Thursday, September 5, 2019

శ్రీగణనాథం భజామ్యహం.... శ్రీకరం చింతితార్ధ ఫలదం.......! :)

శ్రీగణనాథం భజామ్యహం....
శ్రీకరం చింతితార్ధ ఫలదం.......
అనే త్యాగరాయకృతిని అందరు వినేవుంటారు.....
రాజశేఖర్ నటించిన శృతిలయలు సినిమాపాటగా అయినాసరే......
యావద్ భారతావనిలో ఆబాలగోపాలం ఊరువాడ ఏకమై, చిన్న పెద్ద ముసలి ముతక అందరు కలిసిమెలిసి జరుపుకునే గణపతినవరాత్రోత్స పండుగ యొక్క విశేషమైన ప్రాభవం జగద్విదితమే కద..... 😊
నా చిన్నప్పుడు మా స్కూల్ల్ క్లోస్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడవీలైతే అక్కడ చవితి రాగానే పందిరి వేసి
గణపతి ఆరాధనకు కావలసిన పనులన్నీ చక చక ఆరంభించి ఆ సంవత్సరం మొత్తం గుర్తుండిపోయే ఒక మహోత్సవంలా జరుపుకునేవాళ్ళం.....
మహేష్, సందీప్, నవీన్, ఉదయ్, చాణక్య, వినయ్, కిరణ్,.....మొదలైన క్లోస్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 2 వారాల ముందు నుండే చందాలు, కవర్లు, బొంగులు, డెకరేషన్ సామాన్లు సేకరించే పనులను చక్కబెట్టి, ఎవరి ఇంటిదెగ్గర కుదిరితే అక్కడికి అందరం చేరి ఒక్కొక్కరం ఒక్కొక్క పని ముగించి మొత్తానికి చవితి సాయంత్రం కల్లా గణనాథునికి ఒక మంచి వేదిక తయారు చేసేవాళ్ళం......
ఒక చక్కనైన గణపతి మూర్తిని ధూల్పేట్ మొదలైన ప్రాంతాల నుండి తెచ్చి, మొదటి రోజు దెగ్గర ఉండే గుడిలోని అర్చకులను పిలిపించి అర్చన చేయించడం తో మా గణపతినవరాత్రి ఉత్సవం మొదలయ్యేది.....😊
9 రోజులకు తగ్గకుండా ఉండేలా సాగిన ఆ మా చిన్ననాటి ఉత్సవం నిజంగా మా అందరి జీవితాలకు ఎంతో విలువైన అనుగ్రహాన్ని ప్రసాదించి, ఎవరు ఎంతగా ప్రార్ధించి సేవించి తరించారో వారి వారి జీవితపు బాటల్లో ఆ గణపతి అంతగా తోడునీడై నిలిచి అనుగ్రహించాడు.....అనుగ్రహిస్తూనే ఉన్నాడు....! 😊
ఆ ఉత్సవ నిర్వహణలో మాకు తెలియకుండానే జీవితానికి ఉపయుక్తమైన ఎన్నెన్నో విలువైన పాఠాలను మేము నేర్చుకున్నామనేది ఆ తరువాతి మా పాఠశాలానంతర జీవితంలో మేము గుర్తించిన సత్యం.....
వివిధ దుకాణాల్లోకి వెళ్ళి చందాలు అడగడం, పరిచయస్తుల దెగ్గరినుండి అడిగి స్వీకరించడం లో ఇవ్వాళ్టి కార్పోరేట్ పరిభాషలోని సాఫ్ట్ స్కిల్ల్స్ / ఇంటేరాక్షన్ స్కిల్ల్స్ / నెగొషియేటింగ్ స్కిల్ల్స్ ఇత్యాదివి నేర్చుకోవడం, పందిరి వేయడం సామాన్లు కొనుక్కొని రావడం, వస్తువులను ఒక క్రమపద్దతిలో సర్దడం, ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువును ఎందుకు ఎలా వాడాలో నేర్చుకోవడం, ఇలా వివిధ పనుల్లో మమేకమై అంతర్లీనంగా మాకు మేమే బోధకులమై జీవితాన్ని చక్కబెట్టుకోవడం కూడా నేర్చుకున్నామన్నమాట....!
