శివారాధనలోని వైభవాన్ని, మహత్తును ఈశ్వరానుగ్రహంగా కొంత పరికిద్దాం....
హిరణాక్ష హిరణ్యకశిపులు,
రావణ కుంభకర్ణులు,
శిశుపాలదంతవక్త్రులు...
ఇత్యాది అసురులు పరమేశ్వరారాధానతో గొప్ప శక్తియుక్తులను గడించారు...
వరాహస్వామి, నృసిమ్హస్వామి,
శ్రీరామలక్ష్మణులు,
శ్రీకృష్ణబలరాములు,
ఇత్యాది సురులు కూడా పరమేశ్వరారాధానతో గొప్ప శక్తియుక్తులను గడించారు...
అసురుల గురువులైన శుక్రాచార్యులు మరియు దేవగురు బృహస్పతి వారు కూడా పరమేశ్వరారాధానతో గొప్ప శక్తియుక్తులను గడించారు...
దేవాధిదేవుడు, దేవతాసార్వభౌముడైన శ్రీఅనంతపద్మనాభస్వామి వారు శివారాధనాదురంధరులే...
శ్రీఅనంతపద్మనాభస్వామి వారు శివలింగం యొక్క పరమేశ్వర పంచాస్య వైభవంలోని ఊర్ధ్వముఖ వదనమైన ఈశాన వదనంపై వారి హస్తాన్ని అలంకరించి శయనించడం అనే అధ్యాత్మ అంశం యొక్క ఆంతర్యం తెలిస్తే మీరు...
"ఓహ్ శివలింగారాధనలో ఇంతటి గహనమైన అధ్యాత్మవిశేషం ఉన్నదా..." అని ఎంతో ఆశ్చర్యం చెందుతారు...!
(కొన్ని దేవరహస్యాలను గౌరవించాలి కాబట్టి నేను ఆ ఆంతర్యం గురించి పరిధి దాటి వివరించజాలను...
అది విజ్ఞ్యులకు ఈశ్వరానుగ్రహంగా ధ్యానగోచరమయ్యే అంశం..)
అనే పౌరాణిక సత్యం విజ్ఞ్యులకు విదితమే....
అసురుల శివారాధన వారి పతనానికి వారే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థగా పరిణమించును...
దేవతల శివారాధన ఎల్లరికీ అభ్యున్నతిని అనుగ్రహించే వ్యవస్థగా పరిణమించును...
శివారాధనతో...
రావణాది అసురులు ఎంతో బుద్ధిబలాన్ని, ఐశ్వర్యాన్ని అందుకున్నారు...
శ్రీరాముడి వంటి సుక్షత్రియవీరులు కూడా ఎంతో బుద్ధిబలాన్ని, ఐశ్వర్యాన్ని అందుకున్నారు...
కాని ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే...
దేవతల / దేవతానుగ్రహాన్ని నిత్యం సముపార్జించుకునే విజ్ఞ్యుల యొక్క శివారాధన వైభవమనేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిచే నిత్యం సమ్రక్షింపబడే విశేషం...
అసురుల శివారాధన వైభవమనేది తామరాకుపై కొలువైన నీటిబిందువు వంటిది...
రావణుడి శివారాధనా వైభవం గురించి సింపుల్ గా చెప్పాలంటే...
నిత్య శివలింగాభిషేకదురంధరుడైన
ఆతడు ఎంతటి పరమేశ్వరానుగ్రహాన్ని సముపార్జించాడంటే...
ఆకాశంలో సూర్యుడి ప్రకాశం / ప్రతాపం ఎక్కువైన్నట్టు అతడికి అనిపిస్తే...
ఎర్రబడ్డ అతని కనుసైగకి సూర్యుడు తనంత తానుగా తన శక్తిని క్షీణింపజేసుకొని రావణుడికి ఇబ్బంది కలగని రీతిలో ప్రకాశించాలి....
