Tuesday, April 1, 2025

శ్రీ క్రోధి నామ సంవత్సర (28-మార్చ్-2025) ఫాల్గుణ బహుళ చతుర్దశి ప్రయుక్త భృగువాసర సాయాహ్న సంధ్యలో స్వామివారి సహస్రదీపాలంకరణ ఉత్సవంలో

శ్రీశ్రీనివాసదర్శనం,
మహాప్రసాదస్వీకారం,
త్రయంత్రైలోక్యదుర్లభం,

అని విజ్ఞ్యుల ఉవాచ....

శ్రీ క్రోధి నామ సంవత్సర (28-మార్చ్-2025) ఫాల్గుణ బహుళ చతుర్దశి ప్రయుక్త భృగువాసర సాయాహ్న సంధ్యలో స్వామివారి సహస్రదీపాలంకరణ ఉత్సవంలో పాల్గొని....
అక్కడ వేదమూర్తుల సుస్వర వేదఘోషను తనివితీరా ఆలకిస్తూ, సంతసించే పరమాత్మను దర్శిస్తూ కూర్చొని తరించే సౌభాగ్యానంతరం....,
సామవేదసారమైన సంగీతశక్తిని సుస్వర రాగయుక్త సంకీర్తనల రూపంలో స్వామివారికి సంకీర్తనాకైంకర్యం గావిస్తున్న విద్వాంసుల ఆలాపనల్లో సేదతీరుతున్న శ్రీభూసమేతమలయప్పస్వామివారిని దర్శించేందుకు వెయ్యికళ్ళైనా సరిపోవనుకోండి...!

అందునా మన సౌభాగ్యం కొలది గతంలో మనం బాగా సాధనచేసిన సంకీర్తనలే ఆలపింపబడితే ఇక ఆ ఆనందానికి అవధి ఏముంటుంది చెప్పండి....

"నారాయణతే నమోనమో 
భవ నారద సన్నుత నమోనమో"

మరియు

"కంటిశుక్రవారము ఘడియలేడింట
అంటి అలర్మేల్మంగా అండనుండే స్వామిని"

అనే సంకీర్తనల్లో శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి హృదయకోవెలలో వెలసిన తిరుమలేశుడి వైభవం కళ్ళముందు కదలాడుతుంటే, ఆ నయనమనోహర సౌదామిని సదృశ శ్రీభూపతిని తిలకిస్తూ తరించడం ఏ వర్ణనలకు అందని అమరవైభవం...

ఎంతోమంది విజ్ఞ్యులు / భక్తులు ఎన్నోసార్లు ఎన్నో తిరుమల ఆర్జితసేవల్లో పాల్గొని ఉంటారు.....

సహస్రదీపాలంకరణ అనే ఆర్జిత సేవలో మీరు గమనించి ఉండి ఉంటే...
స్వామివారు కొలువై ఉండే మండపంలో వెయ్యిదివ్వెల వెలుగుల్లో మిరుమిట్లుగొలిపే స్వామివారి సందర్శనం సకలశ్రేయోదాయకమైన అనుగ్రహవైభవం....
సహస్రం అంటే సంస్కృతంలో మరో అర్ధం అనంతం అని....
అనగా ఆ అనంతశయనుని అనుగ్రహవీచికలు అనంతమైనవి అని అర్ధం...

"శ్రీభూసమేతమలయప్ప స్వామివారు అనగా....
స్వామివారు ఇద్దరు భార్యలతో తిరువీధి విహారం గావిస్తున్నారు...అని కాదు అర్ధం...
యావద్ విశ్వాన్ని శాసించేది రెండు రకాల శక్తులు...
శ్రీశక్తి...చరశక్తి
భూశక్తి...స్థిరశక్తి

నిత్యం తన అధీనంలోనే ఉండే ఈ రెండు వైశ్వికశక్తులను కూడా సదరు భక్తుడి ప్రపత్తి ప్రార్ధన శరణాగతి మేరకు, శ్రేయస్సును ఒనరించేలా శాసించే పరమాత్మ తత్త్వానికి ప్రతీకగా
స్వామివారు ఇరు దేవేరులతో తిరువీధివిహారం గావిస్తుంటారు...."
అనే తత్త్వసమన్వయాన్ని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు...

ఈశ్వరానుగ్రహంగా, ఈ తత్త్వ సమన్వయాన్ని మరికొంత వివరించే ప్రయత్నం గావిస్తాను....

సంస్కృత భాషా దైవత్వం..
తెలుగు భాషా సౌకుమార్యం / మాధుర్యం..
కన్నడ వస్త్రధారణ / పంచకట్టు / పంచకజ్జాయ ప్రసాద వైభవం..
తమిళ / ద్రావిడ ప్రబంధ / పాశుర పఠన వైభవం..
కేరళ దేవతారాధనా సదాచార వైభవం..
ఓఢ్రపురిజగన్నాథ క్షేత్ర ప్రసాద వైభవం..
బ్రాహ్మణ భోజన వైభవం..
శ్రీశ్రీనివాస ఆరాధనా వైభవం...
ఎనలేనిది..అని ప్రాచీన ఆర్యోక్తి..

