Saturday, February 28, 2026

శ్రీ విశ్వావసు మాఘ బహుళ త్రయోదశ్యోపరి చతుర్దశి, 2026 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు.....💐😊[ అనగా చతుర్దశి పరివ్యాప్తమై ఉన్న రాబోవు భానువాసర త్రయోదశి (ఫెబ్రవరి-15-2026) నాటి నిశీధి సంధ్యాసమయం...]

శ్రీ విశ్వావసు మాఘ బహుళ త్రయోదశ్యోపరి చతుర్దశి, 2026 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు.....💐😊
[ అనగా చతుర్దశి పరివ్యాప్తమై ఉన్న రాబోవు భానువాసర త్రయోదశి (ఫెబ్రవరి-15-2026) నాటి నిశీధి సంధ్యాసమయం...] 

అత్యంత రమణీయమైన శ్రీఉమామహేశ్వర స్తోత్రాన్ని విజ్ఞ్యులు ఎప్పుడైనా పఠించే ఉంటారు కద....
కనీసం ఏదో ఒక మహాశివరాత్రి నాడు జాగరణలో ఉన్నప్పుడైనా పఠించే ఉంటారు కద..

అందలి ఈ క్రింది అత్యంత మనోహరమైన మాధుర్యభరిత శ్లోకాన్ని చదివితే శివ శివా యొక్క ఏకీకృత శం తత్త్వం గురించి ఎరుక కలుగును....

[
నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం 
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ ।
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం 
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 5 ॥

-- ఉమామహేశ్వర స్తోత్రం

భక్తితో ప్రార్ధించే విజ్ఞ్యుల ఎట్టి రుగ్మతలైననూ లయించివేసి చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించే వైదీశ్వరుడను / శ్రీవైద్యనాథుడను నేనే....

న మ శి వా య అనే పంచాక్షరములచే నిర్మితమై ఉండే నమఃశివాయ అనే పంచాక్షరీ పంజరంలో భక్తులు నన్ను తమవారిగా కొలువుతీర్చి, వారికి కావలసిన అనుగ్రహాన్ని బడసి తరిస్తూ ఉంటారు...
]

శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్టమైన వచనాల్లో ఒకటైన ఈ క్రింది వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి.....

"ప్రపంచం అనగా నిత్యం ఈ క్రింది ప్రహృష్టమైన పంచ విధ లక్షణాలతో పరిఢవిల్లే ఒక లౌకిక / భౌతిక వ్యవస్థ...."

1. పుట్టడం / జన్మించడం / ఆవిర్భవించడం / ప్రారంభమవ్వడం / ఏతెంచడం / ప్రత్యక్షమవ్వడం ఇత్యాదిగా ఆద్యస్థితి ప్రకటిత వాచ్యార్ధాలు...

2. పెరగడం / వృద్ధిచెందడం / ప్రవర్ధమానమవ్వడం / వికసించడం ఇత్యాదిగా హెచ్చు గుణక స్థాయి సూచిత వాచ్యార్ధాలు...

3. మార్పుచెందడం అనే భౌగోళిక ప్రక్రియను సూచించే వాచ్యార్ధాలు...

4. తరగడం / క్షీణించడం / సన్నగిల్లడం / ఇత్యాదిగా మంద్ర గుణక స్థాయి సూచిత వాచ్యార్ధాలు...

5. లయించడం అనే అంత్య స్థితి సూచిత వాచ్యార్ధాలు...

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతీ వస్తువు, ప్రతీ వ్యక్తి, ప్రతీ తత్త్వం, ఇత్యాదిగా ప్రతీది కూడా ఈ 5 లక్షణాల్లోనే పరిఢవుల్లుతూ ఉండడం మనం గమనించవచ్చు....

సృష్టి స్థితి లయ ప్రక్రియలకు 
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కర్తలుగా సకలదేవతాస్వరూపిణి అయిన ఆదిపరాశక్తి నియమించి తన శక్తి అంశలైన సరస్వతి లక్ష్మి పార్వతీ శక్తులను వారివారి దేవేరులుగా వారి యొక్క శక్తిగా అనుగ్రహించెను...

అని దేవిభాగవతం యొక్క ఉవాచ....

ఇక్కడ లయప్రక్రియ గురించి చాలా మందికి సరైన అవగాహన లేక శివుడంటే రుద్రుడు...సమ్హారకుడు...ఇత్యాదిగా 
రజోగుణ తత్త్వాన్ని మాత్రమే ఆపాదించి నిర్వచిస్తూ ఉంటారు.....

