Friday, January 25, 2019

సద్గురు శ్రీ త్యాగరాయులవారి 172 సంవత్సరాల ఆరాధనోత్సవాలు ...! :)

Vinay Kumar Aitha shared a post.
Just now
ప. రాగ సుధా రస పానము జేసి రంజిల్లవే ఓ మనసా
అ. యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే (రా)
చ. సదాశివ మయమగు నాదోంకార స్వరవిదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా) 
అని శ్రీ సద్గురు త్యాగరాయులవారు 172 సంవత్సరాల క్రితమే శాస్త్రీయ సంగీతం యొక్క ప్రాభవాన్ని నొక్కివక్కానిస్తూ, తాము రచించి స్వరపరిచిన అనేక కృతులను ఈనాటికి కూడా ఎందరో రాగయుక్తంగా ఆలపించి / ఆలకించి ఆనందించగలగడం సంగీతప్రియులెల్లరికి సంప్రాప్తించిన ఒక దివ్యమైన అయాచిత పెన్నిధి...
ప్రపంచంలో మరే విద్యకు లేని ఘనత కేవలం సంగీతానికి ఉన్నదంటూ, నవజాత శిశువుల మొదలుకొని చతుష్పదులైన జంతువులు, విశేషజీవులైన పాములవరకు, సంగీతం రంజింపజేయని జీవుడు లేడు అంటూ "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః..." అని మన పెద్దలు చెప్పడం వింటూనే ఉంటాం...
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్న వారికి తెలిసినట్టుగా,
ఈ కలియుగంలో కనీసం 18 క్షణాల పాటైనా మన మనసును ఒకే వస్తువు పై నిలపలేని చపల చిత్తులం కనుక, ఎన్ని గొప్ప గొప్ప ఆధ్యాత్మిక బోధలు చేసినా సరే అవి కొండలపైనుండి జాలువారే జలపాతంలా అనతి కాలంలోనే మనోఫలకము నుండి జారిపోవడమే తప్ప మనోస్థిరత్వాన్ని సాధించి పెట్టి జీవుడికి ఉన్నతి కలిగించే సాధనములై ఒప్పుట కల్ల...
కేవలం అనునిత్యం యెదలో ఆరాధించబడే సద్గురువుల వాక్కులు మరియు భగవద్ నామగుణవైభవ సంకీర్తనం వినా, మరే ఇతర సాధనం కూడా అంత గొప్పగా భక్తున్ని భగవంతునివైపు నడిపించలేదు అనే సత్యాన్ని దర్శించిన యోగులై, సమస్తమానవాళి యొక్క యోగక్షేమమును కాంక్షించి, భగవంతుడు / అతని పరివారము అప్పుడప్పుడు భువి పైకి సద్గురువులుగా దిగివచ్చి, తనను చేరే మార్గాన్ని తానే ఉపదేశించడం, ఆనాటి శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులతో మొదలుకొని, నిన్నటి శ్రీ అన్నమాచార్యులు, శ్రీ త్యాగరాయ - శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ - శ్రీ శ్యామశాస్త్రి - సంగీతత్రయం, శ్రీ కంచర్ల గోపన్న / భద్రాచల రామదాసు, శ్రీ బమ్మెర పోతనామాత్యుల వారు, శ్రీ జయదేవుడు, శ్రీ తులసీదాస్, శ్రీ సూర్దాస్, శ్రీ కబీర్దాస్, శ్రీ మీరాబాయి, ... వరకు ఇత్యాది ఎందరెందరో సద్గురువులు భగవంతునిపై మన మనసు లగ్నమయ్యేలా పద్యాలు, దోహాలు, సంకీర్తనలు, అష్టపదులు మొదలైన వివిధ మార్గాల్లో వారు అందించిన చిరంతన సంగీతసారస్వతామృతఝరులు కోకోల్లలు....
( త్యాగరాజు - పోతరాజు - గోపరాజు, ఈ అధ్యాత్మ రాజత్రయం తెలుగు భక్తి సంగీతసాహిత్యలోకానికి మకుటం లేని శాశ్వత మహారాజులు గా కొలువైన కీర్తికాయులు అని అస్మద్ గురువుదేవులు తమ ప్రవచనాల్లో నుడివినారు....)
ఇందరి సద్గురువుల్లో, సద్గురు త్యాగరాయ స్వామి వారిది ఒక విశేషమైన స్థానంగా పెద్దలు చెప్తూఉంటారు...