తను ఉన్న చోట గాలి ఎక్కువగా వీచి సుడిగాలిగా మారుతున్నట్టుగా అతడికి అనిపిస్తే...
ఎర్రబడ్డ అతని కనుసైగకి వాయుదేవుడు తనంత తానుగా తన శక్తిని క్షీణింపజేసుకొని రావణుడికి ఇబ్బంది కలగని రీతిలో మలయమారుతమై మెలగాలి....
ఇత్యాదిగా పంచభూతాలపై కూడా ఎనలేని పట్టును సాధించుకున్న పౌలస్త్యుడి పరమేశ్వరానుగ్రహానికి
తగ్గట్టుగానే ఆతడి ఐశ్వర్యం కూడా వెలకట్టలేనంత రాశి...
శ్రీచాగంటి సద్గురువుల "సంపూర్ణ శ్రీమద్రామాయణం" ప్రవచనాల్లో విన్నవారికి గుర్తున్నట్టుగా....
ఆతడి కాంచనలంకలో ఉండే చీనీచీనాంబరములు / తివాచీల వైభవం గురించి వర్ణించాలంటే ఏ ఉపమానాలు సరిపోలవు....
అంతటి ఐశ్వర్యభరితమైన లంకంత కొంప....రావణుడిది..
శ్రీరాముడి శివారాధనా వైభవం గురించి సింపుల్ గా చెప్పాలంటే...
అపర రుద్రాంశసంభూతుడైన హనుమంతుల వారిచే నిత్యం ఆశ్రయింపబడి ఉండే శ్రీరాముడు ఎంతటి పరమేశ్వరానుగ్రహాన్ని సముపార్జించాడంటే...
తన సచివుడైన హనుమంతుల వారు శ్రీరాముడితో నెరపిన అగ్నిసాక్షి మైత్రికి సంతసించిన సుగ్రీవుడు, తన అన్న వాలి యొక్క శక్తి గురించి,
ప్రత్యర్ధిగా ఎవరైనా వాలికి ఎదురునిలిస్తే ఆ ప్రత్యర్ధి యొక్క సగం బలాన్ని హరించివేయగల వాలికి గల వరం గురించి వివరించి...,
ఎందుకైనా మంచిది శ్రీరాముడి శక్తియుక్తులు ఒకసారి పరీక్షిస్తే బావుంటుంది కద....అని అనుకొని...,
వాలి చేతిలో హతుడైన దుందుభి అనే అసురుడి కొండంత అస్తిపంజరాన్ని చూపించి, ఇది తన అన్న శక్తికి నిదర్శనం అని పలికిన సుగ్రీవుణ్ణి చూసి నవ్వుతూ...
శ్రీరాముడు సంకల్పించి ఆ అస్తిపంజరాన్ని గట్టిగా తంతే అది 10 యోజనాల దూరం, అనగా రమారమి మన పరిభాషలో 125 కిలోమీటర్ల దూరం ఎగిరి పడింది...!
శ్రీరాముడి ధనుర్విద్యాకౌశలాన్ని కూడా ఒకసారి పరీక్షిస్తే మంచిది కదా అని అనుకొని...
సుగ్రీవుడు, ఒకే సరళరేఖలో సమాంతరంగా ఏపుగా ఎదిగిన 7 సాలవృక్షాలను చూపగా...
శ్రీరాముడు తన కోదండంతో ఆకర్ణపర్యంతం లాగి సంధించిన బాణం మెరుపువేగంతో ఆ 7 సాలవృక్షాలను భేదించుకొని వెళ్ళింది....!
సవినయుడై ఎంత ప్రార్ధించినా కూడా సముద్రుడు తనకు నడిచి వెళ్ళడానికి దారి ఇవ్వడం లేదని అనిపించిన శ్రీరాముడు
ఎర్రబడ్డ కన్నలతో ఎక్కుపెట్టిన తిరుగులేని శ్రీరామ బాణానికి సముద్రుడు వెంటనే స్పందించి, నలుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, ఇత్యాది వానరసేనచే లిఖింపబడే శ్రీరామ నామభూషితమైన కొండలుకూడా తనకు శిరోభూషణంగా సమ్రుద్రపు నీటిపై తేలుతూ ఉండును
అని వచించి కాంచనలంకకు వానరసేన నడిచివెళ్ళడానికి మార్గాన్ని సూచించాడు....