కాని యదార్థానికి శివుడిది సత్త్వగుణ ప్రధాన తత్త్వం అని శాస్త్ర ఉవాచ....

ఎందుకంటే

సరస్వతీదేవి : శివుడు,
లక్ష్మీదేవి : బ్రహ్మ,
పార్వతీదేవి : శ్రీమన్నారాయణుడు,
తెలుపు, ఎరుపు, నలుపు వర్ణతత్త్వాలకు, అనగా
సత్త్వ రజో తమో గుణ తత్త్వాలకు ప్రతీకలుగా,
అన్నాచెల్లెళ్ళుగా శాస్త్రం నిర్వచిస్తున్నది....
అనే శ్రీచాగంటి సద్గురువుల ఉవాచ విజ్ఞ్యులకు విదితమే...

శం కరోతి ఇతి శంకరః....
అనే వ్యుత్పత్తిని మీమీ ఇంటర్ కలేజ్ లో సంస్కృతం లెక్చరర్స్ బోధించే ఉంటారు కద.....

అనగా శుభపరంపరలను అనుగ్రహించే వరిష్టదైవం శంకరుడు అని వాచ్యార్ధం...

శివుడి చేతిలో ధరింపబడి ఉండే త్రిశూలం,
మరియు శ్రీమన్నారాయణుడి చేతిలో ధరింపబడి ఉండే సుదర్శనచక్రం, ఈ రెండు తిరుగులేని శస్త్రాస్త్రములు కూడా విశ్వకర్మ గారిచే ఒకానొక సందర్భంలో దుస్సహమైన సూర్యుడి తేజస్సును సానబట్టి తయారుచేయబడిన ఆయుధములు.....

కాబట్టి సూర్యపరివారమైన కాలస్వరూపులు, సూర్యపుత్రులైన యమధర్మరాజు, శనైశ్చరుడు, మరియు కాలస్వరూపమైన యమున, కూడా పరమేశ్వరుడి చేతిలో ఉండే త్రిశూలానికి మరియు శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే 
సుదర్శనచక్రానికి విధేయులై వర్ధిల్లుతూ ఉంటారు...

ఇవ్విధంగా ఈశ్వరుణ్ణి, ఈశ్వరవైభవాన్ని, వివిధరీతుల సమన్వయపరిచే శాస్త్రవైభవాన్ని దర్శించే విజ్ఞ్యులెవ్వరైనాసరే ఈశ్వరారాధన, ప్రత్యేకించి అరూపరూపియై వర్ధిల్లే శివలింగారాధన యొక్క వైభవాన్ని బహుధా శ్లాఘించెదరు....

శ్వేతవృషభవాహనారూఢమై సంచరించే మూర్తీభవించిన ధర్మం యొక్క స్వరూపమే, నిత్యాన్నదాన క్షేత్రమైన ధర్మస్థల ఆలయంలో శ్రీమంజునాథుడిగా కొలువై ఉండగా 
సదాచారవరిష్టులైన సర్వోన్నతులైన శ్రీవైష్ణవులే ఈ అపురూపమైన పుణ్యక్షేత్రంలో నా అర్చకులుగా వర్ధిల్లెదరు....అని పలికిన పరమేశ్వరుడే సర్వోన్నతమైన ప్రప్రథమ శ్రీవైష్ణవుడు అని విజ్ఞ్యులకు విదితమే....

నిజానికి శివలింగం త్రిమూర్త్యాత్మక అరూపరూప అర్చాస్వరూపం...

మొదలు చతుర్ముఖ బ్రహ్మస్వరూపం...
మధ్యన ఉండే పానవట్టం శక్తి స్వరూపం, నారాయణి / శ్రీమన్నారాయణ స్వరూపం...
అందలి ఉపరి భాగాన ఉండే లింగం శివస్వరూపం...
శైవాగమోక్త శిల్పకళానుగుణంగా ఈ మూడింటి పరిమాణం ప్రకారంగా ఆ శివలింగంపై చిత్రింపబడే త్రిశక్తిసంధాన సాధనమైన బ్రహ్మసూత్రం గల శివలింగాలు మరియు నర్మదా నదిలో సహజ సిద్ధమైన బాణలింగాలుగా లభించే నున్నని ఆశ్చర్యకరమైన శివలింగాలు మరియు అరుదైన నవరత్న లింగాలు విశేషమైన ఈశ్వరానుగ్రహదాయక సాధనాలు అని అనాదిగా విజ్ఞ్యుల విశ్వాసం....

