Wednesday, March 16, 2022

శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక శ్రీ ప్లవనామ సంవత్సర తెప్పోత్సవాల వైభవం...🙏🍨🍦🍧🎂💐🍕😊

🙏🍨🍦🍧🎂💐🍕😊

నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది ఉత్సవ వైభవంతో అలలారే కలియుగ ప్రత్యక్ష భూవైకుంఠం తిరుమల శ్రీశ్రీనివాసుడి ఆలయం... 

శ్రీవిఖనస మహర్షి వారిచే అందివ్వబడిన సత్సంప్రదాయ ప్రకారంగా ఒక్కో తిరుమల ఉత్సవానిది ఒక్కో ప్రత్యేకత....ఒక్కోటి ఒక్కో విశేష అనుగ్రహ దాయకం....
ఈ కలియుగ ఈతి బాధలకు సతమతమవుతూ ఎన్నెన్నో ఇక్కట్లతో తిప్పలు పడుతూ సంసారమనే మహాసముద్రం దాటడానికి కావలసిన తెప్ప కానరాక తిప్పలు పడే జనులను ఉద్ధరించడానికే ఆ పరమాత్మ వివిధ ఉత్సవాలు నిర్వహింపజేసుకుంటూ దరిజేరిన భక్తులను విశేషంగా అనుగ్రహించే వైనం కోటాను కోట్ల శ్రీశ్రీనివాసుడి భక్తులకు ఎరుకలో ఉన్న విషయమే...

త్రేతా యుగం నాటి సీతా సమేత లక్ష్మణ సహిత కోదండ రాముడిగా ఒక రోజు....,

శ్రీ ఆండాళ్ / గోదా ( కొందరు శ్రీరుక్మిణీదేవి అని అంటుంటారు....) సమేత నవనీత కరకలిత ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడిగా ఒకరోజు....

ఈనాటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీభూ సమేత శ్రీమలయప్పస్వామివారిగా ఒకరోజు....

ఇలా మూడురోజుల ముచ్చటైన తెప్పోత్సవంతో అలరారే స్వామి పుష్కరిణీ వైభవాన్ని ఏమని వర్ణించగలము..! 

కలియుగం అనే అత్యంత ఘోరమైన కీకారణ్యరోదన సదృశమైన, వైతరణీ నదీ ప్రయాణ సదృశమైన, ఆవేదనా భరిత, ఆక్రందనాపూరితమైన ఈ యుగంలో, శ్రీహరి నామ స్మరణం అనే పడవను ఎక్కనిదే మనిషి తరించలేడు...

శ్రీరాముడి అనుగ్రహంగా ధర్మతత్పరత....
శ్రీకృష్ణుడి అనుగ్రహంగా చతురత.....
శ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహంగా సర్వసమర్ధత , సర్వజ్ఞ్యత....
తో కూడిన జీవనం వినా, ఈ కలియుగంలోని కేవల లౌకిక జీవనం దుర్భరమైనది....

"మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషీం..." అని శ్రీచాగంటి సద్గురువులు ఎంతో భావగంభీరంగా ఉటంకించే యోగమాయ, ఆదిపరాశక్తి యొక్క లీలావిలాసం చాలా మందికి గుర్తుండే ఉంటుంది...

ఆవిడ తెర తీయనంత కాలం, " ప్ర పంచం " అనే పాంచభౌతిక మాయలో పడి జీవుడు పరిభ్రమిస్తూనే ఉంటాడు...

'గోప్త్రీ గోవిందరూపిణీ " గా ఆవిడ హరిభక్తి కటాక్షించనిదే, జీవుడికి సుఖసంతోషాలు మృగ్యం....  

శ్రీరాముడి లాంటి నడత,
శ్రీకృష్ణుడి లాంటి చతురత,
శ్రీవేంకటేశ్వరుడి లాంటి సర్వసమర్ధత, 
ఒక జీవుడికి కటాక్షించి, వారి వారి లౌకిక జీవితాన్ని తద్వారా అధ్యాత్మ జీవితాన్ని కూడా ఉన్నతంగా తీర్చి దిద్దే ఈ తెప్పోత్సవాల వైభవం అంతా ఇంతా కాదు....

ఈ కలియుగం బహువిచిత్రమైనది.....

ఎన్నో డైలీ సీరియల్లలో, సినిమాల్లో వినే ఉంటారు కద....