ఇప్పుడున్నట్టు అప్పుడు ఇంటర్నెట్, సెల్ ఫోన్లు లేవుకాబట్టి స్కూల్ అవ్వగానే ఆ 9 రోజులు కూడా అందరం గణేషుడి దెగ్గరికి చేరి రోజువారి పూజలు ప్రసాదాలు ముచ్చట్లు ఇలా ఉల్లసంగా గడిపేవాళ్ళం.....
ఆ 9 రోజులు కూడా అందరికి అదే వ్యాపకం గా అయ్యి అందరం ఒక ఉమ్మడి కుటుంబంలా ఉండి ఆ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన వైనం తలుచుకుంటే ఇప్పటికీ కూడా ఆ చిన్ననాటి స్మృతులన్నీ కళ్ళముందుకదలాడి ఆ కమనీయ పాఠశాల జీవితాన్ని మాకు ఒక చక్కని చలనచిత్రంలా కనువిందు చేస్తాయి.....😊
అందరివీ చిన్న చిన్న కుటుంబాలు మధ్యతరగతి జీవితాలు కావడం తో ఆ అప్యాయతలు, ఆ కల్మషరహిత స్నేహాలు 1 వ తరగతిలో ఎలా ఉన్నాయో ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల తర్వాత కూడా అంతే పదిలంగా, ఆత్మీయంగా దృఢంగా ఉన్నాయి.....!
ఇప్పుడు ఇళ్ళు పెద్దవి మనసులు చిన్నవి గా అవుతున్న రోజులు....
అప్పటివి ఇళ్ళు చిన్నవైనా మనసులు పెద్దవి గా ఉన్న రోజులు.....
కాబట్టి పెద్దగా ఎటువంటి భేషజాలకు ఆస్కారంలేని అమృతమయమైన బాల్య జీవితం గడిచిన రోజులవి.......
కూకట్పల్లి దాటి ఎక్కడికి వెళ్ళని నాకు టాంక్ బండ్ చూపినా వాళ్ళే...
ప్రతి పండగకి టైలర్ షాప్లో ప్యాంటు షర్ట్ కుట్టించుకోవడమే తెలిసిన నాకు జీన్స్ ప్యాంటు సోకుల టీ షర్ట్లు పరిచయం చేసింది కూడా ఆ స్నేహమే....
స్కూల్ యునిఫార్మ్ కి వేసుకునే బ్లాక్షూస్ మరియు ప్యారగాన్ స్లిప్పర్లు మాత్రమే తెలిసిన కాళ్ళకి యాక్షన్ షూస్ తొడిగింది కూడా ఆ స్నేహమే...
డిప్ప కటింగ్ చేసుకొని ముద్దపప్పులా తలదువ్వుకొని పౌడర్ అద్దుకొని స్కూల్ కి వెళ్ళే పుస్తాకాలపురుగుకి,
స్టైల్ కటింగ్ కొట్టించి బెరిల్ క్రీం రుద్దింది కూడా ఆ స్నేహమే....😁
ఇలా ఆ చిన్ననాటి గణపతినవరాత్రోత్సవం మా చిరకాల స్నేహసౌధానికి పునాదిగా నిలిచిన జీవిత ఘట్టంగా మారి అందరికి అదొక శాశ్వత మధురస్మృతిగా లభించిన పర్వదిన ప్రాభవం.....
ఇక వ్యక్తిగతంగా వినాయకనవరాత్రుల నిర్వహణ నాకు బోధించిన పాఠాలెన్నో.....అందించిన జ్ఞ్యానగులికలు ఎన్నెన్నో.......సమకూర్చిన అనుగ్రహవిశేషం ఎంతగానో.......
