Sunday, April 26, 2020

శ్రీ వైశాఖ శుద్ధ పంచమి / శ్రీఆదిశంకరజయంతి 2020 పాంచాహ్నిక మహోత్సవ శుభాభినందనలు......😊

శ్రీ వైశాఖ శుద్ధ పంచమి / శ్రీఆదిశంకరజయంతి పాంచాహ్నిక మహోత్సవ శుభాభినందనలు......😊
శ్రీ ఆదిశంకరాచార్యులు......
శంకరభగవద్పాదులు / శంకరులు / కాలడి శంకరులు / ఇత్యాది పేర్లతో ఆచర్యుల ప్రస్తుతి రాగానే వారికి ప్రణమిల్లని ఆస్తిక ప్రాణి ఈ దేవభూమిపై ఉండదు  అనేది జగద్విదితమైన సత్యం.....

భారతాదేశ సనాతన ధర్మవైభవాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తు ప్రజలను / భక్తులను వివిధ అవైదిక అశాస్త్రీయ ఆచారవ్యవహారాల వైపునకు కొనిపోతున్న మూర్ఖులనుండి ఈ దేశం యొక్క వెలకట్టలేని సంపదను కాపాడడానికి సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే శ్రీ కాలడి శంకరులుగా శ్రీ ఆర్యాంబ / శివగురు అనే పుణ్యదంపతుల ఇంట జన్మించిన వృత్తాంతం శ్రీరుద్రం చెప్పకనే చెబుతున్నది అనే సత్యాన్ని శ్రీ చాగంటి సద్గురువులు ఎన్నో ప్రవచనాల్లో మనకు బోధించినారు....

( నమః' కపర్ధినే' చ వ్యు'ప్తకేశాయ చ..... 
అని సాగే నమక మంత్ర భాగంలో కపర్ధి అంటే ఎల్లప్పుడు జటాజూటధారిగా ఉండే సదా శివుడు....
మరి వ్యుప్తకేశాయ అనగా 
' బోడి గుండు తో ఉన్న శివుడు'  అనే నామం శంకరునకు ఎక్కడ వర్తిస్తుంది.....? కేవలం సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అసేతుహిమాచల పర్యంతం పాదచారియై ధర్మపరిరక్షణకై అద్వైత సిద్ధాంత ప్రచారకులుగా షణ్మతస్థాపనాచార్యులుగా తిరుగాడిన శ్రీ ఆదిశంకరావతారానికి మాత్రమే ఆ నామం వర్తిస్తుంది...కద.....)

ఈ దేశంలో సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత కాలం, జీవనదులు ప్రవహిస్తున్నంత కాలం శ్రీ ఆదిశంకరులకు సదా కృతజ్ఞులై ఉండి నమస్కరించడం ఎల్లరికి విహిత ధర్మం.....

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన  విషయం ఒకటుంది......

స్థితికారులుగా ఉండే శ్రీమహావిష్ణువు మరియు శ్రీఆదిపరాశక్తి కదా వివిధ రూపాలు ధరించి అవతారాలు స్వీకరించి భూమిపై ప్రభవించి ధర్మపరిరక్షణ కావించేది....
మరియు పరమశివుడు అలా శ్రీ ఆదిశంకరులుగా అవతారం స్వీకరించి రావడం ఒకింత ఆశ్చర్యమే కద......
ఇది కేవలం యాదృశ్చికమా లేదా మరెమైన కారణాలు ఉన్నాయా ??

శ్రీ ఆదిశంకరుల నాటి కాలానికి ఈ దేశానికి వచ్చిన అతి పెద్ద ఆపద నలుదిశలా అలుముకుపోయిన అశాస్త్రీయత అనే అజ్యానాంధకారం.....

ఏది ప్రామాణికం....?
ఏది ఉచితం....?
ఏది శ్రేయస్కరం...?
ఏది శాస్త్ర సమ్మతం...?
ఏది సర్వజన హితకరం....?
ఏది ఎల్లరికి ఆమోదదాయకం...?
ఏది తక్షణ విహితధర్మం....?

ఇలా ప్రతి విషయంలో కూడా సందిగ్ధత నెలకొన్న ఒకానొక విషమపరిస్థితి.....

అటువంటి సమయంలో శిష్టరక్షణ / దుష్టశిక్షణ అనేవి అన్వయం కాని విషయాలు.......