గంగ, యమున, గోదావరి, కావేరి ఇత్యాదివి నదులు...
[తూర్పు వైపుగా ప్రవహించి సముద్రసంగమం చెందే నిత్యప్రవాహాలు...]
నర్మద అనేది నదము...అనగా పశ్చిమం వైపుగా ప్రవహించి సముద్రసంగమం చెందే నిత్యప్రవాహం..
అనే శ్రీచాగంటి సద్గురువుల వచనం కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది....

అనగా అత్యంత మహిమాన్వితమైన సద్యోజాతశివాననశక్తిని కలిగినటువంటి నర్మదా నదీప్రవాహంలో మాత్రమే లభించే బాణలింగాలు పరమేశ్వర వైభవం గురించి చెప్పకనే చెప్తున్నాయి....

అట్టి 12 మహిమాన్వితమైన బాణలింగాలు 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకలుగా ఒకే పానవట్టంపై అమరి, ద్వాదశజ్యోతిర్లింగేశ్వరస్వామివారిగా ఆరాధింపబడుతూ, "వామేశక్తిధరందేవం..." అన్నట్టుగా వామ పార్శ్వమున చతుర్దశభువనాలకు అధినేత్రిగా వర్ధిల్లే హ్రీంబీజాధిదేవత శ్రీభువనేశ్వరి అమ్మవారు శ్రీచక్రానికి అభిముఖంగా కొలువై ఉండగా, ఇట్టి పార్వతీపరమేశ్వరస్వరూపాన్ని మహాశివరాత్రినాడు ఆరాధించి తరించడం ఎంతో చక్కని ఈశ్వరానుగ్రహమైన సౌభాగ్యం....

సంపన్నుల ఇంట్లో మీరు చిమ్ని అనే ఒకానొక పరికరాన్ని వారి కిచెన్ లో స్టవ్ దెగ్గర అమర్చి ఉండడం గమనించే ఉంటారు కద...
ఆ చిమ్ని వల్ల వారి వంటగదిలో పొగ, దుమ్ము, మసి, ఇత్యాది అవాంఛిత అలక్ష్మి కారకాలు లేకుండా, వంటగది కూడా పూజ గదిలా ఉండడం టి.వి సీరియల్స్ లో అయినా గమనించే ఉంటారు కద....

అదే విధంగా ఈ లోకంలో సంపన్నుల ఇంట్లో విశేషమైన శ్రీలక్ష్మీ అనుగ్రహం ఎందుకు నిత్యం తాండవిస్తూ ఉండునో తెలుసా..?
వారి ఇంట్లో ఒక దైవిక చిమ్ని లా నిత్య శివలింగారాధన వారివారి శక్తియుక్తికి తగ్గట్టుగా జరుగుతూ ఉంటుంది....
ఇక్కడ శ్రీలక్ష్మీ అనుగ్రహం అనగానే ధనకనకవస్తువాహనాది భౌతిక సంపద మాతమే కాదు...,
చక్కని మనఃశాంతి, ఆరోగ్యం, విద్య, యశస్సు, ఐశ్వర్యం, అభీష్టసిద్ధి అని విజ్ఞ్యులు గమనించవలె....

ఇప్పుడు లయకర్త యొక్క ఆరాధనా వైశిష్ట్యంలో ఉండే వివిధత్వాన్ని కొంత వివేచన గావిద్దాం....

సాక్షాత్తు, పార్వతీదేవి ఇసుక / మట్టి తో పృథ్వీలింగాన్ని తయారుచేసి ఆరాధించగా, ఆ లింగం పంచభూత లింగాల్లో ఒకటైన శ్రీకంచిఏకామ్రేశ్వర పృథ్వీ లింగమై ఇప్పటికీ అలరారుతూ ఉండడం విజ్ఞ్యులకు విదితమే...
ఈ లింగానికి కేవలం మల్లెనూనేతో మాత్రమే లఘువుగా అభిషేకం నిర్వహిస్తారు అని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించగా, కంచికి వెళ్ళి అట్టి శ్రీకంచిఏకామ్రేశ్వర పంచభూత పృథ్వీలింగ క్షేత్రాన్ని ఒకసారి దర్శించి వచ్చాను...