ధనుర్వేదశాస్త్రానుసారంగా ఒక సుక్షత్రియుడు ఎక్కుపెట్టిన అస్త్రం సంధింపబడకుండా ఉండకూడదు కాబట్టి...,
సముద్రుడిపైకి కోపంతో శ్రీరాముడు ఎక్కుపెట్టిన అస్త్రాన్ని,
ఎందరో రాక్షసులు పోగైఉన్న వేరొక ప్రదేశం దిశగా సంధించగా అసురులపాలిటి అదృశ్యపిడుగై వారిని లయించివేసింది...
శ్రీరామసేన మొత్తం, నిర్జింపనలవికాని అసురుడైన
మాయావి మేఘనాథుడి నాగాస్త్రబంధనంతో అశక్తులై పడిఉన్నప్పుడు సాక్షాత్తు పరమేశ్వర కంఠభూషమైన వాసుకి ఉపవీతంగా గల వైనతేయుడు శ్రీవైకుంఠం నుండి ఏతెంచిమరీ తన గారుత్మతశక్తిని ప్రసరించి వారందరికీ కూడా స్వస్థతను అనుగ్రహించి, "ఓ మిత్రమా నీవెవరవు...?"
అని శ్రీరాముడు అడగగా...ప్రస్తుతానికి నీకు నేనొక ఆప్తమితృణ్ణి అనుకో..." అని గరుత్మంతుడు సెలవిచ్చిన శ్రీమద్రామాయణ వృత్తాంతం మనకు శ్రీరాముణ్ణి నిత్యం ఆశ్రయించి ఉండే పరమేశ్వర శక్తి గురించి విశదపరచును...
నాగస్త్రము, గరుడాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము, ఇత్యాది దేవతాస్త్రాలు, అనగా ఆయా దేవతా శక్తులు మనకు కనిపిస్తాయా....?
అనే కొంటే ప్రశ్నలను కొందరు అడగొచ్చు...
ఒక నార్మల్ ట్యూబ్లైట్ నే 5 నిమిషాలపాటు కళ్ళార్పకుండా చూడలేని సామన్యమానవుల కళ్ళకు, 100 సూర్యబింబాలు ఒక్కటై ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యే రీతిలో దివిలో మెరిసే దివిజుల శక్తిని సాధారణ కళ్ళతో చూడగలం అని అనుకోవడం ఎంతవరకు సమంజసం...?
"దర్శించగల పుణ్యము, శౌచము ఉంటేనే, దేవతలు అనుగ్రహిస్తేనే, వారి ద్యుతిని, శక్తిని దర్శించగలం.."
కాబట్టి శివారాధన ఎవ్వరూ గావించినా కూడా వారెల్లరికీ అమేయమైన ఐశ్వర్యం, జ్ఞ్యానం సమకూరును అనేది జగద్విదితమైన అంశం...
మరి అసురులకు, దేవతలకు, మరియు వారికి గల శివారాధనాశక్తికి భేదం ఎక్కడ ఉన్నది...అని అంటే...
అది వారివారి ధర్మాచరణ యందు...అని అనవలసి ఉంటుంది...
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మార్తుడు....
అడుగు తీసి అడుగువేస్తే ధర్మదేవతేనడిచిన రీతిలో ఉండును శ్రీరాముడి యొక్క ధర్మనిరతి....
అందుకే...