కావలసింది సమాజంలో సమూలంగా పాతుకుపోయిన అజ్ఞ్యాన ప్రక్షాలన...... జ్ఞ్యాన దివిటీల వెలుగుల్లో వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్న వారికి మార్గదర్శనం.....

భగంతుడికి భక్తుడికి ఎల్లవేళలా అనుసంధానకర్తగా ఉండే ఆచార్యులకు మాత్రమే అది సాధ్యం.....

కాబట్టి ఆ సమయంలో అవతారాన్ని స్వీకరించి ఈ సనాతనదేవభూమిని సమ్రక్షించేందుకు కావలసింది ఆచార్యులుగా దేశం నలుచెరగులా నడయాడి జ్ఞ్యాన యజ్ఞ్యం నిర్వహిస్తూ అజ్ఞ్యాన లంపటాన్ని సమూలంగా దహించివేసే దైవస్వరూపం........

అనంతమైన సురగంగాఝరిని తన వ్యోమవ్యాప్తమైన కేశపాశంలోకి ఒక్క బిందువు కూడా క్రిందపడనివ్వకుండా ఒడిసిపట్టిన రుద్రునకు మాత్రమే అది సాధ్యం.......

ఎందుకంటే జ్ఞ్యానం కూడా అట్లాంటి అనంతమైన ఝరి.....

జ్ఞ్యానగంగా అనే తీర్థాన్ని సేవించి ఒక్క చుక్క కూడా అజ్ఞ్యానం మిగలని రీతిలో అనుగ్రహం ప్రసాదించాలంటే అంతటి శక్తివంతమైన జ్ఞ్యానమూర్తికే అది సాధ్యం......

శ్రీదక్షిణామూర్తిగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతులకు మౌనం తోనే చిన్ముద్రతో బ్రహ్మజ్ఞ్యానాన్ని ప్రసాదించిన ఆ పరమశివుడు, 
మౌనాన్ని వీడి, ధ్యానాన్ని ఆపి, బహిర్ముఖుడై, బ్రహ్మవేత్తగా అవతారాన్ని దాల్చి ఈ జగత్తులో ఆవరించుకుపోయిన అజ్ఞ్యాన గ్రంధులను తన త్రినేత్రానలసమమైన జ్ఞ్యానఝరులతో దహించివేయడమే అప్పటి సమస్యకు పరిష్కారం......

అందుకే జగదాచార్యుడై నిలిచి జగత్తుకు తరతరాలకు సరిపడే జ్ఞ్యానగంగా ప్రసాదాన్ని అనుగ్రహించేందుకు ఆ కైలస శంకరుడే కాలడి శంకరులుగా ప్రభవించి ఈ దేశంలో అన్ని ఆచార వ్యవస్థలను సవైదిక సశాస్త్రీయ విధివిధానాలతో సువ్యవస్థీకరించి అవి ఎన్ని శతాబ్దాలైనా సరే అట్లే కొనసాగేలా చతురామ్నాయ పీఠ వ్యవస్థను నెలకొల్పి వాటికి తమ నలుగురు శిష్యులతో మొదలుకొని అవిచ్ఛిన్నమైన పరంపరాగతంగా అవి కొనసాగుతూ ఎటువంటి అవైదిక అశాస్త్రీయతలను ఈ దేశంలోకి చొరబడని విధంగా కట్టుదిట్టం గావించి, శ్రీ ఋష్యశృంగుడి తపో భూమి అయిన ఇప్పటి శృంగేరి లో ఒక పాము తన పడగ క్రింద ఒక కప్పను సమ్రక్షించిన దృశ్యానికి ఆశ్చర్యం చెంది జీవుల జాతివైరాన్ని కూడ మరచేలా చేయగలిగిన అటువంటి మహత్తరమైన తపోస్థలి లో నెలకొన్న దక్షిణామ్నాయ పీఠం ఈ 4 పీఠాలకు గురుస్థానమై ఉండేలా
వ్యవస్థీకరించి ఈ ధర్మభూమిపై జనులచే నిరంతరం ధరించబడి ( ధృయైర్వా జనైరితిధర్మం అనే వ్యుత్పత్తి ప్రకారంగా ) ధర్మం ఎపట్టికీ శాశ్వతంగా వర్ధిల్లేలా మానవాళిని అనుగ్రహించిన అపర కరుణా సాగరులు శ్రీ ఆది శంకరాచార్యులు......