మట్టి మహేశ్వరుడిగా మారి అనుగ్రహించడం అంటే మృణ్మయం చిన్మయం గా మారి అనుగ్రహించడం..

మన శరీరం కూడా అంతా మట్టే అని బన్ని & హన్సిక నటించిన దేశముదురు మూవిలో డైలాగ్ ఒకటి గుర్తుండే ఉంటుంది కద...

కాబట్టి మన శరీరం కూడా నిత్యం శివమయమైన / శివమయమై ఉండవలసిన ఒక స్థూల పృథ్వీలింగమే.....

సృష్టిరచనా నియమానుసారంగా బ్రహ్మగారు నిర్దేశించిన మైథునసృష్టికి సాధనమయ్యే కట్యధోకూటమి అంతా కూడా శివలింగం యొక్క అధోభాగమైన మూలభాగం / బ్రహ్మస్వరూపం....

కట్యోపరిభాగం నుండి కంఠ అధోభాగం వరకు పానవట్టమైన శక్తీస్వరూపం / శ్రీమన్నారాయణ స్వరూపం...

కంఠోపరిభాగం శివలింగస్వరూపం...

మన మీసాల కొసల నుండి ప్రారంభమై నాసికరంధ్రాలవద్ద మలుపు తిరిగి ఊర్ధ్వముఖంగా సన్నని లింగాకారంలో సాగుతూ మన ఆజ్ఞ్యాచక్రస్థానమైన భృకుటి వరకు శోభిల్లే రెండు హైపోతెటికల్ లైన్స్ ని ఊహించండి.....
మన వదనం అనే శివలింగం ఎంత గొప్పగా అద్దంలో తణుకులీనుతుందో...
ఈమధ్యే మొన్న శంకర్పల్లిలో ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు నవరత్నాల్లో ఒకటైన మరకతంతో మలచబడిన ఒక అరుదైన శివలింగాన్ని దర్శించి నమస్కరించాము....
ఆ అపురూపమైన లేత ఆకుపచ్చని వర్ణంలో తణుకులీనుతున్న శివలింగంపై విశ్వకర్మ చెక్కినంత వైభవోపేతంగా ఉన్న బ్రహ్మసూత్రాన్ని బాగా దర్శించి తరించాము... 

"ఆజ్ఞ్యాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథివిభేధిన్యై నమః"

అని ఆదిపరాశక్తిని వాగ్దేవతలు నిత్యం స్తుతిస్తూ ఉంటారు ...

హైద్రాబాద్ లో టేకాఫ్ అయిన ఫ్లైట్ ల్యాడింగ్ గేర్ క్లోస్ చేసి వారాణసి నగరం వరకు ప్రయాణించడం ఒకెత్తు....
ల్యాడింగ్ గేర్ తెరుచుకొని వారాణసి ఎర్పోర్ట్ లో విజయవంతంగా ల్యాండ్ అవ్వడం ఒకెత్తు....

అదే విధంగా...
యోగపరిభాషలో / శ్రీవిద్యోపాసనలో సాధకుడు తన 
ఆంతరప్రయాణాన్ని  మూలాధారచక్రం నుండి ప్రారంభించి బాహ్య నయనాలను మూసి భృకుటిలో కొలువైఉండే ఆజ్ఞ్యాచక్రస్థానమైన భృకుటి వరకు ప్రయాణించడం ఒకెత్తు.....
అందలి రుద్రగ్రంథిని భేదించి పైకి సహస్రారంలో చిత్తాన్ని స్థిరీకరించడం ఒకెత్తు.....

ఒక ప్యాసెంజర్ గా ఫ్లైట్ లో ప్రయాణించడం వేరు....
ఒక పైలట్ గా ఫ్లైట్ ని స్టీర్ చేయడం / నడిపించడం వేరు....

అవ్విధంగానే 

ఒక సాధకుడిగా షట్చక్రాలను ఉత్తేజపరిచి సాక్షిత్వాన్ని వహించి తనతో సహా తను ఉన్న  లోకాన్ని దర్శించడం వేరు....
మరియు
ఒక సాధకుడిగా షట్చక్రాలను ఉత్తేజపరిచి వాటిని భేదించడం వేరు....
షట్చక్రభేదనం అనే ఉన్నతస్థాయి యోగప్రక్రియ
సాధారణ లౌకిక విషయాల గురించి విజ్ఞ్యులు చేయరు, చేయకూడదు...
ఇది కేవలం ఉన్నతోన్నతమైన యోగీశ్వరులకు మాత్రమే సాధ్యమయ్యే యోగప్రక్రియ...