గట్టిగా వర్షంపడితే లోతట్టు ప్రాంతపు వరదబాధితుల ఇల్లు లాగా ఉండే ఒక చిన్న రెండు రేకుల రూములు పోను మిగతా ఇల్లంతా ఖాళి జాగ కాబట్టి ఒక నందనవనంలా అమ్మ నాటిన పూలమొక్కలన్నీ విరబూసి మమ్మల్ని ఈశ్వర సన్నిధికి చేర్చి మోక్షాన్ని బడసేల అనుగ్రహించండి అన్నట్టుగా ఉండే
తెల్ల చమాంతి, పసుప్పచ్చ చామంతి, కుంకుమ రంగు చామంతి, చిట్టి చామంతి, పెద్ద సెంటు గులాబి,
చిన్నరేకుల గులాబి, దవనం, గోరింట పూలు, సెంటు మల్లె, విర జాజి, ఇలా చేతికందిన పూలన్ని కోసి అమ్మతో మాలకట్టించి మేము పెట్టిన గణపతికి అలంకరించడానికి నేను తీస్కెళ్ళెసరికి,
" అర్రె.....మన క్లాస్లీడర్ అన్న వచ్చిండ్రో....జర జర్గండ్రాభై...పెద్ద పూజారి వీడే......ఒక్కగంటకాకముందే ఇంటికివెళ్ళి చదువుకోవాలి అని రాగాలు స్టార్ట్ చెస్తడు.....తొందర్గ పూజ కానిచ్చి ప్రసాదం ఇయ్యండ్రవీడికి...."
అని జోక్స్ వేయడం స్టార్ట్ చేసి, క్లాస్ లో నేను వేసే లీడర్ వేషాలన్నిటిమీద స్పూఫ్స్ చేస్తు నవ్వడం నవ్వించడం షురు అయ్యేది..... రాత్రి పదిగంట్లవరకు కూడా ఏదో ఒక బాతాఖానిలో టయింపాస్ చేయడం మిగిలిన ప్రసాదాలన్ని స్వాహా కానిచ్చి కొందరు అక్కడే కాపలాగ పడుకునేవారు....ఇంకొందరు ఇంటికి వెళ్ళడం తో ఆ రోజు ముగిసేది.....
అందరి దృష్టి జరిగే కార్యక్రమాలమీద, బ్యాండ్ బాజా తో ఆఖరిరోజు ఉండే నిమజ్జనం మీద ఉంటే, నాకేమో ఈ సారి గణేషుడు కొలువైన ఈ వాహనం ప్రత్యేకత ఏంటి, ఆ గణేషుడి తొండం అలా ఎందుకుంది......
ఈ గణేషుడి చేతిలో ఆయుధాలు ఇలా ఎందుకున్నాయ్..... అంటూ ఆధ్యాత్మికత వైపు కూడా ఉండేది...
ఆ చిన్ననాటి గణేషుడి ఉత్సవంలోని
అధ్యాత్మ జిగ్ఞ్యాసే క్రమక్రమంగా సకలవిద్యలకు నెలవైన చల్లనయ్య ఆ గణపయ్య అనుగ్రహంతో పరిపూర్ణ ఆధ్యాత్మికతవైపుగా మళ్ళి, పరిశోధనాత్మకమైన దృక్కోణంతో పరబ్రహ్మతత్వాన్ని గుర్తించే దిశగా నా జీవన ప్రయాణం సాగేందుకు దోహదపడింది......
మా ఇంటి అవతలి గల్లీలో కూడా ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి తమ్ముడు కూడా ప్రతిసంవత్సరపు గణపతి నవరాత్రి ఉత్సవంలో సభ్యుడిగా ఉండేవాడు.....
దైవాన్ని నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అనే నానుడి మన పెద్దలు ఉటంకించడం వినే ఉంటారు.....
చిన్ననాటి నుంచి కూడా ఆ సిద్ధాంతాన్ని చాలా తీవ్రంగా నమ్మేవారిలో నేను ఒకడిని.....
అందుకే అనుకుంటా తనని ఆరాధించిన ఆ చిన్ననాటి జీవితం తరువాత ఎదురైన విపత్కర సమయంలో నాకు అన్నీ తానై వెన్నంటిఉండి కాపాడడానికి నేను ఇంజనీరింగ్లో చేరాగానే నాకు తోడుగా తను కూడా మా కాలెజ్లోకి గుడికట్టించుకొని మరీ వచ్చేసాడు...!