దశేంద్రియసంఘాతమైన తనువంతా కూడా శివమయమైన శక్తితో ఉన్న శ్రీరాముడి ధర్మనిరతియే లోకంలో అప్పటివరకూ లేని సరికొత్త ధర్మాస్త్రమై,
ఎవ్వరిచేతా కూడా సాధారణంగా నిర్జింపనలవి కాని దశకంఠసుతుడైన ఇంద్రజిత్ ని, హనుమ సౌమిత్రి కలిసి లయింపజేసారు....
అధ్యాత్మపరంగా...
హనుమ ఆచార్యులకు అనగా దేవగురు బృహస్పతికి ప్రతీక....
సౌమిత్రి ఆదిశేషుడికి ప్రతీక...
అనగా ధర్మస్వరూపుడైన పరమాత్మను / శ్రీమహావిష్ణువును
వహించే శక్తికి ప్రతీక...
కాబట్టి ఇక్కడ
" ధర్మం + యుక్తి + శక్తి = ధర్మాస్త్రం " అనే సరికొత్త సమీకరణం తో మేఘనాథుడు అనే మాయావి లయించినాడు అని అర్ధం...
అధ్యాత్మపరంగా "మాయావి మేఘనాథుడు" అంటే...
మాయను కల్పించే మన మనస్సు యొక్క శక్తి...
అనగా అంత తెలికగా వశం కాని అధ్యాత్మ వస్తువు మన మనస్సు...
మేఘనాథుడిలా...మన మనస్సు కూడా ఆంతరాకాశంలో మెరుపు వేగంతో ప్రయాణిస్తూ నిరంతరం ప్రాపంచిక మాయలో మనల్ని విహరింపజేస్తూ ఉంటుంది....
అలా నిత్యాంతరవిహారి అయిన మన మనస్సు, తద్వారా మనోమాయ, తద్వరా దశేంద్రితసంఘాతమైన మన శరీరం, తద్వారా మన జీవిత ప్రయాణం, నిత్యం మన అధీనంలో ఉండాలంటే...అందుకు...
"ధర్మం + యుక్తి + శక్తి " అనే మూడింటితో నిత్యం అనుసంధానమౌతూ ఉండవలెను...
అనేది ఇక్కడి అధ్యాత్మ అంతర్యం...
అమేయమైన ఐశ్వర్యం, బలం, జ్ఞ్యానం, వర్చస్సు, తేజస్సు, వైభోగం, విలాసం, ఎన్ని ఉన్నా కూడా ధర్మం అనే అత్యంత ముఖ్యమైన నేస్తం, భూషణం, కవచం, అస్త్రం, లేని కారణంగా రావణుడు పదితలలున్న పౌలస్త్యుడైనా సరే ధర్మస్వరూపుడైన శ్రీరాముడి అస్త్రానికి నేలకొరిగాడు....
ఏది ఎవరికి ధర్మం....
అని అంటే...
"ధృయైర్వా జనైః ఇతి ధర్మం..." అనే వ్యుత్పత్తి ప్రకారంగా...
జనులచే ధరింపబడునది ధర్మం...అని అర్ధం కద...
ఫర్ ఎగ్సాంపుల్....
ఒక డ్రెస్స్ ని ధర్మానికి ఎగ్సాంపుల్ గా భావిద్దాం...
మనం ఎటువంటి డ్రెస్సులను ధరిస్తాము...
మనకు చూడ్డానికి చక్కగా ఉండేది...
మనల్ని చూసేవారికి చక్కగా ఉండేది...
మనకు శ్రేయస్సును కలిగించేది...
మనతో ఉండేవారికి శ్రేయస్సును కలిగించేది...
దేశకాలానుగుణంగా మారేది...
ఇది డ్రెస్స్ / ఆహార్యానికి గల సింపుల్ నిర్వచనం కద...
సాధారణంగా మనకు మన ఇంటి పెద్దవాళ్ళే మంచివారై మంచిమంచి డ్రెస్సులు కొనివ్వాలి...