షట్చక్రభేదనం అనే యోగప్రక్రియ గురించి, 
ఆనాడు మండనమిశ్రుల ఇంటి పైకప్పుని భేదించి అవలీలగా పృథ్వీతత్వాన్ని భేదించిన శ్రీఆదిశంకరాచార్యుల స్థాయిలో విజ్ఞ్యులైన యోగుల ఉదంతాలు...
అరుణాచలం ఉపరితల పర్వతప్రాంతాల నుండి భగవద్ నిర్దేశిత విహితకార్యాచరణకై ఆకాశతత్త్వాన్ని భేధించి వారు ఉన్న తలం నుండి మనం ఉండే తలానికి ప్రయాణించి ప్రత్యక్షమయ్యే యోగీశ్వరుల ఉదంతాలు......
ఇత్యాదిగా లోకంలో విజ్ఞ్యులకు తెలిసిన ఉదాంతాలు ఉన్నా....
అవి సదరు కారణాలరీత్యా భగవంతుడి అనుజ్ఞ్యమేరకు మాత్రమే సదరు సాధకులు గావించే విశ్వకళ్యాణ కార్యములు...

మనలాంటి సామాన్యులు వాటిని తెలుసుకొని, వాటి మహిమ్నతకు, శక్తికి, ఒక నమస్కారం చేసి, మన లౌకిక పరిధిని దాటకుండా వాటిని మనకు ఉపయుక్తంకాని అధ్యాత్మతత్త్వాలుగా భావించాలి...

ఎందుకంటే....
ఒక పేద్ద ఆటోమొబైల్ వెహికిల్ ఉండడం వేరు...
ఆ ఆటోమొబైల్ వెహికిల్ కి ఫుల్ల్ గా పెట్రోల్, డీజిల్, బ్యాట్రి చార్జ్, ఉండడం వేరు...
ఆ ఆటోమొబైల్ వెహికిల్ ఇగ్నిషన్ తాళంచెవి లభించడం వేరు...,
ఆ ఆటోమొబైల్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వేరు...
ఆ ఆటోమొబైల్ వెహికిల్ కి బ్రేక్స్ ఉండడం, వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎంత వరకు అప్ప్లై చేయాలో తెలిసిఉండడం వేరు...

విచక్షణ, వివేకం, విజ్ఞానం, అనే మూడింటి కలబోతగా అవసరం అయితేనే సంక్లిష్ట సాధనములను ఉపయోగించవలసి ఉంటుంది కాబట్టి.. ఇక మిగతా విషయాల గురించి పెద్దగా వివరించడం ఎందుకు...

ఇలా కాంప్లెక్స్ అంశాల్లో కాక, చాలా సింపుల్ అంశాల్లో పరమశుభంకరుడైన లయకర్త యొక్క అనుగ్రహాన్ని వివేచిద్దాం....

ఒక మూడురోజులు పాటు రాత్రిమొత్తం మేల్కొని ఉండండి...
అప్పుడు మన శరీరంలో స్వల్పకాలిక లయప్రక్రియ అనే నిద్రాప్రక్రియ జరగలేదు కాబట్టి..
శరీరానికి ఉండే ఇబ్బంది ఏంటో అర్ధమై, అసలు లయప్రక్రియలో ఉండే ఈశ్వరానుగ్రహం అంటే ఎంటో
తెలియును.....

సృష్టికర్త్రీ 
బ్రహ్మరూపా 
గోప్త్రీ 
గోవింద రూపిణీ 
సంహారిణీ 
రుద్రరూపా 
తిరోధానకరీ 
ఈశ్వరీ 
సదాశివా 
అనుగ్రహదా 
పంచకృత్య పరాయణ

సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యములను నిర్వహించే సకలశక్తిస్వరూపిణి అని వాగ్దేవతలు నిత్యం ఆదిపరాశక్తిని స్తుతింతురు....

1.భూమి
2.వాయువు
3.అగ్ని
4.జలము
5.నభము

అనే పంచభూతాలను విజ్ఞ్యులు ఇవ్విధముగా పంచకృత్యములకు ఆపాదింతురు ..

