంగా సముపార్జించబడిన వివేకరాశికి సరితూగేలా మన జీవిత మార్గపు ధార్మిక నడవడి సరిదిద్దబడడం అన్నమాట....
మన జీవితంలో సద్గురువుల బోధ / సద్వాక్కుల ప్రశస్తి ఎట్టిదో, యావద్ ప్రపంచానికే అత్యంత ప్రశస్తమైన ఆటను పరిచయం చేసిన భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన ఆట చదరంగాన్ని ఒక చిన్న ఉదాహరణగా తీస్కొని చెప్పే ప్రయత్నం గావిస్తాను......
మన జీవితం అనేది ఒక 64 గళ్ళ చదరంగం వంటిది..... ( 64 లలిత కళలే మన జీవితపు ఆటను శాసించే ఆ చదరంగపు గళ్ళు )
16 పావులు మనవి - 16 పావులు ప్రత్యర్ధివి......
1 రాజు ( మన బుద్ధికి సంకేతం ), 1 మంత్రి ( మన మనసుకి సంకేతం )
8 బంట్లు / సిపాయిలు ( సమ్మిళితమై ఉండే అష్టవిధ ప్రకృతికి సంకేతం )
2 ఒంటెలు / ఉష్ట్రములు ( ఉష్ట్రశక్తి ఓపికకు, లౌకిక / సాంసారిక నిమగ్నతకు / జీవుడి న్యాస శక్తికి / స్థానబలిమికి సంకేతం )
2 గుర్రాలు / అశ్వములు ( అశ్వశక్తి వేగానికి, జవసత్వాలకు / బలానికి, ఇంద్రియ శక్తికి సంకేతం )
2 ఏనగులు / గజములు ( గజశక్తి ఐహిక సంపదలకు, శరీరదారుఢ్యానికి సంకేతం )
ఇవన్నీ కూడా రాజుని (బుద్ధిని) నడిపించే / శాసించే / సమ్రక్షించే ఉపకరణములు.......వీటన్నిటి సమ్మిళిత శక్తికి / లేదా వీటన్నిటిని నియంత్రించి ఆటలో పావులుగా మార్చి ఆటను శాసించే శక్తే మంత్రి (అనగా మన మనసు..... చదరంగంలోని మంత్రి అచ్చం మన మనసులాగా ఎటు కవాలంటే అటు ఏ దిశలోనైనా తుర్రుమని దూసుకుపోగలదు...దాన్ని కట్టడిగావించడం బహుకష్టతరం... )
ఆటలో మిగతావన్నీ కోల్పోయినా సరే మంత్రి / రాజు ఈ రెండింటితో కూడా ఆట సాగుతుంది......కాని మంత్రి పోతే ( అంటే మన మనసు లయం అయిపోతే) ఇక ఆట దాదాపు ముగిసిపోయినట్టే.... కేవల రాజు ( అనగా మన బుద్ధి ) మనోసంకల్పం వినా (అనగా మంత్రి యొక్క శక్తి వినా) శక్తిహీనుడు....
ఇక చదరంగపు ఆటలోని పావుల అమరిక తీరును మనం పరికిస్తే ఈ క్రింది విధంగా ఉండడం మనం గమనించవచ్చు....
సిపాయ్, సిపాయ్, సిపాయ్, సిపాయ్, సిపాయ్, సిపాయ్, సిపాయ్, సిపాయ్
ఏనుగు, గుర్రం, ఒంటె, రాజు, మంత్రి, ఒంటె, గుర్రం, ఏనుగు
ప్రతి శక్తి ముందు ప్రకృతి సూచకమైన తత్ సిపాయ్ ఒకటి ఉండడం.....ఆ సిపాయ్ కదిలితే తప్ప వెనక ఉన్న శక్తిని ఆటలో కదిలించలేము.....