అలా మన పెద్దలు కొనివ్వని / కొనివ్వలేని పక్షంలో,
పెద్దైన తర్వాత మనకు మనమే మన బుద్ధివైభవంతో, ఈశ్వరానుగ్రహంతో, మనకు ఉచితమైన మంచిమంచి డ్రెస్సులు కొనుక్కొని ధరించి తరించాలి....
కద...
అచ్చం అదే విధంగా....
సాధారణంగా మనకు మన ఇంటి పెద్దవాళ్ళే మంచివారై మనకు మన ధర్మం గురించి తెలియజెప్పాలి...
అలా మన పెద్దలు చెప్పని / చెప్పలేని పక్షంలో,
పెద్దైన తర్వాత మనకు మనమే మన బుద్ధివైభవంతో, ఈశ్వరానుగ్రహంతో, మనకు ఉచితమైన ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి తరించాలి....
అనగా....
"రోజు పొద్దున్నే సూర్యుడికి నమస్కరించి మంచి ఆరోగ్యం తో తరించు..."
"బాగా చదువుకొని స్కూల్ / కాలేజ్ లో మంచి పేరు / మార్కులు / విద్యను సముపార్జించి తరించు..."
"ఉద్యోగ / వ్యాపారాల్లో చక్కగా రాణించి తరించు..."
"నీ భార్య / భర్త / బిడ్డల పట్ల ఉండవలసిన విహిత కర్తవ్యం, అభివృద్ధి గురించి యోచించు..."
"అలాయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవించు...."
"నలుగురు విజ్ఞ్యులు మెచ్చేలా...నలుగురు విజ్ఞ్యులకు ఉపయుక్తమైన జీవితాన్ని జీవించు..."
" 'సర్వే సుజనాః సుఖినోభవంతు...' అనే తీరుగా జీవితాన్ని సార్ధకం గావించు..."
అని దేశకాలనుగుణంగా మనము ధరించవలసిన ధర్మం గురించి ఎరుకకలిగించే విజ్ఞ్యుల ఉవాచయే మనకు ఆయా దేశకాలావలంబిత ధర్మమై ఒప్పారును...
ధర్మదేవతకు ప్రతిరూపమైన శ్రీరాముడికి,
వృషభ వాహనం అనగ ధర్మమే వాహనంగా గల పరమేశ్వరుడికి, నమస్కరిస్తూ....
నాలుగు పాదాలమీద నడయాడవలసిన ధర్మం,
ఈ కలియుగంలో ఒకేఒక పాదంపై నడయాడుతూఉండడం ఈ కలియుగ లక్షణం కావొచ్చు.....
కాని ఏ యుగంలోనైనా సరే...
ధర్మార్ధకామ్యమోక్షాలు అనే చతుర్విధపురుషార్ధాల్లో ధర్మమే ఎల్లప్పుడూ ముఖ్యమైనదిగా వర్ధిల్లింది....
అనగా ధర్మరహితమైన అర్ధకామ్యమోక్షాలు నిరర్ధకమౌను అనేది సారాంశం...
"ధర్మో రక్షతి రక్షితః " అని ఎల్లరికీ తెలియజేస్తూ....
ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా వెలసిన శ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహంతో ఎల్లరూ ధర్మాత్ములై వర్ధిల్లెదరు గాక...
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తామ్
న్యాయేన్ మార్గేన మహీం మహిషాః ।
గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు ।।
💐💐💐💐💐💐💐💐💐💐💐
షాద్‌నగర్: శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం ప్రతియేటా పెరుగుతూ ఉండడం విశేషం....!
https://m.youtube.com/watch?si=ZMvHI6-Ue2p5jSYs&fbclid=IwZXh0bgNhZW0CMTEAAR6Gu_mxQAccnKaBciOs180ME7XjZa63pF3QobNHAonUCDzQu6T2iS0-Uv3Mwg_aem_rFj4Xy-K8x2PEqchq7nSZQ&v=py3ZdeJ6mqk&feature=youtu.be
No comments:
Post a Comment