ఇప్పుడు శ్రీభూసమేతశ్రీమలయప్పస్వామి వారి సహస్రదీపాలంకరణ సేవలోని విశేషాలను కొంత పరికిద్దాం...

తిరుమల సంప్రదాయాచార పరిభాషలో ఉత్సవబేరం గా భక్తులచే నిత్యం నమస్కరింపబడే శ్రీభూసమేతశ్రీమలయప్ప స్వామివారు తమంత తాముగా శేషాచల అభయారణ్యలోయల్లో మలయకోన అనే గహనమైన అడవిప్రాంతంలో 1339 వ సంవత్సరంలో స్వయంవ్యక్తమైన మూర్తి....
అనగా ఆ మువ్వురూ కూడా సాధారణమానవనిర్మిత మూర్తులు కారు...
శ్రీవేంకటాచలపర్వతశ్రేణుల్లో నిక్షిప్తమై ఉండే శ్రీవైకుంఠలోక బిలమార్గ సంచారులైన శ్రీవిష్ణుపార్శ్వదుల అనుగ్రహం వల్ల ఈ భూలోకవాసులకు అందిన అనన్యసామాన్యమైన పంచలోహ దైవిక మూర్తులే శ్రీభూసమేతమలయప్ప స్వామివారు...
కాబట్టి ఆ మూర్తులను నిత్యం ఆవహించి ఉండే అనన్యసామాన్యమైన దైవికశక్తి యొక్క ప్రసరణ భక్తులను వివిధ రీతుల అనుగ్రహించును....

మీలో ఎంతమంది విజ్ఞ్యులకు ఈ సందేహం వచ్చిందో తెలియదు కాని...
మీరు ఎప్పుడైన గమనించారా....
సహస్రదీపాలంకరణసేవలో...
తిరుమల తిరుపతి ఆస్థాన వేదమూర్తుల వేదఘోషను ఆలకించే శ్రీభూసమేతమలయప్ప పరమాత్మ ఉత్తరదక్షిణాలుగా ఊయల ఊగుతూ ఉంటారు...

ఆ తదుపరి...
స్వామివారిని సేవించేందు టి.టి.డి వారి అనుమతి లభించిన వివిధ శాస్త్రీయ సంగీత విద్వాంసుల సంకీర్తనాలాపనను ఆలకించే శ్రీభూసమేతమలయప్ప పరమాత్మ తూర్పుపశ్చిమాలుగా ఊయల ఊగుతూ ఉంటారు...

ఇది ఏదో కేవలం యథాలాపంగా స్వామివారు సేదతీరే శైలి అని అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది...
ఎందుకంటే....
తిరుమలలో నిర్వహింపబడే ప్రతీసేవకు / ప్రతీసేవానిర్వహణశైలికి / ప్రతీప్రసాదానికి / ప్రతీఉత్సవానికి / ఒక అర్ధం పరమార్ధం ఉండును...
అవి యోగులను, విజ్ఞ్యులను, విద్వాంసులను, గౌరవించి అడిగితే వివరిస్తారు...

తిరుమలేశుడి అనన్యసామాన్యమైన శ్రియానుగ్రహవీచికలకు పాత్రులైన వారు సామాన్యులైనా సరే....
విశేషమైన శ్రీవైష్ణవానుగ్రహసంపాతంతో ఎనలేని భోగభాగ్యాలతో వర్ధిల్లెదరు....

తిరుమలేశుడి దుస్సహమైన ఆగ్రహజ్వాలలకు గురైయ్యే వారు ఎంతటి మాన్యులైనా సరే....
అన్ని లయించిపోయి స్వామివారి ముందు సామాన్యుడిలా మోకరిల్లెదరు...

అది ఈ కలియుగప్రత్యక్ష దైవమైన
తిరువేంకటముడయార్ యొక్క దైవికరాచరికశక్తి...

ఉదాత్త, అనుదాత్త, స్వరిత సంగమంగా సాగే
స్వరప్రధానమైన వేదామ్నాయ / వేదఘోష యొక్క శక్తి వల్లే యావద్ విశ్వంలో దైవత్వం ఉత్పన్నమై మానవాళికి అన్నిరకాల శ్రేయస్సును సమకూర్చుతున్నది అనే అధ్యాత్మ సత్యం విజ్ఞ్యులకు ఎరుకే...

రాగప్రధామైనది సంకీర్తనాలాపన....
తత్ రాగ జనిత శక్తి యొక్క ప్రభావం గురించి సదరు విద్వాంసులకు ఎరుకే...
స్వరరాగసహితమైన ఆలాపన యొక్క శక్తి వల్లే యావద్ విశ్వంలో దైవికప్రశాంతత ప్రభవించి మానవాళికి అన్నిరకాల ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది అనే అధ్యాత్మ సత్యం విజ్ఞ్యులకు ఎరుకే...

