శ్రీవేంకటేశ్వర వరదైవాన్ని దర్శించని మానవుడు ఈ కలియుగంలో సుఖసంతోషాలతో మనగలగడం కల్ల....
సాక్షాత్తు స్వామివారి నందకఖడ్గాంశ సంభూతులుగా జన్మించి ఈ కలియుగ భక్తులు ఈశ్వరానుగ్రహానికి పాత్రతను సంతరించుకొని వర్ణాశ్రమానుగుణంగా ధర్మ అర్థ కామ్య మోక్షములను బడసి
తరించడానికి గల ఎకైక సర్వశ్రేయోదాయక మార్గంగా శ్రీవేంకటహరి సంకీర్తనౌషధంగా 32000 సంకీర్తనలను శ్రీనివాసుడి శ్రీకైంకర్యంగా రచించి లోకానికి అందివ్వగా అందులో ఇప్పుడు కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే మనకు లభ్యమవ్వగా....,
శ్రీశారదాంబ యొక్క నిర్హేతుక శ్రీకటాక్షం గల ఎందరో విద్వణ్మూర్తులు వాటిని పరిశోధించి పరిశీలించి పరిష్కరించి అందుగల పరతత్త్వ ప్రాభవాన్ని పరిపరివిధముల రాగరంజితమైన సంకీర్తనాలాపనలుగా ఈనాటి కలియుగ భక్తులకు అందించినారు....
" ఈశ్వరానుగ్రహంగా ఒక కొలువులో కుదురుకొని స్వార్జితంతో బ్రతకగల స్థాయికి వచ్చినా కూడా ఏనాడైనా కనీసం ట్రైన్ లో జెనెరల్ కంపార్ట్మెంట్ లోనైనా ప్రయాణించి తిరుపతికి చేరుకొని, తిరుచానూర్ పద్మావతీ అమ్మవారికి ఒక నమస్కారం సమర్పించి హుండీలో ఒక్క రూపాయైనా మనస్పూర్తిగా సమర్పించి, మెట్లమార్గంలో తిరుమలకు చేరుకొని స్వామిపుష్కరిణీ తీర్థస్నానం గావించి శ్రీ జ్ఞ్యానవరాహ / భూవరాహ స్వామివారిని దర్శించి, శ్రీవేంకటేశ్వరుడిని దర్శించి నమస్కరించి కార్పస్ హుండీలో ఒక్క రూపాయైనా మనస్పూర్తిగా సమర్పించి, ఒక్క రెండులడ్లైనా ఇంటికి తిరుమల ప్రసాదంగా తెచ్చుకొని, ఒక్క మనిషితోనైనా లడ్డూ ప్రసాదం పంచుకొని, స్వీకరించి తరించడం....
మరియు...
అన్నమాచార్యుల వారి సంకీర్తన ఒక్కటైనా క్యాజువల్ గా వినడం / పాడడం లాంటి సందర్భాలు జీవితంలో ఏమైనా ఉన్నయా...?? "
అని అడిగితే....
" ఏమో పెద్దగా గుర్తులేదండి....
ఎక్కడ తీరిక....తినడం....తిరగడం..
ఆ పని...ఈ పని...అంటూ ఏదో ఒక
పనిలో నిమగ్నమై ఉండడంతో భగవంతుడి స్పృహ ఎక్కడుంటుంది...."
అనేలా సమాధానం గనక ఉంటే.....
తిరుమలకు ఒక్క రేయి ప్రయాణంలో చేరుకోగల సమీపప్రాంతంలో ఉండే తెలుగువారిగా చెప్పుకోవడం ఎందుకు.....సిగ్గు చేటు కాకపోతే.....
" కొన్ని వేల పండ్లు / చిరు తిండ్లు తినుంటావ్......
కొన్ని వందల సినిమాలు చూసుంటావ్....
కొన్ని పదుల విహారయాత్రలకు అక్కడికి ఇక్కడికి వెళ్ళుంటావ్.....
కాని జీవితంలో ఒక్కసారి కూడా తిరుమలేశుడిని దర్శించకపోతే ఇక ఎందుకా జీవితం....
ఎట్లు ఆ జీవితానికి శ్రీలక్ష్మీ కటాక్షం కలుగును....?? "
అని అనడం ఒకెత్తైతే.....
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరానుగ్రహం వినా తిరుమల యాత్ర దుర్లభం అని అనడం ఒకెత్తు......
అంతటి వరదైవం కలియుగ ప్రత్యక్ష పరదైవమైన తిరుమలేశుడు.....
నా ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో లభించిన క్యాంపస్ ప్లేస్మెంట్ తో ఉద్యోగ జీవితంలో కుదురుకున్న తర్వాత 2008 తదుపరి జీవితంలో ఊహతెలిసిన తర్వాత మొట్టమొదటి సారి సాగిన నా తిరుమల యాత్రలో నేను స్వామి వారిని వేడుకున్న కోరిక.....
