Tuesday, April 1, 2025

శ్రీ క్రోధి నామ 2025 సంవత్సర ఫాల్గుణ బహుళ తదియ, ఛత్రపతి శ్రీ శివాజీ రాజే భోంస్లే మహరాజ్ గారి జయంత్యుత్సవ శుభాభినందనలు...😊💐


ఛత్రపతి శివాజి మహరాజ్ గారి పేరు తెలియని దేశభక్తులు ఉండరనేది విజ్ఞ్యులెల్లరికీ విదితమే....

భారతదేశం పరాయిదేశస్థుల నిరంకుశపాలనపీడలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, ప్రజలకు మాతృభూమిపై మమతకలిగిఉండడం కూడా పాలకులకు కంటకమై ఉన్న ఆ రోజుల్లో....
అట్టి దుర్భరదీనావస్థ నుండి భారతదేశానికి 
పరాయిపాలకదాస్యశృంఖలాలనుండి విముక్తిని కలిగించి, గౌరవభరిత అస్థిత్వాన్ని ప్రసాదించిన అనన్యసామాన్యమైన సుక్షత్రియ ధీరుడిగా భారతదేశచరిత్రలో శాశ్వతకీర్తికావ్యాన్ని రచించుకున్న రాచసిమ్హం మన వీర శివాజి మహరాజ్ మరియు వారి అమాత్య, సైనిక, ధీరులు....

ఒక వ్యక్తి ఎంతో గొప్ప పరిపాలకుడిగా కీర్తిని గడిస్తున్నాడు అంటే ఆ కీర్తిలో సిమ్హభాగం అతడి చుట్టూ ఉండే గురువులు, అమాత్యులు, సేనాధిపతులు, మరియు ఇతర మాన్యులదే....

కాబట్టి, మన శివాజి మహరాజ్ గారి అజరామరమైన విశ్వవ్యాప్తకీర్తికి కారకులైన వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకోవడం మన విహితధర్మం...

1. శ్రీసమర్థరామదాసు గారిని ప్రత్యక్ష గురుదేవులుగా గౌరవించి, సేవించి వారి అనన్యసామాన్యమైన అనుగ్రహంతోనే శివాజిమహరాజ్ గారు సువిశాల మరాఠమహాసామ్రాజ్యాధిపతిగా భారతదేశ చక్రవర్తుల చరిత్రలో 
మేటి వీరులుగా ఒక వెలుగువెలిగారు అనేది చరిత్ర గురించి సరైన అవగాహన ఉన్నవారికి విదితమే....

మామూలుగా కపి రూపంలో సంచరించే హనుమంతులవారితో సంభాషించాలంటేనే ఎంతో తపః శక్తి సంపన్నులైతేనే సాధ్యమయ్యేది....

అటువంటిది, ఏకంగా పంచముఖ హనుమంతులవారితో, అనగా అపరరుద్రాంశసంభూతుడై,
పరమేశ్వర పంచాస్యములైన
సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన, అనే 5 వదనాలతో ఉండే పరమేశ్వర విరాట్విశ్వరూపానికి ప్రతీకగా ఉండే...
వానర, నారసిమ్హ, ఖగరాట్, క్రోడ, అశ్వ, 
అనగా
కోతి / మర్కటవదనం
సిమ్హం / నృసిమ్హవదనం,
గరుత్మంత / గరుడవదనం, 
వరాహ / సూకరవదనం, 
గుర్రం / హయవదనం
అనే 5 వదనాలతో ఉండే
పంచముఖ హనుమంతుల విరాట్ విశ్వరూపంతో ప్రత్యక్షంగా సంభాషించేంతటి సిద్ధగురువులైన శ్రీసమర్థరామదాసు గారు....,
వారి శిష్యులైన శివాజి భోంస్లే గారికి...
గుర్రపులద్ది, గులకరాళ్ళు, కాషాయవస్త్రం, ప్రసాదంగా పంపించిన ఆంతర్యాన్ని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు..

అశ్వదళాన్ని విశేషంగా వృద్ధి గావిస్తూ,
వీలైనన్నీ కోటలను గెలుచుకుంటూ,
కాషాయపతాకన్ని మరాఠమహాసామ్రాజ్యపతాకంగా నిలిపి, 
దిగ్విజయుడవై వర్ధిల్లమని అనుగ్రహించిన వారి గురుదేవుల అంతరంగాన్ని శివాజి గారు శిరసావహిస్తూ.....
చిన్నపిల్లలనుండి, స్త్రీలు, వృద్ధులు, ఆఖరికి పరాయిదేశస్థులు కూడా ప్రశంసించే రీతిలో సుపరిపాలనను అందించిన వైనం మనం ఇప్పటికీ, మరియు ఎప్పటికీ కీర్తిస్తూనే ఉంటాం....