అలనాటి త్రేతాయుగపు శ్రీరాముల వారే ఈనాటి కలియుగపు తమ జీవిత సర్వసంగా భావించి సేవించి తరించిన సాధువరేణ్యులు. (భద్రాచల శ్రీరామదాసుల వారిలా....)
వారి భక్తిభరిత జీవనాన్ని చూసి ఓర్వలేని సహోదరుడే కడుపులో రగిలిపోతున్న కుళ్ళుతో భార్య నూరిపోసిన చెప్పుడు మాటలు విని, త్యాగరాయులవారి సీతారామచంద్రలక్ష్మణ స్వామి నిత్యారాధన మూర్తులను రాత్రి అపహరించి కావేరి నదిలో వేసి తమ అక్కసు వెళ్ళగక్కినప్పుడు, ఆ మూర్తులకోసం ఏడిచి ఏడిచి ఊర్లన్నీ తిరుగుతూ, సాక్షాత్ బ్రహ్మ మానసపుత్రులు, త్రిలోకసంచారులు, మహతి వీణాగమకిత నిరంతర శ్రీమన్నారాయణ నామస్మరణోపాసకులైన శ్రీ నారద మహర్షులచే అనుగ్రహించబడిన స్వరార్ణవం అనే సంగీత నాదోపాసనవిద్యను అభ్యసించి ఎన్నెన్నో సశాస్త్రీయ కృతులతో పలువిధాల దైవాన్ని కీర్తించి అర్చించి తరించిన మహనీయులు శ్రీ కాకర్లత్యాగబ్రహ్మం గారు...
(ఆ తర్వాత కొంత కాలానికి అందరి కళ్ళముందే కావేరి నదిపై వారి ఆరాధ్యమూర్తులు తేలుతూ తిరిగి రావడం, భక్తభాగవత అపచారానికి సోదరుడి కుటుంబం పక్షవాతం ఇత్యాది రోగాలతో కృశించిపోవడం, తమ తప్పు తెలుసుకొని త్యాగరాయులవారి భక్తికి దాసోహం చెందడం, అలా మిగతా లౌకిక జీవిత ఘటనలు అందరికి తెలిసినవే కదా....)
ఇక్కడ గమనించ వలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది... నాదోపాసనతో సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజులై వర్ధిల్లి, అద్వైత భావనతో ఆత్మారామున్ని సర్వే సర్వత్రా దర్శించే శ్రీ త్యాగరాయులవారు, కేవలం దూరమైన తమ మూర్తుల్లోనే దైవం ఉందని భావించి శోకించడం తగునా..?
అంటే ఇక్కడ మనం అర్ధం చేస్కొవలసిన విషయం ఏంటంటే, అంతటా ఉండే దైవమే, ప్రస్ఫుటంగా మనం ఆరాధించే మూర్తిలోకి వచ్చి కొలువైఉంటాడు అని...( Though the air is all around us in its own invisible form, switching on a fan makes us feel the same more vehemently. Here the fan isn't creating any air as such...It is only circulating the already present air around us when we have "asked for it...". And so is with the idol worship as well with our prayers being a fan and his grace being the cool breeze being circulated as per our plea...!  )
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే, అవి కేవలం ఒక గదిలో ఉన్న దేవుడి బొమ్మలు అనుకున్న వారికి అవి అంతవరకే పరిమితమవుతాయి....
కాని అవి తాము భగవద్ భక్తిని న్యాసం గావించి సేవించే, తమ సర్వ పోషక తోషక రక్షకత్వాన్ని నిర్వహించే భగవన్మూర్తులు అని నమ్మి కొలిచిన వారికి అవే సర్వస్వం...!
అందుకే త్యాగరాయుల వారు అక్కడ అంతగా బాధపడింది...అందుకే వారి భక్తికి, ఆర్తికి ఆ భగవంతుడే నీటిపై తేలుతూ వారి వద్దకు వచ్చేసాడు...!!
( ఆనాడు నలనీలురు నీటిపై శ్రీరామనామం తో బండరాళ్ళను నిలిపి ఆ శ్రీరామచంద్రున్నే తేలియాడే వంతెన పై నడిపించి కాంచనలంకకు చేర్చినట్టుగా...)
' నారం దదాతి ఇతి నారదః ' అనే వ్యుత్పత్తి ప్రకారంగా, నారం = జ్ఞ్యానాన్ని ప్రసాదించువాడు నారదుడు.... అనేది నారద శబ్దానికి సంస్కృత అమరకోశవచనార్థం...