మా బి.వి.ఆర్.ఐ.టి కాలేజ్లో గాణాపత్య ఆగమ అర్చారాధనా విధివిధానాలతో, మా చేర్మెన్ సర్
శ్రీ కే.వి.విష్ణురాజు గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ గావించబడిన ఆ గణనాథుని అనుగ్రహంవినా,
ఎదిగి ఎదగని వయసులో ఎదురైన
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చదువుల్లో ఉత్తీర్ణుడనై ఒక పెద్ద బహుళజాతీయ సంస్థలో నా ఉద్యోగాన్ని తద్వార మా కుటుంబం నిలదొక్కుకునేలా జీవించగలగడం కల్ల.....
అందుకే ఇప్పటికి కూడా మా కాలేజ్లోని గణపతి ఆలయప్రాంగణం, అందులో కొలువైన నా ఆప్తమితృడు గణపతిని తలచుకున్నంతమాత్రాన కళ్ళు అప్రయత్నంగా చెమర్చి ఆ స్వామి అనుగ్రహవిశేషాన్ని గుర్తుచేస్తూనేఉంటాయి...!
ఇక అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు జీవితంలోకి నా ఆధ్యాత్మిక ప్రయాణపు ఆలంబనగా లభించడం కూడా మా కాలేజ్లో కొలువైన హేరంబుడి కరుణే...!
అస్మద్ గురుదేవులు వారి ఒకానొక ప్రవచనంలో, అణువణువున ఆవహించి ఉన్న బాలా స్వరూపంతో భువిపై తిరుగాడిన సాధువరేణ్యులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారి జీవిత ఘట్టాలను విశ్లేషించే క్రమంలో ఒకసారి వారు అమ్మవారితో హాస్యానికి ఎదో అని నవ్వుతుంటే....." ఎందుకు శాస్త్రి ఆ నవ్వు.....నాక్కూడా చెప్పు... " అని సాక్షాత్ ఆ బాలాత్రిపురసుందరి అమ్మవారే అడగడం, దానికి బదులుగా శాస్త్రిగారు, " నీ యొక్క, అనగా పార్వతీ కళ్యాణంలో కూడా గణపతి పూజ చేసావు కదమ్మ....మరి గణపతి మీ పెళ్ళికి ముందు పుట్టాడా
లేద తరువాతా అని చిన్న సందేహం వచ్చి నవ్వుకున్నాను..అంతే...." అని చెప్పిన సందర్భం విన్నవారికి ఆ గణపతి పరబ్రహ్మం యొక్క వైచిత్రి ని గురించి విచారించి ఆశ్చర్యం చెందడం తద్వార ఆ విశ్వ మూలభూతమైన, మూలాధారచక్రాధిష్టానదైవమైన గణపతి వైభవాన్ని తమ తమ అధ్యాత్మ విద్యాంతర్గతంగా తర్కించి తరించడం కద్దు....
"గణములకు అధిపతి కాబట్టి గణపతి..." అనే లౌకిక భావాన్ని బట్టి గణపతి అనడం సర్వసాధారణం.....
అక్కడితో ఆగకుండ గణములు అనగా ఏ ఏ గణములు అనే ప్రశ్న తలెత్తినవారికి ఆ గణపతి తనదైన అనుగ్రహ విశేషాన్ని వర్షించి తన తత్వాన్ని ఎరుకపరుస్తాడు....
కైలాసంలో ఉండే ప్రమథగణాలకు అక్కడి పార్వతీపరమేశ్వరుల సుతుడైన ప్రమథగణాధిపతి గణపతి......
మరి విశ్వవ్యాప్తంగా కొలువైన ఎన్నెన్నో భూతగణాలకు ఎవరు అధిపతి...?
మనలోనే కొలువైన ఎన్నో శరీర సూక్ష్మ కణజాల సమూహములకు అనగా సప్తధాతువుల కేంద్రీకరణ వికేంద్రీకరణ వల్ల ఏర్పడిన గణములకు ఎవరు అధిపతి..?
"యత్ పిండే తత్ బ్రహ్మాండే...." అనే యోగ శాస్త్ర బోధానుగుణంగా, సూక్ష్మ స్థాయిలో ఈ పిండాడంలో ఎన్ని చిత్ర విచిత్రమైన సంఘాతములు ఉన్నయో, స్థూల స్థాయిలో ఈ విశ్వాంతరమునందు కూడా అన్ని చిత్ర విచిత్రమైన సంఘాతములు తద్ జనితమైన సమూహములు అనగా గణములు ఉన్నాయి.....