కాని గుర్రం ఇందుకు మినహాయింపు....చాలామంది మొదటి పావుగా గుర్రాన్నే కదపడం మనం చూస్తుంటాం......
అదే విధంగా ఈ ప్రపంచంలో ఒక మనిషి యొక్క ఆట మొదలవ్వాలంటే మొదట ప్రకృతి యొక్క కదలికే కారణమై ఉంటుంది.....
కాని ఇంద్రియ శక్తికి ప్రతీక అయిన గుర్రం మాత్రం ప్రకృతి యొక్క పలకరింపు లేకున్నా సరే కదలగలదు....ఆటను మొదలుపెట్టగలదు.....
అటు ఇటు మొదట్లో ఉండేవి ఏనుగులు అనగా మన ఐహిక సంపదను / శరీర దారుఢ్యాన్నే ఈ లోకం మొదట చూస్తుంది.....
ఆ ఐహిక సంపద ధర్మబద్దమైనదా లేదా మందిని ముంచి వివిధ అనైతిక మార్గాల్లో పోగేసిందా మరియు ఆ శారీరక దారుఢ్యం రోగరహితమై హితకరమైనదా లేదా బాగా తిని తొంగుంటే కొవ్వుపట్టి పెరిగినదా అనేది ఆటలోని ఇటు వర్గమా లేద అటు వర్గమా అన్నమాట......
తరువాత రెండో స్థానంలో ఉన్నవి గుర్రాలు......ఒక గుర్రం కర్మేంద్రియాల శక్తికి మరొకటి జ్ఞ్యానేంద్రియాల శక్తికి సంకేతం.....
ఈ శరీరపు కర్మేంద్రియ జ్ఞ్యానేంద్రియాలు సద్వర్తన్నులై మనల్ని ధార్మిక జీవితంవైపుగా నడిపిస్తున్నాయ లేదా ఊరుమీద పడి కేవలం ఇంద్రియభోగాసక్తులై ఉండేలా చరిస్తున్నయా అనేది ఆటలోని ఇటు వర్గమా లేద అటు వర్గమా అన్నమాట......
ఆ తరువాత మూడవ స్థానంలో ఉండేవి ఒంటెలు..... ఇవి రాజుకు మంత్రికి అతి దెగ్గర్లో పక్క పక్కనే ఉంటాయ్.....
ఓపికకు, లౌకిక / సాంసారిక నిమగ్నతకు / జీవుడి న్యాస శక్తికి / స్థానబలిమికి సంకేతంగా ఉండే ఉష్ట్రశక్తి,
మన జీవితంలో మనసు బుద్ధి ఎప్పుడు వీటికి దెగ్గరగా ఉండడాన్ని సూచిస్తుంది.....
వీటన్నిటిని పావులుగా కదుపుతూ ఆటలో మనం వేసే ప్రతి అడుగు ఆ మనిషి యొక్క జీవన గమనాన్ని సూచిస్తుంది / శాసిస్తుంది.....
ప్రతి మనుష్యుడికి ఉండేవి ఈ శక్తులే, అందరు సాగించాల్సిన లౌకిక ప్రయాణం ఈ భూమిపైనే, అందరు అశించేది తమ ప్రయాసలో విజయాన్నే...
కాని ఒక్కొక్కరు ఒక్కోలా వీటిని కదుపుతు తమ జీవితపు ప్రయాణాన్ని సాగిస్తారు......
మనసు (మంత్రి) తత్ సంబంధంగా బుద్ది (రాజు) బాగా బలమైన చాణక్యం తో సాగిననాడు, ఆట ఎల్లప్పుడు మన వశంలోనే ఉంటుంది......
అచ్చం అదే విధంగా సద్గురువుల / అచార్యుల అనుగ్రహంతో మన మనసును తత్ సంబంధంగా బుద్దిని దైవిక / ధార్మిక మార్గంలో ఉండేలా బాగ సంస్కరించుకొని వాటికి తర్ఫీదు ఇచ్చినప్పుడు జీవితపు ప్రయాణం ఎల్లప్పుడు మన వశంలోనే ఉంటుంది......అప్పుడు ఆ ప్రయాణం అంత తేలికగా గతితప్పదు.....లక్ష్యం గురితప్పదు......!