"అన్నమాచార్యుల వారి భావగంభీరమైన సంకీర్తనల్లోని ఆంతర్యాన్ని నాకు ఆకళింపుగావించి వాటి ఆలంబనతో నా జీవితాన్ని తీర్చిదిద్దవా తండ్రీ శ్రీవేంకటేశ....."
అందుకు తగ్గట్టుగానే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా.....
అన్నమాచార్యుల సంకీర్తన అనే దృఢమైన ఆలంబన నా నిత్యజీవితంలో అంతర్భాగమై, అన్ని విధాలుగా ఈ కలియుగ జీవితాంతర్భాగంగానే అధ్యాత్మ ఉన్నతి కూడా అనుగ్రహింపబడిన వైనం నాకు మాత్రమే తెలిసిన ఈశ్వరానుగ్రహ విశేషం.....
గజ గజ వణికే చలిలో రాత్రి ఒంటి గంటకు స్వామిపుష్కరిణీ తీర్థ స్నానం గావించి ఎన్ని సార్లు అంగప్రదక్షిణం టికెట్ పై స్వామివారి విమాన గోపుర ప్రాకారంలో మిగతా ఇతర భక్తులందరితో పాటుగా అంగప్రదక్షిణం గావించానో....
తదంతర్భాగంగా ఎన్ని సార్లు సుప్రభాతం దర్శనం Q లైన్ అవ్వగానే స్టార్ట్ అయ్యే అంగప్రదక్షిణం దర్శనం Q లైన్ కి కూడా లభించే స్వామివారి సుప్రభాత విశ్వరూపసందర్శనానుగ్రహం కటాక్షింపబడి తరించానో....
ఆ బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీశ్రీనివాసుడి దర్శనానికై వేంచేసి అక్కడ కొలువుతీరి ఉండే దేవతాశక్తులతో పరిపుష్టమై ఉండే మణిమండపప్రాకార మహత్తు ఏ వర్ణణలకు అందనిది....
అందుకే ఫ్రీ గానే లభించే అంగప్రదక్షిణం టికెట్ పై అంగప్రదక్షిణానంతరం స్వామివారి సందర్శనానుగ్రహం పొందిన వారి కోర్కెలు అత్యంత శీఘ్రంగా నెరవేరుతాయి అనేది ఎందరో తిరుమల భక్తుల ప్రగాఢ విశ్వాసం....
ఆ మనోహరమైన మండపాల వైభవాన్ని వర్ణిస్తూ అన్నమాచార్యులవారు ఈ క్రింది విధంగా సంకీర్తనపరిచినారు....
చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి | రహి వహించిన గోపురములవె కంటి ||
అన్నిదైవాల్లోను శ్రీవేంకటేశ్వరుడిని దర్శించి....
శ్రీవేంకటేశ్వరుడిలో అందరు దైవాలను దర్శించి దర్శింపజేసి తరించి తరింపజేసిన ఆచార్య శిఖామణులు అన్నమాచార్యుల వారు...
ఖాలిజోబులతో కలహాల కాపురాలతో నిత్యం సతమతమౌతూ బ్రతికే ఈ కలియుగ ప్రాణికోటికి కమ్మని విందులా కమలాక్షుడైన శ్రీవేంకటహరి యొక్క తోడుని అందించినారు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు......
అంటూ.....వారి పుత్రులు పెదతిరుమలాచార్యులు ఈ క్రింది సంకీర్తనలో ఎంతగానో వారిని కొనియాడి నమస్కరించినారు....
*****
అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
*****
భానుమండలానుగ్రహాన్ని నమస్కరించిన వారెల్లరికీ అనుగ్రహిస్తూ ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా వారు మనతోనే ఉన్నారు అంటూ వారి పౌత్రులు చినతిరుమలాచార్యులు ఈ క్రింది చక్కని సంకీర్తనలో నుడివినారు......
*****
ప|| హరి యవతార మీతడు అన్నమయ్య |
అరయ మా గురుడీతడు అన్నమయ్య |
చ|| వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు |
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య |
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు |
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ||
చ|| ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు |
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య |
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు |
హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ||
చ|| క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాడు |
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య |
ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు |
ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ||
*****
అంతటి ఆరితేరిన రీతిలో కాకపోయినా, మనకు సాధ్యమైనంతగా శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారికి ఒక్క నమస్కారమైననూ మనస్పూర్తిగా అర్పించి, శ్రీవేంకటేశ్వరుడి కృపకు పాత్రులవ్వడం మనందరి విహిత కర్తవ్యం......
శ్రీచాగంటి సద్గురువుల
" శ్రీవేంకటేశ్వరవైభవం " ప్రవచనాలు విని....
ఆ శ్రీవేంకటవిభుని అనుగ్రహవీచికలను ప్రసరింపజేసుకోవడం మరింత ఫలదాయకం అని నా వ్యక్తిగత విశ్వాసం...
శ్రీ తాళ్ళపాక గురవే నమః....🙏🙏🙏🙏🙏
శ్రీశ్రీనివాసపరబ్రహ్మణేనమః....🙏🙏🙏🙏🙏
🌸
No comments:
Post a Comment