నాటి రంగస్థలనాటకాలు, హరికథావేదికల నుండి,
నేటి ఆస్కార్ అవార్డ్ ప్రదానోత్సవాలవరకు,
తెలుగుభాషావైభవం విశ్వవ్యాప్తమైనది...
అటు చిత్రసీమలో చిత్రవిచిత్ర కథాకవనాల్లో,
ఇటు అగ్రశ్రేణి భాషాపాండిత్యాన్ని వైరించి అనుగ్రహంగా అందుకున్న మేటికవులకలాలనుండి జాలువారే ప్రౌఢపదబంధనకావ్యకంఠీరవాల్లో,
మరియు ఈశ్వారానుగ్రహంగా అనన్యసామాన్యమైన శ్రీసరస్వతీదేవి అనుగ్రహంగా ప్రభవించే సాటిలేని మేటి
శ్రీవిద్యోపాసకులు, అధ్యాత్మకవికోవిదులు, ప్రవచనాసార్వభౌములు, గాయకగాయనీమణులు, సంగీతరత్నాలు, వ్యాఖ్యానకేసరులు, ఇత్యాది స్రష్టలసృజనల్లో...,
ఎందరో మహానుభావులు అనాదిగా తెలుగుభాషామాహాత్మ్యాన్ని వారివారిశైలిలో దశదిశలా పరివ్యాప్తి గావిస్తూ తరిస్తున్నారు....
ఎల్లరినీ తరింపజేస్తున్నారు.....
వామావర్తలిపిలో తణుకులీనే అరుదైన అందమైన ఆహ్లాదకరమైన అమరవందిత భాష మన తెలుగు భాష...
సాటిలేని సౌకుమార్యంతో, నవరసభరిత నుడికారవైభవంతో,
పాశ్చాత్యులచే "ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా వినుతికెక్కిన భాష మనదైన మన తెనుగుభాష....
అమ్మ జన్మను ఇస్తుంది...
మాతృభాష ఆ జన్మకు సార్ధక్యాన్నిస్తుంది...
సాధనతో భాషాసేద్యాన్ని గావించి తరించే విజ్ఞ్యులకు మాతృభాష జన్మరాహిత్యాన్నిస్తుంది...
అందుకే సహజకవి శ్రీబమ్మెరపోతనామాత్యులవారు,
ఎంతో సరళగంభీరసమ్మిళితశైలిలో
ఈ క్రింది పద్యాలను రచించి వచించారు....
****************************************************
https://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=2
1-18-క.
పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
1-19-ఆ
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత, కన్నంత,
దెలియ వచ్చినంత, దేటపఱతు.
1-20-క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ,
గొందఱకును సంస్కృతంబు గుణమగు, రెండుం
గొందఱికి గుణములగు, నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.
1-21-మ.
ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు, మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో,
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్, దీనిం దెనింగించి, నా జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
1-22-మ.
లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
****************************************************
దేవభాషయగు సంస్కృతసుగంధపరిమళాలకు ఏమాత్రం తీసిపోని అగ్రస్థాయితావి తెలుగుభాషది కాబట్టే....
శ్రీత్యాగరాయుల కలము నుండి జాలువారిన ఎనలేని శ్రీరాముడి రాజసభరిత సారస్వతరాచఠీవికి అలంకరణగా అమరింది మన తెలుగుభాష....
శ్రీభద్రాచలరామదాసు గారి కలము నుండి జాలువారిన ఎనలేని శ్రీరాముడి సౌకుమార్య భరిత సారస్వతవన్నెలకు అలంకరణగా అమరింది మన తెలుగుభాష....
శ్రీ తాళుల పాక అన్నమాచార్యుల కలము నుండి జాలువారిన ఎనలేని శ్రీవేంకటేశ్వరుడి సూర్యకఠారితేజోభరిత సంకీర్తనాసరములకు అలంకరణగా అమరింది మన తెలుగుభాష....
శ్రీ తరిగొండ వెంగమాంబ గారి కలము నుండి జాలువారిన జానపద అధ్యాత్మయోగకవనాల్లో శ్రీవేంకటేశ్వరుడి శ్రీపాదయుగళ మాహాత్మ్యాన్ని అలదుకున్న సారస్వతతపోగంధానికి అలంకరణగా అమరింది మన తెలుగుభాష...
ఆదికవి నన్నయ్య గారి నుండి ఆద్యంతమూ అలరులుకురియగ అక్షరమయి యొక్క చిరంతనమయూరవిన్యాసమై ఎందరో వర్ధమాన కవుల కలాలనుండి జాలువారిన కమనీయకవనాలకు
అలంకరణగా అమరింది మన తెలుగుభాష...
యావద్ ప్రపంచంలో నెలకొన్న భాషలన్నీ కూడా విరించి శక్తి శ్రీవాణి అలకరించుకున్న వివిధవర్ణరంజితరత్నహారమై ఒప్పారుతుండగా, అందలి అపురూపమైన అరవిరిసిన ముద్దమందారంలాంటి సంధ్యావర్ణఅరుణారుణభాసమానమైన భవ్యభాగ్యోదయభావగంభీరమైనభాష మన తేటతెలుగు భాష...!
"దేశభాషలందు తెలుగు లెస్స..."
అని నుడివిన సంగీతసాహిత్యకళాపోషకులైన శ్రీకృష్ణదేవరాయల విజయనగరమహాసామ్రాజ్య కాలంలో
వారి సభలో కొలువైన అష్టదిగ్గజకవుల భాషాభ్యాససేద్యంలో ఒక వెలుగువెలిగిన మన తెలుగు భాషావైభవాన్ని, ఈనాటి వర్ధమాన ప్రపంచంలో కొలువైన తెలుగువారందరూ కూడా వీలైనంతగా పరిరక్షిస్తూ, అనగా అభ్యసిస్తూ, ఇతరులచే అభ్యసింపజేయిస్తూ, మన దైనందిన జీవితప్రయాణానికి ఉపయుక్తమైన రీతిలో అవసరమైనంత అనివార్యమైన ఆంగ్లమును మరియు అన్యభాషలను గౌరవిస్తూనే, అమృతమయమైన అమరులుకొనియాడే మన తెనుగుభాషను ఆదరిస్తూ వర్ధిల్లెదము గాక....అని ఆకాంక్షిస్తూ...
మన తెలుగువారైన పింగళి వెంకయ్య గారు రూపొందించిన మన భారతజాతీయపతాకంలో 3 రంగులు కలిసి ఒక్కటైన పతాకంగా వెలుగుతున్న రీతిలో..
తెలుగుభాషకు గల మూడు ప్రధానయాసల్లో
(తెలంగాణ యాస, ఆంధ్ర యాస, సీమ యాస) పరిఢవిల్లే మన తెలుగుభాషాభవ్యత్వం ఆచంద్రతారార్కమై వర్ధిల్లుగాక అని అభిలషిస్తూ...,
యావద్ ప్రపంచ తెలుగు కుటుంబ సభ్యులకు మనమాతృభాషాదినోత్సవ శుభాభినందనాపూర్వకసాక్షరనమస్సుమాంజలి....💐🙏
No comments:
Post a Comment