Saturday, February 28, 2026

శ్రీ విశ్వావసు నామ 2026 సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి / ద్వాదశి, వైకుంఠ ముక్కోటి ఏకాదశి / ద్వాదశి పర్వసమయ శుభాభినందనలు...💐🙂


ఈ పుష్యశుద్ధద్వాదశి తో నేను చత్వారంలోకి చేరుకున్నానని సమయదర్శిని చెప్తుంటే.....,

వగరు(1-10), తీపి(10-20), కారం(20-30), పులుపు(30-40), చేదు(40-50), ఉప్పు(50-60),

అనే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు...
వేపపువ్వుని ఆరగించడం మొదలుపెట్టిన సమయంలా....
కొంచెం చేదుగా అనిపించే విషయమైనా....
జీవితం అంటే సముద్రసంగమానికి పయనించే జీవనదీప్రవాహం లాంటి పయనం...అది ఎక్కడా ఎవ్వరికోసం ఆగని చిరంతన కాలప్రవాహం...

జీవితం అంటే జామకాయలు తినడమే అని అనిపించే (1-10) వయసు - వగరుకి ప్రతీక...

జీవితం అంటే ఎంతో మధురమైన మధుకావ్యం అని అనిపించే (10-20) వయసు - తీపికి ప్రతీక...

జీవితం అంటే ఘటనాఘటనసమర్ధుడిగా ఉండవలసిన ఘాటైన పయనం అని అనిపించే (20-30) వయసు - కారానికి ప్రతీక...

జీవితం అంటే ఎంతో కష్టపడి పరిశ్రమించి తీర్చిదిద్దుకోవలసిన పయనం అని అనిపించే (30-40) వయసు - పులుపుకి ప్రతీక...

జీవితం అంటే శరీరం దేహం గా పరిణామం చెందే ప్రక్రియకు / సుజ్ఞ్యానసముపార్జనకు సాక్షిగా ఉండే పయనం అని అనిపించే (40-50) వయసు - చేదుకిప్రతీక...

తన జీవితగమ్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో పయనం గావిస్తూ దేహంగా పరిణామం చెందిన శరీరానికి సాక్షిత్వాన్ని వహిస్తూ ఉండే పయనం అని అనిపించే (50-60) వయసు ఉప్పు రుచికి ప్రతీక...

[ 60 వయసు దాటిన వారిని సీనియర్ సిటిజెన్స్ అని ఎందుకు గౌరవిస్తారంటే, ఎక్కువగా శ్రమించి అలసిపోకుండా, జీవితంలో ఉండవలసిన గౌరవభరిత సమతౌల్యస్థితిని సాధిస్తూ, లౌకిక విషయాల గురించి కాకుండా, ఇకనైనా ఈశ్వరచింతనతో జీవితంలో ప్రశాంతమైన పవిత్రమైన పరమానందదాయకమైన ప్రజ్ఞ్యాన సాధనలో లీనమై లోకశ్రేయస్కరకమైన జ్ఞ్యానయజ్ఞ్య కార్యములకై జీవిస్తూ నిత్య ఆంతరవివేచన అనే ఎరుకతో ఉండవలసిన సమయం కాబట్టి....]

చాంద్రమానం ప్రకారంగా నా 40వ పుట్టినరోజు ఉత్సవం (అనగా 39 సంవత్సరములు పూర్తై 40వ పడిలోకి చేరుకున్న శుభతరుణం) సందర్భంగా మధురమైన విశేషాలు ఏంటంటే..., 
అఘహర పుణ్యకారక సుజ్ఞ్యానదాయక ఆంతరశాంతిస్థాపక తీర్థయాత్రా విశేషాలు...

శ్రీతైలనాయకి / శ్రీబాలాంబిక సమేత శ్రీవైదీశ్వరుడి అనుగ్రహంతో కుంబకోణ పరిసరప్రాంతాల్లో వెలసిన ఇతర సగుణసాకారనవగ్రహదేవతాస్థిత ఈశ్వరాలయాలను కూడా సందర్శించి, చిదంబర శ్రీనటరాజ స్వామి సందర్శనం, మైలాదుత్తురై శ్రీ అభయాంబిక సమేత శ్రీ మయూరనాథ స్వామి సందర్శనం, తిరుక్కడయూర్ శ్రీఅమృతఘటేశ్వర సమేత శ్రీ అభిరామి అమ్మవారి సందర్శనం, సీర్కాళి శ్రీ తిరునిలై నాయకి / శ్రీ త్రిపురసుందరీదేవి సమేత శ్రీ బ్రహ్మపురీశ్వర / సత్తైనాథర్ స్వామి / తిరు తోణియప్పార్ ఆలయ సందర్శనం గావించిన తదుపరి తిరుపతికి చేరుకున్నాం....

[
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలను శ్రద్ధాభక్తితో విన్నవారికి కొన్ని ఆశ్చర్యకరమైన అధ్యాత్మ సందర్భాలు / విశేషాలు బాగా గుర్తుండే ఉంటాయ్....