2. మరాఠ పేశ్వా బ్రాహ్మణ వీరులు, మేధావులు..

శివాజి మహారాజ్ గారి కీర్తికి మరాఠాపేశ్వాబ్రాహ్మణ వర్గం మూలస్థంభం....
వారి ఆజ్ఞ్య లేనిదే అపరిచితుల, ఇరుగుపొరుగుదేశస్థుల గాలి కూడా మరాఠాసామ్రాజ్యంలోకి ప్రవేశించలేనంతగా పేశ్వాల అదుపాజ్ఞ్యలలోనే మరాఠారాజ్యాభివృద్ధి సాధింపబడిందంటే...
వారిపై శివాజి మహారాజ్ గారికి ఉన్న సమున్నతమైన గౌరవం, నమ్మకం...
మరియు వారికి శివాజి మహారాజ్ పట్ల ఉన్న అచంచల భక్తి, విశ్వాసం....
ఎట్టిదో ఎల్లరికీ విదితమే....

3. మరాఠ అమాత్యులు, సేనాధిపతులు, సైనికులు....

మరాఠామహాసామ్రాజ్య పరిపాలక వ్యవస్థలో....
తనకంటే కూడా తన అమాత్య, సేనాపతుల వర్గం యొక్క ప్రాభవం, ప్రభావం, ఎక్కువగా ఉండేలా వ్యవస్థీకరించుకున్న సుక్షత్రియమేధావి శివాజి మహరాజ్ గారు.

తద్వారా తన విస్తారమైన మంత్రి / సేన / పహారా వర్గంలో ఉండే ప్రతియోద్ధుడు కూడా, 
కొంత జీతానికి ఒక పరిపాలకుడి క్రింద పనిచేస్తున్నాము అని అనుకోకుండా....
వారందరూ కూడా శివాజి మహారాజ్ తో కలిసి మరో శివాజి లా, 
దేశసమ్రక్షణకై పాటుబడుతున్నాం అనే భావించారు....

అందుకే పొరుగుదేశం నుండి పిల్లి దూరినా కూడా ఆ వార్త వెంటనే శివాజి మహారాజ్ వరకు అత్యంత కట్టుదిట్టమైన గూఢచార వ్యవస్థ ద్వారా చేరుకునేది....
మరియు ఒక సైనికుడు అవలంబించవలసిన వ్యూహం కూడా
శివాజి మహారాజ్ గారికి తెలిసేఉండేది...

మన భాగ్యం కొలది, ఇప్పటితరం వారు కూడా శివాజి గారిని ఛత్రపతి శివాజి మహరాజ్ గా నిలిపిన శ్రీభవానిదేవి అనుగ్రహమైన ఎదురులేని రాచఖడ్గం, (The divine sword that knows no defeat) తో ఉన్న శివాజి మహారాజ్ గారి మూర్తిని శ్రీశైలం ఆలయ ఆవరణలో భక్తుల్లెల్లరికీ దర్శనీయమై ఉండే విధంగా విజ్ఞ్యులు వ్యవస్థీకరించారు....

ఈసారి మీరెప్పుడైనా శ్రీశైలం యాత్రకు వెళ్ళినప్పుడు, శ్రీశివాజి మహరాజ్ గారిని, మరియు వారు ధరించిన శ్రీభవాని ఖడ్గాన్ని తప్పకుండా దర్శించండి...

తనపట్ల విశ్వాసపాత్రులై ఉన్న అన్ని కులవృత్తుల వారిని, అన్ని వర్గాల వారిని, ఇతర సంప్రదాయాల వారిని కూడా తన పరిపాలనలో మమేకం గావించిన మేటి పరిపాలకుడిగా, దేశం కోసం, ధర్మం కోసం, సనాతనధర్మవైభవం కోసం, అహరహం శ్రమించి అమరులైన శ్రీశివాజిమహరాజ్ గారిని వారి జయంతి సందర్భంగా స్మరించి నమస్కరించడం విజ్ఞ్యులైన ప్రతి భరతీయుడి విహితధరం....

శ్రీశివాజిమహరాజ్ గారి స్ఫూర్తి తో ఈ తరం నాయకులు కూడా, వారు పరిపాలించే రాజ్యం / దేశం యొక్క ఔన్నత్యాన్ని సదా గౌరవిస్తూ, సంతతం ఇనుమడింపజేస్తూ, సదాశివమయమైన సుపరిపాలనను అందించాలని ఆకాంక్షిస్తూ...

జై భవాని...జై శివాజి...జై భారతవని...💐😊🙏

No comments:

Post a Comment