శ్రీ చాగంటి సద్గురువుల సద్వాక్కుల్లో మహాభారతం విన్నవారికి,
కేవలం బావగా కాకుండా భగవంతుడిలా సర్వస్వంగా తననే నమ్ముకున్నందుకు శ్రీకృష్ణపరమాత్మ ఎన్నెన్నో వ్యూహలోచనలు సలిపి, అఖరికి తానే రథసారధిగా మారి పార్థసారధి అనే బిరుదునామాన్ని ఆర్జించుకొని అర్జునుడి విజయానికి, తన్మూలంగా పాండవ విజయానికి ఎకైక కారకుడయ్యాడు......
దుర్భేద్యమైన సహజ కవచకుండలాలతో జన్మించినను, పరశురాముడి శాపం దెగ్గరినుండి శ్రీకృష్ణపరమాత్మ వ్యూహం వరకు కర్ణుడి మరణానికి కారాణాలు అనేకం అయినట్టు......
ఈ లోకంలో అజ్ఞానం అరవై రకాలుగా ఉన్నా, విజ్ఞ్యానం మాత్రం ఒకేరకంగా ఉన్నను.....చివరికి ఆ అజ్ఞానం విజ్ఞ్యానం చేతికి చిక్కి ధర్మం అనే అగ్నిలో సమూలంగా దహించుకుపోక తప్పదు......
కేవలం సద్గురువులు / ఆచార్యుల వద్ద మాత్రమే లభించేది ఆ అమూల్యమైన ధార్మికత భరిత ఆత్మజ్ఞ్యానం అనే అధ్యాత్మ విజ్ఞ్యానం ....
అందుకే వారి అనుగ్రహం వినా మన జీవితం అసంపూర్ణం, అయోగ్యం.....వారిని అర్ధించి అధ్యాత్మ విద్యను గడించి భగవంతుడిని శరణాగతి గావించి జీవించడంలోనే జీవితానికి అసలైన సార్ధకత తన్మూలంగా పరిపూర్ణత సిద్దించేది....! 
అందుకే మనం లౌకిక గురువులతో పాటుగా, ఆధ్యాత్మిక గురువులకు, అచార్యులకు కూడా సదా కృతజ్ఞ్యులమై ఉండి, మన ప్రతి విజయానికి వారి కర్తృత్వాన్ని గుర్తించి సదా నమస్కరించేది...!!
ఒనమాలు దిద్దించిన తెలుగు అనురాధా టీచర్, ఇంగ్లిష్ దేవి టీచర్ మొదలుకొని......, బీ.టెక్ విద్యను సార్ధకం చేసిన, మట్టారెడ్డి సర్, దూబే సర్, అనుపమా మ్యాం, జయశ్రీ మ్యాం, నాగపరమేశ్వరి మ్యాం, ఇత్యాదిగా ప్రతి ప్రొఫెస్సర్ వరకు, నాజీవితాన్ని తీర్చిదిద్దిన ప్రతి గురుస్వరూపాన్ని నా ఆధ్యాత్మిక గురుదేవులైన శ్రీ చాగంటి సద్గురువు గారిలో దర్శించి, వారందరి పాదపద్మములకు సాష్టాంగ నమస్సులను సమర్పిస్తూ, ఇదే వారందరికి నా చిరు కవనకుసుమాంజలి భరిత ఉపాధ్యాయదినోత్సవ శుభాభినందనానమస్కారం.....! 
( ఆలస్యమైనందుకు క్షంతవ్యుడను  )
With all due respect towards everything they have had in getting us where we are today, wishing all my Teachers a very happy Teacher's day.... 

No comments:

Post a Comment