సకల శాస్త్ర జ్ఞ్యానాధిష్టాన దైవమైన శంకరుడే శ్రీ ఆదిశంకరులు కాబట్టే.....,

8 వ ఏటికే అన్ని శాస్త్రాల సారాన్ని
రంగరించి రచించిన విధంగా
శ్రీ కనకధారాస్తవాన్ని వచించి,  ఇంట్లో మరేమి లేని దైన్యంతో సతమతమవుతూ ఉన్న
ఒక బీదబ్రాహ్మణి  భక్తితో సమర్పించిన ఒక ఎండిపోయిన ఉసిరికాయ కు ( ఆమలక ఫలం ) సంతసించి ఏకధాటిగా ఆవిడ వాకిట్లో బంగారు ఉసిరికల వర్షాన్ని కురిపించడం కేవలం శంకరాచార్యులకే చెల్లింది.....!

స్తోత్రాలకు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయ......
అని వైదిక వాంజ్మయాన్ని అపహాస్యం చేసిన వారికి చెంపపెట్టుగా ఉండే రీతిలో బంగారు ఉసిరికాయలను రాల్చడం శ్రీఆదిశంకరాచార్యులకే చెల్లింది........


రాజు గారి శరీరంలో పరకాయప్రవేశంతో కొలువై ఉన్న శంకరాచార్యుల నిజ దేహాన్ని దుండగులు నిప్పుపెట్టి దహించగా 
స్వశరీర స్వీకరణ లో ఆలస్యమై  చేతులు కాలిన ఆ సంఘటనలో శ్రీనృసిమ్హకరావలంబ స్తోత్రాన్ని పఠించి స్వస్థత పొంది ఆ శక్తివంతమైన స్తోత్రాన్ని లోకానికి అందించి.......
యావద్ ప్రపంచానికి శ్రీలక్ష్మీనారసిమ్హుడి వైభవం తెలియజెప్పడం కూడ కేవలం శ్రీ ఆదిశంకరాచార్యులకే చెల్లింది....!

ఎల్లరికి ఉపయుక్తంగా ఉండేలా

గణపతి / గాణాపత్యము 
సుబ్రహ్మణ్యుడు / కౌమారము 
( దీపశిఖయే కుమారస్వామి )
అంబిక / శాక్తేయము
శివుడు / శైవము
విష్ణువు / వైష్ణవము
సూర్యుడు / సౌరము

అనే  5 ఉపాస్య దైవస్వరూపాలతో సశాస్త్రీయ పంచాయతన పూజావిధానాన్ని నెలకొల్పి ఎన్నెన్నో దేవాలయల్లో ఈ విధానంతో అర్చారాధనా వ్యవస్థను చక్కదిద్ది షణ్మతస్థాపనాచార్య అనే బిరుదు నామం పొందినా అది కేవలం శ్రీ ఆదిశంకరులకే చెల్లింది....!

అన్నీ దేవతా స్వరూపాలపై ఎంతో గంభీరమైన స్తోత్రాలను రచించి  మానవాళికి అందించి అందరు తరించేలా అనుగ్రహించినా అది కేవలం శ్రీ ఆదిశంకరులకే చెల్లింది....!

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం...
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం....
శ్రీ కాలభైరవాష్టకం......
శ్రీ నృసిమ్హకరావలంబ స్తోత్రం....
శ్రీ భజగోవింద స్తోత్రం / మోహముద్గరం.... 
శ్రీ సుబ్రహ్మణ్యభుజంగస్తోత్రం.....
శ్రీ హనుమత్భుజంగస్తోత్రం.......
శ్రీశైల ప్రాభవాన్ని ప్రస్ఫుటంగా తెలిపేలా సౌందర్యలహరి / శివానందలహరి......
.........

ఇలా వారు ప్రార్ధించి మనకు అందించిన శక్తివంతమైన స్తోత్రాలు ఎన్నెన్నో.....

బాహ్య ప్రపంచానికి కనిపించేలా పై విధంగా జ్ఞ్యాన సిద్ధిని వర్షించినా........

కేవలం కొందరికి మాత్రమే అనుగ్రహించబడేలా యోగ సిద్ధిని ప్రకటించినా అది కేవలం శ్రీ ఆది శంకరులకే చెల్లింది....!

ఉప్పొంగి జనావాసాలను ముంచెత్తుతున్న నర్మదా నది ఉరుకులను  తమ కమండలంలోకి ఒడిసిపట్టినా.... 