అవన్నీ మానవ మేధోగ్రాహ్యమా కాదా అనే లౌకిక విషయాన్ని కాసేపు పక్కన పెడితే,
ఇవి అవి అనే భేదం లేకుండా వాటన్నిటిని కూడా నియంత్రించే ఈశ్వర శక్తికే గణపతి అనే నామవాచకము......
కాబట్టే ఎవరు ఏ వాహనం పై తనను కొలువైయ్యేలా చేసి పూజించినా సరే ఆ సర్వవ్యాప్తమైన పరబ్రహ్మము ఆ పూజను స్వీకరించి అనుగ్రహిస్తున్నది.....
అన్ని వేళలా అన్ని చోట్లా పరివ్యాప్తమై ఉండే పరబ్రహ్మతత్వాన్ని, ఆ జగజ్జనని ఒకానొక సందర్భంలో భండాసురయుద్ధసమయంలో, తన పతి అయిన ఆ పరమశివుని వదనారవిందాన్ని దర్శించి ధ్యానించి ఒక మహాశక్తిగా సృజించి వాడి ఆసురిగణముల శక్తిని విరిచేందుకు శ్రీగణేశ్వర శక్తిగా,
( " కామేశముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర...." )
ఉద్భవింపజేసింది అని కద మనం లలితలో చదివేది...
మరో నామంలో " జడశక్తిర్జడాత్మిక " అని ఆ పరాంబికను కీర్తిస్తున్నాము....
అంటే జడానికి కూడ ఒక శక్తి ఉంటుంది అనికద దాని అర్ధం..!!
జడానికి ఉండే శక్తిని కూడా గణపతి పరబ్రహ్మము యొక్క శక్తిగా దర్శించాలంటే అయినవిల్లి శ్రీ మహాగణపతి ఆలయాన్ని దర్శిస్తే తెలుస్తుంది.....
ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉన్న శ్రీగణేష గర్భాలయ శిలామూర్తిని, దానికి సాక్ష్యంగా పక్కన పెట్టిన ఒకనాటి ఆమూర్తి యొక్క కవచాలను మరియు ఇప్పుడు మూర్తికి ధరింపజేసిన కవచాలను చూస్తే అవగతమవుతుంది....!
( కర్నూల్ యాగంటి శ్రీఉమామహేశ్వర ఆలయంలో కొలువైన భారి నందీశ్వరుడు ప్రతి సంవత్సరము ఒక క్రమంలో పెరిగే రీతిగా.....)
ఇలా ఆ గణపతి పరబ్రహ్మము తనదైన రీతిలో భక్తసులభుడై, సకల అశుభ విఘ్ననివారకుడై, శ్రేయస్కర విఘ్నకారకుడై, సకల విద్యాప్రదాతగా, సకల సంపత్ ప్రదాతగా, సకల శ్రేయోదాయకుడిగా అర్చింపబడుతూ, విశేషించి భాద్రపదమాసం లో నవరాత్రి ఉత్సవాంతర్గతంగా మన జీవితాలకు భద్రతను ఒసగుతూ ( రాబోయే ఆశ్వయుజ మాసం యమ దమ్ష్ట్ర బయల్దేరే కాలం కాబట్టి దానికి ముందు నెలలో జరుపబడే గణపతి ఆరాధన మనకు భద్రతను కలగజేస్తుందని పెద్దల సంప్రదాయ వాక్కు ) తన వైభవాన్ని దిగ్దిగంతముల వ్యాప్తిగావిస్తు అందరిని చల్లగా చూడు గాక...😊
చిన్ననాటి ఆ స్కూల్ జీవితంలోని గణపతినవరాత్రుల్లో మా ప్రగతినగర్ బస్తి కమ్యూనిటి హాల్లో కొలువైన గణేషుడి వద్ద పూజానంతరం దిగిన పిక్ లో అమ్మా, నాన్న, నేను, తమ్ముడు....😊

No comments:

Post a Comment