పరేశ్వరిని కీర్తిస్తూ భక్తిపారవశ్యంలో ఉన్న సుబ్రహ్మణ్యం అయ్యర్ అనే ఒక మహాభక్తుడు, ఆలయానికి ఏతెంచిన సరభోజ రాజు గారి "ఇవ్వాళ్టి తిథి ఏంటి...?" అనే ప్రశ్నకు....
"ఇవ్వాళ పౌర్ణమి....." అని సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు భక్తిపారవశ్యంలో సమాధానం ఇవ్వగా....
"ఓహో అవునా...అట్లైతే ఇవ్వాళ్టి అమావాస్య రాత్రికి ఆకాశంలో పౌర్ణమి చంద్రుణ్ణి చూపించు....లేనిచో నీకు దండన విధించెదము....." అని పలికిన..... ఆ రాజుగారికి సమాధానంగా...
స్వయంగా శ్రీఅభిరామి అమ్మవారే ప్రత్యక్షమై తన ఒక తాటంకాన్ని ఆకాశంలోకి విసరగా అది పూర్ణ పౌర్ణమి చంద్రబింబమై భాసించిన సంఘటనతో "అభిరామి భట్టర్" అనే సార్ధక నామధేయుడై అధ్యాత్మ చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించుకున్న ఒకానొక సంఘటన...
జరిగిన ఆలయమే ఈ తిరుక్కడయూర్ ఆలయం...! 
https://en.wikipedia.org/wiki/Amritaghateswarar-Abirami_Temple

"ఒక చిన్న పిల్లాడు ఇంతటి శివజ్ఞ్యానసంపన్నమైన పత్తికాలు పాడడం ఏంటి....అని లోకం ఆశ్చర్యం చెందిన శ్రీ జ్ఞ్యానసంబంధర్ గారికి, 
శైశవంలో ఉన్నప్పుడు ఆలయ కోనేరు దెగ్గర పాలకోసం రోదిస్తున్నప్పుడు, పరమేశ్వరుడి ఆనతి ప్రకారంగా సాక్షాత్తు 
"శివజ్ఞ్యానప్రదాయిని" అని నిత్యం వాగ్దేవతలచే స్తుతింపబడే
పార్వతీదేవి భువికి దిగి పాలు పట్టించి ఆ పిల్లాడిని అనుగ్రహించిన మహిమాన్వితమైన సంఘటన...
జరిగిన ఆలయమే ఈ సీర్కాళి శ్రీ తిరునిలై నాయకి / శ్రీ త్రిపురసుందరీదేవి సమేత శ్రీ బ్రహ్మపురీశ్వర / సత్తైనాథర్ స్వామి ఆలయం...!
https://en.wikipedia.org/wiki/Sattainathar_Temple,_Sirkazhi

]

తిరుచానూర్ శ్రీ అలర్మేల్మంగమ్మ ఆలయం,
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ సందర్శనం,
శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, సందర్శించిన తదుపరి
అటు ఇంగ్లిష్ హ్యాపి న్యు ఇయర్ 2026...
ఇటు శ్రీవైకుంఠ ముక్కోటి ఏకాదశి / ద్వాదశి పర్వసమయం....
శ్రీస్వామిపుష్కరిణీతీర్థం తన వార్షిక శ్రీవైకుంఠ ద్వాదశి ప్రయుక్త తీర్థముక్కోటిఉత్సవంతో శోభిల్లే సమయం...
తిరుమల ఆలయంలో శ్రీవారి తిరునామ సడలింపుతో శోభిల్లే 2026-Jan-1st గురువార తిరుమలేశుడి నేత్రదర్శనభాగ్యం....
[ గురువారం వేకువజాము సేవాకైంకర్యాలతో మొదలై కొద్దికొద్దిగా శ్రీవారి పచ్చకర్పూర తిరునామం క్రమక్రమంగా శ్రీవైఖానసాగమ భగవద్శాస్త్ర సేవాకైంకర్యాల్లో భాగంగా సడలింపబడుతూ, శుక్రవారం వేకువజాము వచ్చేసరికి స్వామివారి తిరుముఖమండలం మొత్తం దేదీప్యదైవికద్యుతితో వెలుగుతూ ఉండే ఆ అత్యంత మధురాతిమధురమైన సంపూర్ణ శ్రీవారి తిరుముఖమండల సందర్శనాభాగ్యం శుక్రవారం నిజపాదదర్శనం ఆర్జితసేవా టికెట్ హోల్దర్స్ కి ఎరుకలో ఉన్న దృక్ సేవిత ఆమృతద్యుతియే,.. ]

[ బుధవారం సాయంత్రం నాడు శ్రీ భూవరాహస్వామి వారి దర్శనంకోసం Q లైన్ లో ఉండగా...,
అక్కడికి భగవద్ దర్శనార్ధమై ఏతెంచిన  గౌ || రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని, 
అక్కడున్న ఇతర ఎందరో భక్తులతో పాటుగా, ప్రత్యక్షంగా మొట్టమొదటి సారి దర్శించాను.... ]

2025-Dec-31 బుధవారం నాడు శ్రీభూసమేతశ్రీమలయప్పస్వామి వారి సహస్రదీపాలంకరణసేవలో కూర్చొని తిలకించి తరించినప్పుడు చెమ్మగిల్లిన కళ్ళకు లభించిన కమనీయమైన అనుగ్రహంలా 2026-Jan-1 గురువారం నాడు శ్రీరుక్మిణీదేవిసమేత కరకలితనవనీతకృష్ణస్వామి వారి మాసోత్సవ సహస్రదీపాలంకరణసేవలో కూర్చొని తిలకించి తరించడం జన్మజన్మల సౌభాగ్యకారక సుకృతం...
అనుగ్రహభాగ్యపరీపాకవిశేషం...