1.భూమి : సృష్టి
2.వాయువు : స్థితి
3.అగ్ని : లయ
4.జలము : అనుగ్రహము
5.నభము : తిరోధానము

రుద్రుడు / రుద్రాణి
త్రినేత్రుడు / త్రినేత్రి 
త్రయంబకుడు / త్రయంబకేదేవి
[ సోమ / సూర్య / అగ్ని లోచన అని కదా స్తుతి ]

అగ్నికి లయప్రక్రియకు గల సామ్యము ఎల్లరికీ విదితమే......
అగ్నిదేవుడికి ఈశ్వరుడు అనుగ్రహించిన వరం గురించి ఇదివరకే ఒక పోస్ట్ లో వివరించాను కద..
అవ్విధంగా సర్వకాల సర్వావస్థల్లో పవిత్రుడై వర్ధిల్లే అగ్నిదేవుడు తనలోకి ఈ ప్రపంచంలోని ఎట్టి వస్తువైనా, ఎట్టి తత్త్వాన్నైనా లయించే శక్తి కలదు...
అటువంటి అగ్నిదేవుడు అధిదేవతగా గల పంచభూత అగ్నిలింగమై, శ్రీఅరుణాచలేశ్వరుడై ఈశ్వరుడు అనుగ్రహించే లయప్రక్రియ గురించి కొంత వివేచనకావిద్దాం....

సూర్యాగ్ని రూపంలో భూమిపై ఉండే బురదను లయించి ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు...
లేనిచో వర్షాకాలం తర్వాత బయట వాహనాలకే కాదు మనకు కూడా సరిగ్గా నడవడానికి ఆ బురద ఇబ్బందే కద...

ఇది సాధారణ లౌకిక అనుగ్రహం...

జ్ఞ్యానభాస్కరుడై, శ్రీఅరుణాచల అగ్నిలింగరూపంలో కొలువైన ఈశ్వరుడు అనేక జన్మల్లో పేరుకున్న అజ్ఞ్యానరాశిని లయించి / శోషించి అనుగ్రహిస్తున్నాడు...
లేనిచో ఇంకో వంద జన్మలైనా ఈశ్వరుడి వైభవం గురించి తెలియకుండానే జీవుడు నానావిధజన్మల్లో తిరుగుతూనే ఉండును...

అనగా ఈ జన్మలో ఒక ఉన్నతాధికారిగా అనేక రాజభోగాల్లో తేలియాడుతూ ఈశ్వర విస్మరణతో గతించిన సదరు జీవుడు, ఒక నల్లిగా కొన్ని జన్మలు, ఒక దోమగా ఇంకొన్ని జన్మలు, ఒక నక్కగా ఇంకొన్ని జన్మలు, ఒక పిల్లిగా ఇంకొన్ని జన్మలు, ఆ తరువాత చేసుకున్న కొంత పుణ్యం కారణంగా ఎన్నో జన్మల తరువాత మరలా మనిషిగా జన్మించి ఒక ఆలయం బయట యాచకుడిగా జీవించడం అనే అంశంలో గమనించదగిన విషయమేంటంటే.....,
సదరు ఆలయ అభివృద్ధికై కేటాయింపబడిన ప్రభుత్వనిధిని తన స్వవిలాసాలకై దుర్వినియోగపరచిన పాపానికి ఆలయం బయట ఎన్నో జన్మల తరువాత మరలా మనిషిగా జన్మించి అలా యాచకుడిగా జీవించేదుకు కారణం అయ్యింది....

ఇక్కడ ఈశ్వరుడి అనుగ్రహానికి, అనుగ్రహలేమికి, జీవుడి పాపపంకిలప్రోదికి గల భేదాన్ని పరికిద్దాం...  

రోజు మన చేతిలో ఓ 50 రూపాయలు ఉండడం ఈశ్వరానుగ్రహం....
[ అనగా గత పుణ్యం తాలూక ఫలితం ]

ఆ 50 రూపాయలతో...

రోజు ఈశ్వరుడి సేవలో ఎంతో కొంత వెచ్చించి తరించడం అనేది ఉత్తరోత్తరా ఉన్నతమైన ఫలితాలను ప్రసాదించే కర్మను ఆచరించడం...అనబడును...

రోజు ఏదేని సాత్విక పదార్ధం కొనుక్కొని తిని అరోగ్యాన్ని గడించడం అనేది సాధారణ ఫలితాలను ఒనరించే కర్మను ఆచరించడం...అనబడును...