అంటే త్యాగరాయుల వారి కృతులన్నీ కూడా పైకి సుమధురమైన కర్ణపేయమైన శాస్త్రీయసంగీత గులికలు గా ఆకట్టుకొని, ఆంతరమున జీవుడికి బ్రహ్మజ్ఞ్యానాన్ని జనింపచేసే బ్రహ్మవిద్యాభాష్యములే అని పెద్దల ఉవాచ...!!
శ్రీ అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలు సాహిత్యపరంగా రచించి, భక్తులకు ఆలాపనమునందు రాగస్వతంత్రత ప్రసాదిస్తే,
శ్రీ సద్గురు త్యాగరాయుల వారు మాత్రం, తాము దర్శించిన రాగసహితంగానే తమ కృతిరచనకు శాశ్వతత్వాన్ని ప్రసాదించారు...
ఎందుకంటే అన్నమాచార్యుల వారు ' వేంకట ' ముద్రతో తమ రచనల్లో విశిష్టాద్వైతాన్ని విశదీకరిస్తూ, శరణాగతిని ప్రపత్తిని రంగరించి ఏడుకొండలపై కొలువైన పరమాత్మను సేవించేలా కృతులను రచించి, ఆ ఏడుకొండలవాడే అంతటా నిండి ఉన్నాడు అనే భావనతో జానపదశైలిలో తమ సారస్వతాన్ని అందించారు...
సద్గురు త్యాగరాయుల వారు మాత్రం తమ నామధేయమే ముద్ర గా, అందరికి అంతరంగమున కొలువైన ఆత్మారాముడే ఆన్నిట్లో కొలువై ఉండే పరతత్వం అంటూ, హృదయపీఠంపై కొలువైన అంతర్నారాయణున్ని గుర్తించి అద్వైతభావనతో సేవించండి అంటూ సామవేదసారమైన సంగీతశక్తిని కూడా మేళవించి రచించిన కీర్తనలతో శ్రీరామ పరబ్రహ్మానికి మన మనసు చేరువయ్యేలా శాస్త్రీయ పద్దతిలో తమ సారస్వతాన్ని అందించారు...
అంటే మొదట అన్నమాచార్యుల వారు చెప్పినట్టు ఆ పరంధామున్ని ఏడుకొండలపై దర్శించి, క్రమక్రమంగా అంతటా దర్శిస్తూ, చివరకు ఆ పరతత్వమే ప్రతి ఒక్కరి యెదలో దశరథాత్మజమైన శ్రీరామ పరబ్రహ్మంగా కొలువై ఉందనే సత్యాన్ని దర్శించమని,
బుద్ధి & మనసు అనే 2 చక్రాలతో, ( 5 జ్ఞ్యానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు = 10 ) దశ ఇంద్రియాలు అనే గుర్రాల తో నిరంతరం లాగబడే మన శరీరమే రథమై ఉన్నప్పుడు, ఆ రథసారధిగా శ్రీరామున్ని నిలిపి తరించండి అని చెప్పడమే సద్గురువుల తరతరాలకూ వన్నెతరగని శాశ్వత సంకీర్తనా బోధామృతం...!! 
శ్రీరాగం లో కూర్చబడిన తమ 'ఎందరో మహానుభావులు..' అనే పంచరత్న కీర్తనలోని ఈ క్రింది చరణాలు, సద్గురు శ్రీ త్యాగరాయులవారికి సకల శాస్త్రములపై గల అసామాన్యమైన పట్టుతో, జీవుడికి ఆఖరి ఊపిరిలో భగవద్ నామస్మరణమే కైవల్యతీరానికి దరిజేర్చు నావ అనే పరతత్వపు సారాన్ని, వేదాంత రహస్యాన్ని తమ కృతిలోకి అంత సరళంగా రంగరించిన వైనాన్ని, 'న భూతో న భవిష్యద్' అని ఎవ్వరైనా సరే భావించడం కద్దు...!
చ9. భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి
సురాంతరంగముల భావంబుల-
నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా(రెందరో)
చ10. ప్రేమ ముప్పిరికొను వేళ
నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన వా(రెందరో)
ప. ఎందరో మహానుభావులందరికి వందనములు.... 🙏🙏🙏🙏🙏 

No comments:

Post a Comment