శ్రీవారి మూలమూర్తి అర్చకవరేణ్యుల్లో ఒకరైన మాన్యులు శ్రీ గోపీనాథ్ దీక్షితులు గారు సుపథం ప్రాంతంలో ప్రత్యక్షమవ్వగా వారికి నమస్కరించి అశీర్వచనం తీసుకోవడం స్వామివారి మరో అనుగ్రహవిశేషం.....

తిరుపతి తాళ్ళపాక గంగమ్మ ఆలయం, కపిలతీర్థం శ్రీకామాక్షి సమేత శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం, తిరుత్తని శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీకార్తికేయస్వామి వారి ఆలయ సందర్శనం, నారాయణవనం శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం, తదుపరి తేనేలో బాగా మగ్గిన కొబ్బరిమామిడి పండును ఆరగిస్తే లభించే ఆనందంలా, అత్యంత ప్రశస్తమైన వైభవంతో కొలువైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, లోకత్తరమైన మహిమతో అలరారే అత్యంత అరుదైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి అభయహస్త దేదీప్య ప్రభలతో అలరారే ఏకాంతసేవానంతర సందర్శనాభాగ్యం మరియు "మేవా" ప్రసాదం (దశాబ్ద కాలం క్రితం "తెలుగు భక్తి పేజెస్" బృందం వారి సౌజన్యంతో తిరుమల ఆలయ ఆనందనిలయంలో శ్రీవారి సేవక్ గా నియమింపబడిన ఒకానొక రోజున రాత్రి శ్రీవారి ఏకాంత సేవానంతరం లభించిన అత్యంత అరుదైన "మేవా" ప్రసాదం,
(వివిధ పండ్లు, శుష్కఫలాలు / డ్రై ఫ్రూట్స్, మధు / తేనే సమ్మిళిత ప్రసాదం) మళ్ళీ ఇన్నాళ్ళకు అప్పలాయగుంట ఆలయంలో శ్రీవారి ఏకాంత సేవానంతరం లభించడం నా జన్మాంతర సుకృతం...!

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయం,
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయం,
తిరుమల ఆనందనిలయ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం,
ఈ మూడు ఆలయాలు కూడా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మహామహిమాన్విత ప్రత్యక్ష అనుగ్రహదాయక ఆలయాలు అని ప్రాచీన ఆర్షవాక్కు...!

సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లా, తిరుపతి రైల్వే స్టేషన్ కూడా రాబోయే 50 సంవత్సరాల ప్రయాణీకుల నిత్య రాకపోకలను సౌకర్యవంతమైన రీతిలో స్వాగతించే విధంగా సువిశాలమైన ప్రాంగణంగా ఆధునికీకరణ / నవీకరణ చెందడం ఎల్లరూ హర్షించే మరో విశేషం...

అత్యంత సమర్ధవంతంగా వీలైన ప్రతీచోట ఆధునిక సాంకేతిక సదుపాయాలతో భక్తులకు సేవలను అందిస్తూ,
[ లాకర్ అలాట్మెంట్ నుండి వసతి గృహ కాషన్ డిపాసిట్ ఆన్లైన్ రిఫండ్ వరకు.... ]
లోక శ్రేయస్సుకై నిత్యం వర్ధిల్లుతూ ఉండే / ఉండవలసిన ప్రాచీన తిరుమల సంప్రదాయ వైభవానికి అత్యాధునిక సాంకేతికమాధ్యమాధారిత సదుపాయ వితరణను మేళవిస్తూ,
2026-జనవరి-1 కి ఇ-డిప్ ద్వారా సామాన్య భక్తులకు కూడా శ్రీవైకుంఠ ముక్కోటి ఏకాదశి / ద్వాదశి పర్వసమయ దర్శనాలను అనుగ్రహించిన తి.తి.దే వారి సౌజన్యానికి సభక్తికంగా నమస్కరిస్తూ.....

శ్రీశ్రీనివాసుడి శ్రీచరణాలచెంత శ్రీవైకుంఠ ముక్కోటి ఏకాదశి / ద్వాదశి పర్వసమయ శుభాభినందనానమస్సుమాంజలి...🙂💐🙏

సర్వం శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీవత్స భూషిత శ్రీవక్షస్థలవ్యూహలక్ష్మీస్థిత శ్రీతిరుమలేశ శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏


No comments:

Post a Comment