తల్లిదండ్రుల వద్ద నుండి వారి ఆస్తిపాస్తులన్నీ లాక్కొని వృద్ధాప్యంలో వారిని పట్టించుకోని దౌర్భాగ్యులే కాదు....
తల్లిదండ్రుల ఆస్తిపాస్తులను ఏమాత్రం ఆశించకుండా వాటిని సమ్రక్షిస్తూ, వారి బిడ్డల పట్ల వారి కర్తవ్యంగా చదివించినందుకు, ప్రయోజకులై వారికి అన్నీ సమకూర్చి పెట్టే చక్కని బిడ్డలను ఓర్వలేని, తాగి తందనాలాడి ఇబ్బందులకు గురిచేసే వారు కూడా ఉండే యుగం ఈ కలియుగం.......

వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్ళమంటే...
" నీ లాంటి తాగుబోతులకు నీ కొడుకులు తిండి పెడతరని అనుకుంటున్నవ....? నీ ఆస్తి మొత్తం గుంజుకుంటరు..... గమ్మున నా పేరు మీద రాసెయ్ నీ ఆస్తి మొత్తం.......ఇన్నవా......."
అంటూ నిప్పులో ఉప్పు విసిరినట్టు మాట్లాడి మరింతగా సమస్యలను జటిలం గావించే నిలువుగాడిదలాంటి వారు బంధువులుగా ఉండే అత్యంత శోచనీయమైన యుగం ఈ కలియుగం.... 

"ఎట్లున్నరుల్ల...." అని మాటవరసకు పలకరించినందుకు....
"నా చిన్న కొడుకు ఎంత కష్టపడినా ఉద్యోగం రాక ఊరికే ఉండి బాధపడుతున్నడు వదినా....ఇక మీ తమ్ముడి సంగతి చెప్పేదేముంది...ఎంత చెప్పినా మారి సావట్లేదు..."
అని ఒక గృహిణి తన ఆవేదన వెళ్ళబోస్కుంటే....

" నా చిన్నల్లుడు లేడానే అట్లనే ఒట్టిగ చాలా రోజులు...ఉండని.... పొయ్యేదేముంది...." 
అంటూ ఎంతో వెటకారంగా మూతి తిప్పే నంగనాచి నక్కలు బంధువులుగా ఉండే అత్యంత విచారకరమైన యుగం ఈ కలియుగం.....

ఇలా ఒకటి కాదు....రెండు కాదు.....
ఈ కలియుగం మొత్తం కల్తీలమయమై....మనుష్యుల మనసే మహోగ్ర రక్కసిమూకలకు ఆవాసమై ఉండే కిరాతక యుగం.....

"హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి....తన్నః హంసః ప్రచోదయాత్...."

అని ఆలయాల్లో ఆచార్యులు నుడివే హంస గాయత్రిని ఎపుడైనా వినే ఉంటారు కదా.....
పాలను నీటిని వేరు గావించి కేవల క్షీరాన్ని స్వీకరించి తరించే హంసలా, 

మన చుట్టూ ఉండే ప్రకృతిలో నుండే పరమాత్మ తత్త్వాన్ని సంగ్రహించి ఈ ప్రకృతిలో భాగంగా ఉంటూనే పరతత్త్వాన్ని ఒడిసిపట్టి తరించేలా అనుగ్రహాన్ని వర్షించే తెప్పోత్సవంలో స్వామి పరమహంసలా విహరించే వైనాన్ని, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఎంతో రసరమ్యంగా 
"దిబ్బలు వెట్టుచు ఉబ్బునీటిపై...."
అనే సంకీర్తనలో, మన మనసే మానససరోవరంలా నిర్మలమైనప్పుడు, ఈశ్వరుడు తన హంస తత్త్వంతో అనుగ్రహాన్ని వర్షించేందుకు మనలోనే కొలువై ఉంటాడు అనే  సత్యాన్ని 

" మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస || "

అనే వాక్యంలో ఎంత గొప్పగా విశదీకరించినారో భక్తుల్లెలరికీ ఎరుకలో ఉన్నదే...

టీ.బీ.పీ వారి శ్రీవారిసేవలో భాగంగా తిరుమలలో నేను శ్రీవారిసేవక్ గా ఉన్నప్పుడు, 
తిరుమల అలిపిరి మార్గంలోని మెట్ట్లు ఎక్కించి, 
తెప్పోత్సవాలకు అమ్మా నాన్నను రప్పించి, 
సీ.ఆర్.ఓ లో తెప్పోత్సవాల టికెట్ ఇప్పించి,
దర్శనాన్ని ప్రసాదించి స్వామి కటాక్షించిన అనుగ్రహం నేను ఎప్పటికీ మరవలేని నా నిజ జీవిత స్వానుభవ సత్యం...!

సర్వం శ్రీ వేంకటేశపరబ్రహ్మార్పణమస్తు.....
🙏🙏🙏🙏🙏🙏🙏

https://fb.watch/bNuEN9sIDX/

No comments:

Post a Comment