భీష్మ ఏకాదశి/ద్వాదశి పర్వసమయ శుభాభినందనలు...💐🙂
శ్రీకృష్ణపరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రమైన భక్తుల్లో ఒకరు,
ఇచ్ఛామరణం అనే అత్యంత దుర్లభమైన వరాన్ని కలిగి ఉన్న అనుపమ సుక్షత్రియ ధీరవీరుడు, గంగాసుతుడు, శాంతనవుడు, జ్ఞ్యానవృద్ధుడు, కురువృద్ధుడు, కౌరవసమూహంలో ఉండి కూడా మనవడైన అర్జునుడికి పెద్దమనసుతో ఎనలేని సహాయాన్ని ఒనరించిన ప్రేమైకమూర్తి అయిన శ్రీ భీష్మపితామహుల వారు,
అత్యంత మహిమాన్వితమైన, దుర్లభమైన శ్రీకృష్ణపరమాత్మ యొక్క విశ్వరూపసందర్శనాభాగ్యాన్ని కనులారా దర్శించి ఆ చెమ్మగిల్లిన కళ్ళతోనే పరమాత్మను దర్శిస్తూ, ప్రార్ధిస్తూ, స్తుతిస్తూ, ఒక ధనస్సుకి ఎక్కుపెట్టిన బాణాన్ని ఆకర్ణాంతం లాగి గమ్యం దిశగా సంధించే విలుకానివలె, వారి యోగశక్తిని శ్రీకృష్ణపరమాత్మలో లయించి నిర్యాణం చెందిన మహిమాన్వితమైన రోజు...ఈ రోజు....
ఉదయం యుద్ధం అయిన తరువాత సూర్యాస్తమయం తదుపరి రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటున్న భీష్మపితామహుల వారికడకేగిన అర్జునుణ్ణి పలకరిస్తూ...
"తెలుసు మనవడా...నువ్వు ఇక్కడివరకూ వచ్చి ఇలా అడుగుతావని.....
సవ్యసాచి...
సావధానుడవై విను...
సర్వసన్నద్ధమైన క్షాత్రవ పరాక్రమంతో శస్త్రాన్ని ధరించి రణభూమిలో ఉండగా,
నా అప్రతిహత పరాక్రమాన్ని నిలువరించగల వీరులు ఈ సృష్టిలోనే లేరు....
విధివశాత్తు నేను కౌరవసేనలో ఉన్నాను కాబట్టి....,
ఈ భీష్మపితామహుణ్ణి రణభూమిలో నిర్జించగల క్షత్రియుడు నీ పాండవసేనలో ఎవ్వరూ లేరు...
కావున...ఈ తాతను నువ్వు గెలవాలంటే....
నా మీద కోపంతో మరో జన్మ ఎత్తి మరీ ఎదురుచూస్తున్న శిఖండిని నాకు ఎదురుగా నిలుపు....
నా క్షత్రియ ధర్మానుసారంగా నాకు ఎదురు నిలిచిన శిఖండిని చూడగానే నా ధనస్సును పక్కనపెట్టేస్తాను కాబట్టి....
నీ క్షత్రియ ధర్మం నువ్వు నిర్వర్తించు...
విజయోస్తు వత్సా..."
అని పలికిన ఆశ్చర్యకరమైన కరుణామయుడు, కారణజన్ముడు, కౌరవసేనాధ్యక్షుడు, శ్రీ భీష్మపితామహుల వారు....
అంతటి మహానుభావులైన సుక్షత్రియ వీరునకు, అర్జునుడు అంశయ్యను నిర్మించి దానిపై వారిని పరుండబెట్టి, వారి దాహార్తిని శమింపజేయడానికి పాతాళగంగను బాణప్రహారంతో భువిపైకి రప్పించి సేవించమని అందించగా....
శ్రీ భీష్మపితామహుల వారు విశ్రాంతి తీసుకొని అట్లే పరుండి ఉండక, ఒళ్ళంతా సవ్యసాచి సంధించిన శరసమూహాలతో గాయాలై విరగబూసిన మోదుగచెట్టులా నెత్తురోడి నేలకొరిగిన యోగిపుంగవులై ఉండి కూడా, ఈ లోకానికి
"ధర్మరాజ భీష్మ సంవాదం" గా ఎనలేని మహిమాన్వితమైన అమర సారస్వతాన్ని, అనగా శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రరత్నాన్ని అనుగ్రహించారు...!!
అట్టి సర్వదేవతానుగ్రహదాయకమైన శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రరత్న వైభవాన్ని బహు భంగిమల్లో తరచి తరిద్దాం....
శ్రీ చాగంటి సద్గురువుల అగ్రశ్రేణి ప్రవచనాల్లో, వారు అప్పుడప్పుడు ఔచిత్యభరిత హాస్యాన్ని కూడా పండించడం విజ్ఞ్యులకు ఎరుకే....
ఒకానొక ప్రవచనంలో, ఒక హాస్పటల్ కి ఐ-చెకప్ కోసం గురువుగారు విచ్చేసినప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని ఉటంకిస్తూ....
"మీరు ఇంత పెద్దవారు...పైగా బ్రాహ్మణులు అని అంటున్నారు...
మీకు ఈ పుస్తకంలో ఉన్నదేంటో తెలియట్లేదా...!!!
అని శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం గురించి తెలియదు అని వచించిన ఒక పెద్దాయన గురించి వచించడం గుర్తుండే ఉంటుంది....