రోజు అడ్డమైనవాటిని కొనుక్కొని తిని అరోగ్యం పాడుచేసుకోవడం అనేది అధమ ఫలితాలను ఇచ్చే కర్మను ఆచరించడం...అనబడును...

ఇక్కడ కర్మాచరణస్వాతంత్ర్యం కలిగిన జీవుడు / జీవధారకుడు 
తన భవిష్యద్ స్థితికి కారణం అగుచున్నాడా....?
లేక కర్మసిద్ధాంతానికి, కర్మాచరణకు, కర్మఫలితాలకు సాక్షిత్వాన్ని వహించే ఈశ్వరుడు జీవుల భవిష్యద్ స్థితికి కారణం అగుచున్నాడా....?

అని అంటే.....

కర్మాచరణకు, కర్మసిద్ధాంతం పట్ల సరైన అవగాహానకు, కర్మసిద్ధాంతాన్ని మించిన ఎనలేని ఈశ్వరానుగ్రహవైచిత్రి ఎరుకకు కారణమై ఉండే జీవుడి బుద్ధివైభవం ఇక్కడ అన్నిటికీ మూలకారణం అని అనవలసి ఉంటుంది...

ఆ బుద్ధివైభవాన్ని విశేషంగా అనుగ్రహించే సాధనమే ఈశ్వరారాధన అని అనవలసి ఉంటుంది...

అట్టి అనేకవిధములైన ఈశ్వర ఆరాధనల్లో సర్వోన్నతమైనది బుద్ధివైభవాన్ని అనగా అజ్ఞ్యానలయాన్ని విశేషంగా అనుగ్రహించే శ్రీఅరుణాచలేశ్వరుడి ఆరాధన...
అది కూడా స్మరణమాత్రాన అనుగ్రహించే విశిష్టవరదైవం కావున "స్మరణాత్ అరుణాచలే....." అనే నానుడి...!

1. అరుణాచాలం
2. అరుణ అచలం
3. అ రుణ అచలం

1. అరుణాచలం అనే నామధేయంతో అనాదిగా భాసిల్లుతున్న ఓ అద్భుత జ్ఞ్యానాచలమా...,

2. అరుణవర్ణంలో భాసిల్లే సకలదేవతానుగ్రహాన్ని వర్షించే ఓ సకలదేవావాసమా...

3. పునర్జన్మలకు కారణమయ్యే అన్నిరకాల రుణాలను, అజ్ఞ్యానగ్రంథికారక అన్నిరకాల మౌఢ్యాన్ని విశేషంగా లయించే ఓ అరుణపర్వతమా.....,

నిన్ను స్మరించినంత మాత్రాన అరుణాచలేశ్వరుడి విశేషమైన జ్ఞ్యానానుగ్రహాన్ని వర్షించే అమేయ కారుణ్యాచలమా...,
ఎంతో పుణ్యదాయకమైన మహిమాన్విత మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి లింగోద్భవకాలంలో నిన్ను స్మరించే భాగ్యాన్ని ప్రసాదించి తరతరాలకు తరగని శివశివానుగ్రహాన్ని వర్షించి మమ్ములను తరింపజేయుము అని ఈశ్వరుణ్ణి ప్రార్ధించడం ఎంతటి సౌభాగ్యకరమో కద...

ఎల్లరూ ఈ మహాశివరాత్రి నాటి పర్వసమయంలో కనీసం ఐదుసార్లు "అరుణాచలశివ" అనే సప్తాక్షరిని స్మరించి, జపించి, ఆరాధించి, శివ, శివా, శివసుత, అనుగ్రహంతో
తరించెదరని అభిలషిస్తూ, ఎల్లరికీ రానున్న 2026 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు....😊💐

మహాశివరాత్రినాటి లింగోద్భవకాల అభిషేకసమయంలో అశుతోషుడైన శివుడు ఎవ్విధంగ విశేషంగా సంతసించి విశిష్టమైన వరపరంపరలను వర్షించునో, ఈశ్వరానుగ్రహంతో మరో పోస్ట్లో మళ్ళీ సంభాషించుకొని తరిద్దాం.....

[ విజ్ఞ్యులకు ఉపయుక్తమైన అరుణాచలేశ్వరుడి నామావళి
ని కామెంట్స్ సెక్షన్లో జతపరిచాను...]

సర్వం శ్రీరత్నగర్భగణపతి సహిత శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీరాజరాజేశ్వరస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...😊💐🙏

No comments:

Post a Comment