మామూలు చదువులకు, సామాన్య మానవమేధస్సుకు అందని విజ్ఞ్యానవిషయాలు ఈ విశ్వంలో ఎన్నో ఉండును...
వాటిపై అవగాహనగల విజ్ఞ్యులు సహృదయులై వాటి గురించి చెప్పిన్నప్పుడు విని విశ్వసించి శ్రేయస్సును గడించి తరించడం మన విహిత కర్తవ్యమై ఉండవలెను..

ప్రాచీన ఆర్యులు చెప్పినదాని ప్రకారంగా....

నిత్యం ఉత్తరానికి శిరస్సుతో, దక్షిణానికి పాదాలతో నిద్రించే వారు శీఘ్రంగా గతించెదరు....
నిత్యం పశ్చిమానికి శిరస్సుతో, తూర్పుకు పాదాలతో నిద్రించే వారు శీఘ్రంగా మానసిక సంతులనాలేమితో పిచ్చి / మెంటల్ వారు అవుతారు...
అని ఒకానొక శాస్త్రం యొక్క ఉవాచ...

ఇది నేను నమ్మను అని అనే మూర్ఖుడు,
నిత్యం దక్షిణ తూర్పులకు పాదాలతో పరుండి, అరోగ్యమంతా ఆవిరైన తదుపరి ఆ శాస్త్రం యొక్క ఉవాచ గురించి తెలుసుకోవాలి...

ఇది నేను విశ్వసిస్తాను అని అనే విజ్ఞ్యుడు,
నిత్యం దక్షిణ తూర్పులకు శిరస్సుతో పరుండి, మంచి అరోగ్యాన్ని గడిస్తూ ఆ శాస్త్రం యొక్క ఉవాచ గురించి తెలుసుకోవాలి...

కదా...

అచ్చం అదేవిధంగా...

ఒకానొక శాస్త్రప్రకారంగా....

శ్రీభూసమేతమలయప్పస్వామి వారు....
వేదఘోషను ఆలకించే సమయంలో...
ఉత్తర దక్షిణాలకు ఊయల ఊగుతూఉంటే.....,
ఉత్తరోత్తరా భక్తులు ప్రార్ధించే లౌకికాభివృద్ధి వారికి అనుగ్రహింపబడును....

శ్రీభూసమేతమలయప్పస్వామి వారు....
శాస్త్రీయసంకీర్తనాలపనను ఆలకించే సమయంలో...
తూర్పు పశ్చిమాలకు ఊయల ఊగుతూఉంటే.....,
భక్తులకు లభించవలసిన మానసిక ప్రశాంతత, సంతోషం, ఆనందం అనుగ్రహింపబడును....

అది ఎవ్విధంగా అవ్వునూ అనేది....వేరోక గహనమైన శాస్త్రం....

స్వామివారిని సందర్శిస్తూ ఆర్తితో ప్రార్ధించే భక్తుల మనోభావాలను గ్రహించే వాడు కాబట్టే ఆతడు 
"భావగ్రాహి జనార్ధన" అని నుతింపబడుతున్నాడు...

తన క్రీగంటి చూపులతో భక్తులను అనుగ్రహించడానికి...
ఎవ్విధంగా తనను ఆర్తితో, త్రికరణశుద్ధితో ప్రార్ధించే భక్తుల జీవితాల్లో ఏ గ్రహం యొక్క ఫలితాన్ని బలపరిచి, ఏ గ్రహం యొక్క ఫలితాన్ని క్షయింపజేస్తున్నాడో...
అనేది పరమాత్మకు మాత్రమే తెలిసిఉండే బ్రహ్మవిద్య...
ఆ విద్యను అర్ధం చేసుకోవడం మానవమాత్రులకు అంత సులభతరం కాదు...

సహస్రం అంటే సంస్కృతంలో అనంతం అని ఒక అర్ధం..
అనగా సహస్రదీపాలంకరణ సేవలో కొలువై ఉండే శ్రీభూసమేతశ్రీశ్రీనివాసుడి విభూతులు అనంతమైనవి...అగ్రాహ్యమైనవి...
అమేయమైనవి...అమరవందితమైనవి...

అని మనం స్వామివారికి నమస్కరించడంలోనే...
మనం స్వామివారిని సేవించి తరించడం అనే ఉన్నతి ఉండును...అనేది ఇక్కడి సారాంశం అన్నమాట...

సూర్యచంద్రమండలాలే తన నేత్రద్వయశోభగా అమరి
మందస్మితుడై మెరిసే స్వామి వారి క్రీగంటి చూపుల జల్లుల్లో జాలువారిన ఆనందభాష్పాలకు ఆ శ్రీశ్రీనివాసుడికి ఎన్ని సార్లు నమస్కరించినా, ఆతడి భక్తవాత్సల్యాన్ని ఎంత స్తుతించినా, తనివితీరదు...!

సర్వం శ్రీభూసమేత శ్రీవేంకటకృష్ణార్పణమస్తు...💐🙏😊

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో

http://annamacharya-lyrics.blogspot.com/2006/10/40narayanathenamonamo.html





No comments:

Post a Comment