నీళ్ళకోసం కష్టపడుతున్న తల్లి యొక్క కష్టాలు తగ్గేలా పూర్ణానదీ ప్రవాహాన్ని వారి ఇంటి వైపుగా ప్రవహించేలా చేసినా....

మూగాంబిక యొక్క పదమంజీర సవ్వడులకు అణుగుణంగా నడిచినా....

ప్రపంచంలో ఏ ఆగమశాస్త్రానికి అందని రీతిలో శ్రీశైల అభయారణ్యాల్లో కొలువైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని భూగృహమునుండి వెలికితీసి ఇప్పుడు మనకు దర్శనయోగ్యంగా ఉండేలా చేసినా.......

మండనమిశ్రునితో ( శంకరాచార్యులతో వాదంలో ఓడిన తర్వాత సురేశ్వరాచార్యులుగా శంకరుల నలుగురు శిష్యుల్లో ఒకరైనవారు..... )
వాదం జరిగే సమయంలో మూలాధారచక్రాన్ని భేదించి పృథ్వీతత్వాన్ని తమ అధీనంలోకి తీసుకొని గోడలు, పైకప్పుల గుండా అవలీలగా ప్రయాణం గావించినా.......

సన్యాసి కి కామశాస్త్రము నందు అంతగా ప్రావీణ్యము ఉండదు కాబట్టి అందులో వాదించి శంకరులను ఓడిద్దామనుకున్న మండనమిశ్రుని 
భార్య వేసే ఎత్తులను చిత్తు చేయుటకు ఆ శాస్త్రంలో ఆరితేరిన రాజుగారి శరీరంలోకి పరకాయప్రవేశం గావించి కామశాస్త్ర వాదంలో కూడ తమను ఓడించడం అసంభవం అని నిరూపించినా.......

తమ సకల శాస్త్ర ప్రావీణ్యానికి తగు రీతిలో అలంకరణగా ఉండే కాశ్మీర సర్వజ్ఞ్యపీఠాన్ని అధిరోహించే సమయంలో సాక్షాత్తు ఆ సరస్వతీ దేవితోనే వాదించి గెలిచి సర్వజ్ఞ్యపీఠాన్ని అధిరోహించినా......

పద్మపాదాచార్యులుగా బిరుదునామం పొందేలా తోటకాచార్యులనబడే తమ శిష్యునకు గంగమ్మ పద్మాలు ప్రభవింపజేసి వాటిలో పాదం మోపి అవతల తీరంలో ఇతరశిష్యులతో ఉన్న ఆది శంకరుల సన్నిధికి చేరేలా చేసి, 
'మంద బుద్ధి గల శిష్యుడు.....'
అని ఇతర శిష్యులతో పరిహాసమాడబడిన పద్మపాదాచార్యులకు ఒక్క సంకల్పంతో సకల విద్యలను కట్టబెట్టి వారిచే 
ఎంతో ఘనమైన తోటకాష్టకం చెప్పించినా సరే.......

ఒళ్ళు మొత్తం కొయ్యబారే చలిలో చుట్టూ మొత్తం మంచు దట్టంగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో తమ తపశ్శక్తితో ఉష్ణకుండాలను ఏర్పాటు చేసి ఇన్ని శతాబ్దాలుగా అక్కడ వేడినీళ్ళు లభించే విధంగా 
అనుగ్రహించినా సరే......

వాళ్ళ మాతృమూర్తికి అవసాన సమయంలో ఎక్కడ ఉన్న సరే తిరిగివస్తానని ఇచ్చిన మాటను గౌరవించి, సన్యాసిగా దేశాటనం లో ఉన్నవారు కాలడికి వచ్చి జన్మనిచ్చినందుకు అమ్మకు సంపూర్ణ కర్మక్షయం గావించి మోక్షం ప్రసాదించడం తమ బాధ్యతగా భావించి శ్రీ కృష్ణపరమాత్మను ప్రార్ధించి శ్రీమద్భావత ఘట్టాలను దర్శింపజేసి పరమాత్మ యొక్క సంకర్షణేక్షనములతో అమ్మకు కైవల్యం ప్రసాదించినా సరే......

32 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే
ఇన్ని ఘనకార్యాలు సాధించి ఇక తమ అవతార ప్రయోజనం సిద్ధించిందని గ్రహించి నడుచుకుంటూ వెళ్తూనే ఎవ్వరికి కనిపించకుండా కేదారనాథ్ పర్వతసానువులపై అదృశ్యమైనా సరే......