అంటే ఎల్లరికీ ఎంతో శ్రేయోదాయకమైన శ్రీవిష్ణుసహస్రనామ
స్తోత్రం ఎంతగా ఈ లోకంలో విజ్ఞ్యులెల్లరిచే ఆరాధింపబడే స్తోత్రమై ఉండాలో పై సందర్భం తెలియజేస్తున్నది....
శ్రీవిష్ణుసహస్రనామాలు అనేవి చాలా సింపుల్ గా కనిపించే క్యారెట్ల వంటి గొప్ప ఔషధీగుణభరిత అధ్యాత్మ పదార్ధాలు...
చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించే క్యారెట్లతో మనం
క్యారెట్ హల్వా,
క్యారెట్ పాయసం,
క్యారెట్ బర్ఫి,
క్యారెట్ కూర,
క్యారెట్ సలాడ్,
క్యారెట్ చిప్స్,
క్యారెట్ బజ్జీలు,
క్యారెట్ పెరుగు రైతా,
ఇత్యాదిగా ఎన్నో అమోఘమైన వంటకాలను చేస్కొని ఆస్వాదించవచ్చు....
అట్లే చక్కని శ్రేయస్సుని అనుగ్రహించే శ్రీవిష్ణుసహస్రనామాలు కూడా...
శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం,
శ్రీవిష్ణుసహస్రనామ అర్చన,
శ్రీవిష్ణుసహస్రనామ పఠనం,
శ్రీవిష్ణుసహస్రనామ మననం,
శ్రీవిష్ణుసహస్రనామ జపం,
శ్రీవిష్ణుసహస్రనామ సంకీర్తనం,
శ్రీవిష్ణుసహస్రనామ స్మరణం,
శ్రీవిష్ణుసహస్రనామ అంగన్యాస కరన్యాస పూర్వక ఆరాధన,
ఇత్యాదిగా ఎన్నో విశేషమైన విధానాల్లో ఆరాధించి తరించవచ్చు....
వేటి వైభవం వాటిదే...
వేటి విశేషం వాటిదే...
మొట్టమొదటి సారి నా 7 వ తరగతిలో వొడుగూరివీరవేంకటసత్యనారాయణ రాఘవేంద్రనాథ్ శర్మ / వి.వి.ఎస్. రాఘవ అనే మితృడి ద్వారా ఏవో రోజువారి క్యాజువల్ మాటల్లో పరిచయమైన శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం,
ఆ తరువాత 2009 లో వివేకానందనగర్ లో శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వినిపించగా అప్పటినుండి నా దైనందిన జీవితంలో అంతర్భాగమై నిత్యపారాయణ స్తోత్రమై అలరారుతున్నది...
తెలుగు భక్తి పేజెస్ వారి సౌజన్యంతో,
శ్రీ పరిటాల గోపికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ రోజుల్లో గావించిన తిరుమల శ్రీవారిసేవాంతర్భాగంగా,
ఆనందనిలయ బంగారు త్రితలవిమాన గోపురాన్ని కనులారా దర్శిస్తూ, తిరువీధులకు ప్రదక్షిణంగా నడుస్తూ శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సేవకబృందగానం గా అనుసంధానం గావించే భాగ్యం కూడా లభించింది....
(అప్పుడు పారవశ్యంలో నేను ఆలపించిన "ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీవేంకటేశ" అనే భజనకు తోటి శ్రీవారిసేవకులు నన్ను ఎంతగానో ప్రశంసించడం ఒక మధురమైన గోవిందానుగ్రహవైభవం....
నాకైతే అది గజారోహణ కంటే మిక్కుటమైన ఆనందకారక అంశం...😊)
ఆ రోజుల్లో ఎస్.వి.బి.సి ఛానెల్ లో నిత్యం ప్రసారమైయ్యే
"శ్రీ విష్ణుసహస్రనామ భాష్యం" కార్యక్రమంలో మాన్యులైన అధ్యాత్మవేత్తలు, శ్రీ టి.కె.వి రాఘవన్ గారు వివరించే తాత్పర్యాలు నన్ను ఎంతగానో ప్రభావితం గావించాయి...
"పూర్వజా త్రిపురాంబిక..." గా నిత్యం వాగ్దేవతలచే
స్తుతింపబడే శ్రీపార్వతీపరమేశ్వరులే
"శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే..."
అనే శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర పారాయణ ఫలదాయక లఘు శ్లోకరూప సారాన్ని వచించారంటే...
అది అత్యంత ప్రాచీనమైన శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర వైభవానికి అద్దంపట్టే అమరవచనం....
అష్టవసువుల్లో ఒకరైన యోగీశ్వరులు, నిర్దేశిత అవతారప్రయోజనార్ధమై దేవకార్యనిమిత్తమై గంగాశంతనమహారాజుల పుత్రుడిగా, భీష్ములుగా అవతరించి ఈ లోకానికి శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం అనే ఎనలేని పెన్నిధిని అనుగ్రహించి మరలా వారి స్వస్థానమునకు చేరుకున్న ఆ మహానుభావుల అనుగ్రహం విజ్ఞ్యులైన భక్తులెల్లరికీ నిత్యం లభించి తరించాలని అభిలషిస్తూ....
ఓం నమో భగవతే వాసుదేవాయ.....💐🙂🙏
సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు...💐🙂🙏
No comments:
Post a Comment