అది కేవలం శ్రీ ఆదిశంకరులకే చెల్లింది....!!!

భక్తి మార్గంలో ప్రయాణం మొదలు పెట్టిన వారికి అత్యంత సులభమైన రీతిలో 
" గేయం గీతా నామ సహస్రం.....
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం....." 
అని బోధించిన భజగోవింద స్తోత్రం తో మొదలుకొని 

మనీషాపంచకం లాంటి మహత్తరమైన స్తోత్రంతో విద్వాంసులను ఆశ్చర్యచకితం చేయగలిగేలా సాగిన ఆ అధ్యాత్మ శాస్త్ర వస్తు విషయ రచనాప్రౌఢిమ కేవలం శ్రీశంకరాచర్యులకు మాత్రమే చెల్లింది......

ఆఖరికి " మీరు ఏమి చేయకున్నా సరే, భక్తితో ప్రార్ధించి సేవించి కొప్పెర / హుండీలో కానుకలు ధర్మబద్దమైన ఆర్జితం తో సమర్పించండి.... మీ పాపాన్ని మీ సొమ్ముపైకి అవహింపజేసి క్షయింపజేస్తాను......"
అనే తిరుమల శ్రీనివాసుడి కలియుగ భక్త రక్షణా వైచిత్రిని మనకు అందించినా సరే అది కేవలం శ్రీశంకరాచర్యులకు మాత్రమే చెల్లింది...!!!

అందుకే 
" నమః శంకరభానవే...!"
అని జ్ఞ్యానభాస్కరులై మన జీవితాలను తీర్చిదిద్దిన శ్రీఆదిశంకరులకు నమస్కరించడం 
నేర్పించారు మన గురువులు, ఆచార్యులు......

" శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ! నమామి భగవద్పాద శంకరం లోకశంకరం ! " 🙏

తమ పూర్వాశ్రమమునందు మరియు సన్యాసాశ్రమము నందు కూడా ఒకేపేరు గల ఎకైక సన్యాసాశ్రమ చక్రవర్తులు, శ్రీఆదిశంకరాచార్యులు... !!

శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా శ్రీఆదిశంకరజయంతి రోజు కనీసం తోటకాష్టకం పఠించి వారికి నమస్కరించడం ప్రతి ఆస్తికుడి విహిత బాధ్యత.....

కరోనా కారణంగా ఈ సారి శ్రీ శంకరాచార్యుల పల్లకీ ఉత్సవం లో పాల్గొనడం కుదరదేమో..... 

కనీసం వచ్చే వైశాఖ శుద్ధ పంచమి వరకు ఈ ప్రపంచం లో కరోన విలయతాండవం మొత్తం సమసి శాంతియుతంగా అందరు శ్రీశంకరజయంతిని జరుపుకుందురు గాక........అని ఆశిద్దాం.....😊

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జయ జయ శంకర హర హర శంకర.....!
జయ జయ శంకర హర హర శంకర....!! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తోటకాష్టకం :

గురుర్నామ్నా మహిమ్నాచ శంకరో యో విరాజతే |
తదీయాంఘ్రిగళద్రేణు కణాయాస్తు నమో మమ ||

విదితాఖిల శాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్ధ నిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకరదేశిక మే శరణం || 1 ||

కరుణా వరుణాలయ పాలయమాం భవసాగర దు:ఖవిదూన హృదం
రచయాఖిలదర్శన తత్త్వవిదం భవ శంకరదేశిక మే శరణం || 2 ||

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకరదేశిక మే శరణం || 3 ||

భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే
కలయేశ్వర జీవ వివేకవిదం భవ శంకరదేశిక మే శరణం || 4 ||

సుకృతే ధిక్రుతే బహుధాభవతా భవితా సమదర్శన లాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకరదేశిక మే శరణం || 5 ||

జగతీ మవితుం కలితా కృతయో విచరంతి మహా మహాసశ్చలత
ఆహిమాన్శురివాత్ర విభాసి పురో భవ శంకరదేశిక మే శరణం || 6 ||

గురుపుంగవ పుంగవకేతన తేసమతా మయతాం నహి కోపి సుధీ
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకరదేశిక మే శరణం || 7 ||

విదితానమయా విదితైక కలా నచ కించన కాంచన మస్తి విభో
ధ్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకరదేశిక మే శరణం || 8 ||

ఓం శాంతిః  శాంతిః శాంతిః ..... !!

No comments:

Post a Comment